అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు మెరుగైన రాబడి, మరోవైపు పన్ను ఆదాకు వీలు కల్పించేవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) పథకాలు. సెక్షన్ 80సీ పరిధిలో ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందాలనుకునే వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు. ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. పన్ను ఆదా కోరుకునే వారు, రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉన్న వారికి ఇవి అనుకూలం. ఈ విభాగంలో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం మంచి పనితీరు చూపిస్తోంది.
రాబడులు
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 22 శాతానికి పైగా రాబడులు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలంలో చూస్తే ఈ పథకంలో సగటు వార్షిక రాబడులు 20.52 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 16.59 శాతం, ఏడేళ్లలో ఏటా 16.47 శాతం, పదేళ్లలో 17.33 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం తెచ్చి పెట్టింది. దీర్ఘకాలంలో ఈ పథకం అందించిన రాబడులు ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగం సగటు కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
ఈ పథకం డైవర్సిఫైడ్ విధానంలో వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. మార్కెట్ ర్యాలీల్లో లాభాలను స్వీకరిస్తుంటుంది. మార్కెట్లు అస్థిరంగా మారితే సురక్షిత విధానంలోకి మారిపోతుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,699 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.56 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 4.44 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. ఇక ఈక్విటీల్లోనూ బ్లూచిప్ కంపెనీలకే 67 శాతం కేటాయింపులు చేసింది.
మిడ్‌క్యాప్ కంపెనీల్లో 23.42 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 9.31 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 54 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్దపీట వేసింది. 30 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. 8.63 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.41 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 7.62 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 7.50 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 5.58 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 5.44 శాతం, సేవల రంగ కంపెననీలకు 4.93 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment