ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతారు.
ఒకరి కోసం ఒకరు అన్వేషణ సాగిస్తారు.
పరస్పరం ప్రణాళికలు రచిస్తారు.
పక్కా ప్లానింగ్‌తో కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
ఇదంతా ఎందుకంటారా?
నచ్చింది తినడానికి!
జస్ట్... తినడం కోసం ఇంత అవసరమా?
ఇదేనా మీ సందేహం?
అయితే మీరు....
‘హైదరాబాద్ ఫుడీస్’ సభ్యుల్ని కలవాల్సిందే.
నగరాల్లో రోజుకో రెస్టారెంట్ వెలుస్తోంది. గంటకో మెనూ మారుతోంది. నెక్ట్స్‌వీక్ ఫలానా చోట లంచ్ చేద్దామనో, డిన్నర్ చేద్దామనో ప్లాన్ చేసుకునేలోపే లే‘టేస్’్టకి అడ్రెస్ మారిపోతోంది. అలా నచ్చిన రుచితో జిహ్వ చాపల్యం తీర్చుకున్నామో లేదో ఇలా సరికొత్త రుచుల వాసన నాసికకు రాసుకుంటోంది. ఈ నేపథ్యంలో తినే ప్లేస్‌లను ఎంచుకోవడంలో కన్‌ఫ్యూజన్‌కు చెక్‌పెట్టడానికి, విభిన్నరుచులను ఆస్వాదించడంలో ముందుండడానికి హైదరాబాద్‌కు చెందిన ఆహారప్రియులు చక్కని మార్గం కనిపెట్టారు. రుచుల వేటలో గజి‘బిజీ’గా ఉన్నవారందరినీ కలుపుకుని ‘హైదరాబాద్ ఫుడీస్’ను ప్రారంభించారు.
బిర్యానీని తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో తినాలంటే ఎక్కడని వెతకాలి? హైదరాబాద్ ఫుడీస్‌ని అడగండి. దాదాపు పది సమాధానాలకు తక్కువరావు. అడిగినవారు సిటీలో ఇన్ని ప్లేస్‌లుఉన్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే.
‘‘ఎంత రాత్రయినా, పగలైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు’’ అని ధీమాగా చెప్తారు హర్షిత్. ఆయన హైదరాబాద్ ఫుడీస్ నిర్వాహకుల్లో ఒకరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి బెన్నీసమర్ యాంథాన్ ఆలోచనతో గత ఏడాది ఈ గ్రూప్ ప్రారంభమైంది. స్థానికురాలు కాని బెన్నీ... తక్కువ ధరలో రుచికరమైన ఆహారం దొరికేచోటు కోసం పడిన కష్టాల నుంచి పుట్టిన ఆలోచనే హైదరాబాద్ ఫుడీస్. అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహారం దొరికే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ వేదికకు రూపకల్పన చేశారు.
ఒకరొకరుగా ఈ గ్రూపులో సభ్యుల సంఖ్య నాలుగు వేలకు పైగా పెరగడంతో... నెలకోసారి కలిసేవారు కాస్తా వారానికోసారి కలవడం మొదలైంది. దీనిని సభ్యులంతా ‘ఫుడ్ మీట్’ అని పిలుస్తారు. ఒక్కో మీట్‌కి కనీసం 40 నుంచి 80 మంది హాజరవుతారు. ‘‘ఎక్కడికి వెళ్లాలో ప్లేస్ ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ తర హాలో సీట్స్ ఆఫర్ చేస్తాం. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడి సీట్లు రిజర్వ్ చేసుకుంటాం’’ అని చెప్పారు క్లబ్‌నిర్వాహకుల్లో ఒకరైన సంకల్ప్.
అది ఫైవ్‌స్టార్ రెస్టారెంట్ కావచ్చు లేదా ఫుట్‌పాత్ మీది పానీపురి బండి కావచ్చు.. కాదేదీ విజిట్‌కు అనర్హం అన్నట్టుంటుంది వీరి శైలి. ఈ గ్రూప్‌లో కనీసం 12 నుంచి 60 దాకా విభిన్న వయసులున్న సభ్యులున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి చిరుద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు, చదువుకోవడానికి వచ్చినవాళ్లు... తక్కువధరలో మంచి ఫుడ్ కోసం రోజుల తరబడి చేసే అన్వేషణకు ముగింపు పలకడం కూడా ఈ గ్రూప్ ఏర్పాటుకు దోహదం చేసిందంటారు సంకల్ప్.
‘సరసమైన’ రుచులు...
ఈ మీట్‌లకు ఎంపిక చేసుకున్న రెస్టారెంట్‌కు ఒకేసారి గ్రూప్‌గా వెళతారు కాబట్టి ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గింపు లభిస్తుంది. దాంతో నగరంలో ఈగ్రూప్‌కు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతున్నాయి. తమ ఫుడ్ రుచి చూడమంటూ పలురెస్టారెంట్ల నుంచి వీరికి ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. ‘‘మాకు ఈ విషయంలో అనుభవం ఎక్కువ అనే భావనే దీనికి కారణం. అలాగే మేం మా అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చెబుతాం కూడా’’ అని సంకల్ప్ చెప్పారు. ఈ ఫుడీలకు ఆహారంతో పాటు అందులో కలిపే ముడిపదార్థాలకు సంబంధించి కూడా అవగాహన బాగా ఉంటుంది. ‘‘మన ఆంధ్రా క్విజీన్‌ను మించిన రుచుల సంపద ఎక్కడా ఉండదు. ఏ విదేశీ క్విజీన్‌ను దీనితో పోల్చలేం’’ అని సంకల్ప్ తేల్చేస్తారు.
రాష్ట్రవ్యాప్త టూర్‌లకూ రెడీ...
వివిధ రంగాల్లో ఉన్న వర్గాబ్ భక్షి, సంకల్ప్, రాహుల్ బోస్, హర్షిత్ జైన్, సవ్యసాచి రాయ్ చౌదరిలతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం దీన్ని నడిపిస్తోంది. రెస్టారెంట్ రివ్యూస్ మీద చర్చలు, సరికొత్త రుచుల అన్వేషణ వీరి బాధ్యత. అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్‌హోమ్‌లలో ఉన్నవారికి చక్కని రుచులను ఆస్వాదించే అవకాశం ఇవ్వడానికి వీరు నెలకోసారి చారిటీ ఈవెంట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఈ గ్రూప్ రాష్ట్రవ్యాప్త ఫుడ్‌టూర్‌లు నిర్వహించబోతోంది. ‘‘పసందైన విందుతో పాటు పర్యటనలను కూడా ప్రేమించే వారి కోసం వైవిధ్యభరితమైన ఆహారపు రీతులను ఈ టూర్లలో పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’అని సంకల్ప్ చెప్పారు. అదే విధంగా వైన్ టేస్టింగ్ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేయాలని వీరు నిర్ణయించారు. వెల్‌డన్ ఫుడీస్...
‘ఫుడీస్’ చెప్పిన విశేషాలు...
హైదరాబాద్, ఫిలిమ్‌నగర్‌లో ఉన్న థియా కిచెన్‌లో మెడిటరేనియన్ (ఇటలీ, నార్వే, యూరప్‌లో కొంత భాగంగా ప్రవహించే మెడిటరేనియన్ సముద్రం చుట్టూరా ఉండే దేశాలు) ఫుడ్ లభిస్తుంది.
హైదరాబాద్, మాదాపూర్ దగ్గరున్న చాట్ బజార్‌లో నగరంలోనే ఎక్కడా లేనంత తక్కువ ధరకు చాట్ లభిస్తుంది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న అయ్యప్ప సొసైటీ దగ్గర్లో మామా చికెన్ అనే తోపుడు బండి ఉంటుంది. మన ముందే బొగ్గుల మీద కాల్చి ప్లేట్లో వేసి ఇస్తారు. అద్భుతమైన రుచి... అత్యల్పమైన ధర.
హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ దగ్గర ఫేమస్, బిలాల్ ఐస్‌క్రీమ్ పార్లర్స్‌లో హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తాయి. సీజనల్‌గా లభించే సీతాఫలం ఐస్‌క్రీమ్, సపోటా ఐస్‌క్రీమ్... వంటివి అద్భుతంగా ఉంటాయి. అత్యంత సహజమైన పద్ధతుల్లో తయారయే వీటి ధర రూ.25 నుంచి మొదలని తెలుసా?
- ఎస్. సత్యబాబు
‘ఫుడీస్’కి ఆఫర్లే ఆఫర్లు...
రూ.1600 ఖరీదు చేసే ఫుల్ 5 కోర్స్ మీల్‌ను ఓ రెస్టారెంట్ రూ.450కే వీరికి అందించింది.
ఓ రెస్టారెంట్ వాళ్లు ప్రస్తుతం గ్రూప్ సభ్యుల్లో కొందరికి ఉచితంగా గ్రీకు దేశపు వంటకాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు.
గచ్చిబౌలిలో ఉన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఈ గ్రూప్‌కి రూ.200కే అన్‌లిమిటెడ్ ఐస్‌క్రీమ్స్ అందించారు. అక్కడ ఒక్కో ఐస్‌క్రీమ్ ధర రూ.150కి తక్కువ వుండదు.
ఆహారం కోసం...ఆధునిక మానవుల వేట
Published Mon, Nov 4 2013 11:44 PM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM
Advertisement
Advertisement