
హారతి కర్పూరంలా కరిగిపోతున్న సెంట్రల్ వర్సిటీ భూములు
మొదట ఇచ్చింది 2300 ఎకరాలు.. ఇప్పుడు మిగిలింది 1800
తాజాగా 400 ఎకరాలు వేలం వేసేందుకు నిర్ణయం
భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
అవి వర్సిటీ భూములు కావంటున్న ప్రభుత్వం
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వర్సిటీ భూములను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.
తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్‌సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.
హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్‌సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
మొదటి కేటాయించింది 2,300 ఎకరాలు
హెచ్‌సీయూను సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం 1974లో ఏర్పాటు చేసి 2,300 ఎకరాలు కేటాయించారు. మొత్తంలో టీఐఎఫ్‌ఆర్‌కు 200 ఎకరాలు, ఐఎస్‌బీకి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు ఎఐఏబీకి 100, నిడ్‌కు 30, హెచ్‌సీయూ ఆర్టీసీ డిపోకు 9 ఎకరాలు, ట్రిపుల్ ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. అంతేకాక విద్యుత్ సబ్‌స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ (IIIT) విద్యుత్ కేంద్రం, ఎంఆర్‌ఓ, ఎంఈఓ కార్యాలయాలకు, జీహెచ్‌ఎంసీ (GHMC) వెస్ట్‌జోన్, సర్కిల్ కార్యాలయాలకు, టిమ్స్ ఆస్పత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు. ఇటీవలే టీఎన్‌జీఓ కాలనీకి ఐఎస్‌బీ ప్రహరీని ఆనుకొని లింకు రోడ్డుకు 20 ఎకరాలు కూడా హెచ్‌సీయూ నుంచి సేకరించి పెద్ద రోడ్డు వేశారు.
భూముల విక్రయాలు ఆపాలి
ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విక్రయాలను ఆపాలి. ఇది ప్రభుత్వ విద్య, పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన దాడి. ప్రైవేటు లాభాపేక్ష కంటే ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ హెచ్‌సీయూ క్యాంపస్ అధ్యక్షుడు
ఏకతాటిపై నిలుస్తాం..
హెచ్‌సీయూ ఉన్నత విద్యకు ఒక బ్రాండ్. ఈ విద్యా సంస్థ భూమిని తీసుకోవడం దారుణం. అందరం ఏకతాటిపై నిలిచి వర్సిటీ భూములను కాపాడుకుంటా. ఇప్పటికే చాలా భూమి తీసుకున్నారు. ఇకనైనా ఆపండి.
– జి.కిరణ్‌కుమార్, ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు
ఎంతవరకైనా పోరాడుతాం..
హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. నాణ్యమైన విద్య అందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు మారుపేరైన హెచ్‌సీయూను రక్షించుకుంటాం. ఇప్పటికే ఎంతో స్థలం తీసుకున్నా ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వలేదు.
– అనిల్‌కుమార్, ఏబీవీపీ హెచ్‌సీయూ క్యాంపస్ అధ్యక్షుడు
చదవండి: రూ. 100 కోట్లు విలువ చేసే భూమికి ఎసరు
జీవ వైవిధ్యాన్ని కోల్పోతాం..
ప్రభుత్వ చర్యతో శివారులో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వేలాన్ని రద్దు చేసి హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.
– నాగరాజు, పీడీఎస్‌యూ హెచ్‌సీయూ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment