Income Tax Return Guide : ఏ కారణం వల్లనైనా కానివ్వండి, ఇంకా మీరు మీ ఆదాయాన్ని డిక్లేర్ చేయలేదా.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయలేదా? గడువుతేదీని పొడిగిస్తారని ఎదురు చూసి నిరాశ చెందారా? గాభరా పడకండి.
ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లోపల రిటర్ను దాఖలు చేయని వారికి కొంత జరిమానా కడితే మరో ఐదు నెలల వ్యవధి దొరుకుతుంది. జూలై 31లోపు వేయని వారికి రాబోయే 5 నెలల్లో ఎప్పుడు రిటర్ను దాఖలు చేసినా జరిమానా మొత్తం మారదు. దీనికి గడువు తేదీ 31–12–2023. మీ నికర ఆదాయం రూ. 5,00,000 లోపు అయితే రూ. 1,000; నికర ఆదాయం రూ. 5,00,000 దాటితే రూ. 5,000 జరిమానాగా చెల్లించేందుకు మీరు సన్నద్ధం అయితే మీరేమీ గాభరా పడక్కర్లేదు. అలా అని 5 నెలల దాకా పొడిగించకండి.
నెల మారుతున్న కొద్దీ ఇతర వడ్డీలు పెరుగుతుంటాయి. మీ నికర ఆదాయం మీకు వర్తించే బేసిక్ లిమిట్ దాటకపోతే, అసలు రిటర్ను వేయనవసరం లేదు. మీ వయస్సుని బట్టి మీ బేసిక్ లిమిట్ మారుతుంది కదా. అయితే, మీ కేసులో ఏదైనా టీడీఎస్ ఉంటే, ఆ మొత్తాన్ని రీఫండుగా మీరు పొందుదామనుకుంటే, ఆదాయంతో నిమిత్తం లేకుండా రిటర్ను వేయండి. అతి తక్కువ టీడీఎస్ ఉంటే, దాని మీద ఎటువంటి ఆశ లేకుండా రిటర్ను వేయడం తప్పించుకునే ధన్యులు కూడా ఉన్నారు.
ఇప్పుడు అన్ని వివరాలు సేకరించండి. కాగితాలు, రుజువులు, ధృవీకరణలు, సర్టిఫికెట్లు మొదలైనవి సంపాదించండి. ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త తీసుకోండి. వెబ్‌సైటులోని ఫారం 16, 16 అ, అ 26 మొదలైనవి డౌన్‌లోడ్ చేయండి. వీటిలో సమగ్ర సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని చెక్ చేసుకోండి. సర్వసాధారణంగా వీటిలో తప్పులుండవు. నిజంగా తప్పేదైనా దొర్లి ఉంటే మీరు వాటిని విభేదించవచ్చు. కానీ, త్వరలో రాబోయే నోటీసుకి, ఆ భేదం లేదా తేడాను రుజువులతో, వివరణలతో, సంజాయిషీతో డిపార్టుమెంటు వారికి చెప్పాలి. మనం చాలా చోట్ల, చాలా సందర్భాల్లో మన పాన్‌ని తెలియపరుస్తాము. అటు పక్క వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేయవచ్చు.
అలాంటప్పుడు తప్పులు జరగవచ్చు. రిటర్నులు వేయని వారికి నష్టాల సర్దుబాటు ఉండదు. దాని వల్ల ఎంతో నష్టం ఉందండి. మిగతా వడ్డీలు వడ్డిస్తారు. రిఫండు మీద వడ్డీ ఇవ్వరు. ఇలాంటివి ఇంకా ఎన్నో. సకాలంలో ఐటీ రిటర్ను వేసినంత సుఖం లేదు. ఇదే, మీ అనారోగ్యం, భయం, మానసిక ఆందోళన, ఒత్తిడి, బెంగ, బాధను తగ్గించేది. కాబట్టి ఇప్పటికైనా రిటర్ను వేయండి.
ఇదీ చదవండి ➤ గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది?
Comments
Please login to add a commentAdd a comment