S. Satyababu
-
నడిచే హక్కుకోసం పోరు..
మెహదీపట్నం సమీపంలోని కరోల్‌బాగ్ కాలనీవాసి కాంతిమతి కన్నన్. పాదచారుల సమస్యలపై కొన్నేళ్లుగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ‘ఈ నగరంలో రోజుకి ఒక పాదచారి యాక్సిడెంట్లో చనిపోతున్నారని మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నిస్తారామె. పాదచారుల హక్కుల పట్ల పాలకులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంత కాలం ఈ తరహా సంఘటనలు పెరుగుతూనే ఉంటాయన్నారు. జనాభాలో 70 శాతం మంది ఇప్పటికీ సొంత వాహన సౌకర్యం లేనివారే. మరి వీరంతా నడవడానికి సరైన దారేది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేస్తున్నారు. నగర రోడ్లను సర్వే చేశారు. పేరుకి రాష్ట్ర రాజధాని నగరమే అయినా హైదరాబాద్‌లో ఎక్కడా పాదాచారులకు మార్గమే లేదని, అరకొరగా ఉన్న ఫుట్‌పాత్‌లు అక్రమ పార్కింగ్లు, చెత్తకుండీలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న గుళ్లు, మందిరాలతో నిండిపోయాయని గుర్తించారు. వీటన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన పరిధిలో తోచిన పరిష్కార మార్గాలు కూడా సూచించారు. చేస్తున్న ఉద్యోగాన్ని, వేలల్లో నెలవారీ జీతాన్ని వదిలేశారు. ‘రైట్ 2 వాక్ ఫౌండేషన్’ను సంస్థను ప్రారంభించారు. పూర్తి సమయాన్ని పాదచారుల హక్కులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణకు ఉద్యమించారు. పాదచారుల సమస్యలపై హైకోర్టులో పిల్ వేశారు. సీఎన్ఎన్, ఐబీఎన్ చానెల్లో సిటిజన్ రిపోర్టర్‌గా చేసి సమస్య తీవ్రతను వెలుగులోకి తెచ్చారు. 20 వేల మంది పాదచారుల నుంచి ఉద్యమానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. ‘చాలా మంది ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమస్యపై స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. అయితే ఇంకా చాలా జరగాలి. పాదచారుల హక్కులపై ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరగాలి. పూర్తిస్థాయి పెడస్ట్రియన్ (పాదచారులు) పాలసీ రూపొందాలి. వీటికోసం పోరాడుతూనే ఉంటా’నంటున్నారు కాంతిమతి. ఇదే విషయంపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. - ఎస్.సత్యబాబు -
సింక్ విన్
ఇండియా ఫీస్టా లాటినా.. ఈ పేరు సిటీలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఆ తక్కువలోనూ డ్యాన్సర్లే ఎక్కువుంటారు. ఢిల్లీ వేదికగా ఏడాదికోసారి లాటిన్ నృత్యాలతో హోరెత్తించే ‘ఇండియా ఫీస్టా లాటినా’.. ఓ అంతర్జాతీయ నృత్యోత్సవం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన విభిన్న వెరైటీల లాటిన్ డ్యాన్స్ స్టయిల్స్‌కు పట్టం కడుతూ సాగే ఈ ఫెస్టివల్లో ఈసారి నగరానికి కూడా ప్రాతినిథ్యం లభించడమే విశేషమనుకుంటే.. వీరిలో ప్రొఫెషనల్ డ్యాన్సర్ల కన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉండటం మరో విశేషం. - ఎస్.సత్యబాబు ఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న లీలా యాంబియన్స్ హోటల్ గత ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో టాప్‌క్లాస్ లాటిన్ డ్యాన్సులతో హోరెత్తింది. ఈ కనుల‘పండుగ’లో సిటీ నుంచి పాల్గొనే అవకాశం సింక్‌వన్ బృందానికి దక్కింది. ఇటీవలే ఈ ఫెస్ట్ నుంచి సిటీకి తిరిగి వచ్చిన ఈ బృంద సభ్యులు సిటీప్లస్‌తో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు. రెస్పాన్స్ అదుర్స్.. ‘ఐఎఫ్ఎల్లో సల్సా- పచాంగా స్టైల్‌ను మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ సాంగ్‌కు రీమిక్స్ చేసి అందించాం. దీని కోసం ముందుగా బోలెడంత ప్రాక్టీస్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ఆర్టిస్ట్‌లను కలవడం ఓ స్ఫూర్తిదాయక అనుభవం. మా పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ మరచిపోలేం. అక్కడ ఒక వర్క్‌షాప్ కూడా నిర్వహించాను. ఈ సందర్భంగా టాప్‌క్లాస్ లాటిన్ డ్యాన్సర్లతో కలిసి పదం కలిపే ఛాన్స్ వచ్చింది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు సింక్‌వన్ బృంద సారథి శశాంక్. తనతో పాటు తొమ్మిది మంది ఈ బృందంలో ఉన్నారు. ‘ఇప్పటిదాకా 8 డ్యాన్స్ ఫెస్ట్‌లలో పాల్గొన్నా.. అన్నింటిలోకి ఇది బెస్ట్’ అని చెప్పాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అర్జీత్ సింగ్. వీరిలో తొలిసారి డ్యాన్స్ ఫెస్ట్‌లలో పాల్గొంటున్నవారూ ఉన్నారు. ‘ఇదే ఫస్ట్ టైమ్ నాకు. ఇట్స్ క్రేజీ ఈవెంట్. నేను ఇప్పటిదాకా అటెండవ్వని పూల్ పార్టీనీ ఎంజాయ్ చేశాను’ అంటూ సంబరపడిపోయింది ఐటీ ఉద్యోగిని పరిధి. అన్బిలీవబుల్.. ఎంజాయ్మెంట్ విత్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగిని సునంద. ‘ఐఎఫ్ఎల్ కోసం లాస్ట్ డిసెంబర్ నుంచి ప్రిపేరయ్యా. నేర్చుకునేవారికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేవారికి ఇదో గొప్ప వేదిక’ అని అన్నారామె. ప్రపంచపు బెస్ట్ ఆర్టిస్ట్స్‌తో స్టేజ్ షేర్ చేసుకోవడం నమ్మలేకపోతున్నానని చెప్పారు ప్రతీక్. ‘ఇది నేను పాల్గొన్న 4వ ఫెస్టివల్. యూట్యూబ్‌లో మాత్రమే చూడగలిగే విదేశీ డ్యాన్సర్లను ప్రత్యక్షంగా కలవడం ఒక కలలా అనిపిస్తోంద’ని అన్నారు పార్కర్ ట్రైనర్‌గా నగరంలో సుపరిచితులైన అభినవ్. ‘తొలిసారి ఐఎఫ్ఎల్లో పాల్గొన్నాను. క్లాసుల నుంచి పెర్ఫార్మెన్స్ల దాకా అన్నీ సూపర్బ్. కొత్త కొత్త మూవ్మెంట్స్ నేర్చుకున్నాం’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అదితి. ‘ఈ మెగా డ్యాన్స్ ఫెస్ట్‌లో అంతులేని వినోదాన్ని పొందాను’ అన్నారు మరో డ్యాన్సర్ శ్రవణ్. త్రీ డేస్.. ఓన్లీ డ్యాన్స్ నాలుగేళ్లుగా సింగపూర్ డ్యాన్సర్ నీరజ్ మస్కారా.. లాటిన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నృత్యాభిమానులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు పాల్గొనే ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. వరల్డ్ ఫేమస్ డ్యాన్సర్లు 800 మంది వరకు దీనికి హాజరయ్యారు. అమెరికా, యూకే తదితర దేశాల నుంచే కాక హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన వారు పాల్గొన్నారు. లాటిన్ డ్యాన్స్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో దీనిలో రోజంతా వర్క్‌షాప్స్, సాయంత్రం వేళల్లో డ్యాన్స్ షోలు ఉంటాయి. ఒకరోజు మొత్తం కాంపిటీషన్స్ ఉంటాయి. -
రాజకీయాల్లోకి రండి..
‘రాజకీయాలను, ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. స్వచ్ఛమైన, కల్మష రహిత నేపథ్యం ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి’ అంటూ స్పష్టం చేశారు షాజియా ఇల్మి. దేశ రాజకీయాల్లో స్వల్పకాలంలోనే చిరపరిచితమైన నేతగా ఎదిగిన ఈ ఢిల్లీ మహిళ... సిటీకి వచ్చారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ),యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్ఎల్ఒ)లకు నూతన గవర్నింగ్ బాడీస్ ఏర్పాటైన సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘రాజకీయాల్లో సిద్ధాంతాలు’పై మాట్లాడారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆమె మాటల్లోనే.. మార్పు దిశగా పయనిద్దాం... రాజకీయం అనేది నా భావాలు వ్యక్తం చేసేందుకు, నిర్ణయాత్మక శక్తిగా నన్ను నేను మలచుకునేందుకు నేను ఎంచుకున్న వేదిక. ఒకప్పుడు జర్నలిస్ట్‌గా ఉన్న నేను కేవలం రిపోర్టింగ్ చేసేసి ఆ తర్వాత సెలైంట్‌గా ఉండిపోవడానికి పరిమితమవడం కన్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం కావాలనుకున్నా... రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. మన సిస్టమ్ బాగోలేదనడం, ప్రభుత్వాలను తప్పుపట్టడమూ సులభమే. అయితే మనం మేల్కొని మార్పుకు కారణం కావాల్సిన సమయం ఇది. కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఇది. మార్పును స్వీకరిస్తూ దేశాన్ని మార్చే దిశగా మనం పయనించాలి. మన తలరాత రాసేది రాజకీయాలే... కులం, మతం, ప్రాంతం. తన మన భేదాలు ఇంకా అలాంటి అనేకానేక అంశాల ఆధారంగా ఓట్లేస్తున్నాం. ఇలా వేసినంత కాలం మనం రాజకీయాల్లో విలువల్ని ఆశించలేం. భారతదేశ తలరాతను రాసేవి రాజకీయాలే. మన బిడ్డల భవిష్యత్తును, మన జీవన స్థితిగతులను, పాఠశాలల్లో పద్ధతులను, మన అక్కా చెల్లెళ్ల భద్రతను, తోటి పౌరుల భద్రతను అన్నింటినీ నిర్ణయించేవి అవే. కాబట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సి ఉందని నేను నమ్ముతున్నాను. - ఎస్.సత్యబాబు -
చీరస్తు
జుబిన్ డిజైన్ మస్తు కొంతకాలంగా సిటీ పేజ్ త్రీ సర్కిల్స్‌లో గాని, ఫ్యాషన్ సీన్లో గాని పెద్దగా కని-వినిపించని జుబిన్.. మరోసారి న్యూస్ మేకర్ అయ్యారు. తన స్టైల్‌కు పూర్తి భిన్నంగా.. శారీ కలె క్షన్స్ను క్రియేట్ చేసి వావ్ అనిపిస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, రోహిత్ ఖోస్లా వంటి టాప్ డిజైనర్స్‌కు వర్క్ చేసిన మాయా అనంతరాజన్ హ్యాండ్ పెయింటింగ్ తోడుగా ఆయన ఈ కలె క్షన్స్ డిజైన్ చేశారు. జుబిన్ కలెక్షన్స్‌లో అందంగా మెరిసిపోతున్న మిస్ ప్లానెట్ మెహక్‌మూర్తి స్టిల్స్‌ని ఫొటోగ్రాపర్ సిరాజ్ క్లిక్‌మనిపించారు. - ఎస్.సత్యబాబు వెస్ట్రన్ వేర్. ఈ పదం వినగానే సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌కి ఠక్కున గుర్తొచ్చే పేరు జుబిన్ వకీల్. అల్ట్రామోడ్రన్కి ఆల్టర్నేటివ్ అనిపించేలా మీ వర్క్స్ ఉంటాయంటూ తరచుగా కాంప్లిమెంట్స్ అందుకునే ఈ డిజైనర్.. వర్క్ పరంగానూ, వ్యక్తిగతంగానూ టాక్ ఆఫ్ ది టౌన్. దాదాపు 15 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న జుబిన్ తొలిసారి శారీస్ డిజైనింగ్లోకి ప్రవేశించారు. ఒక్క‘శారీ’ కమిట్ అయితే... ‘నా చేత శారీ కలెక్షన్స్ లాంచ్ చేయించిన క్రెడిట్ నా క్లయింట్ సునందా సేన్ గుప్తాకే దక్కుతుంది’ అని చెప్పారు జుబిన్. తన కోసం ఒక్క శారీ డిజైన్ చేసి ఇమ్మని పదే పదే సునంద రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక శారీస్ డిజైనింగ్‌కు సిద్ధమయ్యానన్నారు. ‘అయితే వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది శారీస్ డిజైనింగ్‌లో లభించే ఆనందం ఏమిటో’ అన్న జుబిన్.. అదే ఊపులో కొత్త కలెక్షన్స్ లాంచ్ చేసేశారు. సమకాలీన డిజైనర్లకు భిన్నంగా కొన్నేళ్లు ముందుకు వెళ్లి డిజైన్ చేయడానికి ఇష్టపడే ఈ ట్రెండ్ సెట్టర్.. తాజా కలెక్షన్స్‌లో ఎల్లో మేళవించిన ఆలివ్ గ్రీన్, డల్ గ్రీన్-పింక్ మిక్సింగ్.. వంటి కలర్స్ కాంబినేషన్లతో తన ఫాస్ట్ ఫార్వర్డ్ ఐడియాస్కి అందమైన రూపమిచ్చారు. సిల్క్స్, ఆర్గాంజా, షిఫాన్ తదితర ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన ఈ లైట్ వెయిట్ శారీస్ డిఫరెంట్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని జుబిన్ హ్యాపీగా చెప్పారు. ఆర్టిస్ట్ మాయా అనంతరాజన్ తన శారీస్‌పై ఆమె హ్యాండ్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే.. ఆమె పెయింటింగ్ స్టైల్ తన కలెక్షన్స్‌కు నప్పుతుందా లేదా అని కొంత తటపటాయించినా.. ఒక్కసారి ఆమె వర్క్ చూశాక ఫిదా అయిపోయానంటున్నారీ ప్రయోగాల డిజైనర్. నా రూటే వేరు... ఫ్యాషన్వీక్స్, సెలబ్రిటీ షోస్, బొటిక్స్, స్టోర్స్.. ఇలా ఎప్పుడూ న్యూస్‌లో వెలిగిపోయే మిగిలిన డిజైనర్ల మార్గాన్ని ఎంచుకోని జుబిన్.. ఫ్యాషన్ వీక్ అనేది ఒక వ్యయప్రయాసల వ్యవహారమని అంటారు. దీని కోసం నిధులు సమకూర్చే ‘ఫండింగ్’ పర్సన్‌ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత డిజైనర్దేనని, సెలబ్రిటీలు డబ్బుల విషయంలో పెట్టే ఇబ్బందులు భరించడం తనవల్ల కాదన్నారు. క్లయింట్స్‌ను మెప్పించినంత కాలం.. ఈ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం సాధ్యమేనంటున్న జుబిన్... శారీస్ డిజైనింగ్ కొనసాగిస్తూనే.. తనదైన శైలి షాకింగ్ డ్రెస్‌లతో మెరిపిస్తానని చెప్పారు. -
కుట్రీరం
నీడ నుంచి ఓడ దాకా పచ్చని చెట్టు ఇచ్చే ప్రతిఫలాలకు లెక్కేలేదు. చెట్టుకీ మనిషికి ఉన్న అనుబంధాన్ని కాంక్రీట్ జంగిల్ కాసింత తగ్గించగలదే కాని తుడిచేయలేదు. ఆ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఈ ట్రీహౌస్‌లు. సిటీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ట్రెండ్.. పచ్చదనం నీడలో పయనించాలనే మనిషి ఆకాంక్షకు అచ్చమైన ప్రతిరూపంగా నిలుస్తోంది. - ఎస్.సత్యబాబు ఇల్లు, ఆఫీస్, హోటల్స్, థియేటర్స్.. ఇలా సిటీవాసి వెళ్లే ప్రతి చోటు సిమెంట్ మేటలు పరుచుకుని సహజత్వాన్ని దూరం చేసేవే. పార్క్‌లు మినహాయిస్తే.. పది రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా.. ప్రకృతి చిరునామా ఇక్కడ దొరకడం కష్టమే. వెదురుతో వెలిసిన ట్రీహౌస్‌లు ఈ సమస్యకు చెక్ పెడుతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకున్న వెదురు.. ఓ చెట్టునీడలో కుటీరాల్లా వెలిసి.. చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పల్లె పొలాల్లో.. రైతులు నిర్మించుకునే మంచెలను తలపిస్తూ.. పట్నవాసంలో పల్లెవాసనలు తీసుకొస్తున్నాయి. భూమికి కాసింత ఎత్తులో ఉండే ఈ ట్రీ హౌస్‌ను చూడగానే సగం రిలాక్స్ అయిపోతాం. ఎంత సేపయినా హాయిగా.. ‘నేను ఈ హౌస్ కట్టినప్పుడు నందివర్ధనం చెట్టు ఉండేది. ఒక కొమ్మ కొట్టేసి కట్టాం. ఇప్పుడు ఆ నందివర్ధనం బాగా పెరిగి ట్రీ హౌస్ పైకి వచ్చేసింది. చూడముచ్చటగా ఉంటుంది. ఈ ట్రీహౌస్‌లో ఎంతసేపైనా గడిపేయవచ్చు’ అంటూ తన ట్రీహౌస్ ప్రత్యేకతను వివరిస్తారు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాశ్. కూకట్‌పల్లిలోని ఆలంబన ఎన్జీవో నిర్వాహకురాలు శిరీషకు ఈ ట్రీహౌస్ అంటే చాలా ఇష్టం. ‘మా స్కూల్ ఎదుట దీన్ని మూడేళ్ల కిందట కట్టాం. మా పిల్లలకు ఇది మంచి రిక్రియేషన్ ప్లేస్. నేల నుంచి 15 అడుగుల ఎత్తులో నిర్మించిన కుటీరంలో కూర్చునేందుకు ఇక్కడి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పోటీపడుతుంటారు. ట్రీహౌస్ కట్టే సమయంలో ఇక్కడో పెద్ద చెట్టు ఉండేది. ఇటీవల ఆ చెట్టు కొట్టివేయడంతో ట్రీ హౌస్ కొంత బోసిపోయినా.. ఇప్పటికీ ఇది బెస్ట్ మీటింగ్ పాయింట్‌గా నిలుస్తోంది. మా విద్యార్థులు హోమ్‌వర్కులు చేసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. ఇక్కడికే వచ్చేస్తుంటార’ని తెలిపారు శిరీష. గృహస్థు ఆశ్రమం.. ఎన్జీవోల నుంచి ప్రారంభమైన ఈ ట్రీ హౌస్‌ల ట్రెండ్.. ఇప్పుడు వ్యక్తిగత ఇళ్లకు కూడా విస్తరించింది. వ్యక్తిగత విశ్రాంతి నిలయంగా, రొటీన్‌కు భిన్నమైన ఆవాసంగా నగరవాసులు దీనిని భావిస్తున్నారు. అదే కోవలో ‘మంచిపుస్తకం’ పబ్లిషర్ అయిన సురేష్ కొసరాజు నాగోల్‌లోని తన ఇంటి టై మీద ఈ తరహా ఇల్లు కట్టుకుంటే.. వనస్థలిపురంలోని హస్తినాపురంలో నివసించే విమలాచార్య మామిడి చెట్టు కింద కట్టుకున్నారు. అస్సాం అయితే బెస్ట్.. ప్రస్తుతం నగరంలో నిర్మితమవుతున్న ట్రీ హౌస్‌లకు అస్సాం నుంచి వచ్చిన వెదురునే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర లభించే వెదురుతో పోలిస్తే థిక్నెస్ ఎక్కువుంటుందని, మరింత బలమైనదని అంటున్నారు. ఎక్కువ బరువును భరించడంతో పాటు.. పురుగులు కూడా పట్టవని చెబుతున్నారు. భూమిలోకి రెండున్నర అడుగులు, పైకి 5 అడుగులు మొత్తం 8 అడుగుల్లో రూపొందించగలిగిన ఈ ట్రీ హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.20 వేలలోపే. విరివిగా కట్టాలి.. నగరంలో గూడులేని వారెందరో ఫుట్‌పాత్‌లపైనే విశ్రమిస్తుంటారు. అలాంటి వారికి ఈ ట్రీ హౌస్‌లు అందుబాటులోకి తీసుకురాగలితే వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే, ట్రీ హౌస్‌లను విరివిగా కడితే ఎందరికో ఉపకరిస్తుంది. -డా.సూర్యప్రకాష్, ఓపెన్ హౌస్ చారిటీ సంస్థ నిర్వాహకుడు -
సవాల్
గోడ మీది బల్లిని తలపించే ఆట అది. వేలాడే మనుషుల్ని వాల్స్ మీద చూపించే వింత అది. సిటీలో సరికొత్త అభిరుచిగా సందడి చేస్తోంది. నగరవాసుల వీకెండ్ డైరీలో ఇప్పుడు దీనిదే చెప్పుకోదగ్గ స్థానం. గోడల్ని పట్టుకుని ఎగబాకడంలో సత్తా చూపించేందుకు నగర యువత ఉత్సాహపడుతోంది. దీని కోసం సిటీలో కొన్ని ప్రత్యేకమైన వేదికలు సైతం ఏర్పాటవుతున్నాయి. బౌల్డరింగ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆట విశేషాలివి.. - ఎస్.సత్యబాబు క్లైంబింగ్ అనేది తొలుత పర్వతాలతో ప్రారంభమైంది. పర్వతారోహణ (మౌంటెనీరింగ్), రాక్‌క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ .. ఇలా విస్తరించింది. రాక్ మీద ఐస్ ఫామ్ అయితే దాన్ని మిక్స్డ్ క్లైంబింగ్ అంటారు. క్లైంబింగ్ క్రేజ్ ఇటీవల బాగా పెరిగింది. అయితే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిసారీ మౌంటెన్స్, రాక్స్ వెతుక్కుంటూ వెళ్లలేం కదా. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చినవే ఆర్టిఫిషియల్ వాల్స్. ఆర్టిఫిషియల్ వాల్ మీద చేసే క్లైంబింగ్ని స్పోర్ట్స్ క్లైంబింగ్ అంటున్నారు. దీనిలో కూడా 3 విభాగాలున్నాయి. గోడ ఎత్తు 15 అడుగులు అంతకన్నా తక్కువుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30-40 అడుగుల ఎత్తుంటుంది. భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి చాలా శారీరక సామర్థ్యం ఉండాలి. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. బౌల్డరింగ్ ‘భాగ్యం’... లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు మౌంటెనీరింగ్‌ను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే పరిమితం. పైగా అంత కాంపిటీటివ్ వాల్స్ కూడా సిటీజనులకు అందుబాటులో లేవు. దీంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు నగరవాసులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే బౌల్డరింగ్ని ఒక వినోద సాధనంగా, వ్యాయామ మార్గంగా పలు చోట్ల ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్, ఫిలింనగర్ క్లబ్, పలు రిసార్ట్స్‌తో పాటు రన్‌వే 9, గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ స్కూల్‌తో పాటు లాటిట్యూడ్, సోల్ వంటి జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ సాధన కోసం అమర్చిన వాల్స్ ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు బౌల్డరింగ్ కోసమే ప్రత్యేకించిన క్రాగ్ స్టూడియో.. కొండాపూర్‌లో ఏర్పాటైంది. ఇది బౌల్డరింగ్ లవర్స్‌కి మరింత ఊపునిస్తోంది. ఏడాది శ్రమ ఫలితం... ‘సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ చేసేవాణ్ని. అమెరికా, యూకేలలో ఉన్నట్టుగా వ్యక్తిగతంగా ప్రాక్టీస్ కోసం ఒక ఆర్టిఫిషియల్ వాల్ పెట్టుకుందామనుకున్నాను. తర్వాత ఆ ఆలోచన మార్చుకుని దీన్ని నాలాంటి అభిరుచి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశా. మొత్తం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్రాగ్ స్టూడియో కన్స్ట్రక్ట్ చేశాను. ఇక్కడ బౌల్డరింగ్ కోసం 12 అడుగుల ఎత్తున్న 3 వాల్స్ ఉన్నాయి. 24 ఫీట్స్ లీడ్ క్లైంబింగ్ ఒకటి ఉంది’ అని వివరించారు క్రాగ్ స్టూడియో నిర్వాహకుడు వూటుకూరు రంగారావు. ఈ స్టూడియోలో సభ్యత్వం కోసం నెలకు రూ.1,500 ఛార్జ్ చేస్తున్నామన్నారు. హైపర్ యాక్టివిటీ హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ అద్భుతమైన హాబీ. దీనిలో గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మంచి ఫన్ కూడా ఉండడంతో సిటీలో చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తోంది. దీనికి పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో కొందరు వ్యక్తిగతంగా ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.పూణె లాంటి నగరాల్లో చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం అయితే 8, 9 అడుగుల వాల్ సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాల్కి దీన్ని సెటప్ చేస్తారు. బెడ్రూమ్ ఉంటే ఒక కార్నర్లో క్లైంబింగ్ వాల్ పెడతారు. ఇదే ట్రెండ్‌ని సిటీలో కూడా పలువురు ఫాలో అవుతున్నారు. -
వెరైటీ చారిటీ
ఒకప్పుడు చారిటీ యాక్టివిటీ అంటేనే గొప్ప అనుకునే పరిస్థితి. మరిప్పుడో.. ఎంతో కొంత వినూత్నంగా ఉంటే తప్ప సేవ.. ఆసక్తిని పెంచడం లేదు. దీంతో సిటీలోని కార్పొరేట్ సంస్థలు చారిటీలోనూ వెరైటీ మార్గాలు అన్వేషిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీని ప్రదర్శిస్తున్నాయి. ..:: ఎస్.సత్యబాబు వైవిధ్యం సేవకు సైతం సారథ్యం వహిస్తోంది. కేవలం పైసలు ఇచ్చేసి హెల్ప్ చేసేశాం అనుకునే స్థాయిని సిటీ చారిటీ దాటేసింది. అవసరాలను గుర్తించడంలోనే కాదు వాటిని తీర్చడంలోనూ వినూత్న విధానాలను ఫాలో అవుతోంది. విష్ మీ గుడ్‌లక్.. ‘పరీక్ష రాయబోతున్నాను. మార్కులు బాగా వచ్చేలా బ్లెస్ మీ’ అంటూ శాంతాక్లాజ్‌ను వేడుకుందో అమ్మాయి. ‘ఖరీదైన సైకిల్ కొనుక్కోవాలనుంది. తీరుస్తావా?’ ఇది మరో బుడతడి కోరిక. నగరానికి చెందిన ‘ఓయే హ్యాపీ’ అనే సంస్థ బస్తీ చిన్నారుల అవసరాలు తెలుసుకుని, తీర్చడం కోసం.. ఓ వినూత్న ప్రయత్నం చేసింది. చిన్నారులకు ఎంతో ప్రియమైన క్రిస్మస్ తాత, శాంతాక్లాజ్‌కి తమ కోరికలు చెప్పుకోమంటూ చిన్నారుల క్లాస్‌రూమ్‌లోనే ఒక పోస్ట్‌డబ్బా ఏర్పాటు చేసింది. కార్డ్స్ ఇచ్చింది. వాళ్లు స్వయంగా రాసిన కోరికల ఉత్తరాలను పోస్ట్‌డబ్బా ద్వారా శాంతాక్లాజ్‌కు చేరవేస్తున్నామని చెప్పి ఆ ఉత్తరాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు, స్టాఫ్‌కు పంపింది. వాళ్ల చేయూతతో పిల్లల విష్ లిస్ట్‌లో వీలున్నన్ని కోరికలను తీర్చగలిగింది. ‘చాక్లెట్ల నుంచి సైకిల్స్ దాకా 45 మంది బస్తీ పిల్లల కోరికలను నెరవేరేలా చేయగలిగామ’ని ఓయె హ్యాపీ ప్రతినిధి వర్ష ఆనందంగా చెప్పారు. ఉద్యోగులే ఊతం... ‘రెండు నెలల పాటు మా ఉద్యోగం ఇదే’ అంటూ చెప్పారు సీతారామయ్య. మాసబ్‌ట్యాంక్ దగ్గరల్లోని ఐటీ టవర్స్ సమీపంలో ఉన్న వాయిస్ ఫర్ గాళ్స్ అనే ఎన్జీఓ ఆవరణలో ఉద్యోగం.. అదీ 2 నెలలు మాత్రమేనా..? ‘మా కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ యాక్టివిటీస్‌లో భాగంగా ఇక్కడ మమ్మల్ని నియమించింది’ అని వివరించారాయన. వొడాఫోన్ ఫౌండేషన్ తర ఫున సీతారామయ్య, ఏసుదాస్ ఆంటోనీలు అక్కడ సేవోద్యోగం చేస్తుంటే మరో ఇద్దరు సిటీలోని మరో రెండు ఎన్జీఓలకు పనిచేస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నాలజీ డెవలప్మెంట్.. వంటి అంశాల్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫండ్‌రైజింగ్ మార్గాలు.. వృద్ధి చేయడంలో వాయిస్ ఫర్ గాళ్స్‌కు వీరిద్దరూ తోడ్పడుతారు. ‘ఈ తరహా చేయూత మేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిర్వహణాపరమైన అంశాల్లో నిపుణులైన ఉద్యోగుల స్వచ్ఛంద విధులు మాకు ఎంతో మేలు చేస్తాయి’ అని వాయిస్ ఫర్ గాళ్స్ ప్రతినిధి శరణ్య చెప్పారు. ఖాన్ పాన్ దుకాన్.. ఈ పేరు వింటే ఏదో పాన్షాపో, మరొకటో అన్నట్టు ధ్వనిస్తుంది కదూ. అయితే ఇదొక చారిటీ ఈవెంట్. సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఇది. ఈ సంస్థ ‘ఖాన్ పాన్ దుకాన్’ పేరుతో ఈవెంట్ ప్లాన్ చేసి తమ క్లయింట్లను, మిత్రులను, సిబ్బందిని ఆహ్వానించింది. వారికి విభిన్న రకాల ఫుడ్ వెరైటీలను వండి వడ్డించింది. ఈ ‘దుకాన్’లో వంటకాలు రుచి చూసిన వారి దగ్గర రుసుము వసూలూ చేసింది. ఆడపిల్లల విద్యకు అవసరమైన ఆర్ధిక సాయం అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను వినియోగిస్తున్నామని.. సంస్థ ఆధ్వర్యంలోని ‘సంకల్ప్’ విభాగం కింద ఈ చారిటీ యాక్టివిటీ ఏర్పాటు చేశామని ‘సంకల్ప్’ ప్రెసిడెంట్ హేమలత తెలిపారు. యాక్టివిటీ సెంటర్... పాఠశాలలో చారిటీ అంటే కాసిన్ని పుస్తకాలు పెన్నులు ఇచ్చేసి వచ్చేయడం కాదు. చిన్నారుల కోసం పూర్తిస్థాయి యాక్టివిటీ సెంటర్‌ను, ఇద్దరు టీచర్లను రెండేళ్లపాటు సేవలందించేలా ఏర్పాటు చేయడం ద్వారా వినూత్న ట్రెడిషన్‌కు నాంది పలికాయి టీచ్ ఫర్ ఇండియా, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన సేల్స్ ఫోర్స్ ఇండియా డాట్కామ్లు. నారాయణగూడలోని గవర్నమెంట్ స్కూల్లో వీరు ఏర్పాటు చేసిన ఆసక్తికరమైన యాక్టివిటీ సెంటర్.. చిన్నారులకు ఒక లైబ్రరీలా, ఒక గేమ్స్ రూమ్‌లా.. ఇలా విభిన్న రకాలుగా ఉపకరిస్తుంది. ‘పిల్లలకు యాక్టివిటీ ద్వారా లెర్నింగ్ అనేది ఇప్పటి ట్రెండ్. ఇలాంటి సెంటర్లు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు చాలా ఉపయోగపడతాయి’ అని టీచ్ ఫర్ ఇండియా ప్రతినిధి సిరిచందన చెప్పారు. జాబ్ శాటిస్ఫాక్షన్.. మాలాంటి ఉద్యోగులకు చారిటీ యాక్టివిటీ చేయాలంటే.. వారాంతాలు.. లేకపోతే సెలవుదినాలే మార్గం. అయితే మా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు ఉద్యోగంతో పాటు ఇటు అవసరార్థులకు తోడ్పడుతున్నామనే సంతృప్తి కూడా లభిస్తోంది -సీతారామయ్య, ఆంటోని మార్గాలు ఏవైనా గమ్యం చేరడం ముఖ్యం. సేవ ఎలాంటిదైనా అవసరార్థులకు ఆసరా అందడం ముఖ్యం.ఈ విషయాన్ని గుర్తించిన సిటీ చారిటీ కొత్త పుంతలు తొక్కడాన్ని స్వాగతిద్దాం. ఆధునిక ‘సేవ’కులను అభినందిద్దాం. -
బక్వా నాచే షురూ కరో
ఫిట్నెస్ త్రూ ఫన్.. సిటీలో ఇదీ ట్రెండ్. స్టెప్ ఎరోబిక్స్ నుంచి మొదలుపెట్టి సల్సా, బాల్రూమ్ స్టెప్స్, హిప్హాప్.. ఇవన్నీ సిటీలో నృత్యాభిలాషుల కన్నా ఆరోగ్యాభిలాషుల కారణంగానే ఆదరణ పొందుతున్నాయనేది నిర్వివాదం. ఇక జుంబా డ్యాన్స్ స్టైల్ అయితే ప్రతి జిమ్, ఫిట్నెస్ సెంటర్లో తప్పక జత చేయాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో వచ్చేస్తోంది బక్వా. - ఎస్.సత్యబాబు నెలన్నర క్రితం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్ ద్వారా సిటీలో అరంగేట్రం చేసింది బక్వా డ్యాన్స్. సదరు ఈవెంట్‌కి మొత్తంగా వచ్చిన స్పందన కన్నా బక్వా యాక్టివిటీకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కొత్త ఫిట్నెస్ మార్గాలు వెతుక్కునే సిటీజనులు ‘ఏమిటీ బక్వా’ అంటూ ఆరా తీయడం మొదలు పెడితే... అప్పటిదాకా దీనిపై అంతగా అవగాహన పెంచుకోని ట్రైనర్లు.. ఒక్కసారిగా నెట్లోకి వెళ్లి బ్లాగులూ, యూ ట్యూబ్ వీడియోలు సెర్చ్ చేసి దీని గురించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించారు. ప్రస్తుతం సిటీలో జుంబా తదితర డ్యాన్స్ యాక్టివిటీల ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకుల్లో పలువురిని బక్వా బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో సిటీలో బక్వా సందడి మొదలుకానుంది. ఆఫ్రికా మూలాలు.. సిటీలో సందడి చేయనున్న బక్వా డ్యాన్స్ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సౌతాఫ్రికన్ వార్ డ్యాన్స్, క్యాపొయిరా, కిక్ బాక్సింగ్, లైట్ బాక్సింగ్, స్టెప్ల కలయిక బక్వా. ఇదొక ఫన్ వర్కవుట్ ప్రోగ్రామ్. లైట్ బాక్సింగ్‌ని సూచించే బీవో, సౌతాఫ్రికన్ వార్డ్యాన్స్, ట్రెడిషనల్ క్వైటోను సూచించే కేడబ్ల్యూఏ నుంచి బక్వా పేరు పుట్టింది. అంతర్జాతీయ ఫిట్నెస్ ప్రముఖుడు పాల్ మార్వి దీని సృష్టికర్త. ఏడేళ్ల కృషితో దీన్ని లాస్ఏంజెల్స్లో లాంచ్ చేశాడు. జన్మతః సౌతాఫ్రికాకు చెందిన మార్వి లాస్ఏంజెల్స్లో లీడింగ్ గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. ఈ బక్వాను తన సొంత క్లాసుల గురించి ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నాడు. తదనంతర కాలంలో ఇది ప్రపంచమంతా పాకింది. తైవాన్, జపాన్, అమెరికా. గ్రీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి చోట్ల హెల్త్పబ్స్లో బక్వా ఇప్పుడు హాట్ వర్కవుట్. విశేషాలెన్నో... దీనిని నేర్చుకోవడానికి డ్యాన్స్‌లో ప్రాథమిక అంశాలు సైతం తెలియనక్కర్లేదు. ప్రపంచంలో సైన్ లాంగ్వేజ్ వినియోగించే ఏకైక వర్కవుట్ ఇదే. అలాగే లెటర్స్, నంబర్స్, హ్యాండ్ సిగ్నల్స్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లు ఉపయోగించి చేసే వినూత్నమైన పోగ్రామ్ బక్వా. ఈ యాక్టివిటీలో పాప్, లాటిన్, హౌస్ మ్యూజిక్‌లను బ్యాక్ గ్రౌండ్‌గా వినియోగిస్తారు. ఇందులో పార్టిసిపెంట్స్‌కి తర్వాతి మూవ్‌ని చెప్పడానికి సైన్లాంగ్వేజ్ని ఉపయోగిస్తాడు ఇన్స్ట్రక్టర్. ఈ వర్కవుట్‌లో అందరూ ఒక గ్రూప్‌గా పాల్గొంటారు. డ్యాన్స్ చేసే సమయంలో అక్షరాలను, అంకెలను పార్టిసిపెంట్స్ తమ పాదాలతో డ్రా (చిత్రణ) చేస్తారు. బక్వా ఎల్, 3, జే, కే ఇంకా డజన్ల కొద్దీ ఇతర బక్వా స్టెప్స్‌ను పాదాలతో డ్రా చేస్తారు. మిగిలిన డ్యాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ తరహాలో స్టెప్స్ 8 కౌంటింగ్ ఇందులో ఉండదు. అసలు ఇందులో స్టెప్స్ కౌంటింగ్ అవసరమే లేదు. బీట్తో పాటు మ్యూజిక్‌ని ఫీలవుతూ కదలడమే. స్టెప్ తెలిస్తే చాలు ఇన్స్ట్రక్టర్ అందించే కొరియోగ్రఫీ అవసరం లేకుండానే ఫాలో అయిపోవచ్చు. ఉపయోగాలెన్నో... అన్ని వయసుల వారికీ తగ్గట్టుగా, అన్ని రకాల ఫిట్నెస్ లెవల్స్ ఉన్నవారికీ నప్పేలా డిజైన్ చేసిన డ్యాన్సింగ్ వర్కవుట్ బక్వా. ఇంటెన్సిటీ ఉన్నవారికీ, కావాలనుకునే వారికీ, లావుగా ఉన్నవారికీ, సన్నగా ఉన్నవారికీ.. ఇలా అందరికీ ఇది ఉపకరిస్తుంది. టోటల్ బాడీ వర్కవుట్‌గా, అత్యధిక కేలరీలను సహజమైన పద్ధతిలో ఖర్చు చేసేదిగా పేరొందింది. అత్యంత సులభంగా అనిపించే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్క సెషన్లో అత్యధికంగా 1,200 కేలరీలు సైతం ఖర్చు చేసే అవకాశం ఉందంటే ఆశ్చర్యమే. ‘జుంబాతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన, సమర్థవంతమైన వర్కవుట్. అనూహ్యమైన స్ట్రెస్ బస్టర్. గంటలో 1,000 కేలరీలు ఖర్చు చేయిస్తుంది. జుంబా కూడా ట్రెడిషనల్ 8 కౌంట్ స్టెప్స్‌ను ఫాలో అవుతుంది. అలాగే దీనికన్నా కాస్త స్లో కూడా. బక్వాకి ఎటువంటి కొరియోగ్రఫీ అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా... ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్స్‌ని, నంబర్స్‌ని మన ఫీట్‌తో డ్రా చేయాలి. ఉదాహరణకు ఎల్, కే, జేలను డ్రా చేయడం లేదా.. మీ దేహాన్ని నంబర్ 3 లాగా కదపడం వంటివి. ఈ డ్యాన్స్‌ను అన్ని వయసుల వారూ ఫాలో కావచ్చు’ అని ముంబైకి చెందిన ట్రైనర్ అంచల్ గుప్తా అంటున్నారు. ఇది కేవలం ఒక వర్కవుట్ మాత్రమే కాదని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు దీని రూపకర్త మార్వి. మన చుట్టూ ఉన్నవారితో ఎనర్జీనీ, ఎగ్జయిట్‌మెంట్‌నీ సమానంగా పంచుకునే అద్భుతమైన అనుభవం అంటున్నాడు. హైలెవల్ కార్డియో వర్కవుట్ చేశామనే ఫీలింగ్‌నే కలగనీయనంత పూర్తి వినోదం దీని స్పెషాలిటీ. -
జీవితం సాధారణం
బడ్జెట్.. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరినీ అటెన్షన్లో పెడుతుంది! కామన్ థింగ్స్ నుంచి కాస్మోటిక్స్ దాకా అన్నిటి ఉనికినీ శాసిస్తుంది. ఆ శాసనం కామన్‌మ్యాన్ శ్వాసను బరువెక్కించొచ్చు.. తేలిక చేయొచ్చు. సూట్కేస్తే తెరిస్తే కానీ సీక్రెట్ రివీల్ కాదు. ఈలోపు కొన్ని కుటుంబాలు వాళ్ల చిట్టాపద్దులు, ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందో అన్న కుతూహలాన్నీ తెలిపాయి. - సరస్వతి రమ/ఎస్.సత్యబాబు చివర్లో టెన్షన్ రాంచందర్ టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. స్థిరమైన ఆదాయంలేని వృత్తి. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. చిన్నమ్మాయి చెన్నైలోని ఓ ఎమ్ఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొడుకుది మార్కెటింగ్ జాబ్. చిన్నదే అయినా సొంత ఇల్లుంది. కింద పోర్షన్, పైన పోర్షన్‌కి నామమాత్రపు అద్దె వస్తుంది. అయినా ఆదాలేని సంసారం.. చూసి ఖర్చుపెట్టుకోవాల్సిన ఆగత్యం అంటారు రాంచందర్ సతీమణి బాలేశ్వరి. ‘మాకు నెలకు ముప్పయ్వేల ఖర్చుంటుంది. నాలుగు రోజుల కూరగాయలకు రూ.250 అవుతున్నయ్. కరివేపాకు, కొత్తిమీర.. అంతెందుకు ఆకుకూరలు కూడా బాగా పిరం అయినయ్. సండే నాన్‌వెజ్‌కి మసాలాకి పదిహేను వందలు. పప్పూ, ఉప్పూ అన్నీ కొనుక్కోవల్సిందే. బియ్యం ధరలు కూడా మండిపోతున్నయ్. అందుకే రాత్రిపూట చపాతీకి ఓటేస్తున్నం. మా అదృష్టానికి పిల్లల చదువులు పూర్తయినా, వారి పెళ్లిళ్లు చేయాలింకా. హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి.. హాస్పిటల్కని, పిల్లల కాలేజ్ అడ్మిషన్స్కని.. ఆఫీస్ పనుల మీదని వచ్చే చుట్టాలకేం కొదవుండదు. వచ్చిన చుట్టాలకు కనీసం పప్పన్నమన్నా పెట్టాలే కదా! జీతం రానంత వరకే మంచిగ. వచ్చిందంటే రెండు రోజుల్లో ఖతం. మల్లా ఒకటో తారీఖు దాకా టెన్షనే. సినిమాలు, షికార్లు, హోటళ్లల్ల డిన్నర్లయితే మాకు గుర్తేలేదు. ఒక్క సంతోషమేందంటే.. పొదుపు చేయలేకపోయినా అప్పు అయితే చేస్తలేం. మందు, సిగరెట్, గుట్కా లాంటి వాటిమీద బాగా రేట్లు పెంచి మిగిలినవి పెంచకుండా ఉంటే కుటుంబాలు బాగుపడ్తయ్’ అని చెప్పుకొచ్చారు బాలేశ్వరి. వాళ్లాయన మాట్లాడుతూ ‘నిజమే.. సామాన్యుల నిత్యావసరాల ధరలను తగ్గిస్తే చాలా క్షేమం’ అంటారు. చెన్నైలో ఉండే వాళ్లమ్మాయి రమోలా సెలవు మీద హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయి ‘ఎమ్‌ఎన్‌సీలలో పనిచేస్తున్నామంటే దానికి తగ్గట్టే ఉండాల్సి వస్తుంది. బ్రాండెడ్ డ్రెసెస్, వీకెండ్స్‌కి అవుటింగ్స్‌కి, స్ట్రెస్ బస్టర్స్ అంటూ టీమ్ డిన్నర్స్ కంపల్సరీ. సగం శాలరీ వీటికే ఖర్చు అవుతుంది. ఇంకొంత.. ట్రావెలింగ్‌కి. ఆఫీస్‌కైతే ఆటోలో వెళ్లాల్సిందే. ఏ ఆటో మీటర్ మీద రాదు. గట్టిగా అడిగితే.. రేట్లు పెరిగాయని దబాయిస్తారు. వీళ్ల రేట్లకు అనుగుణంగా మా శాలరీలు పెరగవ్ కదా. ఎంతో ఖర్చుపెట్టి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన మా పేరెంట్స్‌కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోతున్నామనే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంద’ని చెబుతోంది. సగం జీతం రెంట్‌కే... విద్యుత్ ఉద్యోగి అస్క మల్లయ్య బడ్జెట్ గోస ఇది.. ‘లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. పేరుకే గవర్నమెంట్ జాబ్.. పొదుపు ముచ్చటే లేదు. ముగ్గురు పిల్లలు. పెద్ద బిడ్డ మాధురి బీటెక్ ఫస్టియర్. ఏటా లక్షలు పోయాలె. రెండో బిడ్డ అనూష బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతుంది. ఆమెకు రూ.50 వేలు ఫీజు. కొడుకు అనిల్‌కుమార్ ఎనిమిది చదవుతున్నడు. ఇంట్లో ఒక్కడినే సంపాదించేటోడిని. సొంతిల్లు లేదు.సగం జీతం కిరాయిలకే పోతది. ఆ మిగిలిన జీతంలనే కూరగాయలు, ఉప్పు, పప్పు అన్నీ.. చిట్టీలు వేసినా.. ఎత్తుకున్న పైసలు పిల్లల చదువులకే అయితయ్. మీదికెళ్లి అప్పు చేయాల్సొస్తది. అది తీర్చడానికి ఇంకో కాడ అప్పు. ఇట్ల పెరుగుతనే ఉంటది. పిల్లలున్న కుటుంబం.. వాళ్లకు తిండి తక్కువ చేస్తమా? చదువు మాన్పిస్తమా? ఏ ఖర్చు తగ్గించుకోవాలె? ఇంక మా పిల్లలు.. దోస్తులు, సినిమాలు, షికార్లు అనేటోళ్లు కూడా కారు. కాలేజ్లల్ల సీట్లు కూడా మెరిట్ మీదనే వచ్చినయ్. ఇయ్యాల బడ్జెట్ల చూడాలే.. మాలాంటోళ్లకేమన్నా నిమ్మలంగా ఉంటదో.. ఉండదో!’ అంటారు మల్లయ్య. మిగిలేది సున్నా.. మేమిద్దరం ఉద్యోగస్థులమే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం అంటే లక్షల్లో ప్యాకేజీలు వాళ్లకేంటి అనుకుంటారు కానీ.. సంవత్సరానికి రూ.10 లక్షలు ఆదాయం ఉన్నా.. మా బోటి వారికి మొత్తం పన్నులు, ఖర్చులు పోతే పెద్దగా మిగిలేదేమీ ఉండదు. టాక్స్, పీఎఫ్ వగైరాలు పోను చేతికి వచ్చేది రూ.7.50 లక్షలు. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ.30 లక్షలు పెట్టి కొంటే దీర్ఘకాలం దానికి నెలసరి వాయిదాలు చెల్లించడం కూడా కష్టమే. రూ.5 లక్షల దాకా ఆదాయంపై పన్ను తీసేసి, రూ.10 లక్షల లోపు ఆదాయానికి 10 శాతం, 10-15 లక్షల లోపుంటే 15 శాతం, ఆపైన ఉంటే 30 శాతం పన్ను అయితే వెసులుబాటుగా ఉంటుంది. - అశోక్. నోరు కట్టేసుకుంటేనే... వాచ్మెన్ ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం రూ.700. ఇప్పటికి దాదాపు 18 ఏళ్లు కావస్తోంది. ఇప్పుడు జీతం రూ.8 వేలు. మా ఆవిడ ఆయాగా పనిచేస్తూ రూ.4,000 తెస్తోంది. అయినా ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగానే ఉంది ఫీజులు లేని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినా డ్రెస్సులు, పైన ఖర్చులు తప్పవు కదా. మా ఇద్దరికీ వచ్చిన దానిలో దాదాపు సగం ఇంటి అద్దె (రూ.5వేలు), కరెంటుకే సరిపోతంది. నచ్చింది తినడానికి లేదు. పప్పు, పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకోవాలి. ఈ మధ్యే పెద్దమ్మాయికి పెళ్లి చేశాం. ఇంకా ఇద్దరున్నారు. వీరిని గట్టెక్కించేవరకూ ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే. - శివ, కస్తూరి కేంద్ర బడ్జెట్ అయినా మార్చిలో వచ్చే రాష్ట్ర బడ్జెట్ అయినా.. ప్రభుత్వాలకి చెలగాటం.. సామాన్యులకు ప్రాణ సంకటంలా ఉండకూడదనే వీళ్లందరి విన్నపం. కేంద్ర బడ్జెట్ సరే.. ఆమ్ ఆద్మీ నుంచి బడా ఆద్మీ వరకు అందరి దృష్టి కొత్త రాష్ట్రం కొత్త బడ్జెట్ మీదే! -
3బ్రదర్స్ కార్పొరేట్‌కి కత్తెరేశారు...
సూపర్మార్కెట్స్ దెబ్బకి కిరాణా కొట్లు... డిజైనర్స్ రాకతో దర్జీలు... వరుసపెట్టి కొత్త ఆటంబాంబులు పోటీకొస్తుంటే తట్టుకోలేక పాత సీమటపాకాయలు అల్లల్లాడిపోయాయి. బరిలో నిలవలేక తుస్సుమనేశాయి. కొన్ని ముందే దాసోహమైపోయి ‘పెద్ద’ నీడలో జేరిపోయాయి. కొన్ని మాత్రం గ్లోబలైజేషన్ తెచ్చిన ముప్పును తెలివిగా అందిపుచ్చుకుని తమ ఎదుగుదలకి పైకప్పుగా మార్చుకున్నాయి. ఇప్పుడు తాముసైతం ఆటంబాంబులై మోతమోగిస్తున్నాయి. హైస్కూల్ చదువు దాటని ముగ్గురు అన్నదమ్ములు... ఆటంబాంబులై సాధించిన సక్సెస్ అలాంటిదే. - ఎస్.సత్యబాబు ‘మాది కరీంనగరన్నా. నాయీబ్రాహ్మలం. నాన్న చిన్నగున్నప్పుడే సిటీకి వచ్చేసి షాపులో కటింగ్ పనిల జేరిండు. చిన్నంగా.. ఎట్లనో చేసి కొత్తపేట మారుతీనగ ర్ల సొంతంగా షాపు పెట్టిండు. అయినా ఆదాయం చాలక మా చిన్నతనంలో మస్తు కష్టాలు పడుతుండె’’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు అలియాస్ శ్యామ్. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎన్ఆర్ బీ హెయిర్ అండ్ బ్యూటీ పేరుతో దాదాపు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆ ఆధునిక పార్లర్లో కూర్చుని మాట్లాడుతున్న ఆ పాతికేళ్ల కుర్రాడిని చూస్తే.. సిటీలో అలాంటివి మరో 3 పార్లర్లతో పాటు ఏకంగా ఒక హెయిర్ స్టైల్స్ ట్రైనింగ్ అకాడమీ సైతం సొంతంగా నిర్వహిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరని చెబితే వెంటనే నమ్మడం కష్టం. ‘ఈ స్టేజికి రానీకి చేయని కష్టం లేదన్న’ అంటూ చెప్పుకొచ్చాడు నందు. చిన్న షాప్... చింతలు తీర్చలేదు... మారుతీనగర్‌లో షాప్ మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత పార్లర్ల ధాటికి పాతకాలపు క్షవరం కొట్టుకు ఆదరణ తగ్గిపోయింది. కుటుంబం నడపడం కష్టమైపోయింది. నందు తండ్రికి సొంత చెల్లెళ్ల పెళ్లి బాధ్యతలు కూడా మీదపడ టంతో.. నందు, రాజు, బబ్లూ (అన్నదమ్ములు)లు చిన్న వయసులోనే సంపాదన కోసం రోడ్డెక్కక తప్పలేదు. ‘నేను సెలూన్లో, తమ్ముళ్లలో ఒకడేమో కార్లు తుడిచి, మరొకడేమో కోఠిలో డాంబర్ గోళీలు (బొద్దింకల మందు) అమ్ముతుండె’ అంటూ గుర్తు చేసుకున్నాడు నందు. ఈ పనుల కారణంగా ముగ్గురి చదువూ హైస్కూల్ దాటలేదు. ఈ పరిస్థితుల్లో.. సిటీలోని బంజారాహిల్స్‌లో ఉన్న జావెద్హబీబ్ సెలూన్లో రాజుకి పని దొరికింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే.. పార్లర్స్‌కి, బార్బర్షాప్లకు తేడా ఏమిటి? అక్కడ ఉంటున్నవేమిటి? తాము ఇవ్వలేకపోతున్నవేమిటి అనేది అర్థమైంది. అది అయ్యాక... ఎలాగైనా తాము కూడా అందాలను మెరిపించే పనిలో ఆధునిక విపణి అందిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకున్నారు. అప్పుచేసి.. హెయిర్ స్టైలింగ్ కోర్స్.. ఇల్లు గడవడమే చాలా కష్టం. ముంబై వెళ్లి హెయిర్‌స్టైల్ కోర్స్ చేయాలంటే వేలకు వేలు ఎలా తేవాలి? ‘ఆడ్నించి ఈడ్నించి తెచ్చినం. అమ్మ పుస్తెలు, కమ్మలు అమ్మినం. దొరికిన కాడ అప్పులు చేసినం. ఎట్టయితేనేం... ముంబైలో కోర్సులో జేరినం. వాళ్ల సెలూన్ల జీతానికి జేస్తమని రాసిచ్చి.. ఒక్కరికి కట్టిన ఫీజుతో ఇద్దరం కోర్సు పూర్తి జేసినం’ అంటూ వివరించాడు నందు. ముంబై వెళ్లడం, హెయిర్‌స్టైల్స్ కోర్స్ పూర్తి చేయడం.. ఇవన్నీ ఈ అన్నదమ్ముల ఆలోచనాధోరణిని సమూలంగా మార్చేశాయి. కోర్స్ అనంతరం సిటీలో పేరున్న సెలూన్లో జీతానికి చేరి నాలుగేళ్లపాటు మరింత అనుభవాన్ని సంపాదించారు. అదే సమయంలో జావేద్ హబీబ్ ఫ్రాంఛైజీ ఆఫర్ వీరిని కోరి వచ్చింది. అయితే ఆ బ్రాండ్ పార్లర్ పెట్టాలంటే లక్షలతో పని. కానీ ఈ అన్నదమ్ముల పనితీరు అప్పటికే తెలుసు కాబట్టి... రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తామన్నారు జావేద్హబీబ్ బ్రాండ్ వాళ్లు. మంచి అవకాశం అనుకున్నారీ బ్రదర్స్. వద్దు వద్దంటూ వారిస్తున్న కుటుంబ సభ్యుల్ని అతి కష్టమ్మీద ఒప్పించి... దిల్సుఖ్నగర్ రోడ్, మూసారాంబాగ్‌లోని ఆండాల్ బిల్డింగ్ పక్కన, లెజెండ్ బిల్డింగ్‌లో ఫ్రాంఛైజీ స్టార్ట్ చేశారు. మూడేళ్లు గడిచాక.. ఫ్రాంఛైజీగా చెల్లిస్తున్న 20 శాతం మొత్తం గాని మిగిల్చగలిగితే.. తమ కస్టమర్స్‌కి మరింత తక్కువ ధరలకే సేవలు అందించవచ్చునని అనిపించింది. దాంతో మరోసారి ధైర్యం చేశారు. ఫ్రాంఛైజీని వదులుకుని తమ ముగ్గురి పేర్లూ కలిపి ఎన్ఆర్బీ బ్రాండ్ నేమ్‌ని స్టార్ట్ చేశారు. తక్కువ ధరలకే పార్లర్ సర్వీసెస్ ఆఫర్ చేశారు. దీంతో షార్ట్‌టైమ్‌లోనే పార్లర్‌కు మంచి పేరొచ్చింది. కెరీర్ గైడ్స్.. ఒక విజయం మరిన్ని సంకల్పాలకు నాంది అన్నట్టు అదే ఊపులో కొత్తపేట, ఉప్పల్, ఐడీపీఎల్... ప్రాంతాల్లోనూ బ్రాంచీలు నెలకొల్పారు. రెండేళ్ల క్రితమే జావేద్ హబీబ్ ట్రైనింగ్ అకాడమీకి ఫ్రాంఛైజీ తీసుకుని పార్లర్లో కెరీర్‌ను వెతుక్కుంటున్న వారికి ఆశాదీపంలా మారారు. సర్టిఫికెట్ కోర్సు చేయడానికి తాము పడిన కష్టాలు బాగా గుర్తుంచుకున్న ఈ అన్నదమ్ములు ఆ పరిస్థితిని కొంతమందికైనా తప్పించాలని, తక్కువ ఫీజులతో శిక్షణ అందిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఇప్పటికే వందల మంది బ్యూటీ ఇండస్ట్రీలో కెరీర్ అవకాశాలు అందుకునేలా చేశారు. కేవలం వీరి రిఫరెన్స్‌తో మరెంతో మందికి ఉద్యోగాలొచ్చాయి. ఆర్థికంగా స్థోమత లేని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా కూడా శిక్షణనిస్తున్నారు. ఆసక్తి కలవారు 9908512905 ఫోన్‌నంబర్‌ను సంప్రదించవచ్చు. ‘‘ఇంకా పార్లర్లు ఓపెన్ జేసి, స్టేట్లెవల్లో మస్తు పేరు సాధించాలె’’ అంటూ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న ఈ సోదర త్రయం ఆత్మవిశ్వాసం చూస్తుంటే అనుకున్నది సాధించడానికే పుట్టారా అనిపించకమానదు. -
మాబ్ మానియా
ఉరుములేని మెరుపులా ఊడిపడతారు. తరుముకొస్తున్న తుపానులా ఊగిపోతారు. ఈ వేళ ఏదో ఒకటి అదరగొడదాం అంటూ ఊపిరి సలపనివ్వని సంగీతంతో ఊర్రూతలూగిస్తారు. మరపురాని నృత్యాన్ని అందిస్తారు. షాపింగ్ మాల్స్ కావచ్చు.. వాకింగ్ రోడ్స్ కావచ్చు.. కావేవీ కళా ప్రదర్శనకు అనర్హం అంటున్న ఈ డ్యాన్సర్లలో ఐటీ ఉద్యోగులూ ఉండటం విశేషం. విద్యాధికులను సైతం భాగస్వాముల్ని చేస్తున్న ఈ ఫ్లాష్ డ్యాన్స్‌లు సమాజానికి ఉపకరించే చక్కని సందేశాలను సైతం మోసుకొస్తున్నాయి. మారథాన్ తరహాలో సిటీలో రెగ్యులర్ ఈవెంట్లుగా స్థిరపడుతున్నాయి. - ఎస్.సత్యబాబు మాబ్ అనే ఆంగ్ల పదానికి సంఘ వ్యతిరేకుల సమూహం అనే చెడు అర్థం ఉంది. అయితే సందేశాత్మక ‘షో’లతో మన నగరం ఈ అర్థాన్ని సమూలంగా మార్చేస్తోంది. కొంతకాలం క్రితం సిటీలో ప్రారంభమైన ఫ్లాష్‌మాబ్‌లు ఇటీవల నృత్యాభిమానులతో పాటు సామాజిక సేవాభిలాషులను కూడా ఆకట్టుకుంటున్నాయి. డ్యాన్స్ ఫర్ కాజ్... కొన్ని రోజుల క్రితం కూకట్‌పల్లిలోని ఒక మాల్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఫ్లాష్డ్యాన్సర్లు అదిరిపోయే స్టెప్స్‌తో షాపర్స్‌ను కట్టిపడేశారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన నృత్యవేగం చివర్లో నిదానించినప్పుడు.. చక్ దే ఇండియా సినిమాలోని స్లో సాంగ్ వస్తుండగా ఉమెన్ సేఫ్టీ స్లోగన్స్ ఉన్న ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అంతవరకూ ఉర్రూతలూగించిన డ్యాన్సర్లు.. సందేశాత్మక అంబాసిడర్లుగా మారిపోయారు. అటు వినోదాన్ని ఇటు ఓ సందేశాన్ని అందించిన ఈ తరహా సందడి అక్కడి జనాలకు గ్రేట్ మెమొరీగా మిగిలిపోయింది. ఫ్లాష్.. ఫ్లాష్.. ‘వృత్తిరీత్యా ఫిట్నెస్ ట్రైనర్‌ని. చేంజ్ కోసం మా స్టూడెంట్స్‌తో కలిసి ఓ ఫ్లాష్‌మాబ్ నిర్వహించాలి అనుకున్నప్పుడే వీటికి ఒక సందేశాన్ని జోడించాలని నిర్ణయించుకున్నా. సిటీలో ఇలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఫ్లాష్‌మాబ్‌లు జరగకపోవడంతో దానికి మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆ తరహా ప్రోగ్రాం అంటే మమ్మల్ని సంప్రదించేవారు పెరిగారు’ అని బాబీ చెప్పారు. మాదాపూర్‌లో బాబీ ఫిట్నెస్ ఫ్యూజన్ స్టూడియోను నిర్వహిస్తున్న బాబీ.. ఆడశిశువుల రక్షణార ్థం పింక్ రిబ్బన్ వాక్, రోడ్ సేఫ్టీ, పొల్యూషన్, హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం.. ఇలా పలు అంశాల నేపథ్యంలో మెరుపు నృత్యాలను నిర్వహించారు. అవర్ రోడ్స్, అవర్ ఫ్రీడమ్ అంటున్న వీక్లీ ఈవెంట్ రాహ్‌గిరిలో ప్రతి వారం నృత్య సందడి సృష్టిస్తోంది బాబీ అండ్ కోనే. ‘ప్లాష్‌మాబ్ చూసేవారి అటెన్షన్‌ను తొందరగా అందుకుంటుంది. ఇలాంటివి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉండటం అనేది మరింత ప్రయోజనకరం. మాకు నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటాం తప్ప వీటిలో వేటికీ మేం రెమ్యునరేషన్ తీసుకోం’ అని బాబీ చెప్పారు. ఇప్పటికి అరడజనుకుపైగా మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్లాష్ డ్యాన్స్ షోలు నిర్వహించిన బాబీ అండ్ కో కోసం ప్రస్తుతం స్వచ్ఛ భారత్, కేన్సర్ అవేర్నెస్ వంటి మరికొన్ని ఈవెంట్లు, ఇన్వైట్లు సిద్ధంగా ఉన్నాయి. అవేర్నెస్ త్రూ డ్యాన్స్... ఏ నొప్పయినా వ్యక్తిగతంగా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి అప్పటిదాకా అదొక సమస్య కాదనే ధోరణి సరికాదు. ముందస్తు అవగాహన కలిగించడం అవసరం. అలాంటి సందేశాలకు క్రౌడ్‌ని ఈజీగా ఎట్రాక్ట్ చేసే ఫ్లాష్‌మాబ్ ఓ చక్కని మార్గం. నాకు నచ్చిన పద్ధతిలో నేను కూడా సోషల్ అవేర్నెస్కి ఉపయోగపడటం అనేది నాకు సంతృప్తిని అందిస్తోంది. అందుకే నేను ఫ్లాష్మాబ్స్లో పాల్గొంటున్నాను. - సంతృష్ణ, సీఎస్సీ ఉద్యోగిని ఈజీగా.. క్యాచీగా.. ఫ్లాష్‌మాబ్‌లు కామన్ పీపుల్ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీటికి మెసేజ్‌లు జోడించడం అనేది వండర్ఫుల్ ఐడియా. ఈ ఈవెంట్లలో ఓ రకంగా జనాలు కూడా పార్టిసిపెంట్సే. ఆసక్తిని పెంచడంలో ఈ తరహా డ్యాన్స్‌లు బాగా సక్సెస్ అవుతాయి. అందుకే నేను కూడా మాబ్ పార్టీస్‌లో పాల్గొంటున్నా. -సాయినేత్ర, బీబీఏ విద్యార్థిని -
బోనమెత్తిన శకటం సకల కళామకుటం
కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ గణతంత్రదినోత్సవాల్లో తన తొలి శకటాన్ని ప్రదర్శిస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని చాటే ఉత్సవాల్లో తొలిసారి ’ తెలంగాణ స్వేచ్ఛా స్వరూపం, సంస్కృతీ సంప్రదాయాల ‘ప్రతిరూపం’ సగర్వంగా సాక్షాత్కరించనుంది. దేశ ప్రథమపౌరునితో పాటు అగ్రరాజ్యాధినేత ఒబామా సాక్షిగా తెలంగాణ వైభవం కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ శకటానికి రూపుకట్టిన మన రాష్ట్ర ప్రసిద్ధ చిత్రకారుడు, హైదరాబాద్ నివాసి ఎం.వి.రమణారెడ్డి తన మనోభావాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారిలా.. - ఎస్.సత్యబాబు తొలి తెలంగాణ శకటాన్ని రూపొందించే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనుమతి ఆలస్యం కావడం వల్ల అతి తక్కువ సమయమే ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల శకటాలకు థీటుగా 15 రోజుల రికార్డ్ టైమ్‌లో దీన్ని రూపొందించాం. తెలంగాణ సంస్కృతికి రెండు కళ్లలాంటివి బతుకమ్మ, బోనాలు. డిఫెన్స్ విభాగం సమకూర్చిన 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న ప్రత్యేక వాహనం వేదికగా... బోనాల వైభవాన్ని చాటుతున్నాం. ప్రస్తుతం మహిళల రక్షణ సమాజంలో అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో మహిళా రక్షకుడిగా, శక్తిమంతమైన పోతరాజును చూపుతున్నాం. ఈ శకటానికి ముందు భాగంలో పోతరాజు భీకర రూపం ఉంటుంది. వెనుక భాగం గోల్కొండ కోటను చూపుతుంది. సంప్రదాయదుస్తుల్లో బోనమెత్తిన ఇద్దరు మిహ ళలుంటారు. డప్పు, కొమ్ము, తష, పగడం... పరికరాలను వాయించే 25 మంది కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే మహంకాళి అమ్మవారి మాటగా భవిష్యవాణిని చెప్పే మహిళ... అచ్చమైన బోనాల సందడితో, అణువణువూ అద్భుతమైన తెలంగాణ ప్రతిరూపంగా దీన్ని మలుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్, డప్పు కళాకారుడు శేఖర్,10మంది యువతులు... మరెందరో ఈ సందడిలో భాగం అవుతున్నారు. మొత్తం 18 రాష్ట్రాలు, 25 శకటాలతో 4కి.మీ సాగే ఈ పెరేడ్లో మన శకటానిది 9వ నెంబరు. వ్యక్తిగతం... సిద్ధిపేటలో పుట్టాను. తెలంగాణ బిడ్డగా... చిత్రకారుడిగా తెలంగాణ చిత్రకారులను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరంను ఏడేళ్ల క్రితమే ఏర్పాటు చేశాను. పేద, ప్రోత్సాహం కరవైన తెలంగాణ చిత్రకారుల కోసం పదుల సంఖ్యలో పది జిల్లాల్లో ఆర్ట్ క్యాంప్ లు నిర్వహించాను. పేరు తెచ్చిన కాన్వాస్నే సాధనంగా చేసుకుని పుట్టిన గడ్డకు సేవ చేయాలనేదే నా లక్ష్యం. -
వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న
ఒక రంగంలో ప్రముఖుడిగా వెలుగుతున్న వ్యక్తికి వారసులు కావడం అంటే గోల్డెన్ స్పూన్‌తో ‘రంగ’ప్రవేశం చేసినట్టే అనుకోవడం లేదు నవ యువత. పెద్దల కీర్తి ప్రతిష్టల వెలుగుల్లో తమ జీవితం ప్రకాశించాలని కాకుండా.. స్వీయ ప్రతిభ మీద తమను తాము నిరూపించుకోవాలని కోరుకుంటోంది. తద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపును స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. పెద్దోళ్ల ముద్రలో వచ్చేది పేరూ కాదు యుద్ధం చేయకుండా వరించేది విజయమూ కాదంటున్నారు నవ యువ‘వార్’సులు. - ఎస్.సత్యబాబు ‘నాన్నగారితో నన్ను ఎలా పోలుస్తారు? ఆయనది 40 ఏళ్ల అనుభవం. నాది అందులో సగం కూడా లేదు. ఇక నా పెయింటింగ్ శైలి వేరు. ఆయనది వేరు. ఆయన సమయంలో ఉన్న కాలమాన పరిస్థితులు నేడు లేవు. ఇప్పుడున్న ఆధునిక సమాజం అప్పుడు ఊహకు కూడా అందదు’ అంటూ ఓర్పుగా వివరిస్తారు అఫ్జా. ప్రసిద్ధ చిత్రకారుడు ఫవాద్ తమకానత్ కుమార్తె అనే కేరాఫ్తో కళారంగంలోకి ప్రవేశించిన అఫ్జా.. సిటీలో యువ చిత్ర కళాకారిణిగా రాణిస్తున్నారు. అఫ్జాకు.. తరచుగా ఆర్ట్ సర్కిల్లో ఆమె తండ్రితో పోలిక వస్తుంటుంది. ఇది సహజమైన విషయమంటూనే, తనను, తన ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విన్నవిస్తుంటారు. ఎందుకంటే తండ్రి పేరు ప్రతిష్టల నీడ నుంచి బయటపడి తనను తాను నిరూపించుకోవాలని తపన పడే నవతరానికి ప్రతినిధి అఫ్జా. ప్లస్సూ అదే మైనస్సూ అదే... తల్లి లేదా తండ్రి రాణించిన రంగంలో వారసులుగా ప్రవేశించడం సులభమే. అయితే వారి ఇమేజ్ తాలూకు బరువు వీరిపై పడుతోంది. ఈ లాభనష్టాలను సమన్వయం చేసుకుంటూ యువతరం ముందుకు సాగుతోంది. ‘నాన్న రచయిత అయినా.. ఎప్పుడూ ‘రాసే’పనిలోకి వెళ్లాలని అనుకోలేదు. అందాల రాక్షసి చిత్రంలో పాటకు సరదాగా డమ్మీ లిరిక్స్ రాస్తే.. చాలా బాగున్నాయని అనడం, వాటినే వినియోగించడంతో.. రచయితగా నా ప్రస్థానం మొదలైంది’ అంటూ చెప్పిన సినీర చయిత వెన్నెలకంటి తనయుడు రాకేన్డుమౌళి.. ప్రస్తుతం తండ్రికి తన శైలి భిన్నం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రచనలతో ఆగిపోకుండా, గాయకుడిగా మారారు. సినీ నటుడిగానూ మారనున్నారు. ‘నాన్నకు రచయితగా ఉన్న నేమూ, ఫేమూ ఒక తనయుడిగా నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వాటి మీదే ఆధారపడి నా భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఆశించడం లేదు. సొంతంగా సాధించుకున్నది ఇచ్చే సంతృప్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అంటారు రాకేన్డుమౌళి. తామేంటో నిరూపించుకుంటేనే తమకు భవిష్యత్తు అంటున్నారు. వెన్నెల కంటి పెద్ద కుమారుడు, తండ్రిలాగే రచయితగా కొనసాగుతున్న శశాంక్ సైతం స్ట్రెయిట్ చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన రైటింగ్ స్టైల్‌ను ఏర్పాటు చేసుకుని తండ్రి ముద్ర పడకుండా ప్రయత్నిస్తున్నానన్నారు. తప్పని నీడ... ప్రముఖుల ముద్ర నుంచి బయటకు రావాలని స్వీయ ప్రతిభ ఉన్న ప్రతి కళాకారుడూ తపించినా అంత సులభం కాదంటున్నారు అజిత్నాగ్. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు కుమారుడిగా చిత్రాల రూపకల్పనలోకి ప్రవేశించిన అజిత్.. స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, యాడ్ఫిల్మ్స్ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. ఇంకా తన తండ్రి నీడ తనను వెంటాడటంపై... ‘నాన్న తీసిన చిత్రాలు పూర్తిగా సోషల్ ఓరియెంటెడ్. నావన్నీ కమర్షియల్. నా స్టైల్లో నాకంటూ ఒక ఇమేజ్ వచ్చినా.. నర్సింగరావు గారి అబ్బాయిగానే మరింత రెస్పెక్ట్ దొరుకుతుందని చాలా సందర్భాల్లో తెలిసి వచ్చింది. దీనిని నేను అంగీకరించక తప్పదు’ అని అంటున్నారు అజిత్. అయితే, నిజమైన ఆర్టిస్ట్ చివరి శ్వాస వరకూ తనదైన ముద్ర వేసేందుకు పోరాడుతూనే ఉంటాడు. ‘ఎప్పటికైనా మా ఫాదర్ షాడో నుంచి బయటకు వస్తాననే నమ్మకం ఉంది’ అని అంటారు అజిత్. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని ఊరేగాలనో, ఊళ్లేలాలనో చేసే నిరరథక యత్నాలకు స్వస్తి చెప్పి.. తమ పేరెంట్స్‌కు తామే కేరాఫ్‌లుగా మారాలనే నవ యువ ఆలోచన అభినందనీయం. నిన్నటి వివేకానందుడి స్ఫూర్తితో నేటి వివేకవంతులైన యువతరం ముందుకు సాగాలని, తమనితాము నిరూపించుకోవాలని కోరుకుందాం.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అందిద్దాం. -
కామెడీ క్లాస్-వేణు మాధవ్
*కామెడీ క్లాస్ : వేణు మాధవ్ *ఆ సీన్ గుర్తొస్తే... దిల్ షూటింగ్... వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం... ఆ సినిమాలో నాది ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో మంచి ఊపు మీదున్నా. పల్లెటూర్లో సీన్. విలన్ ఇంటికి నేను, నితిన్ వెళతాం. నితిన్ దొంగతనంగా అటకెక్కేస్తాడు. ఇంట్లోకి వెళితే విలన్ చంపేస్తాడని గ్యారంటీగా తెలుసు కాబట్టి... ఎక్కడ దాక్కోవాలో తెలీక రోడ్లు పట్టుకుని తిరుగుతుంటా. ఓ పిల్లగ్యాంగ్ పేకాడుతూ కనపడితే... వాళ్ల చేత ‘పైసల్తియ్యి బే’ అని మర్యాదగా పిలిపించుకుని నేనూ కార్డ్స్ పట్టుకుంటా. ఆడాలంటే గేదెను కదలకుండా పట్టుకోవాలనేది కండిషన్. కార్డ్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి... తాడును నడుముకి చుట్టుకుంటా. అది అటూ ఇటూ కదులుతూంటుంది. చిర్రెత్తి ‘నీ తల్లి...’ అని తిడతా. అసలే బర్రె. మనకి పాలు ఇచ్చి పోషించేది... తిడుతుంటే ఊరుకుంటదా... కుప్పలు, వరికుప్పలు తేడా లేకుండా అది రన్నింగ్... దాని తాడు మన నడుముకు ఉంది కాబట్టి వెనుకే నేను దొర్లింగ్.. ఈ సీన్ గుర్తొస్తే మీరంతా లాఫింగ్ కదా. షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్లిన దగ్గర్నుంచి నాకు వామిటింగే. అప్పటికీ వినయ్ అన్న (వినాయక్) చెప్పాడు కూడా... వేణూ... డూప్‌ని పెడదాం అని. నేను వింటే కదా... బ్యాడ్‌టైమ్... సారీ బర్రె టైమ్. చిన్నతనంలోని సరదాలు మా ఊరు కోదాడ. టూరింగ్ టాకీస్ లాంటి చిన్న థియేటర్లలో ఏఎన్నార్, ఎన్టీయార్... సినిమాలు ఆడుతుండేవి. కొత్త బొమ్మ వచ్చిందని రిక్షాకు మైక్ పెట్టి ఎనౌన్స్ చేస్తూండేవారు. మైక్రిక్షా కనపడితే ఎక్కడలేని సంతోషం! దాని మీదకి ఒక్క ఎగురు ఎగిరి నేను మైక్ పట్టుకునేవాడ్ని. మన గొంతు ఊరంతా వింటుంటే గొప్పగా ఉండేది. ఇందులో చిన్న ఇబ్బంది ఏమిటంటే... ఈ గొంతు మా అన్నయ్యలిద్దరికీ వినపడేది. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి, నిక్కరు విప్పి మరీ ఉతుక్కుంటా తీసుకుపోయేవారు. అమ్మా అన్నలు ‘కొట్టిన్రు చూడే’ అంటే అమ్మ అయ్యో అనకుండా... పాత చీపురు తీసుకుని తన వాటా తను పూర్తి చేసేది. హు... ఆ రోజులే వేరులెండి. బ్రేక్ తర్వాత... బ్రహ్మానందం అంటే పాతకక్షలున్నాయి. అందుకే ఫస్ట్ మారుతి కారు కొన్నప్పుడు ఎమ్మెస్ అన్ననొక్కడ్నే ఎక్కన్నా అని పిలిచా. ఆయనింటే కదా. ‘‘బ్రహ్మానందాన్ని కూడా పిలవరా, బాగోదు’’ అంటూ పోజు కొట్టి నేను బ్రహ్మానందాన్ని కూడా పిలిచేలా చేశాడు. ఓ శుభముహూర్తాన ఊరి శివార్లలో షూటింగైపోయాక ఇద్దర్నీ కారెక్కించుకున్నా. కాసేపు మంచిగానే నడిపి... తర్వాత సూపర్‌స్పీడ్‌లో మెలికలు తిప్పేశా. ఎమ్మెస్సన్న కంగారు. ‘అరేయ్ ఆపరా’ అంటూ అరుపులు. నేనేమో కారు నడుపుతూ సీలింగ్ వంక కంగారుగా చూడడం... దీంతో ఎమ్మెస్ అన్న ‘ఏరా ఏంటి వెతుకుతున్నావ్?’ అని కంగారుగా అడిగితే, ‘‘బ్రేక్ అన్నా, పైన ఎక్కడో ఉండాలి కనపడట్లే’’ అన్నా. ఇగ చూస్కోండి... కారాపాక బ్రహ్మానందం గంటన్నర పాటు నవ్వీ నవ్వీ... రిపోర్టింగ్ : ఎస్.సత్యబాబు -
లైట్ 4 క్రికెట్
సిటీకి చెందిన ఏడీపీ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ యువకుడికి క్రికెట్ కిట్ కొనిచ్చింది. నగరంలోని సాయి జానియర్ కాలేజ్ మరో కుర్రాడికి ప్రయాణపు ఖర్చులు అందివ్వడమే కాకుండా పాస్‌పోర్ట్ సైతం సిద్ధం చేసి ఇచ్చింది. ఇంకో అబ్బాయికి అవసరమైన సాయాన్ని ఐ అండ్ ఐ అనే ఎన్జీఓ సమకూర్చగా, మరో యంగ్‌స్టర్‌కి కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయూతని అందించాడు. ఆ సాయం చేసిన వారికి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఆ నలుగురు కుర్రాళ్లూ సాధించిన విజయం మాత్రం ఆషామాషీ కాదు. అవును మరి ఆ విజయం పేరు బై ్లండ్ క్రికెట్లో వరల్డ్‌కప్. -ఎస్.సత్యబాబు చూపులేనివాళ్లూ క్రికెట్ ఆడతారు. దేశానికి పేరు తెస్తారు. కొన్నాళ్ల కిందటే సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్‌కప్ జరిగింది. అందులో మనవాళ్లు కప్ గెలిచారు. అదీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ మీద. అంతటి ఘన విజయాన్ని మనకు దక్కించిన క్రికెట్ వీరుల్లో నలుగురు మన తెలుగోళ్లే. వరల్డ్‌కప్ విజయం తర్వాత ఇటీవల స్వస్థలాలకు వెళుతూ హైదరాబాద్‌లో ఆగిన వీరిని సిటీప్లస్ పలకరించింది. కంటి చూపు లోపానికి దుర్భర దారిద్య్రం తోడైనా.. వెలుగు బాటలు పరచుకుంటూన్న ఈ క్రీడారత్నాలు తమ అనుభవాలను ఇలా వివరించారు. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని.. మాది గుంటూరు జిల్లా, మాచర్ల. నాన్నది వ్యవసాయం. నాలుగేళ్ల వయసులో తలుపు గొళ్లెం తగిలి ఒక కన్ను పోయింది. వయసు పెరిగేకొద్దీ ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కంటి చూపు మందగించింది. నరసరావుపేట షిఫ్టయ్యాక నాన్న ఇడ్లీ, దోసె అమ్మి మమ్మల్ని పోషించారు. స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడేవాడ్ని. పదో తరగతిలో ఉండగా ఏపీ టీమ్‌కి.. అలా ఇండియన్ టీమ్‌కి కూడా వైస్ కెప్టెన్ అయ్యాను. ఇంటర్ చదువు, క్రికెట్ హైదరాబాద్‌కి రప్పించాయి. నిజాం కాలేజ్‌లో బీఏ ఆర్ట్స్ పూర్తి చేశాను. ఆల్‌రౌండర్‌ని. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో కెరీర్ బెస్ట్ స్కోరు 94 బంతుల్లో 158 రన్స్ చేశాను. 2008 దాకా మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. మా బ్రదర్ ఆంజనేయరెడ్డి ఎస్సై అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. జనరల్ కోటాలోనే 2011లో ఎస్బీహెచ్లో క్లర్క్పోస్ట్కు సెలక్టయ్యా. కొంత నా స్పోర్ట్స్ నేపథ్యం కూడా ఉపయోగపడింది. ఆర్థిక సమస్యలు తీరడంతో క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాను. ప్రాక్టీస్‌లో కాళ్లు ఫ్రాక్చర్స్ అయ్యాయి. పళ్లు విరిగాయి. చాలా సార్లు దెబ్బలు తగిలాయి. అయినా పట్టు విడవలేదు. ఈ కష్టాలన్నీ మరపించిందీ వరల్డ్ కప్ విజయం. తొలిసారి స్పోర్ట్స్ మినిస్ట్రీ రూ.5 లక్షలు ఇచ్చింది. అలాగే ప్రధాని మోదీ మాతో అరగంట గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. - అజయ్‌కుమార్‌రెడ్డి వైజాగ్ టు వరల్డ్‌కప్ మాది శ్రీకాకుళం జిల్లా. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. నాన్న వ్యవసాయకూలీ. అమ్మ ఇంట్లో ఉండేది. తమ్ముడు వెల్డింగ్ లేబర్. ఐదేళ్లున్నప్పుడు కుడి కన్నుకు క్రికెట్ బాల్ తగిలింది. రక్తం రాలేదు చిన్నదెబ్బే అనుకుంటే మళ్లీ అక్కడే తగిలింది. ఒక నెలలోనే చూపు పూర్తిగా పోయింది. అంతేకాకుండా ఎడమ కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. విశాఖపట్నంలోని మోడల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో పదో తరగతి వరకూ చదివాను. అక్కడే క్రికెట్ కంటిన్యూ చేశాను. టెన్త్‌క్లాస్‌లో స్కూల్ కెప్టెనయ్యా. విశాఖపట్నం నుంచి వైజాగ్ చాలెంజర్స్ టీమ్‌కు సారథిగా స్థానిక క్రికెట్ పోటీ ల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత స్టేట్ టీమ్‌లో తీసుకున్నారు. 2011 నవంబర్లోఇండియన్ క్రికెట్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాను. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను అందుకున్న టీమ్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికీ నాకు సరైన ఉద్యోగం లేదు. జిల్లా కలెక్టర్‌ను కలిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించారు. రూ.4,500 జీతం. టోర్నమెంట్స్‌కి వెళితే అందులోనూ కోత. తమ్ముడికి హెల్త్ బాగోలేదు. నాన్న వెల్డింగ్ పని మీద ఇతర దేశాలు వెళ్లారు.హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ సాయంతో క్రికెట్‌ను కొనసాగించగలిగాను. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం చేసింది. మంచి జాబ్ వస్తే లైఫ్‌లో కొంత తేరుకుంటాను. - వెంకట్ యంగెస్ట్.. ఫీల్డింగ్‌లో బెస్ట్.. మాది శ్రీకాకుళం జిల్లా కొప్పరవలస. చిన్నప్పుడే నాన్న చనిపోతే... అమ్మ రెక్కల కష్టం మీద నన్ను, తమ్ముడ్ని పెంచింది. నా చిన్నప్పుడు ఏదో కర్రపుల్ల తగిలి కుడి కంటి చూపు దెబ్బతింది. సరిగా గమనించకపోవడంతో.. ఎడమ కంటికీ ఇన్ఫెక్షన్ సోకింది. పదో తరగతి వరకు బొబ్బిలిలోని బ్లైండ్ స్కూల్లో చదివా. తర్వాత హైదరాబాద్‌లోని సాయి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్లో చేరా. 2011 నుంచి క్రికెట్ ఆడుతున్నాను. 2013లో తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి, వెంటనే ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యా. ప్రస్తుతం వరల్డ్‌కప్ ఆడిన టీమ్‌లో నేనే యంగెస్ట్. నా ఫీల్డింగ్‌కు మంచి పేరుంది. ఏడుగురిని రన్ అవుట్ చేశాను. 4 క్యాచ్‌లు పట్టాను. పేదరికంలో ఉన్న నాకు పాస్‌పోర్ట్ వర్క్, రాకపోకల ఖర్చులు అంతా మా కాలేజ్ వాళ్లే చూసుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరి బాగా ప్రోత్సహిస్తున్నారు. మాకు ఉపాధి పరంగా సరైన ఆసరా లభిస్తే క్రికెట్లో మరింతగా సత్తా చాటుతా. - దుర్గారావు ఆల్‌రౌండర్‌ని.. మాది నల్లగొండ జిల్లా మల్లాపురం గ్రామం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ హైదరాబాద్‌లోని చంపాపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు రూ.2 వేల జీతం. ఊర్లో ఉండగా, ఏడెనిమిదేళ్ల వయసనుకుంటా.. బాణం పుల్ల కుడికన్ను లోపల గుచ్చుకుంది. హైదరాబాద్ సరోజని కంటి ఆస్పత్రిలో చూపించినా చూపు దక్కలేదు. ఎడమ కంటి చూపు 40 శాతం దెబ్బతింది. దారుల్ షిఫా బాయ్స్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో టెన్త్ దాకా చదివా. క్రికెట్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఆడి, 2008లో సౌత్‌జోన్‌కు సెలక్టయ్యాను. ఆ తర్వాత ఇండియన్ టీమ్‌కు సెలక్టయ్యాను. ఐ ఆండ్ ఐ ఎన్జీఓ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చే సింది. డిసెంబర్లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించా. ప్రస్తుతం మెహదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలో ఉన్న హోమ్ ఫర్ ద బ్లైండ్ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఉస్మానియాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తున్నాను. కాల్ సెంటర్లో జాబ్ చేసేవాడ్ని. ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యాక లీవ్ ఇవ్వడం కుదరదన్నారని రిజైన్ చేశాను. ప్రస్తుతం జాబ్ కూడా లేదు. నాకు అవసరమైన క్రికెట్ కిట్‌ను బంజారాహిల్స్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీ ఏడీపీ కొని ఇచ్చింది. వరల్డ్‌కప్ గెలిచాక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం అందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసరా అందిస్తే మరింతగా క్రికెట్లో రాణించగలనన్న నమ్మకం ఉంది. - మధు -
షూట్ @ సైట్
ఓ అనాథాశ్రమానికి మీరు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేవు. అప్పుడు ఏం చేస్తారు?నిర్వాహకులకు కొన్ని ఉచిత సలహాలు పడేస్తారు. వీలైతే.. కొంత ఆర్థికసాయం చేస్తారు. అలాగే ఓ పదమూడేళ్ల బాలిక అయిన వారికి దూరమై అష్టకష్టాలు పడుతోందనే విషయం తెలిస్తే అయ్యో అని జాలిపడతారు. ఆ అమ్మాయి గాని మిమ్మల్ని కలిస్తే కాసిన్ని డబ్బులిచ్చి సాయపడతారు. ఈ టీమ్ మాత్రం అలా సరిపెట్టదు. సదరు సమస్యలపై కెమెరా ఎక్కుపెడుతుంది. వాటిని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక బలమైన చేయూతను పోగు చేసుకుని మరీ పరిష్కారాల్ని కనిపెడుతుంది. ఆ టీమ్ పేరు బ్లూ ఫంక్. వీరేం చేశారో, చేయనున్నారో తెలుసుకోవాలనుందా..? అయితే... గెట్ ఇన్ టు దిస్ స్టోరీ... - ఎస్.సత్యబాబు ఓసారి బ్లూ ఫంక్ టీమ్.. మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ పాఠశాలలో వసతుల లేమిపై డాక్యుమెంటరీ తీసింది. దాన్ని నగరంలోని 15 కాలేజీల్లో ప్రదర్శించింది. దీంతో వాళ్లకి కొన్ని ప్రాథమిక అవసరాలు తీరడంతో పాటుగా 12 కంప్యూటర్లు కూడా లభించాయి. సంఘంలో పేరుకుపోయిన సమస్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్న బ్లూ ఫంక్ టీమ్ రూపకర్త అన్షుల్ సిన్హా. ఈ పాతికేళ్ల కుర్రాడి సార థ్యంలో నడుస్తున్న ఈ టీమ్ వినూత్న తరహాలో సొసైటీలోని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ చూపిస్తోంది. బేస్.. కాలేజ్ డేస్.. ‘మా సోషల్ రెస్పాన్సిబిలిటీకి బీజం పడింది కాలేజ్ డేస్‌లోనే’ అని చెప్తారు అన్షుల్. మూడేళ్ల క్రితం ఎంబీఏ చదువుతుండగా రోజుకు తలో రూపాయి కలెక్ట్ చేసి పలు ఆర్ఫనేజ్ హోమ్‌లు, ఎన్జీవో సంస్థలకు అందించేవాళ్లీ ఫ్రెండ్స్. ‘అయితే మేం చేసే కాసింత సాయం ఏ మూలకీ రాదని తెలిశాక.. ఈ డాక్యుమెంటరీ ఐడియా వచ్చింది’ అంటూ వివరించారు అన్షుల్. అప్పటి నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో నుంచి కొన్నింటిని ఎన్నుకుని డాక్యుమెంటరీలుగా మలుస్తున్నామన్నారు. సామాజిక కోణం.. ‘ఓ ఆర్ఫనేజ్కి వెళ్లినప్పుడు నాగోల్ అమ్మాయి వైష్ణవి (13)ని కరీంనగర్ తీసుకెళ్లి చైల్డ్లేబర్గా మార్చిన వైనాన్ని తెలుసుకుని, ఆ అమ్మాయి కష్టాల్ని యథాతథంగా చిత్రీకరించాం. డాక్యుమెంటరీగా మలచి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం’ అంటూ కేవలం ఆర్థిక సాయానికి మాత్రమే కాకుండా మరికొన్ని సామాజిక సమస్యలపై కూడా తాము స్పందించే తీరును వెల్లడించాడు అన్షుల్. అలా ఒక ఏడాదిలో ఈ బృందం 12 డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో కొన్ని పలు అవార్డులను సైతం దక్కించుకున్నాయి. అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సోషల్ కాజ్ కోసమే ఖర్చు పెడుతోందీ టీమ్. రిమూవ్ పావర్టీ ఫ్రం ఇండియా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అనే అంశంపై తీసిన చాకొలెట్ రూమ్, బయో మెడికల్ వేస్టేజ్ పై చిత్రం, హైదరాబాద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 3 నెలలు రీసెర్చ్ చేసి తీసిన మరో డాక్యుమెంటరీ.. ఇలా సామాజిక సమస్యల పై స్పందిస్తున్న అన్షుల్ బృందం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆ మార్గంలోనే.. ‘హ్యాండీ కామ్ లాంటి చిన్న సాధనంతోనే పెద్ద పెద్ద సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అర్థమయ్యాక ఆ మార్గాన్ని వీడలేకపోయాను’ అని అంటాడు అన్షుల్. ఇంటర్ కాలేజ్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 14 అవార్డ్స్, మై చాకొలెట్ కవర్ ద్వారా మరో డజనుకు పైగా పురస్కారాలు, కమ్యూనలిజంపై తీసిన ‘లాపెట్’ ద్వారా అంతర్జాతీయ స్థాయి అవార్డ్స్.. ఇలా డాక్యుమెంటరీల ద్వారా అత్యధిక పురస్కారాలు అందుకున్న యువ బృందంగా నిలిచింది బ్లూఫంక్. తెగిపడి తమ ముందు వాలిన పతంగి కోసం భిన్న మతాలకు చెందిన నలుగురు చిన్నారులు కొట్లాడు కోకుండా దాని చిరుగులు అతికించి, మరింత బాగా ఎగిరేలా చేయడం అనే కాన్సెప్ట్‌తో తీసిన లాపెట్.. పలు అంతర్జాతీయ పురస్కారాలను ఎగరేసుకుపోయింది. సమస్య ఏదైనా.. ‘యువతరం తలచుకుంటే అసాధ్యమనేది లేదు. ఒక కాలేజ్‌కు చెందిన కొందరు విద్యార్థులే ఇంత చేయగలిగితే.. సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులు చేయి కలిపితే.. ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంద’ని అంటాడు అన్షుల్. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, తర్వాత విద్యార్థి లోకంలో తలెత్తిన అయోమయాన్ని వివరిస్తూ వీరు తీసిన డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ది ఆన్‌సీన్ డిజాస్టర్, బ్లైండ్ ఇమేజ్, స్విచ్ ఆఫ్, ఫ్లిప్ బుక్, లాపెట్ రిటర్న్స్, రోడ్ ఆఫ్ సెపరో.. ఇలా దాదాపు 38 చిత్రాలు తీసిన ఈ బృందం 48 అవార్డులు సొంతం చేసుకుంది. ఆర్గాన్ మాఫియాపై గురి... ఇన్నాళ్లు సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించిన వీరి కెమెరా.. ఇప్పుడిప్పుడే సవాళ్లకు సై అంటోంది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా పరిశోధనాత్మక చిత్రాలను రూపొందించే పనిలో ఉంది. నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వాస్పత్రులకు చెందిన సిబ్బంది నిర్వాకంతో యథేచ్ఛగా సాగుతున్న ఆర్గాన్ మాఫియాను చూపించడం తమ తొలి ప్రయత్నంగా అన్షుల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న అవయవ వ్యాపారం సిటీలో కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న వైనంపై ఏడాది పాటు పరిశోధించి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ‘ఆర్గాన్ మాఫియాపై తీసిన చిత్రం ‘గేట్ వే టు హెవెన్’ సెన్సార్ దశలో ఉంది, అది వెలుగులోకి వస్తే ఆర్గాన్ మాఫియా జాడలు సమాజానికి తెలుస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అన్షుల్. కెమెరా నేత్రంతో వ్యవస్థ బాగు కోసం పాటుపడుతున్న బ్లూ ఫంక్కు హ్యాట్సాఫ్ ! -
వాలంటీనేజర్
పొద్దున్నుంచి పొద్దు పోయేదాకా పనులు చేస్తాం. ప్రతి పని నుంచి రకరకాల ప్రతిఫలాలు ఆశిస్తాం. ఆశ తీరితే ఉత్సాహంగా, తీరకపోతే మరింత ఆశగా మరుసటి రోజు పనులు మళ్లీ మొదలు పెడతాం. కాని ఒక్క రోజు లేదంటే ఒక్క గంట.. ఏమీ ఆశించకుండా పనిచేస్తే ఊహించనంత ఆనందం అందుతుంది. రేపటి భయాన్ని దూరం చేసేంత ఆత్మవిశ్వాసం ఆవహిస్తుంది. ఇది శ్రీకర్ లాంటి స్వచ్ఛంద సేవకుల మాట. సీనియర్లే కాదు శ్రీకర్ లాంటి ‘సిటీ’నేజర్లు సైతం ఎంచుకుంటున్న సరికొత్త బాట. సేవామార్గం వైపు మళ్లాలంటే వయసు మళ్లినవారో, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారో మరీ తప్పకపోతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కోసం చేసేవారో అయి ఉంటారు. దీనికి భిన్నం కుందన్‌బాగ్‌లో నివసించే ఈ కుర్రాడు. - ఎస్.సత్యబాబు సముద్రపు ఒడ్డున పడి ఉన్న స్టార్ఫిష్లను ఓ కుర్రాడు ఒకటొకటిగా తిరిగి సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు. ఆ పని చూస్తూ ‘పిచ్చా’అంటూ కొందరి ఎద్దేవా, ‘అలా ఎన్నని వేస్తావ్?’ అంటూ కొందరి జాలి చూపులు. అయితే ఆ కుర్రాడు అవేవీ లక్ష్యపెట్టడు. చేసే పని ఆపడు. ‘నేనేం చేయగలనో చేస్తున్నా. చేతనైతే మీరూ చేయండి’అనేది ఆ కుర్రాడి మౌనంలోని భావం. శ్రీకర్ ఆధ్వర్యంలోని వాలంటరీ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్లిన వెంటనే పడే స్ఫూర్తి దాయక ప్రభావం. ‘మా ఎన్జీవోను స్థాపించినప్పుడు నా వయసు 15 ఏళ్లే’ అని చెప్పాడు కూచిభట్ల శ్రీకర్ శ్రీరామ్. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఈ సిటీ కుర్రాడు రెండేళ్ల క్రితం స్థాపించిన క్విడ్ ఫేసియమ్ (ఈ లాటిన్ పదానికి వాట్ ఐ కెన్ డు అని అర్థం) సంస్థ.. బహుశా దేశంలోనే తొలిసారి ఒక టీనేజర్ సీఈవోగా ఏర్పడిన వాలంటరీ ఆర్గనైజేషన్. గిటార్ టు చారిటీ... ‘చిన్నవయసు నుంచే గిటార్ ప్లే చేయడం అంటే ఇష్టం. ఆరేళ్ల పాటు గిటార్‌ను నేర్చుకుని లండన్ ట్రినిటీ మ్యూజిక్‌లో 6 గ్రేడ్స్ పూర్తి చేశాను. ఈ కోర్సులో అత్యుత్తమంగా చెప్పే గ్రేడ్ 7 పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నా. ఓక్రిడ్జ్ స్కూల్లో నా మ్యూజిక్కు ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక, స్కూల్లో ఉన్నప్పుడు పలు వాలంటరీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాక.. మ్యూజిక్ ద్వారా సర్వీస్ అనే ఆలోచన వచ్చింది’ అంటూ వివరించాడు శ్రీకర్. అయితే ‘ఈ వయసులో వాలంటరీ ఆర్గనైజేషన్ ఏమిటి? చదువు దెబ్బతింటుంది’ అంటూ పేరెంట్స్‌తో పాటు సన్నిహితులూ వారించారు. కాని స్కూల్ స్థాయి నుంచే ఎడ్యుకేషన్‌లో ఏటా టాపర్‌గా నిలిచే శ్రీకర్‌కు తన మీద తనకు నమ్మకం ఉంది. అయితే 15 ఏళ్ల వయసులో సంస్థ నిర్వహణ మన చట్టాల ప్రకారం సాధ్యం కాదు. దీంతో తను ఫౌండర్‌గా ఉండి, సీనియర్ ఆర్కిటెక్ట్ కడియాల తులసీరాం, బయోటెక్నాలజిస్ట్ దేబాంజన దత్తా,టెక్నోక్రాట్ శివరామ్ రాథోడ్, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ మాగంటి వెంకట్, సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ లలితాకుమారి.. వంటి విభిన్న రంగాల ప్రముఖులను, కార్పొరేట్ లీడర్స్‌ను, ప్రొఫెసర్స్‌ని, డాక్టర్స్‌ని తన సంస్థకు బోర్డ్ మెంబర్స్‌గా చేసుకున్నాడు. ‘క్విడ్ ఫేసియమ్- స్కిల్ బేస్డ్ వాలంటీరిజం’ను స్థాపించాడు. వాలంటీర్ల వెల్లువ... ‘నాకు మీరు డబ్బులు ఇవ్వొద్దు. విరాళాలో, వస్తువులో వద్దు. మీకు వచ్చిన విద్య పాటలైనా, ఆటలైనా, సేద్యమైనా, వైద్యమైనా.. దానిని పంచుకోండి చాలు’ అంటాడు శ్రీకర్. అదే తమ స్కిల్ బేస్డ్ వాలంటీరిజం అని నిర్వచిస్తాడు. ఇది ఎందరినో ఆకర్షించింది. వయసుకు మించిన పరిణితితో ఓ కుర్రాడు చేసిన విజ్ఞప్తికి వాలంటీర్ల వెల్లువే సమాధానమైంది. ‘ప్రస్తుతం మా ఫేస్బుక్ పేజ్‌కు 2,500 మంది మద్దతు ఉంది. దాదాపు 350 మంది రిజిస్టర్డ్ వాలంటీర్లున్నారు. ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మన సిటీల నుంచే కాకుండా అమెరికా, యూకే వంటి విదేశాల నుంచి సైతం వాలంటీర్లు ఉన్నారు’ అంటూ స్వల్పకాలంలో తాము సాధించిన విజయాన్ని వివరిస్తాడీ కుర్రాడు. రెండేళ్లుగా దాదాపు 50 వరకూ వాలంటరీ యాక్టివిటీస్ నిర్వహించింది శ్రీకర్ సంస్థ. ఇప్పటిదాకా దాదాపు ఆరువేల మంది విద్యార్థులను మేం కవర్ చేయగలిగాం అని చెప్పాడు శ్రీకర్ ఆనందంగా. ‘ఫైవ్’తో ఫైన్... నిరుపేద, అవసరార్థులైన విద్యార్థుల కోసం అనాథాశ్రమాలు, అంధ విద్యార్థుల కోసం గిటార్ ప్లే చేయడం.. వంటి మ్యూజిక్ బేస్డ్ కార్యక్రమాలతో పుట్టింగ్ బ్యాక్ స్మైల్, చదువుకు సంబంధం లేని జీవితానికి ఉపకరించే అనేక అంశాలను వివరించే బియాండ్ ది బెల్ట్స్, విద్యానంతర కెరీర్‌కు దిక్సూచిగా పనికివచ్చే కెరియర్ క్యాంపస్, లీడర్ షిప్ క్వాలిటీస్‌ను పెంచే యంగ్లీడర్స్, ఎన్విరాన్మెంట్పై బాధ్యతను, దాని ప్రాధాన్యాన్ని వివరించే గ్రినోవేషన్ ఇలా తమ యాక్టివిటీస్‌ను 5 రకాలుగా విభజించి సిటీలోని పలు పాఠశాలల్లో, ఆర్ఫనేజ్ హోమ్స్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది క్విడ్ ఫేసియమ్. వీరి ప్రోగ్రామ్స్‌లో అత్యధిక భాగం మ్యూజిక్ బేస్డ్ కావడంతో సంగీత నైపుణ్యం ఉన్న వాలంటీర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ‘మ్యూజిక్ డెరైక్టర్ సాల్మన్‌రాజు సహా మా వాలంటీర్లలో వీజే సందీప్, సింగర్స్.. ఉన్నారు. మేం చేస్తున్న కార్యక్రమాన్నివివరించి, మా రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇంట్రస్ట్ ఉన్న వారు స్పందిస్తున్నారు’ అని చెప్పాడు శ్రీకర్. ఎదుగుతున్న వయసులోనే చారిటీ వర్క్‌లోకి ఒదిగిపోతున్న ఈ కుర్రాడికి మరింత మంది తోడు కావాలని ఆశిద్దాం. నిస్వార్థంగా సమాజసేవకు సై అంటున్న సిటీలోని శ్రీకర్ లాంటి యువ వాలంటీర్ల ఉజ్వల భవితకు ‘హ్యాపీ వాలంటీర్స్ డే’ చెప్పేద్దాం. -
వైకల్యం వంగి సలాం చేసింది
నీరు తీస్తానన్న వైద్యుడు కన్నీరు మిగిల్చాడు. అమ్మకు ఆసరాగా ఉందామనుకున్న తనకే ఆసరా అవసరమయ్యే పరిస్థితి. అయినా వెన్ను చూపలేదు. ప్రభుత్వోద్యోగం సాధించాలనే పట్టుదల, విధి చేతిలో పావులా మారానన్న కసి చదరంగంలో పావుల్ని నేర్పుగా కదిలించింది. లోపాన్ని లోకానికి వదిలేసి అనుకున్నవన్నీ సాధిస్తూ, అనూహ్యంగా రాణిస్తున్న ఆ యువకుడి ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం ఓడిపోయింది. వంగి సలాం చేసింది. - ఎస్.సత్యబాబు వైద్యపరిభాషలో ‘కిఫోసిస్’, వాడుకలో ‘గూని’గా వ్యవహరించే వైకల్య బాధితుడు అమర్నాథ్ (37). సాయం అడగాల్సిన తన శారీరక స్థితి గురించి మర్చిపోయి ఎందరో తమ కాళ్లమీద తాము నిలబడేందుకు సాయంగా మారిన ఆయనను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అంతేకాదు... చదరంగంలో ఆయన సాధించిన విజయాలు అనూహ్యం. ఆయన కథలో ఒక యువకుని ఒంటరిపోరాటం ఉంది. చుట్టూ ఉన్న సమాజంతో పెనవేసుకున్న అనుబంధంలో స్ఫూర్తినింపే సేవాభావముంది. వెన్నులో నీరు తీస్తాడనుకుంటే... ‘‘పుట్టి పెరిగింది నెల్లూరు. నాన్న చిన్నతనంలోనే పోతే చిరుద్యోగి అయిన అమ్మ చేతుల మీదుగా కష్టాల నీడలోనే అక్కయ్య, అన్నయ్య, నేను పెరిగాం’’ అంటూ ప్రారంభించారు అమర్. నాన్న లేరు, అమ్మ ఉద్యోగంతో రోజంతా కుస్తీ, బంధువులు ఆదరించలేదు... చదువు సరిగా ఒంటబట్టని అమర్ తప్పుతూ, పాసవుతూ...10వ తరగతి పూర్తి చేశాననిపించాడు. ఆ సమయంలో బాగా బొద్దుగా ఉండే అమర్‌ను చూసిన ఒక డాక్టరు... ‘‘మీ పిల్లాడు మరీ లావుగా ఉన్నాడు. పెద్దయితే కష్టం’’ అని భయపెట్టి ఆపరేషన్‌తో వెన్నులో నీరు తీసేసి సన్నగా చేస్తానని నమ్మించాడు. ఆ ఆపరేషన్ వికటించి అమర్ వీపునకు కుడి వైపు దేహాన్ని పూర్తిగా కుంగదీసి గూనికి దారి తీసింది. దీంతో అమర్ మరింత నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లల బాగుకోరిన ఆ తల్లి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా... ‘‘కుటుంబ పోషణలో అమ్మకు ఆసరాగా ఉండాలనిపించినా, వీలు లేకుండా ఈ వైకల్యం అడ్డుపడింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు అమర్. స్పోర్ట్స్‌కోటాలో ప్రభుత్వోద్యోగం సంపాదించడానికి చిన్నప్పుడు ఊసుపోక ఆడిన చదరంగాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాడు. అందులో ప్రావీణ్యం సాధించి జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విజ యాలు సాధించాడు. అయినా స్పోర్ట్స్ కోటాలో వికలాంగులకు ఉద్యోగం ఇవ్వం పొమ్మన్నారు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, వైకల్యం సాకుతో నిరాకరించడం... ఇలా ఎన్నో మార్లు జరిగింది. రైల్వే ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా పట్టు వీడలేదు. ప్రభుత్వంతో పోరాడాడు. 9నెలల పాటు హైదరాబాద్‌కు, ఒంగోలుకు మధ్య చక్కర్లు కొడుతూ అధికారులకు అర్జీలపై అర్జీలు పెడుతూ పోరాడి చివరకు గెలిచాడు. వికలాంగుడై ఉండీ స్పోర్ట్స్‌కోటాలో రైల్వే ఉద్యోగం పొందినవారిలో ప్రథముడిగా నిలిచి, మరెందరో వికలాంగులకు స్ఫూర్తినిచ్చాడు. నేనున్నానని... ఒకరి గొడవ ఒకరికి పట్టని హైదరాబాద్ లాంటి అ‘భాగ్య’నగరాల్లో ఉద్యోగార్థ్ధుల బాధలు మరింత వర్ణనాతీతంగా ఉంటాయి. ‘‘ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఈ సిటీకి వచ్చి వెళ్లేపుడు సరైన వసతి లేక, కట్టే స్థోమత లేక పడిన బాధలే... మరి కొంత మందికి చేయూతని అందించేలా ప్రోత్సహించాయి’’ అని వివరించారు అమర్. నగరానికి సినిమా, టీవీ... వంటి రంగాలలో ప్రతిభకు తగ్గ ఉపాధిని ఆశిస్తూ వచ్చే ఎందరో యువతీయువకులకు నీడనిచ్చేందుకు ఓ పదేళ్ల నుంచి నగరానికి ఉద్యోగార్థులై లేదా మరేదైనా రంగంలో కెరీర్ వెతుక్కుంటూ వచ్చే వారికి ఉచిత వసతి కల్పించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అమర్‌కు చెందిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో రెగ్యులర్‌గా అరడజనుకు తక్కువ కాకుండా అవసరార్థులు ఆశ్రయం పొందుతుంటారు. ‘‘ఒక్కోసారి ఎవ్వరూ రానపుడు నిమ్స్, ఎల్వీప్రసాద్ ఆసుపత్రుల దగ్గర ఫుట్‌పాత్ మీది రోగులనో వారి బంధువులనో పిలుచుకువస్తాను’’ అని చెప్పారు అమర్. తన ఫ్లాట్‌ను పంచుకునే వారికి చాపలు, దుప్పట్లు, దిండ్లుతో పాటు అన్నం వండుకోవడానికి బియ్యం సమకూరుస్తున్నానని, తన జీతంతో పాటు స్నేహితులు అందిస్తున్న చేయూతతో ఇది సాధ్యమవుతోందని అమర్ అంటున్నారు. అంతేకాదు... అనాథ పిల్లలకు హోమ్‌లలో ఆశ్రయం కల్పించడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, నిరుపేద రోగులకు సహకారం అందించడం వంటి సదుద్దేశాలతో ‘‘నేనున్నాను ఫౌండేషన్’’ (www.nenunnanu.org)ను ఏర్పాటు చేశారాయన. చెస్‌లో... ఆర్బిటర్‌గా... ప్రస్తుతం రైల్వేలో కమర్షియల్ క్లర్క్‌గా పనిచేస్తున్న అమర్...మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక పాప. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మాత్రమే కాదు చదరంగంలోనూ ఆయన చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నారు. రాష్ట్ర. జాతీయస్థాయిలో ట్రోఫీలు గెలిచారు. అంతేకాదు... క్రికెట్లో అంపైర్ తరహాలో చెస్‌లో విధులు నిర్వర్తించే ఆర్బిటర్ హోదాను ఆయన అందుకుని ఈ హోదాను దక్కించుకున్న ఏకైక వికలాంగుడిగా నిలిచారు. అలాగే పోలెండ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఫిజికల్లీ డిజేబుల్డ్ చెస్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఎంపికయ్యారు. ‘‘మిగిలినవారి కన్నా డిజేబుల్డ్ పర్సన్స్‌కే స్పోర్ట్స్ చాలా అవసరం’’అంటారు అమర్. అందులోనూ చెస్ లాంటి ఆటల విషయంలో వికలాంగుల్ని బాగా ప్రోత్సహించాల్సి ఉందంటున్న అమర్ అందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నగరంలో డిజేబుల్డ్ పర్సన్స్, చిల్డ్రన్‌కి ఆశ్రయం పొందే చోటకు స్వయంగా వెళ్లి వారికి ఉచిత చదరంగం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డిజేబుల్డ్కు చెస్‌ను చేరువ చేయడమే తన జీవితాశయం అనీ, వీలున్నంత వరకూ సమాజ సేవ చేస్తూనే ఉంటానంటున్న అమర్ ఆశయం సిద్ధించాలని కోరుకుందాం. -
చైల్డ్ రాక్
ఆయన పేరు డేవిడ్ ప్రభాకర్. సిటీలో చాలామందికి చిరపరిచితమైన రాక్ సంగీతజ్ఞుడు. అయితే పబ్‌లు, క్లబ్బుల్లో రాత్రుల్ని వేడెక్కించే రాక్‌కు భిన్నమైన రాగాలాపన ఆయనది. ‘సంగీతం అత్యంత బలమైన మాధ్యమం. దీనిని మంచి పనులకు ఉపయోగిస్తే అద్భుతమైన సందేశం అందించవచ్చు’ అంటారు డేవిడ్. తన రాక్ బ్యాండ్ ద్వారా అదే పని చేస్తున్నారాయన. నిరుపేద చిన్నారులతో ఈయన చేసే మ్యూజికల్ జర్నీ స్ఫూర్తిదాయకం. - ఎస్.సత్యబాబు కొంతకాలంగా పలు ప్రదర్శనలు ఇచ్చిన డేవిడ్.. తన ప్రతి సంగీత ప్రదర్శనకూ చక్కని థీమ్‌ను ఎంచుకుంటారు. అంతేకాక ఆయన రాక్ బృందం సభ్యులు కూడా ఎప్పుడూ చిన్నారులే. ‘స్వచ్ఛమైన సందేశం అందించాలంటే చిన్నారులే కరెక్ట్’ అంటారు డేవిడ్. పర్యావరణం పరిరక్షణ, ప్రపంచశాంతి, మానవత్వం-సేవాభావం.. ఇలా ఒక్కో ప్రోగ్రామ్‌కి ఒక్కో మెసేజ్‌ను ఆయన ‘చిరు’ రాగాల రాక్ బృందం మోసుకొస్తుంటుంది. గుడిసెల్లో.. గుండెల్లో.. సిటీలో ఏదైనా బస్తీ మీదుగా వెళ్తుంటే.. వీనులవిందైన గిటార్ రాగాలు లేదా చక్కని సంగీతస్వరాలు వినిపించాయనుకోండి. పరిశీలిస్తే ఆ మురికివాడల్లోని ఇళ్లలో పిల్లల్లో పిల్లవాడిగా మురిసిపోయే డేవిడ్‌ని చూడవచ్చు. ‘ఇది నాకెంతో ఇష్టమైన వ్యాపకం.మనం గిటార్ ప్లే చేస్తుంటే కళ్లింతలు చేసుకుని చూస్తూ ఆనందంగా కేరింతలు కొట్టే ఈ పిల్లలను చూస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది’ అంటారు డేవిడ్. వారాంతాల్లో, లేదా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆయన తన సంతోషాలకు దగ్గర్లోని బస్తీ చిన్నారులతో వంతెన కట్టుకుంటారు. హైటెక్‌సిటీ ఎదురుగా ఉన్న డంప్ యార్డ్ పరిసరాల్లోని బస్తీతో సహా పలు బస్తీల్లో ఆయన ఈ తరహా వీనుల విందును పంచుతున్నారు. ఆయా బస్తీల్లో పిల్లలు మ్యూజిక్‌పై ఆసక్తి చూపిస్తే వారికి ప్రాథమిక శిక్షణ కూడా ఉచితంగా అందిస్తున్నారు. సన్నాఫ్ హరీష్‌రావు సారథ్యం... డేవిడ్ ఆలోచన మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తనయుడు అర్చిష్‌మన్ సారథ్యంలో ఏర్పడిన ఇన్ఫ్యూజ్ చిన్నారుల రాక్ గ్రూప్ శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ చిన్నారుల రాక్ బృందంలో మంత్రి హరీశ్‌రావు తనయ వైష్ణవి కూడా ఉన్నారు. బేస్ గిటారిస్ట్‌గా అర్చిస్మెన్, రిథమ్ గిటార్‌తో ఐశ్వర్య కృష్ణన్, ఓకల్స్ వైష్ణవి, వరుణ్, కీబోర్డ్ ప్లేయర్‌గా అరిందమ్, డ్రమ్మర్ హర్షలు తమ దైన శైలిలో సంగీతాన్ని అందిస్తారు. నిరుపేద చిన్నారుల అవస్థలకు సంబంధించిన ‘షి కాల్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు ద మేన్ సర్ కెన్ యు హెల్ప్ మీ’ అనే సూపర్ హిట్ సాంగ్‌తో మొదలు పెట్టి మొత్తం 8 నుంచి 10 దాకా పాటలు వినిపిస్తారు. శిల్పారామంలో నైట్ బజార్లో రాత్రి 6.30గంటలకు ప్రారంభమయే ఈ కార్యక్రమంలో ఎలైస్ మ్యూజిక్ అకాడమీ టీచర్స్ ప్రదర్శన కూడా భాగం. ఈ సందర్భంగా మారు మూల ప్రాంతాలకు చెందిన 100 మంది నిరుపేద చిన్నారులకుబేసిక్ సర్వైవల్ కిట్స్ అందిస్తున్నారు. ‘‘కార్యక్రమానికి మంత్రి హరీ్‌శ్‌రావు తదితరులు హాజరవుతున్నారు’ అని డేవిడ్ చెప్పారు. -
ఈఫిల్‌పై సిటీ బ్యూటీ
ప్రపంచపు వింతపై సిటీ డిజైన్లు ప్రకాశించాయి. ఫ్యాషన్ హెవెన్‌లో హైదరాబాద్ హ్యాట్సాఫ్ అనిపించుకుంది. గత నెల 31 అర్ధరాత్రి ఈఫిల్ టవర్ ఫస్ట్ డెక్‌పై నిర్వహించిన జె-ఆటమ్ ఫ్యాషన్ షోలో నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అటు డిజైనర్‌గా, ఇటు మోడల్‌గానూ టవర్‌పై పవర్ చాటిన శిల్ప... ఈ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ డిజైనర్‌గా నిలిచారు. స్థానిక మల్కా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ను వినియోగించి ఆమె ఆవిష్కరించిన ఆటమ్/వింటర్ కలెక్షన్ 2014... ఆహూతులను ఆకట్టుకుంది. ‘ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్’ అని శిల్ప ‘సిటీ ప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. - ఎస్.సత్యబాబు -
నో చెవుల పువ్వెట్టింగ్
ఓ ఉద్యోగినికి భయం.. ఒంటరిగా ఆటోలో వెళ్లాలంటే!.. సగటు మనిషికి హడల్.. ఆటో ఎక్కితే మీటర్ మీద ఇంతవ్వమని డిమాండ్ చేస్తాడని!.. ఇది సకల జనుల సణుగుడు! మీటర్ నిజంగానే మొరాయించిందని మొత్తుకున్నా.. నమ్మని ప్యాసింజర్లు. పర్ఫెక్ట్ రీడింగ్ చూపించినా ట్యాంపరింగ్ చేశావనే కస్టమర్లు.. సగటు జనుల గురించి ఆటోవాలాల నిర్వేదం ఇది! ఈ ఇద్దరి కష్టానష్టాలకు ఒక్క ఆలోచనతో చెక్ పెడుతున్నారీ సిటీ యువకులు. ఒక్క ఫోన్ కాల్, ఆన్లైన్ బుకింగ్‌తో ఆటోను మన ఇంటి ముందుకే పంపిస్తున్నారు. సిటీలోని ఆటో సర్వీస్‌లను సిస్టమాటిక్ చేసి.. ఆటోవాలాల స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. ఈ యువకుల ఐడియా అటు ఆటోవాలాలను, ఇటు ప్యాసింజర్లను నో చెవుల పువ్వెట్టింగ్ అని అనేలా చేస్తోంది. యూకేలో ఉద్యోగం చేసి తిరిగొచ్చిన శశాంక్, ఐటీ ఫీల్డ్‌లో 11 ఏళ్ల అనుభవం ఉన్న హర్షవర్ధన్, కులదీప్‌లు సిటీవాసులు. అంటే సహజంగానే ఆటోలతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చూసి ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. ‘ఊర్నుంచి వచ్చిన మా ఫ్రెండ్‌ను సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ తీసుకొచ్చినందుకు రూ.450 వసూలు చేశాడు..’ అని చెప్పాడు శశాంక్. ‘లేట్ నైట్ ఆఫీస్ అయిపోయాక.. ఆటోవాళ్లతో పెద్ద పరేషాన్. కొందరేమో మనం అడిగిన చోటుకు రామంటారు. వస్తామన్న వాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారు’ అని గుర్తు చేసుకున్నాడు హర్షవర్ధన్. దీనికి ఆటోవాలాల అత్యాశ మాత్రమే కారణం కాదని, ఆర్థిక పరిస్థితి కూడా ఓ కారణమేనని గుర్తించిన వీరు ఓ వినూత్న కాన్సెప్ట్ రూపొందించారు. ఉభయ కుశలోపరి.. ఆటోవాలాలు, సిటీవాసులు.. వీరిద్దరి గురించి ఆలోచించి తొలి అడుగు వేశారు. నగరవ్యాప్తంగా కొన్ని నెలలు సర్వే చేశారు. ఓ 20 వేల ఆటో డ్రైవర్లతో కనెక్టయ్యారు. వారి ఆర్థిక ఇబ్బందులు, అవసరాల గురించి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత అనుభవాలతో పాటు వేలాది మంది ప్యాసింజర్లనూ దగ్గరగా పరిశీలించారు. వీటిని బేస్ చేసుకుని వీరిద్దరి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి పూనుకున్నారు. ఆటోడ్రైవర్లకు సరైన ఆదాయం, అదే టైంలో ప్యాసింజర్ల జేబులకు చిల్లులు పడకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను డిజైన్ చేశారు. పంజగుట్టలోని వీరి సాఫ్ట్వేర్ కంపెనీకి అనుబంధంగా ఆటో హోనా పేరుతో 3 నెలల క్రితం వెబ్సైట్ ప్రారంభించారు. ఈ సర్వీసు అచ్చం కాల్ ట్యాక్సీ వంటిదే. ఒక్క ఫోన్‌కాల్‌తో లేదా ఆన్లైన్ బుకింగ్‌తో జంటనగరాల పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా క్షణాల్లో ఆటోను మన ఇంటి ముంగిట ఉంచుతుంది. మొదటి 1.6 కి.మీ వరకూ రూ.20 ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.11 చొప్పున చార్జీ ఉంటుంది. కేర్ టేకర్స్ ఫర్ డ్రైవర్స్ ‘ఆటోలో ప్రయాణికుడు ఎక్కి, గమ్యం చేరే వరకూ మా పర్యవేక్షణ కొనసాగుతుంది. గమ్యాన్ని చేరారా అనేది కూడా మా కాల్ సెంటర్స్ ప్రతినిధులు వాకబు చేస్తారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రాత్రి వేళల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం’ అని వివరించారు హర్షవర్ధన్. ఆటోవాలాల స్థితిగతులు మెరుగుపరచడమే ప్రధాన బాధ్యతగా తీసుకుంది ఈ మిత్ర త్రయం. ‘వారి కష్టం, సమయం వృథా కాకూడదు. ఎవరైనా కస్టమర్ 10 నిమిషాలకు మించి వెయిటింగ్లో ఉంచితే, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణిస్తే అదనపు చార్జీ చెల్లించాలి. ప్రయాణికుడు కోరిన చోటుకు నిర్ణీత సమయానికంటే 5 నిమిషాల ముందుగానే చేరిస్తే రూ.10 బహుమతి అందిస్తున్నాం. ఆటో డ్రైవర్లకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం, ఆటో నిర్వహణలో మెలకువలు, మెడికల్ క్యాంప్స్ ప్లాన్ చేస్తున్నాం. ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలో కూడా సూచనలు, శిక్షణ అందిస్తున్నాం’ అని ఈ ఫ్రెండ్స్ చెప్పారు. ఆటో హోనా.. ఆటో హోనా వెబ్సైట్లో రెండు నెలల్లోనే 12 వేలకు పైగా ఆటోలు తమ పేరు ఎంట్రీ చేసుకున్నాయి. రోజుకు వందలాదిగా ఈ వెబ్సైట్లో ఎంక్వైరీ చేస్తుంటే, 50కి తగ్గకుండా బుకింగ్‌లు వస్తున్నాయి. ‘ఓన్ కార్స్ ఎక్కువ ఉండే బంజారాహిల్స్, మాదాపూర్ ఏరియాల నుంచీ మా సర్వీస్‌లను బాగా వినియోగించుకుంటున్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ స్నేహితులు. భవిష్యత్తులో హౌస్ షిఫ్టింగ్ నుంచి గణేశుడి నిమజ్జనం వరకూ ఈ కాల్ ఆటోని అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నారు. ఆటోవాలాలకు ఆదాయం పెంచేలా ఆటోల్లో యాడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీరి కాన్సెప్ట్‌ను మరికొందరు కూడా అందిపుచ్చుకుని ఈ తరహా సర్వీస్‌లు ప్రారంభిస్తున్న నేపధ్యంలో... చూద్దాం... వీరి నేటి ఆలోచనతో మన నిన్నటి ఆటో కష్టాలు తీరుతాయేమో..! బెస్టాఫ్ లక్ టూ.. ఆటో హోనా. - ఎస్. సత్యబాబు -
సెల్ఫీ
నచ్చిన, మెచ్చిన దృశ్యాన్నో, సందర్భాన్నో, అందాన్నో తీసి చూసి ఆనందపడే ఫేసుల్ని... ‘వెర్రిముఖమా.. ఎవర్నో చూసి ఎవరో తీసి కాదు నిన్ను నువ్వే తీసుకుని చూసుకుని ఎంజాయ్ చెయ్’ అంటూ కొత్త రకం టెక్నిక్‌ను చేతికిచ్చింది..‘సెల్ఫీ’. బ్యాక్ కెమెరాను వెనక్కినెట్టేస్తూ ఫ్రంట్ కెమెరాకు వీర క్రేజ్ తెచ్చిన ఈ ట్రెండ్ ఫొటోగ్రఫీకి కొత్త అర్థాలు చెబుతోంది. నిన్నామొన్నటి దాకా ఏదైనా టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లి.. పక్కనున్న వారినో, అపరిచితుల్నో బతిమాలి ఫొటోలు తీయించుకునేవాళ్లం. ఇప్పుడా బాధలకు శుభం కార్డ్ వేసింది సెల్ఫీ. సిటీలో ఈ ట్రెండింగ్ వింతలూ విశేషాలూ.. - ఎస్. సత్యబాబు మనల్ని మనం ఫ్రంట్ ఫొటోలు తీసుకోవడమనేది వీడియో కాలింగ్‌తో స్టార్ట్ అయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నోకియా ఫ్రంట్ కెమెరాను పరిచయం చేయడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. యువతరం సెల్ఫీపై బాగా మక్కువ పెంచుకుంటోంది. సెల్ఫీల దూకుడు ఏ రేంజ్లో ఉందంటే.. కొన్ని రోజులకి మామూలు కెమెరాను మర్చిపోతామేమో అనేంతగా. స్నేహితులు, కుటుంబసభ్యులు, బాయ్/గాళ్‌ఫ్రెండ్స్/సహోద్యోగులతో ఛాయాచిత్రాలను పంచుకోవడంలో తలమునకలైపోతున్నారు. మనం పంపిన సెల్ఫీని అవతలి వ్యక్తి చూశారా లేదా అనేదీ మనకు తెలిసిపోతుండడం కిక్‌నిస్తోంది. ఐ విల్ అప్డేట్ టూ యూ టీనేజ్ యువత సెల్ఫీమేనియాలో కొట్టుకుపోతోంది. స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి అప్లికేషన్స్ సాయంతో ఈ ట్రెండ్ విజృంభిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నారు. స్నాప్‌చాట్ అప్లికేషన్ ద్వారా లేచిన దగ్గర్నుంచి ప్రతిదీ ఫ్రెండ్స్‌తో పంచుకుంటున్నారు. ‘టుడే ఆనంద్కాబ్రా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకున్నాను. బార్బెక్యూలో ఫిష్ టేస్ట్ చేస్తున్నా. స్పాయిల్ పబ్‌లో క్యూట్ ‘చిక్’తో సల్సా చేస్తున్నా. లియో మెరిడియన్‌లో స్విమ్ చేస్తున్నా. ఐమ్యాక్స్‌లో సినిమా చూస్తున్నా’.. ఇలా టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా అప్డేట్స్ను నియర్ అండ్ డియర్‌కు ఫొటోలు జోడించి మరీ పంపించుకుంటున్నారు. క్లాస్‌రూమ్‌ల నుంచీ సెల్ఫీలు పంపడం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. స్టాండ్‌కి కెమెరా తగిలిం చి సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. ‘ఇగో’ తృప్తికి ఇదో మార్గం మనం చేసే రోజువారీ పనులను కాస్త గొప్పగానో, కొంచెం వెరైటీగానో ఇతరులకు ససాక్ష్యంగా చెప్పడంతో పాటు చూపడం మరింత క్రేజీగా మారింది. ఎక్కువ మంది దృష్టిని తమవైపు తిప్పుకోవడం దీన్లో ఒక ప్రధానోద్ధేశంగా కనిపిస్తోందని నగరానికి చెందిన సైకాలజిస్ట్‌లు అంటున్నారు. స్నేహితులకు తమ క్రియేటివిటీ తెలపడం, దినచర్యలోని వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా వ్యక్తిగత ఇగో సంతృప్తికి ఇది ఉపకరిస్తోందట. దినచర్యలో రొటీన్ ఫీలింగ్‌ను దూరం చేసుకోవాలను కోవడమూ ఓ కారణమేనంటున్నారు. వ్యక్తులు ఎదురుగా ఉన్నప్పుడు కొన్ని చూపాలనుకుని, లేదా చెప్పాలనుకుని.. అవి చేయలేకపోయినవారు సెల్ఫీలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఎమోషన్స్ వ్యక్తీకరణలకు ఇది మాధ్యమంగా మారింది. దూరంగా ఉన్నవారికి సెల్ఫీ ద్వారా ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపడం లేటెస్ట్ ట్రెండ్. ఉదాహరణకు ఇతరులు పంపిన టెక్స్ట్మెసేజ్ నవ్వు తెప్పిస్తే దానికి సమాధానంగా స్మైలీని పంపేవాళ్లు. ఇప్పుడదే స్మైలీ ప్లేస్‌లో తామే నవ్విన ఫొటోని తీసుకుని పంపుతున్నారు. టీజింగ్కూ వీటిని వాడుతుండడం సెల్ఫీలు మోసుకొస్తున్న దుష్పరిణామాల్లో ఒకటి. డోంట్ బీ ‘సెల్ఫీ’ష్... జంటలు తీసుకుంటున్న కొన్ని సెల్ఫీలు బాగా క్లోజప్లుగా ఉంటున్నాయి. ఇవి ఒక్కసారి చేయి దాటితే జీవితాలనే తలకిందులు చేయవచ్చునని ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఫ్రంట్ కెమెరా వినియోగంలోనూ సంయమనం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత భధ్రతను భంగపరిచేవి, మన ం నివసించే పరిసరాలు, పరిస్థితులు పదేపదే ఇతరులకు తెలియజేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పదుల సంఖ్యలో రోజూ సెల్ఫీలు తీసుకోవడం అలవాటైతే.. అది మానసిక జాడ్యంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. సో... టేక్ సెల్ఫీ అండ్ హ్యాండిల్ విత్ కేర్. సర్వే(సెల్ఫీ)జనా... * సెల్ఫీక్రేజ్ మహిళల్లోనే ఎక్కువని సెల్ఫిసిటీ పేరుతో జరిగిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. * విదేశీ నగరాల్లో ఈ ట్రెండ్ ప్రమాదపు ఘంటికలు మోగిస్తోంది. న్యూయార్క్‌లో ఇటీవల ఒక యూనివర్సిటీ చేసిన సర్వేలో న్యూడ్ సెల్ఫీలు పంపుకోవడం యువతకు క్రేజీగా మారిందని తేలిన విషయం ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా హైస్కూల్ స్టూడెంట్స్‌లో న్యూడ్ సెల్ఫీలు పంపుతామని 20శాతం మంది చెబితే... 38శాతం మంది అలాంటివి తరచుగా రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పారు. * ఫేస్‌బుక్‌పై సెల్ఫీలను పోస్ట్ చేసే మగవాళ్ల ధోరణి తమకు నచ్చదని 23.1 శాతం మంది అమ్మాయిలు చెప్పారట. ఒక మ్యారేజ్ వెబ్సైట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో చేసిన సర్వేలో ఇది తేలింది. * సెల్ఫీ ముదిరి మానసిక జాడ్యంగా మారుతుందా? అని ప్రశ్నించుకుంటే అవుననే చెబుతున్నాయ్ పరిణామాలు. బ్రిటిష్ యువకుడు డానీ బొవ్మన్ (19) ఒకేరోజున ఏకంగా 200 సెల్ఫీలు తీసుకుని, అప్పటికే పర్ఫెక్ట్ ఫొటో రాక, మానసిక ఒత్తిడికి గురయ్యాడట. ఆత్మహత్యకు సైతం యత్నించాడు. సెల్ఫీల రాక తర్వాత సెల్ఫీ అడిక్షన్‌కు గురైన తొలి యువకుడిగా ఇతడ్ని ఇప్పుడు గుర్తించారు. నాట్ ఫర్ సెల్ఫ్ మనల్ని మనం తీసుకునే ఫొటోలు సామాజిక చైతన్యం కోసం కూడా తీయవచ్చునని సిటీకి చెందిన మోడల్స్ నిరూపించారు. నగరానికి చెందిన దీపాదేవేంద్ర, సాధనాసింగ్, దినేష్ శర్మ వన్యప్రాణులను రక్షించాలనే సందేశంతో సిటీలోని చారిత్రక స్థలాలే వేదికగా సేవ్ వైల్డ్ అండ్ యానిమల్ నినాదాలతో సహా తీసుకున్న ఫొటోలు.. సెల్ఫీ క్రేజ్‌కు తొలిసారి మానవీయ కోణాన్ని యాడ్ చేశాయి. -
మల్కా ఇన్ ఫ్యారీస్
సిటీ డిజైనింగ్ పతాక ఈఫిల్ టవర్‌పై ఎగరనుంది. ఫ్యాషన్ వరల్డ్‌కు కేరాఫ్ అనిపించుకునే పారిస్‌లో హైదరాబాద్ తొలి అడుగు వేయనుంది. తెలంగాణ చేనేత వైభవం ఎల్లలు దాటనుంది. ఈఫిల్ టవర్ మీద ఫ్యాషన్ వేడుకతో ఈ సంచలనాలను మనకు చవి చూపించనున్నారు తెలంగాణ ఫ్యాషన్ సెన్సేషన్ శిల్పారెడ్డి. సిటీ డిజైనర్లు అంతర్జాతీయ యవనికపై రాణిస్తున్న తరుణంలో శిల్పారెడ్డి... సిటీ ఫ్యాషన్ ను ఫ్యాషన్ల స్వర్గమైన పారిస్ దాకా తీసుకెళ్లనున్నారు. తద్వారా హైదరాబాద్ నుంచి ఈ క్రెడిట్ సాధించిన ఫస్ట్ డిజైనర్‌గా నిలవనున్నారు. ఆమెతో బాటే తెలంగాణకు చెందిన మల్ఖా ఫ్యాబ్రిక్ కూడా ర్యాంప్‌పై తళుకులీననుండటం విశేషం. ఈఫిల్ టవర్‌ను వేదికగా చేసుకుని ఈ నెల 31న ఈ ఫ్యాషన్ వండర్ జరుగనుంది. తనను తాను మలచుకునే ‘శిల్ప’ం.. మోడల్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్, డిజైనర్.. మిసెస్ ఇండియా.. ఇలా తన పేరుకు ముందు బోలెడన్ని విశేషణాలు చేర్చుకుంటూ విభిన్న రంగాల్లో విజయాలు నమోదు చేస్తున్నారు శిల్పారెడ్డి. ప్రస్తుతం డిజైనర్లకు కలల గమ్యం లాంటి పారిస్‌లో తొలిసారి కాలు మోపుతున్నారు. ‘ ఈఫిల్ టవర్ అనే ఆర్కిటెక్చర్ అద్భుతంపై నా డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శిల్పారెడ్డి. తన డిజైన్ల కోసం తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో మాత్రమే వినియోగించే, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం లాంటి మల్ఖా చేనేతను వినియోగించనున్నారు. ‘మన ప్రాంతానికి విశిష్టత తేవడం, సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించుకుని కూడా ఫ్యాషన్‌ను నిలబెట్టవచ్చునని తెలియజెప్పడమే పారిస్‌లో మల్ఖా ప్రదర్శనకు కారణం’ అన్నారామె. ఇప్పటిదాకా ఈ ఫ్యాబ్రిక్‌ని ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌లో ప్రదర్శించలేదని ఆమె గుర్తు చేస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ డైస్‌ను ఉపయోగించి చేసిన పర్యావరణహిత ఫ్యాబ్రిక్ మల్ఖా అని చెప్పారు. దీన్ని ఉపయోగించి ఫుట్‌వేర్‌ను సైతం శిల్పారెడ్డి సృష్టించడం విశేషం. ‘ఈ అవకాశం నన్ను ఉత్తేజితురాల్ని చేస్తోంది. అదే సమయంలో కాస్త నెర్వస్‌గానూ ఫీలవుతున్నాను. నన్ను ఒక డిజైనర్‌గా కాకుండా ఒక భారతీయ ఫ్యాషన్ ప్రతినిధిగా చూస్తారు. ఇది పెద్ద బాధ్యత. మన భారతీయ ఫ్యాషన్‌కే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను’ అని అంటున్నారు శిల్ప. ‘వండర్’ ఫుల్.. జెస్సికా ఆర్కిటెక్చర్ అద్భుతాలపై డిజైనింగ్ ఆవిష్కరణలు చేయడంలో విదేశీ మోడల్, జెస్సికా మినాహ్ స్పెషలైజ్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన జెస్సికా ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నివసిస్తున్నారు. ఐకానిక్ వెన్యూలను అద్భుతమైన క్యాట్వాక్లకు వేదికలుగామలచడం ద్వారా జెస్సికా పేరొందింది. ఈ తరహా వేదికలపై ర్యాంప్‌వాక్‌లు నిర్వహించడానికి అనుమతి ఉన్న ఏకైక ఫ్యాషన్ డిజైనర్ ఈమే. గ్రాండ్ కెన్యన్ స్కైవాక్ (అమెరికా), లండన్స్ టవర్ బ్రిడ్జ్ (యూకే), పెట్రొనాస్ ట్విన్ టవర్స్ స్కై బ్రిడ్జ్ (మలేషియా), కోస్టా అట్లాంటా (దుబాయ్), గార్డెన్స్ బై ది బేస్ ఒసిబిసి స్కై వే (సింగపూర్), సియెనె రివర్ (పారిస్), వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (న్యూయార్క్)లలో ఆమె ఇప్పటిదాకా షోస్ నిర్వహించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. విశేషమేమిటంటే వీటిలో ఇప్పటిదాకా ఒకే ఒక ఇండియన్ డిజైనర్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత సిటీడిజైనర్ శిల్పారెడ్డికి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ షోలో మరో 10 దేశాల నుంచి డిజైనర్స్ పాల్గొంటున్నారు. పల్లెల నుంచి... పారిస్ దాకా... సున్నితత్వాన్ని ప్రతిబింబించే మల్ మల్, గట్టిదనాన్ని చెప్పే ఖాదీల కలయికకు మల్ఖా పేరు పెట్టారు. ఎక్కువగా తెలంగాణ, తక్కువగా ఆంధ్ర రీజియన్స్‌లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది మల్ఖా. మహబూబ్‌నగర్‌లోని బూర్గుల గ్రామం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, ఎల్లంటకుంట, ఖమ్మం జిల్లాలోని పునుకుల గ్రామం అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల, ఈస్ట్‌గోదావరి పులకుర్తిలో తయారవుతుంది. ఈ మల్ఖా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ని తరుణ్తహిల్యానీ, సవ్యసాచి ముఖర్జీ తదితర టాప్ డిజైనర్లు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా మెహిదీపట్నంలోని ఖాదీబోర్డు షోరూం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. - ఎస్.సత్యబాబు -
ఎక్స్పోజర్
కుప్పలుగా పోసి అమ్మే డిజైనర్ దుస్తులు, గుత్తులుగా వేలాడే ఫ్యాన్సీ ఆభరణాలు.. ఎక్స్పో ఏదైనా కావల్సింది ఎన్నుకోవడంలో హైదరాబాదీలు సిద్ధహస్తులైపోయారు. ఇప్పుడు నగరంలోని ప్రతి స్టార్ హోటల్స్, క్లబ్స్.. వగైరాలన్నీ ఫ్యాషన్ సంతలకు వేదికలయ్యాయి. సిటీలో ఎక్స్పోలకు పెరుగుతున్న క్రేజ్ రాష్ట్రం, దేశం ఎల్లలు దాటింది. జాతీయ అంతర్జాతీయ డిజైనర్లు, అమ్మకపుదారులు హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఎక్స్పో అంటే చాలు సై అంటున్నారు. సదరు ఎగ్జిబిషన్స్‌లో స్టాళ్ల కోసం క్యూ కడుతున్నారు. ఈ ట్రెండ్ సిటీలోని ఎక్స్పో నిర్వాహకులకు మరింత ఊపునిస్తోంది. మహా అయితే ఒక్కరోజు.. వీలైతే మూడు రోజుల పాటు సాగే ఈ ఎక్స్‌పోలు రూ. కోట్లలో వ్యాపారం చేస్తుండడంతో పలు రాష్ట్రాలు, దేశాల నుంచీ వ్యాపారులు తరలివస్తున్నారు. ‘హైదరాబాద్‌లో ఎక్స్పో జరుగుతోందంటే వెంటనే స్టాల్ బుక్ చేసేసుకుంటాం. ముంబైలో వ్యాపారం ఎక్కువ చేసినా, స్టాల్కయ్యే వ్యయం అవీ చూసుకుంటే ఇక్కడే లాభం ఎక్కువ. అందుకే మూడేళ్లుగా 6 ఎక్స్‌పోలలో పార్టిసిపేట్ చేశాను’ అని ముంబైకి చెందిన ఓ వ్యాపారి చెప్పారు. మహిళలే నిర్వాహకులు.. సిటీ పేజ్ త్రీ సర్కిల్‌ను ఇప్పుడు బిజీగా మారుస్తున్నవి కేవలం నైట్ పార్టీలూ, క్లబ్ సందళ్లు మాత్రమే కాదు.. ఎక్స్‌పోలు కూడా. దశాబ్దం కిందట కామిని షరాఫ్ ఫ్యాషన్ యాత్ర తప్ప పెద్దగా ఎక్స్పోజర్కు నోచుకోని ఫ్యాషన్ ఉత్పత్తుల ప్రదర్శనలు.. ఇప్పుడు సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటవుతున్నాయి. మహిళల కోసం మహిళల చేత అన్నట్టుండే ఈ ఎక్స్పోలను నిర్వహించడంలో సిటీ వనితలు ముందుంటున్నారు. కామినిషరాఫ్, శశినెహతా, నిఖితారెడ్డి, మనీషాకపూర్.. ఇలా పేజ్ త్రీ సర్కిల్లోని పలువురు ఎక్స్పో నిర్వాహకుల జాబితాలో చేరిపోతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి పాకిస్థాన్ దాకా... కారెవరూ స్టాళ్ల ఏర్పాటుకు అనర్హం అన్నట్టుగా.. పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు నగరంలో జరిగే ఎక్స్పోలకు తరలివస్తున్నారు. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, వ్యాపార పరిమాణం దినదినాభివృద్ధి చెందుతుండడంతో దూరాభారాలు లెక్కచేయకుండా మరీ వస్తున్నారు. పాకిస్థాన్ నుంచి రెడ్జ్, రూమీ ఫ్యాబ్రిక్స్.. వంటి బ్రాండ్స్, ఆఖరికి సౌతాఫ్రికా నుంచి కొరియన్ క్లిప్స్ వంటి సంస్థలూ ఇక్కడికి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. సిటీకి తరలివస్తున్న ఉత్పత్తిదారుల్లో ముంబై, కోల్‌కతా, బెంగళూరుల నుంచి పెద్దసంఖ్యలో ఉంటే, ఢిల్లీ, జైపూర్, చెన్నైల నుంచీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నారు. ఏర్పాటవుతున్న స్టాల్స్‌లో డిజైనర్ దుస్తులు అందులోనూ శారీస్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంటుంటే, ఫ్యాన్సీ జువెలరీ సెకండ్, యాక్సెసరీస్ది థర్డ్‌ప్లేస్. ‘గతంతో పోలిస్తే ఎక్స్‌పోల సంఖ్య బాగా పెరిగింది. ఒకే సమయంలో పలుచోట్ల ఎక్స్‌పోలు ఏర్పాటవుతున్నాయి. అయినా వేరే ఊళ్ల నుంచి వస్తున్న వారి మధ్య స్టాల్స్‌కు పోటీ తగ్గడం లేదు’ అంటున్నారు ఎక్స్పో నిర్వాహకురాలు శశినెహతా. మా సిటీ కన్నా బెస్ట్ మాది బెంగళూరు. తొలిసారి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకెలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ తర్వాత బిజినెస్ పరంగా హైదరాబాద్ ఏమిటో నాకు అర ్థమైంది. మొదట్లో ఏడాదికి ఒకసారి వచ్చేదాన్ని. లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇయర్లీ ట్వైస్ సిటీకి వస్తున్నా. ఇక్కడి ఫ్యాషన్ ప్రియుల టేస్ట్‌కు తగ్గట్టు డిజైన్లు, ఫ్యాబ్రిక్స్ అందించడం నిజంగా ఒక డిజైనర్‌కు సవాల్ లాంటిది. ఐయామ్ ఎంజాయింగ్ ఇట్. ఫ్యాషన్ విషయంలో బెంగళూర్ కన్నా హైదరాబాదే బెస్ట్. - ఆమ్రపాలి, బెంగళూరు ‘బోర్డర్స్’కు ఆర్డర్లు లాస్ట్ ఇయర్ ఫస్ట్‌టైమ్ హైదరాబాద్‌కి వచ్చా. మంచి రెస్పాన్స్ వచ్చింది. సేల్స్ బాగున్నాయి. దాంతో ఈసారీ వచ్చేశాం. శారీస్‌కు డిజైనర్ బోర్డర్స్ మా స్పెషల్. ఇక్కడ మాకు రెగ్యులర్ క్లయింట్లు కూడా ఏర్పడ్డారు. ఫోన్ల ద్వారా ఆర్డర్స్ ఇస్తున్నారు. నె క్ట్స్ ఇయర్ కూడా వస్తాను. అప్‌కమింగ్ డిజైనర్లకు సిటీ ఒక బెస్ట్ చాయిస్. -బీనా జైస్వాల్, ఢిల్లీ డిఫరెంట్ సిటీ ఆరేళ్లుగా ఏడాదికి మూడుసార్లు వస్తున్నా. ఇక్కడ జరిగే ప్రతి టాప్ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేస్తున్నా. హైదరాబాదీలకు ఉన్నంత ఫ్యాషన్ స్పృహ మరెవరికీ లేదేమో!. ఇక్కడి షాపింగ్ టేస్ట్స్ చాలా స్పీడ్‌గా మారుతుంటాయి. ఇక్కడ ఎక్స్‌పోలో పార్టిసిపేట్ చేయడమనేది ఒక డిజైనర్‌ని అలర్ట్ చేసేస్తుంది. రొటీన్ నుంచి బయటపడేస్తుంది. అన్నింటికన్నా హ్యాపీగా అనిపించే విషయం నచ్చిన డిజైన్ కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి సై అంటారు. - రీనా, ఇండోర్ - ఎస్.సత్యబాబు -
సేవ మన తత్వం
‘సేవాతత్పరత అనేది భారతీయుల రక్తంలోనే ఉంది. సేవాగుణంలో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయులు ఇక్కడ పుట్టారు’ అని అంటున్నారు ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు మహేష్‌భట్. నగరవాసి నిర్వహిస్తున్న రైస్ బకెట్ చాలెంజ్‌కు మద్దతుగా తొలుత ఆయన తాజ్ ఫలక్‌నుమా వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆసుపత్రి దగ్గర అన్నార్తులకు బిర్యానీ ప్యాకెట్ల పంపిణీనిప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరణ్ జోహార్‌కు రైస్ బకెట్ చాలెంజ్‌ను విసురుతున్నట్టు ప్రకటించిన ఆయన మాట్లాడుతూ ‘ రైస్ బకెట్ చాలెంజ్ అనే నిరుపేదలకు ఉపకరించే కార్యక్రమం రూపుదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది హైదరాబాదీ కావడం ఈ నగరవాసులు గర్వించాల్సిన విషయం’ అనికొనియాడారు. తెలుగు సినిమా రూపొందించడంపై మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో సినిమా తీసే ఆలోచన లేదు. కాబట్టి, తెలుగు సినిమా తీసే అవకాశం లేదు. అయితే ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులున్న రంగంగా తెలుగు సినీ రంగం మీద నాకు చాలా గౌరవం ఉంది’ అన్నారు. కాగా, శృంగారభరిత చిత్రాలను రూపొందించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘ప్రేక్షకులు వాటినే ఆదరిస్తున్నారు. నేను సిటీలైట్ అనే క్లాసిక్ మూవీ తీస్తే ఎవరూ చూడలేదు. అదే జిస్మ్, మర్డర్.. సూపర్‌హిట్ అయ్యాయి. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువ తీస్తున్నారు. ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలే ఎవరైనా తీయాలనుకుంటారని, వారికి నచ్చని సినిమాలు తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ అనుకోరని’ అన్నారాయన. - ఎస్.సత్యబాబు