IT field
-
ఇదే జరిగితే.. టెకీల పరిస్థితి ఏంటి?
ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది. ఇది ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకతను రేకెత్తించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) సభ్యులు ఇప్పటికే కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌తో సమావేశమై ఈ పరిణామానికి సంబంధించి తమ సమస్యలను వినిపించారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులపై ఉంటుందని అన్నారు.కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో ఓవర్టైమ్తో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది. ఒక ఉద్యోగి చేత మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు.ప్రస్తుతం ఈ పనిగంటలు పెంపుకు సంబంధించిన ప్రతిపాదలన మీద చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. దీనిపైన తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని రాష్ట్ర కార్మకశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా పని చేసే పని గంటలపై ఎటువంటి కట్ ఆఫ్ లేదని కేఐటీయూ సెక్రటరీ సూరజ్ నిడియంగ అన్నారు. వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. -
ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే?
Income Tax Return Guide : ఏ కారణం వల్లనైనా కానివ్వండి, ఇంకా మీరు మీ ఆదాయాన్ని డిక్లేర్ చేయలేదా.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయలేదా? గడువుతేదీని పొడిగిస్తారని ఎదురు చూసి నిరాశ చెందారా? గాభరా పడకండి. ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లోపల రిటర్ను దాఖలు చేయని వారికి కొంత జరిమానా కడితే మరో ఐదు నెలల వ్యవధి దొరుకుతుంది. జూలై 31లోపు వేయని వారికి రాబోయే 5 నెలల్లో ఎప్పుడు రిటర్ను దాఖలు చేసినా జరిమానా మొత్తం మారదు. దీనికి గడువు తేదీ 31–12–2023. మీ నికర ఆదాయం రూ. 5,00,000 లోపు అయితే రూ. 1,000; నికర ఆదాయం రూ. 5,00,000 దాటితే రూ. 5,000 జరిమానాగా చెల్లించేందుకు మీరు సన్నద్ధం అయితే మీరేమీ గాభరా పడక్కర్లేదు. అలా అని 5 నెలల దాకా పొడిగించకండి. నెల మారుతున్న కొద్దీ ఇతర వడ్డీలు పెరుగుతుంటాయి. మీ నికర ఆదాయం మీకు వర్తించే బేసిక్ లిమిట్ దాటకపోతే, అసలు రిటర్ను వేయనవసరం లేదు. మీ వయస్సుని బట్టి మీ బేసిక్ లిమిట్ మారుతుంది కదా. అయితే, మీ కేసులో ఏదైనా టీడీఎస్ ఉంటే, ఆ మొత్తాన్ని రీఫండుగా మీరు పొందుదామనుకుంటే, ఆదాయంతో నిమిత్తం లేకుండా రిటర్ను వేయండి. అతి తక్కువ టీడీఎస్ ఉంటే, దాని మీద ఎటువంటి ఆశ లేకుండా రిటర్ను వేయడం తప్పించుకునే ధన్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్ని వివరాలు సేకరించండి. కాగితాలు, రుజువులు, ధృవీకరణలు, సర్టిఫికెట్లు మొదలైనవి సంపాదించండి. ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త తీసుకోండి. వెబ్సైటులోని ఫారం 16, 16 అ, అ 26 మొదలైనవి డౌన్లోడ్ చేయండి. వీటిలో సమగ్ర సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని చెక్ చేసుకోండి. సర్వసాధారణంగా వీటిలో తప్పులుండవు. నిజంగా తప్పేదైనా దొర్లి ఉంటే మీరు వాటిని విభేదించవచ్చు. కానీ, త్వరలో రాబోయే నోటీసుకి, ఆ భేదం లేదా తేడాను రుజువులతో, వివరణలతో, సంజాయిషీతో డిపార్టుమెంటు వారికి చెప్పాలి. మనం చాలా చోట్ల, చాలా సందర్భాల్లో మన పాన్ని తెలియపరుస్తాము. అటు పక్క వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు తప్పులు జరగవచ్చు. రిటర్నులు వేయని వారికి నష్టాల సర్దుబాటు ఉండదు. దాని వల్ల ఎంతో నష్టం ఉందండి. మిగతా వడ్డీలు వడ్డిస్తారు. రిఫండు మీద వడ్డీ ఇవ్వరు. ఇలాంటివి ఇంకా ఎన్నో. సకాలంలో ఐటీ రిటర్ను వేసినంత సుఖం లేదు. ఇదే, మీ అనారోగ్యం, భయం, మానసిక ఆందోళన, ఒత్తిడి, బెంగ, బాధను తగ్గించేది. కాబట్టి ఇప్పటికైనా రిటర్ను వేయండి. ఇదీ చదవండి ➤ గడువు లోపు ‘ITR’ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది? -
ఐటీకి బ్యాంకింగ్ షాక్!
రెండు వారాలుగా అమెరికా, యూరప్ ప్రాంతాల బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్ఎస్ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా. సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్ బ్యాంకింగ్ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్‌గేట్ క్యాపిటల్ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్‌డీఐసీ) టేకోవర్ చేసింది. ఈ బాటలో సిగ్నేచర్ బ్యాంక్ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్ బ్లూచిప్ క్రెడిట్ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని ఫైనాన్షియల్ రంగ దిగ్గజం యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోలుకుంటున్న వేళ కోవిడ్–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇంతలోనే బ్యాంకింగ్ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. బీఎఫ్ఎస్ఐ దెబ్బ దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్వేర్ రంగ సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్ సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసీ, యూబీఎస్లకు టీసీఎస్ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి డీల్స్ తగ్గనుండగా.. కాంట్రాక్ట్ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. మందగమనం అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్ మందగించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మేషన్ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే వీలున్నట్లు తెలియజేశారు. ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్ఎస్ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్వేర్ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. -
నో చెవుల పువ్వెట్టింగ్
ఓ ఉద్యోగినికి భయం.. ఒంటరిగా ఆటోలో వెళ్లాలంటే!.. సగటు మనిషికి హడల్.. ఆటో ఎక్కితే మీటర్ మీద ఇంతవ్వమని డిమాండ్ చేస్తాడని!.. ఇది సకల జనుల సణుగుడు! మీటర్ నిజంగానే మొరాయించిందని మొత్తుకున్నా.. నమ్మని ప్యాసింజర్లు. పర్ఫెక్ట్ రీడింగ్ చూపించినా ట్యాంపరింగ్ చేశావనే కస్టమర్లు.. సగటు జనుల గురించి ఆటోవాలాల నిర్వేదం ఇది! ఈ ఇద్దరి కష్టానష్టాలకు ఒక్క ఆలోచనతో చెక్ పెడుతున్నారీ సిటీ యువకులు. ఒక్క ఫోన్ కాల్, ఆన్లైన్ బుకింగ్‌తో ఆటోను మన ఇంటి ముందుకే పంపిస్తున్నారు. సిటీలోని ఆటో సర్వీస్‌లను సిస్టమాటిక్ చేసి.. ఆటోవాలాల స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. ఈ యువకుల ఐడియా అటు ఆటోవాలాలను, ఇటు ప్యాసింజర్లను నో చెవుల పువ్వెట్టింగ్ అని అనేలా చేస్తోంది. యూకేలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శశాంక్, ఐటీ ఫీల్డ్‌లో 11 ఏళ్ల అనుభవం ఉన్న హర్షవర్ధన్, కులదీప్‌లు సిటీవాసులు. అంటే సహజంగానే ఆటోలతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూసి ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. ‘ఊర్నుంచి వచ్చిన మా ఫ్రెండ్‌ను సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ తీసుకొచ్చినందుకు రూ.450 వసూలు చేశాడు..’ అని చెప్పాడు శశాంక్. ‘లేట్ నైట్ ఆఫీస్ అయిపోయాక.. ఆటోవాళ్లతో పెద్ద పరేషాన్. కొందరేమో మనం అడిగిన చోటుకు రామంటారు. వస్తామన్న వాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు’ అని గుర్తు చేసుకున్నాడు హర్షవర్ధన్. దీనికి ఆటోవాలాల అత్యాశ మాత్రమే కారణం కాదని, ఆర్థిక పరిస్థితి కూడా ఓ కారణమేనని గుర్తించిన వీరు ఓ వినూత్న కాన్సెప్ట్ రూపొందించారు. ఉభయ కుశలోపరి.. ఆటోవాలాలు, సిటీవాసులు.. వీరిద్దరి గురించి ఆలోచించి తొలి అడుగు వేశారు. నగరవ్యాప్తంగా కొన్ని నెలలు సర్వే చేశారు. ఓ 20 వేల ఆటో డ్రైవర్లతో కనెక్టయ్యారు. వారి ఆర్థిక ఇబ్బందులు, అవసరాల గురించి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత అనుభవాలతో పాటు వేలాది మంది ప్యాసింజర్లనూ దగ్గరగా పరిశీలించారు. వీటిని బేస్ చేసుకుని వీరిద్దరి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి పూనుకున్నారు. ఆటోడ్రైవర్లకు సరైన ఆదాయం, అదే టైంలో ప్యాసింజర్ల జేబులకు చిల్లులు పడకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను డిజైన్ చేశారు. పంజగుట్టలోని వీరి సాఫ్ట్వేర్ కంపెనీకి అనుబంధంగా ఆటో హోనా పేరుతో 3 నెలల క్రితం వెబ్సైట్ ప్రారంభించారు. ఈ సర్వీసు అచ్చం కాల్ ట్యాక్సీ వంటిదే. ఒక్క ఫోన్‌కాల్‌తో లేదా ఆన్లైన్ బుకింగ్‌తో జంటనగరాల పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా క్షణాల్లో ఆటోను మన ఇంటి ముంగిట ఉంచుతుంది. మొదటి 1.6 కి.మీ వరకూ రూ.20 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది. కేర్ టేకర్స్ ఫర్ డ్రైవర్స్ ‘ఆటోలో ప్రయాణికుడు ఎక్కి, గమ్యం చేరే వరకూ మా పర్యవేక్షణ కొనసాగుతుంది. గమ్యాన్ని చేరారా అనేది కూడా మా కాల్ సెంటర్స్ ప్రతినిధులు వాకబు చేస్తారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రాత్రి వేళల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని వివరించారు హర్షవర్ధన్. ఆటోవాలాల స్థితిగతులు మెరుగుపరచడమే ప్రధాన బాధ్యతగా తీసుకుంది ఈ మిత్ర త్రయం. ‘వారి కష్టం, సమయం వృథా కాకూడదు. ఎవరైనా కస్టమర్ 10 నిమిషాలకు మించి వెయిటింగ్లో ఉంచితే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణిస్తే అదనపు చార్జీ చెల్లించాలి. ప్రయాణికుడు కోరిన చోటుకు నిర్ణీత సమయానికంటే 5 నిమిషాల ముందుగానే చేరిస్తే రూ.10 బహుమతి అందిస్తున్నాం. ఆటో డ్రైవర్లకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం, ఆటో నిర్వహణలో మెలకువలు, మెడికల్ క్యాంప్స్ ప్లాన్ చేస్తున్నాం. ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా సూచనలు, శిక్షణ అందిస్తున్నాం’ అని ఈ ఫ్రెండ్స్ చెప్పారు. ఆటో హోనా.. ఆటో హోనా వెబ్సైట్లో రెండు నెలల్లోనే 12 వేలకు పైగా ఆటోలు తమ పేరు ఎంట్రీ చేసుకున్నాయి. రోజుకు వందలాదిగా ఈ వెబ్సైట్లో ఎంక్వైరీ చేస్తుంటే, 50కి తగ్గకుండా బుకింగ్‌లు వస్తున్నాయి. ‘ఓన్ కార్స్ ఎక్కువ ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ ఏరియాల నుంచీ మా సర్వీస్‌లను బాగా వినియోగించుకుంటున్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ స్నేహితులు. భవిష్యత్తులో హౌస్ షిఫ్టింగ్ నుంచి గణేశుడి నిమజ్జనం వరకూ ఈ కాల్ ఆటోని అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నారు. ఆటోవాలాలకు ఆదాయం పెంచేలా ఆటోల్లో యాడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీరి కాన్సెప్ట్‌ను మరికొందరు కూడా అందిపుచ్చుకుని ఈ తరహా సర్వీస్‌లు ప్రారంభిస్తున్న నేపధ్యంలో... చూద్దాం... వీరి నేటి ఆలోచనతో మన నిన్నటి ఆటో కష్టాలు తీరుతాయేమో..! బెస్టాఫ్ లక్ టూ.. ఆటో హోనా. - ఎస్. సత్యబాబు