నో చెవుల పువ్వెట్టింగ్ | Do not put flowers in ears | Sakshi
Sakshi News home page

నో చెవుల పువ్వెట్టింగ్

Published Thu, Oct 30 2014 1:04 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

నో చెవుల పువ్వెట్టింగ్ - Sakshi

నో చెవుల పువ్వెట్టింగ్

ఓ ఉద్యోగినికి భయం.. ఒంటరిగా ఆటోలో వెళ్లాలంటే!.. సగటు మనిషికి హడల్.. ఆటో ఎక్కితే మీటర్ మీద ఇంతవ్వమని డిమాండ్ చేస్తాడని!.. ఇది సకల జనుల సణుగుడు! మీటర్ నిజంగానే మొరాయించిందని  మొత్తుకున్నా.. నమ్మని ప్యాసింజర్లు. పర్‌ఫెక్ట్ రీడింగ్ చూపించినా ట్యాంపరింగ్ చేశావనే కస్టమర్లు.. సగటు జనుల గురించి ఆటోవాలాల నిర్వేదం ఇది! ఈ ఇద్దరి కష్టానష్టాలకు ఒక్క ఆలోచనతో చెక్ పెడుతున్నారీ సిటీ యువకులు. ఒక్క ఫోన్ కాల్, ఆన్‌లైన్ బుకింగ్‌తో ఆటోను మన ఇంటి ముందుకే పంపిస్తున్నారు. సిటీలోని ఆటో సర్వీస్‌లను సిస్టమాటిక్ చేసి.. ఆటోవాలాల స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. ఈ యువకుల ఐడియా అటు ఆటోవాలాలను, ఇటు ప్యాసింజర్లను నో చెవుల పువ్వెట్టింగ్ అని అనేలా చేస్తోంది.  
 
 యూకేలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శశాంక్, ఐటీ ఫీల్డ్‌లో 11 ఏళ్ల అనుభవం ఉన్న హర్షవర్ధన్, కులదీప్‌లు సిటీవాసులు. అంటే సహజంగానే ఆటోలతో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చూసి ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. ‘ఊర్నుంచి వచ్చిన మా ఫ్రెండ్‌ను సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ తీసుకొచ్చినందుకు రూ.450 వసూలు చేశాడు..’ అని చెప్పాడు శశాంక్. ‘లేట్ నైట్ ఆఫీస్ అయిపోయాక.. ఆటోవాళ్లతో పెద్ద పరేషాన్. కొందరేమో మనం అడిగిన చోటుకు రామంటారు. వస్తామన్న వాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు’ అని గుర్తు చేసుకున్నాడు హర్షవర్ధన్. దీనికి ఆటోవాలాల అత్యాశ మాత్రమే కారణం కాదని, ఆర్థిక పరిస్థితి కూడా ఓ కారణమేనని గుర్తించిన వీరు ఓ వినూత్న కాన్సెప్ట్ రూపొందించారు.
 
ఉభయ కుశలోపరి..
 ఆటోవాలాలు, సిటీవాసులు.. వీరిద్దరి గురించి ఆలోచించి తొలి అడుగు వేశారు. నగరవ్యాప్తంగా కొన్ని నెలలు సర్వే చేశారు. ఓ 20 వేల ఆటో డ్రైవర్లతో కనెక్టయ్యారు. వారి ఆర్థిక ఇబ్బందులు, అవసరాల గురించి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత అనుభవాలతో పాటు వేలాది మంది ప్యాసింజర్లనూ దగ్గరగా పరిశీలించారు. వీటిని బేస్ చేసుకుని వీరిద్దరి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి పూనుకున్నారు. ఆటోడ్రైవర్లకు సరైన ఆదాయం, అదే టైంలో ప్యాసింజర్ల జేబులకు చిల్లులు పడకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను డిజైన్ చేశారు. పంజగుట్టలోని వీరి సాఫ్ట్‌వేర్ కంపెనీకి అనుబంధంగా ఆటో హోనా పేరుతో 3 నెలల క్రితం వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ సర్వీసు అచ్చం కాల్ ట్యాక్సీ వంటిదే. ఒక్క ఫోన్‌కాల్‌తో లేదా ఆన్‌లైన్ బుకింగ్‌తో జంటనగరాల పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా క్షణాల్లో ఆటోను మన ఇంటి ముంగిట ఉంచుతుంది. మొదటి 1.6 కి.మీ వరకూ రూ.20 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది.
 
 కేర్ టేకర్స్ ఫర్ డ్రైవర్స్
 ‘ఆటోలో ప్రయాణికుడు ఎక్కి, గమ్యం చేరే వరకూ మా పర్యవేక్షణ కొనసాగుతుంది. గమ్యాన్ని చేరారా అనేది కూడా మా కాల్ సెంటర్స్ ప్రతినిధులు వాకబు చేస్తారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రాత్రి వేళల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని వివరించారు హర్షవర్ధన్. ఆటోవాలాల స్థితిగతులు మెరుగుపరచడమే ప్రధాన బాధ్యతగా తీసుకుంది ఈ మిత్ర త్రయం. ‘వారి కష్టం, సమయం వృథా కాకూడదు. ఎవరైనా కస్టమర్ 10 నిమిషాలకు మించి వెయిటింగ్‌లో ఉంచితే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణిస్తే అదనపు చార్జీ చెల్లించాలి. ప్రయాణికుడు కోరిన చోటుకు నిర్ణీత సమయానికంటే 5 నిమిషాల ముందుగానే చేరిస్తే రూ.10 బహుమతి అందిస్తున్నాం. ఆటో డ్రైవర్లకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం, ఆటో నిర్వహణలో మెలకువలు, మెడికల్ క్యాంప్స్  ప్లాన్ చేస్తున్నాం. ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా సూచనలు, శిక్షణ అందిస్తున్నాం’ అని ఈ ఫ్రెండ్స్ చెప్పారు.
 
 ఆటో హోనా..
 ఆటో హోనా వెబ్‌సైట్‌లో రెండు నెలల్లోనే 12 వేలకు పైగా ఆటోలు తమ పేరు ఎంట్రీ చేసుకున్నాయి. రోజుకు వందలాదిగా ఈ వెబ్‌సైట్‌లో ఎంక్వైరీ చేస్తుంటే, 50కి తగ్గకుండా బుకింగ్‌లు వస్తున్నాయి. ‘ఓన్ కార్స్ ఎక్కువ ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ ఏరియాల నుంచీ మా సర్వీస్‌లను బాగా వినియోగించుకుంటున్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ స్నేహితులు. భవిష్యత్తులో  హౌస్ షిఫ్టింగ్ నుంచి గణేశుడి నిమజ్జనం వరకూ ఈ కాల్ ఆటోని అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నారు. ఆటోవాలాలకు ఆదాయం పెంచేలా ఆటోల్లో యాడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీరి కాన్సెప్ట్‌ను మరికొందరు కూడా అందిపుచ్చుకుని ఈ తరహా సర్వీస్‌లు ప్రారంభిస్తున్న నేపధ్యంలో... చూద్దాం... వీరి నేటి ఆలోచనతో మన నిన్నటి ఆటో కష్టాలు తీరుతాయేమో..! బెస్టాఫ్ లక్ టూ.. ఆటో హోనా.
 -  ఎస్. సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement