అడ్వాన్స్‌గా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? | Do I have to pay advance tax | Sakshi
Sakshi News home page

అడ్వాన్స్‌గా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?

Published Mon, Sep 18 2023 9:39 AM | Last Updated on Mon, Sep 18 2023 9:44 AM

Do I have to pay advance tax - Sakshi

ఆదాయపు పన్నుని మూడు పద్ధతుల్లో చెల్లించాలి. ఆర్థిక సంవత్సరాంతం ముగిసే లోపలే పూర్తి భారాన్ని చెల్లించడం .. అంటే అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించడం వీటిలో మొదటిది. రెండోది టీడీఎస్‌. నిర్దిష్ట డిడక్టర్‌ మీకు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి నిర్దేశిత శాతాన్ని మినహాయించుకుని, దాన్ని మీ పేరున ట్యాక్స్‌ కడతారు. టీడీఎస్‌ చేసే మొత్తానికి మీ ఆదాయంతో సంబంధం లేదు. ఇది డిడక్టర్‌ బాధ్యత. మీ ప్రమేయం ఉండదు. ఇక రిటర్ను వేసేటప్పుడు, చెల్లించిన అడ్వాన్స్‌ ట్యాక్స్, టీడీఎస్‌లు మీరు చెల్లించాల్సిన పన్ను భారానికి సరిపోని పరిస్థితి తలెత్తినప్పుడు కట్టే మొత్తాన్ని సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌ అంటారు. నాలుగో పద్ధతి ఏమిటంటే, అసెస్‌మెంట్‌ చేసినప్పుడు డిమాండ్‌ ఉంటే ఆ డిమాండ్‌ మొత్తాన్ని చెల్లించడం.  
ఇక అడ్వాన్స్‌ ట్యాక్స్‌ విషయానికొస్తే..

ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 

టీడీఎస్‌ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత పన్ను భారం రూ. 10,000 లేదా అంతకన్నా అధికంగా ఉంటేనే చెల్లించాలి. 

సాధారణంగా కేవలం జీతం ఆదాయంగా ఉండి, టీడీఎస్‌ బాధ్యతని యజమాని సక్రమంగా నిర్వహించి ఉంటే, సదరు ఉద్యోగి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. 

కానీ, సదరు ఉద్యోగికి ఇతర ఆదాయాలు ఉండి, వాటి వల్ల పన్ను భారం రూ. 10,000 దాటితే మాత్రం ఈ పరిధిలోకి వస్తారు.
 
చెల్లించాల్సిన అడ్వాన్స్‌ ట్యాక్స్‌ మొత్తం.. నాలుగు గడువు తేదీల్లోగా చెల్లించాలి.  

     15–06–2023 లోపల 15 శాతం 

     15–09–2023 లోపల 30 శాతం 

     15–12–2023 లోపల 30 శాతం 

     15–03–2024 లోపల 25 శాతం 

ఇలా చేస్తూ వెడితే 2024 మార్చి 15 నాటికి నూటికి నూరు శాతం పన్ను భారాన్ని చెల్లించినవారవుతారు. మీరు ఈ పరిధిలోకి వచ్చే వారయితే, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించడం మొదలుపెట్టాలి. సకాలంలో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. ఏ వాయిదాకి ఆ వాయిదా చెల్లింపులో జాప్యం జరిగినా ఆ మేరకు వడ్డీ విధిస్తారు. కట్టాల్సిన పన్ను భారంలో చెల్లించిన మొత్తం 90 శాతం కన్నా తక్కువ ఉంటే వడ్డీ విధిస్తారు. ఈ చెల్లింపులు చాలా ముఖ్యం. తప్పనిసరి. ముందుగా మీ ఆదాయాన్ని నిర్ధారించే వారికి ఇది ప్రయోజనకారి. ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్‌ చేసుకోవచ్చు. చివరి క్షణంలో ఉరుకులు పరుగుల అవసరం ఉండదు. రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement