Prajansam
-
కారుణ్యవాది
మహేశ్ అగర్వాల్‌తో జాగ్రత్తగా ఉండాలి! పిట్టలకీ, పాములకి మనిషి రక్తం సెట్ కాదు కాబట్టి మనల్ని వదిలేశారు కానీ... లేకుంటే వాటిక్కూడా మనచేత రక్తదానం చేయించేవారు! అంత ప్రేమ ఆయనకి... మూగజీవులంటే! పందేల కోసం కోళ్లని, జోస్యాల కోసం చిలకల్ని, పతంగులు ఎగరేసి పక్షుల్నీ... టార్చర్ పెడుతుంటే ఈ న్యాయవాది అస్సలు సహించలేరు. ముందు... వాటికి మందు రాస్తారు. తర్వాత... వాటి తరఫున వాదిస్తారు. ఎనిమిదేళ్లుగా ఆయనకు ఇదే పని. ఇప్పుడూ ఈ పని మీదే సింగపూర్ వెళుతున్నారు. ‘మనుషుల బారి నుంచి మూగప్రాణుల్ని కాపాడ్డం ఎలా?’ అని ప్రసంగించబోతున్నారు. ఆయన మాటల్ని చెవికెక్కించుకుంటే చాలు... మానవ కారుణ్యానికి సంకేతాల్లా వన్యప్రాణులు పదికాలాల పాటు హాయిగా జీవిస్తాయి. ఇదే ఈవారం ‘ప్రజాంశం’. సంక్రాంతి పండగ వస్తోందంటే.. ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాలు మన కళ్ల ముందుంటాయి. కాని మహేశ్ అగర్వాల్‌కి మాత్రం గాలిపటాలకు ఉపయోగించే మాంజా దారాల మధ్య చిక్కుకున్న పక్షులు కనిపిస్తాయి. గాయాలపాలైన పక్షుల వివరాలు తెలిసిన వెంటనే ఆగమేఘాలమీద వచ్చి వాలిపోయి, వాటికి ప్రథమ చికిత్స చేసి, అవి మళ్లీ గాల్లోకి ఎగిరేవరకూ నిద్రపోడు. అలాగే ఎక్కడైనా పాము ఉందని తెలిసినా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. బందీలుగా ఉన్న రామచిలుకలు, పాలపిట్టలు, కుందేళ్లు, తాబేళ్లు... వేటి గురించి తెలిసినా మహేశ్ అగర్వాల్ ‘రెస్క్యూ ఆపరేషన్’ మొదలవుతుంది. వాటిని మళ్లీ వాటి వాటి స్థానాలకు చేర్చిన తర్వాత అతని పని పూర్తవుతుంది. పసితనం నుంచే వన్యప్రాణుల్ని ప్రేమించిన మహేశ్ వాటి మనుగడ కోసం కూడా కృషి చేస్తున్నారు. వన్యప్రాణుల్ని చంపినవారు... పాతికవేలు జరిమానా చెల్లించి, మూడేళ్లు జైలుశిక్ష అనుభవించాలి. అంతేకాదు, వీరికి బెయిల్ కూడా దొరకదు. ఇంత కఠిన చట్టాలున్నా చాలాచోట్ల వీటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరు రంగంలోకి దిగకముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది... అంటారు మహేశ్ అగర్వాల్. ‘‘పదేళ్లక్రితం మార్కెట్లో కూరగాయలతో పాటు కుందేళ్లు, ఉడుములు, పావురాలు, రామచిలుకలు, తాబేళ్లను అమ్మేవారు. మేం కేసులు పెట్టడం మొదలెట్టాక పరిస్థితి మారింది. 2005లో భారత ప్రాణమిత్ర సంఘ్‌లో సభ్యుడిగా చేరాను. అంతకు ముందువరకూ ఒంటరిగానే పనిచేసేవాడిని. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మంది వరకూ సభ్యులున్నారు. రాష్ర్టంలోని అన్నిప్రాంతాల్లో మావాళ్లు అందుబాటులో ఉంటారు. వన్యప్రాణికి హాని జరుగుతోందన్న విషయం తెలిసిన నిమిషాల్లోనే, ఎంతటి మారుమూల గ్రామానికైనా మా వాళ్లు అందుబాటులోకి వస్తారు. మా నెట్వర్క్ వల్ల ఇప్పటివరకూ 1100 పాముల్ని, 93 పాలపిట్టల్ని, 8000 పావురాల్ని రక్షించాం. వీటితో పాటు వందల సంఖ్యలో రామచిలుకలు, నెమళ్లు, కుందేళ్లు, అడవిపందుల్ని కూడా రక్షించాం. మేం వెళ్లేసరికి వాటిని చంపేసినా, బంధించినా వారిపై కేసుల్ని పెట్టించి శిక్ష పడేవరకూ పోరాడాం’’ అని చెప్పారు మహేశ్ అగర్వాల్. ఎడ్వకేట్ కమ్ సేవ... హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మహేశ్‌కి చిన్నప్పటి నుంచీ పక్షులంటే ప్రాణం. ఆ ప్రేమే ఆయనను ఈ సేవాపథంలోకి నడిపించింది. భారత ప్రాణమిత్ర సంఘ్, సహయోగ్ వంటి స్వచ్ఛందసంస్థలలో ఈయన చేస్తున్న సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ‘‘వన్యప్రాణులకు హాని కలిగించకూడదన్న విషయం అందరికీ తెలుసు. కాని వాటికి సంబంధించిన చట్టాల గురించి చాలామందికి తెలియదు. ముందుగా అందరికీ అవగాహన రావడం కోసం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. గాలిపటాలకు మాంజా దారం వాడడం వల్ల ఎన్ని పిట్టలకు గాయాలవుతున్నాయో తెలిపేందుకు చాలా స్కూళ్లకు తిరిగి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎక్కడైనా పాము కనిపించినా మాకు వెంటనే ఫోన్‌కాల్ వస్తుంది. మా రెస్క్యూ టీం వాటిని పట్టుకుని, అటవీశాఖ అధికారులు సూచించిన ప్రాంతాలలో విడిచిపెడుతుంది’’ అంటూ ఈ ప్రాణి ప్రేమికుడు చెప్పే మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఆ ప్రభావమే కావొచ్చు ఇప్పుడు చాలామంది ఇళ్లలో చిలకల పెంపకం తగ్గిపోయింది. పాలపిట్ట...రామచిలుక ఏటా దసరా పండక్కి పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవాలనుకునేవారు అడవిలోని పాలపిట్టల్ని పట్టుకొచ్చి చెట్టుకి కట్టేసి అందరికీ చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. ‘‘పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. పచ్చని చెట్లమధ్య హాయిగా తిరిగే ఈ పక్షి... మనిషి చేతుల్లో పడిందంటే రోజుల వ్యవధిలోనే చనిపోతుంది. చాలామంది వేటగాళ్లు దసరాపండగ ఒక్కరోజు డబ్బు సంపాదనకోసం వాటిని వాడుకుని పడేస్తున్నారు. అందుకే దసరా వచ్చిందంటే మా టీమ్ చాలా అలర్ట్‌గా ఉంటుంది. వీటితోపాటు రామచిలుకల రెక్కలు కత్తిరించి, కాళ్లకు ఫెవిక్విక్ అంటించి, వాటిని జోస్యం చెప్పడానికి ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించేవారు మన కంటపడుతుంటారు. ఆ సమాచారం మాకు అందగానే, వాళ్లను అరెస్టు చేసేవరకూ వదలం. ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల్ని రక్షించి మా చెంతకు చేర్చినవారికి ట్రావెల్ ఖర్చులు ఇచ్చేస్తాం. అలాగే రెగ్యులర్‌గా ఇలాంటి సమాచారం అందించేవారిని ప్రాణమిత్రలో సభ్యులుగా చేర్చుకుంటాం’’ అని వివరించారు మహేశ్. కోడిపందేలు... జంతుబలులు... సంక్రాంతికి గోదావరి జిల్లాలలో జరిగే కోడిపందేల గురించి తెలిసిందే. ఆ జూదగాళ్లపై కేసులు పెట్టాలన్న ఆలోచన ఆచరణలోకి వచ్చేవరకు మహేశ్ అగర్వాల్ నిద్రపోలేదు. ‘‘ఒక పక్క ప్రాణమిత్ర సంఘ్, మరో పక్క సహయోగ్, ఏపి వైల్డ్‌లైఫ్ క్రైమ్ బ్యూరో ఇంకోపక్క... వన్యప్రాణి సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో పోరాడుతున్నాయి. అయినా అక్కడక్కడా దారుణాలు జరిగిపోతున్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే జాతర పేరుతో చేసే జంతుబలులు మరో వైపు... వరంగల్‌లోని సమ్మక్క సారక్క జాతరలో వందల సంఖ్యలో జంతుబలులు ఉంటాయి. ఒకసారి జాతర సమయంలో మా టీమ్ అక్కడ ఏర్పాటు చేసిన ఓ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. ‘ప్రాణి రక్తం చిందించడం వల్లే దేవుడు కరుణిస్తాడనుకుంటే మేకల్ని, దున్నపోతుల్ని బలి ఇవ్వడం దేనికి? మీరే స్వయంగా రక్తదానం చేస్తే మరింత మంచి ఫలితాలను చూస్తారు’ అని చెప్పి అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మా మాటల్ని అర్థం చేసుకున్న కొందరు యువకులు రక్తదానం చేశారు’’ అని చెబుతున్న ఈ న్యాయవాది మాటలు విన్నవారికి వన్యప్రాణులపై తప్పకుండా ప్రేమ పెరుగుతుంది. సింగపూర్ వేదికగా... ఈ నెల 13న సింగపూర్‌లో జరగబోయే ‘ఏసియా ఫర్ యానిమల్స్’ కార్యక్రమానికి మన రాష్ర్టంలో మహేశ్ అగర్వాల్‌కు ఆహ్వానం వచ్చింది. ‘‘భవిష్యత్తులో వన్యప్రాణిపై ఎవరి చెయ్యీ పడకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. మాతో మీరు కూడా చేయి కలిపితే ఆ మూగజీవుల మనుగడకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు... అంటున్న మహేశ్ అగర్వాల్‌తో మనం కూడా చేయి కలిపి, వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకుందాం. - భువనేశ్వరి రెండు రోజులక్రితం అనంతపురం నుంచి ఎవరో అడవిపందుల్ని పట్టుకుని అమ్ముతున్నట్టు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం అక్కడ లోకల్‌గా పనిచేసే వారికి మహేశ్ సమాచారం అందించారు. వారు రెస్క్యూ చేసి అడవిపందుల్ని పట్టుకున్నవారిని అరెస్టు చేయించారు. మనిషికి పాతికవేలు చొప్పున ముగ్గురు నిందితులు 75 వేల రూపాయల జరిమానా చెల్లించారు. -
కొత్త డైరీ
ఇంకొన్ని గంటలయితే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త ఆశలు. కొత్త ఆశ యాలు. అయితే క్యాలెండర్ మారడంతోనే మన జీవితంలోకి కొత్తదనం వచ్చేస్తుందా? గతం గతః అనుకుని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం కేక్ కట్ చేసినంత సులభమా? కాదు. మార్పు అనేది సరిగ్గా ఒకటో తేదీన కాలం మనకిచ్చే బహుమతి కాదు. ఇప్పటివరకూ మన జీవితంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండాలంటే మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ సందర్భంలో నిపుణుల సలహాలు మనకు బాగా ఉపకరిస్తాయి. మన ఆలోచనలకు వారి ఆచరణాత్మకమైన సూచనలు తోడైతే కొత్త సంవత్సరం తప్పకుండా మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. పిల్లల పెంపకం నుంచి వృద్ధుల పట్ల మన బాధ్యత వరకూ ఏడు అంశాలపై ప్రముఖ మానసిక వైద్యులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారిక్కడ. వాటిని మనసు అనే మీ కొత్త డైరీలో రాసుకుని న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పండి. జీవితంకల కాదు పెళ్లయిన నెల రోజుల్లోనే విడాకులు కోరుతూ క్యూ కడుతున్న కొత్తదంపతుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లికి ముందే భవిష్యత్తుపై రంగురంగుల కలలు కని పెళ్లి తర్వాత అలా లేని జీవితం అక్కర్లేదని విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు డాక్టర్ పద్మ పాల్వాయి. ‘‘పెళ్లయిన కొత్తలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్నింటికీ విడిపోవడం పరిష్కారం కాదు. ముందుగా మీరు చేయాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం, మీ విషయాల్లోకి మూడోవ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం. భార్యాభర్తల విషయంలో తలుపులు తీస్తే సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని కోరుకోవడం పొరపాటు. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకోవడం సరైన పద్థతి. అన్నింటికీ ప్రేమ, సహనం అనే ఆయుధాల్ని ఉపయోగిస్తేనే పని జరుగుతుంది’’ అంటారు ఆమె. ఓడిపోవడం తప్పు కాదు పదో తరగతి పరీక్ష ఫలితాలు తెలిసిన మర్నాడు ‘విద్యార్థి ఆత్మహత్య’ అని వార్తాపత్రికల్లో మూడునాలుగు వార్తాకథనాలైనా కనిపిస్తాయి. కోరుకున్నది దక్కనపుడు, అనుకున్నది చేయలేనపుడు, వేధింపులకు తట్టుకోలేనపుడు ‘ఆత్మహత్య’ ఒక్కటే మెడిసిన్ అనుకుంటున్నారు కొందరు. ఓర్పులేని వాడు మాత్రమే సూసైడ్ మంత్రాన్ని జపిస్తాడంటున్నారు డాక్టర్ ఎస్‌ఆర్‌ఆర్‌వై శ్రీనివాస్. ‘‘బాధని భరించడం, కోపాన్ని అణుచుకోవడం వంటి లక్షణాల్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. విజయం సాధించినపుడు ఆకాశానికి ఎత్తడం, ఓడిపోయినపుడు పాతాళంలోకి తొక్కడం తల్లిదండ్రుల నుంచే మొదలవ్వడం వల్ల ఈ రోజు యువత ఏ సందర్భాన్నీ తట్టుకోలేకపోతోంది. వారు నేర్చుకోవలసిన మొదటి వాక్యం ‘ఓర్పు’ అంటున్నారు. కీడెంచడం తప్పు కాదు ఈరోజు తల్లిదండ్రుల కళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్... బయటికెళ్లిన అమ్మాయి ఇంటికి క్షేమంగా తిరిగి రావడం. మృగాళ్లు సంచరిస్తున్నచోట తమ బిడ్డల మనుగడ ఎలా? అంటూ గుండెల్ని పట్టుకుంటున్న తల్లిదండ్రులు ఆడపిల్లలకు రకరకాల జాగ్రత్తలు చెప్పి భయపెట్టడం కాదంటారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి. ‘‘జరుగుతున్న సంఘటనల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని త్వరగా ఇంటికి చేరుకోమని చెబుతున్నారే కాని అలాంటి సంఘటనలు ఎదురైనపుడు ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి, చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి...వంటి విషయాలపై అవగాహన పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి సందర్భాల్ని అయినా ఎదుర్కొనాల్సి రావొచ్చు. అతిజాగ్రత్తలు చెబుతూ అమ్మాయిల్ని మరింత పిరికివారిగా మార్చేకంటే శారీరకంగా, మానసికంగా వారిని దృఢంగా మార్చడం ఉత్తమం’’ అని చెప్పారాయన. అవసరం తర్వాతే కోరికలు ‘డబ్బుంటే జీవితంలో సగం సమస్యలుండవు’ అనే మాట వినే ఉంటారు. ఉన్న డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో తెలియక వచ్చే సమస్యలు లెక్కలేనన్ని. వీటిని డబ్బుతో కొనితెచ్చుకున్న సమస్యలు అనవచ్చంటారు డాక్టర్ ప్రశాంత్ ‘‘మొన్నీమధ్యే బడ్జెట్ గురించి తగవులాడుకుంటున్న భార్యాభర్తలిద్దరు నా దగ్గరకు వచ్చారు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బు విషయంలో ఇద్దరికీ పొత్తు కుదరక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్య ఇద్దరి సంసారజీవితాన్ని నాశనం చేసేవరకూ వెళ్లింది. నాలుగు లక్షలయినా, నాలుగు వేలయినా ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అర్థం చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. వీలైనంతవరకూ పెద్ద బడ్జెట్ల వివరాలు రాసిపెట్టుకోవడం మంచిది. సంపాదన ఎంతైనా మీరు వేసే బడ్జెట్ ప్లాన్ లక్ష్యం ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండేలా ఉండాలి’’ అంటారు డాక్టర్ ప్రశాంత్. మీకోసం మీరు మారండి జీవితంలో నష్టపోయిన వారి డైరీలో వ్యసనం తాలూకు వాసనలు ఉంటాయి. పొగ తాగడం, మద్యం సేవించడం...ఈ రెంటి నుంచి బయటపడడానికి తొంభైతొమ్మిది ముహూర్తాలు దాటిపోయినవారిని చాలామందిని చూస్తుంటాం... అంటున్నారు డాక్టర్ ఫణి ప్రశాంత్. ‘‘అమ్మకోసం, భార్యం కోసం, పిల్లల కోసం వ్యసనాలు వదులుకోవాలనుకునేవారు మాట మీద నిలబడడం కష్టం. నిజంగా మీరు రేపటి నుంచి వ్యసనాల్ని వదిలేయదల్చుకుంటే ముందుగా మీరు నష్టపోయినవాటి గురించి తెలుసుకోండి. సమయం, ఆరోగ్యం, కుటుంబం, తెలివితేటలు, అనుబంధాలు... ఇలా ఇన్నిరోజుల్లో మీరు కోల్పోయిన ప్రతి చిన్న విషయాన్ని వివరంగా తెలుసుకోండి. వీలైతే ఓ డైరీలో రాసుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే మీ జీవితంపై మీరు ఓ పరిశీలన చేసుకోండి. అప్పుడు మానాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోండి. మీకు మీరుగానే మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే దానికి తిరుగుండదు ’’ అన్నారు. ఈ రాత్రికే ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది మీరు పోగొట్టుకున్నవన్నీ మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం. మనమే మలుపు తిప్పుకోవాలి టర్నింగ్ పాయింట్ అనే మాట వినే ఉంటారు. నిజానికి జీవితం మలుపు తిరగదు. మనమే నడవాలి, మనమే పరిగెత్తాలి, మలుపు కూడా మనమే తిరగాలి. ఆ మలుపు మన తలపుల్ని బట్టి ఉంటుందంటారు డాక్టర్ మయూర్‌నాథ్‌రెడ్డి. ‘‘ఉద్యోగాల గురించి చదువుకునే వయసునుంచే కలలు కనడం, ఆ కల తీరకపోతే జీవితం ముగిసిపోయినట్టు ఫీలయిపోవడం యువతలో అక్కడక్కడా చూస్తున్నాం. నిజానికి ప్రయత్నించేవారికి, కష్టపడేవారికి బోలెడు ఉపాధి అవకాశాలున్నాయి. చదువు పూర్తవ్వగానే మన చుట్టూ ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవాలి. నాకు తెలియని విద్య కదా అనుకుని చాలామంది తమకొచ్చిన అవకాశాల్ని వదులుకుంటుంటారు. అవకాశం వచ్చినచోట మీకున్న తెలివిని చూపించండి. జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తొందర పడకండి’’ అని చెప్పారు మయూర్‌నాథ్‌రెడ్డి. పెద్ద మనసు చేసుకోండి కొడుకుకోడళ్లిద్దరూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ‘అమ్మా’, ‘అత్తయ్యా’ అంటూ ఆప్యాయంగా పలకరించి ఓ పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడతారని ఎదురుచూసే పెద్దలు అందరి ఇళ్లలో కనబడతారు. అలా పలకరించి ప్రేమను పంచే పిల్లలెంతమంది ఉన్నారు... అంటున్నారు డాక్టర్ నరేష్ వడ్లమాని. ‘‘మా పిల్లల ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమంలో ఉండడం మేలనే వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బిజీలైఫ్‌లో బంధాల గురించి ఆలోచించే తీరిక కరువైంది. అమ్మానాన్నల దగ్గర కాసేపు కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక ఎవరిలోనో గాని కనిపించడం లేదు. అలాగని పెద్దల్ని పక్కనపెట్టకూడదు. కనీసం వారానికొకసారైనా ‘అమ్మా’,‘నాన్నా’ అంటూ దగ్గరకెళ్లి నాలుగు మాటలు చెప్పండి. ఓపిక లేకపోతే వారు చెప్పేది వినండి. అమ్మానాన్నలు దూరంగా ఉంటే రెండురోజులకొకసారైనా ఫోన్ చేసి బాగున్నారా... తిన్నారా అంటూ క్షేమాలడగండి. ఆ పని రేపటి నుంచే మొదలుపెట్టండి’’ అని డాక్టర్ నరేష్ ఇచ్చిన సలహా చాలా విలువైంది. అది పాటించడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు మీ మీద పడకుండా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. - భువనేశ్వరి -
జీవిత ధీమా!
జీవితంలో సక్సెస్ అంటే ఏమిటి? ఇంగ్లిష్ మీడియంలతో గట్టెక్కడమా? ఇంజనీరింగ్ పట్టాలతో ఒడ్డెక్కడమా? సెక్యూర్ జాబ్‌ని దక్కించుకోవడమా? కానీ సక్సెస్ అంటే ఇవి మాత్రమే కాదంటున్నారు వెంకటేశ్వరరావు. పుట్టిపెరిగింది పల్లెటూరైనా... చదువులు చెట్టెక్కిపోయినా... తాను ఉట్టికెగరలేనేమోనని నిరాశపడని నిత్య ఆశావాదంతో ఏకంగా భూతల స్వర్గం అనుకునే అమెరికాకు ఎగిరారు. అక్కడి క్లయింట్లను కూడా అవలీలగా ఆకట్టుకున్నారు. లక్ష క్లయింట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈయన కోట్ల కమీషన్‌తో ఫోర్బ్స్ మ్యాగజీన్లో స్థానం పొందారు. కోటీశ్వరుల సరసన తానూ ధీమాగా నిలబడ్డారు. ఆ పాలసీ బీముడి వాస్తవ కథ... ఆ జీవితభీముడి విజయగాథ... నేటి ప్రజాంశంలో... రెండు వేల మంది క్లయింట్స్... 40 దేశాల్లో కార్యకలాపాలు... ఏటా కోట్లరూపాయల ఆదాయం... రాష్ట్ర రాజధానిలోని నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు... 1.89 కోట్లు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్... ఇవన్నీ ఉన్నాయంటే అతనొక బిజినెస్ టైకూనో, బడాబడా సంస్థ సీఈఓనో అనుకుంటున్నారా! కానే కాదు... ఆయన ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. యథాలాపంగా ఎల్ఐసీ ఏజెన్సీ తీసుకుని... ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. గడిచిన ఏడాది 2 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ పొందారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజీన్లో గతనెల (నవంబర్) స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివసిస్తున్న ఎల్ఐసీ ఏజెంట్ వాకలపూడి వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా కలిసినప్పుడు తన విజయప్రస్థానాన్ని ఇలా వివరించారు. అది ఆయన మాటల్లోనే... ఇంగ్లిష్ మీడియంలో చదవలేక... ఇంజినీరింగ్‌లో ఫెయిలై... మాది పశ్చిమ గోదావరిజిల్లా తణుకు సమీపంలోని కాల్దరి గ్రామం. ఇంటర్మీడియట్ తరవాత ఇంజనీరింగ్ కోసం 1986లో హైదరాబాద్ వచ్చాను. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో కొనసాగిన చదువు ఒకేసారి ఆంగ్లమాధ్యమంలోకి మారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వరుసగా మూడేళ్లు ఫెయిలయ్యాను. దాంతో మా నాన్నగారు ఫీజు కోసం డబ్బు పంపడం మానేశారు. ఇంటికి వచ్చేసి, వ్యవసాయం చేయమన్నారు. అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. తిరిగి వెళ్లడం ఇష్టం లేక రూ.50 వేల రుణంతో సికింద్రాబాద్‌లో నోట్‌బుక్ తయారీ యూనిట్ ఒకటి ప్రారంభించాను. దాంట్లో నష్టాలు రావడంతో మూడేళ్ల తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మారాను. 1997లో నాన్నగారు మరణించడంతో వైజాగ్ వెళ్లి పౌల్ట్రీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి 2005 వరకు ఇదే వ్యాపారం చేస్తూ దూరవిద్య ద్వారా ఎం.ఏ. పూర్తి చేశాను. ఈ వ్యాపారం రెండుమూడేళ్లు బాగున్నా... ఆ తరవాత అందులో కూడా నష్టాలే వచ్చాయి. ఏజెంట్‌గా మారతానని ఊహించలేదు నెలకు 50 వేల రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం ఎల్ఐసీ పాలసీ గురించి నన్ను సంప్రదించారు. వారి కోసమని, నా చేత పాలసీలు చేయించిన ఏజెంట్‌ను రమ్మన్నాను. అయితే అతను రెండు నెలలైనా రాలేదు. ఒకవైపు స్నేహితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి. అప్పటి కొవ్వూరు ఎమ్మెల్యే కృష్ణబాబు గారి ప్రోద్బలంతో నేనే ఏజెంట్‌గా చేరాను. ప్రోద్బలం అనడం కన్నా... ఓ రకంగా ఒత్తిడి చేశారనవచ్చు. నిజానికి ఆయన మాట కాదనలేక ఏజెన్సీ తీసుకున్నాను. నా మిత్రులు ఆరుగురికి పాలసీ చేసిన తరవాత, నేను ఏజెంట్‌గా తగనని భావించి, కొద్దో గొప్పో తెలిసిన పౌల్ట్రీ వ్యాపారంలోకి మళ్లీ వెళ్లాను. మలుపుతిప్పిన జీవన్‌శ్రీ ఎల్ఐసిలో బాగా పాపులరైన జీవన్‌శ్రీ పాలసీ 2001లో క్లోజ్ అవుతున్న సమయంలో... మా డెవలప్మెంట్ ఆఫీసర్ రఘు పట్టుబట్టి, పాలసీలు చేయమని నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆ పాలసీ చేయడానికి జనం ఎగబడుతుండటంతో... ఆఖరి 15 రోజుల్లో 4.5 కోట్ల రూపాయల వ్యాపారం చేశాను. ఇది నన్ను అమెరికా బాట పట్టించింది. అక్కడి ఎండీఆర్టీఏ సభ్యుడిగా 2002లో మొదటిసారిగా అమెరికా వెళ్లాను. లాస్‌వెగాస్‌లో సెవెన్ స్టార్ హోటల్లో బస ఏర్పాటుచేశారు. (ఎండీఆర్టీఏ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్. ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏజెంట్స్/అడ్వయిజర్స్‌ను ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు ఎండీఆర్టీఏకి నామినేట్ చేస్తాయి. ఆయా రంగాలలో అభివృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణలను అది ఇస్తుంది). అప్పటివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నా దృష్టిలో పంచెకట్టుకుని, డొక్కువాహనంపై, ఫైలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారే. జీవన్‌శ్రీ పుణ్యమాని రూ.4.5 కోట్ల వ్యాపారం చేసినా, నా దృష్టి మారలేదు. అయితే లాస్‌వెగాస్ పర్యటన నా ఈ దృక్పథాన్ని మార్చేసింది. అక్కడ నుంచి తిరిగి వచ్చాక, ఎల్ఐసీ ఏజెన్సీతో పాటు పౌల్ట్రీ వ్యాపారం కూడా కొనసాగించాను. 2005లో మా అమ్మ మరణించారు. పౌల్ట్రీ వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. దాంతో పూర్తిస్థాయి ఎల్ఐసీ ఏజెంట్‌గా మారాను. ఇక వెనుతిరిగి చూడలేదు. స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసి... ఆర్థికంగా వెనుకబడి ఉన్న పల్లె ప్రజలను ఆదుకోవాలనుకున్నాను. దీనికోసం నా స్నేహితులు, క్లయింట్ల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాను. ఐఎస్బీలో నేర్చుకున్న విషయాలతో పాటు ప్రొఫెసర్ల సాయంతో ఆ ఐఎస్బీకే కోర్సు రూపొందించి, అక్కడ ఎన్నో అంశాలను బోధిస్తున్నాను. ఏజెంట్లకు గర్వకారణం అనేదే సంతృప్తి నన్ను, నా స్థాయిని చూసి ఎన్నో రంగాలకు చెందిన వారు ఎల్ఐసీ ఏజెంట్స్‌గా మారారు. ఇది అన్నింటికంటే తృప్తినిస్తోంది. నా దగ్గర ఒకసారి పాలసీ చేసినవాళ్లు నా కుటుంబంగా మారిపోతారు. వారివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను... అంటూ సంతృప్తిగా ముగించారు వెంకట్. ఆంగ్లమాధ్యమంలో చదవలేక చదువుకే దూరమైన వ్యక్తి దాదాపు 40 దేశాలు తిరిగి, ఎల్ఐసి వంటి అతిపెద్ద సంస్థ తరపున బిజినెస్ స్కూల్‌కు కోర్సు డిజైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనాన్ని విశ్లేషిస్తే... తన బలాన్ని గుర్తించిన మనిషికి అదే బలంగానూ, ఆ నిత్యవిజయ కాంక్షే అతిపెద్ద బలహీనతగా మారుతుందనే వాస్తవం మనకు అవగతమవుతుంది. - శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ విక్టోరియాస్ విన్నర్స్సీక్రెట్నే ఫాలో అయ్యాను విక్టోరియా యుద్ధవీరులు పడవలపై యుద్ధానికి వెళ్లినప్పుడు రాత్రి వేళ తీరాన్ని చేరుకుంటారు. ఆ వెంటనే వారు వచ్చిన పడవల్ని కాల్చేస్తారు. దీంతో యుద్ధరంగం నుంచి మడమతిప్పే అవకాశం ఉండదు. కేవలం డూ ఆర్ డై ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. ఆ స్థితి వారిలోని పోరాట పటిమను పెంచుతుంది. దీన్నే విక్టోరియాస్ విన్నర్స్ సీక్రెట్ అంటారని అమెరికాలోని ఎండీ ఆర్టీఏ (మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్)లో బోధించారు. ప్రతి ఏడాదీ ఇలాంటి గోల్‌నే ఏర్పాటు చేసుకుంటాను. 2020 నాటికి ప్రతి వ్యక్తికీ ఓ పాలసీ ఉండాలన్నది ఎల్ఐసీ లక్ష్యమైతే, ఈ లోపే లక్ష పాలసీలు పూర్తి చేసి మరో రికార్డ్ సృష్టించాలనేదే నా గోల్! -
కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు
జీవితం ఒక తియ్యని వేడుక. అందరికీనా? అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ! పిల్లల్లో కలిసిపోతే... పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది. స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం... ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది. అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు! సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్... చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి... అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయో! ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’. అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే... ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం... సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు... చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు. క్యాండిల్ దగ్గర నుంచి వెల్కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు... అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే... బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్. స్కూలు ఆలోచన... అమెరికాలో ఎమ్ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు. మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు... ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి... పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది. ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం... చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్... వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్. తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్. అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’ - శ్రీవ్యాల్ -
మానవసేవే...మహాసేవ..!
వైద్యుడిని దేవుడిలా చూస్తుంది సమాజం! సేవలో దేవుణ్ణి చూశారు, దేశాన్ని చూశారు ఈ వైద్యుడు! ఎంతో పవిత్రమైనదని చెప్పే ఈ వృత్తిని... అంత పవిత్రంగానూ నిర్వర్తించారు ఈ డాక్టర్!!. ‘నీ కోసం చేసుకున్న గొప్ప పని కంటే ఇతరుల కోసం చేసిన మంచి పని ద్వారా కలిగేదే అసలైన ఆనందం’ అంటూ ఎన్సిసి నేర్పించిన పాఠాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన ఆచరణశీలి ఈయన. కార్గిల్‌లో ఈయన చేసిన దేశసేవ మనకు అతిశయం. మనలాంటి మానవులకు సేవ చేయడం ఈయన ఆశయం. తాడికొండ గురుకులపాఠశాలలో చదువుకున్న పాఠాలే తన జీవితాన్ని నడిపించాయంటారు డాక్టర్ అశోక్. జీవితంలో అత్యంత ఆనందాన్నిచ్చేది దేశసేవ మాత్రమేనన్న ఈయన నమ్మకాన్ని అధ్యాపక వృత్తిలో ఉన్న అమ్మ సావిత్రి, నాన్న వైపీరావులు ప్రోత్సహించారు. డాక్టర్ అశోక్ 22 ఏళ్లు దేశరక్షణ వ్యవస్థలో పనిచేశారు. జమ్ము-కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్... అనేక రాష్ట్రాల్లో దేశ సరిహద్దులో ఉద్యోగం చేసి, చెన్నైలో లెఫ్టినెంట్ కల్నల్‌గా రిటైరయ్యారు. 1985 నుంచి 2007 వరకు సాగిన ఆర్మీ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు, ఆర్మీలో జీవితానికి, సాధారణ పౌరుడుగా జీవితానికి మధ్య తేడా ఆయన మాటల్లోనే... అప్పటి కాశ్మీర్! ‘‘మాది కృష్ణాజిల్లాలోని రేమల్లె గ్రామం. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత 1985లో ఆర్మీలో చేరాను. 1990 నుంచి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒక ఉగ్రదాడి జరిగేది. ఆ ఘాట్‌రోడ్లలో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం మా ఉద్యోగం. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు, అందులో గాయపడిన వారికీ వైద్యం అందాలి. కాబట్టి ఆర్మీ డాక్టరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, స్థానికులకు వైద్యం చేయడం మా విధి కాదు కానీ ఆసక్తి ఉంటే చేయవచ్చు. నా డ్యూటీ పూర్తయిన తర్వాత గ్రామాలకు వెళ్లి వైద్యం చేసేవాడిని. నేను అనస్థీషియాలజిస్ట్ని, కానీ ఎంతోమందికి పురుడుపోశాను. ప్రాణాపాయంలో ఉన్న వారికి చికిత్స చేశాను. చేయగలిగినంత చేయాలనే తృష్ణతో చేశాను. పొరుగుదేశ సైనికుడైనా ప్రాణం పోయాల్సిందే! మాకు కూడా మిలటరీ ట్రైనింగ్ ఇస్తారు. మిలటరీ వ్యక్తులకు వైద్యం చేయడం విధ్యుక్తధర్మం, స్థానికులకు సేవ చేయడం ద్వారా సైన్యం పట్ల వారిలో విశ్వాసాన్ని పెంచవచ్చు. పొరుగుదేశపు సైనికుడికైనా సరే వైద్యం చేయాల్సిందే... ఇందులో మొదటిది మనిషి ప్రాణం కాపాడడం డాక్టర్ ధర్మం. ప్రాణం కాపాడితే ఆ కృతజ్ఞత వారికి ఉంటుంది. ఆ వ్యక్తితో స్నేహసంబంధాలు పెంచుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాల వివరాలు సేకరించవచ్చు. దేశరక్షణలో ఇదో భాగం. యూనిఫామ్‌కు దూరం! నా కళ్లు చెమర్చిన రోజది. 2007, డిసెంబర్ 16 వతేదీ వరకు పనిచేశాను, 17న మా పై అధికారి... ‘మీరు రిటైర్ అయ్యారు, ఇక యూనిఫాం ధరించక్కర్లేద’ని చెప్పినప్పుడు కళ్లనీళ్లొచ్చాయి. నేను రిటైర్ కావాలనే నిర్ణయం తీసుకునేటప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ నుంచి కల్నల్‌గా ప్రమోషన్‌కు నా పేరు ఖరారైంది. కల్నల్ అయితే వైద్యం చేయడానికి వీలుండదు, కార్యనిర్వహణ విధులకే పరిమితం కావాలి. అదే సమయంలో మా పేరెంట్స్ దూరమయ్యారు. ఆ సమయంలో రక్షణ రంగాన్ని వదులుకున్నాను. సామాన్య పౌరునిగా... అదేరోజు తడ చెక్‌పోస్టు దగ్గర అలవాటుగా ఐడీకార్డు చూపించాను. ‘ఇది ఎక్స్‌సర్వీస్‌మన్ కార్డు, రాయితీలు ఉండవు’ అన్నారు. నేను చెల్లించాల్సింది పాతిక రూపాయలే కానీ నేను సాధారణ పౌరుడిని అని తెలియచెప్పిన సంఘటన అది. నిన్నటి వరకు నేను పొందిన గౌరవం నా యూనిఫామ్దే తప్ప నాది కాదు. ఇక నాకు నేనుగా నన్నో గౌరవప్రదమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చుకున్నాను. నాలోని ప్రత్యేకతలకు మెరుగుపెట్టాను. పిల్లల్లో, పెద్దవాళ్లలో దేశభక్తిని పెంపొందించే ప్రశ్నోత్తర పోటీలు (క్విజ్) నిర్వహిస్తున్నాను. లావాదేవీ లేని బంధం! పేషెంటుకి, డాక్టర్‌కి మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. నేను రక్షణ వ్యవస్థలో ఉద్యోగానికి వెళ్లడానికి ఇది కూడా ఒక కారణమే. ఆర్మీలో విపరీతమైన ఎండలు, గడ్డకట్టుకుపోయే చలి, ఎప్పుడైనా దాడి జరిగే నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని ఉద్విగ్నత మధ్య జీవిస్తాం. ఎవరికైనా ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు పక్కవారితో విభేదాలు ఉండవు. ఒకవేళ అప్పటి వరకు ఉన్నా వాటిని ఆ క్షణంలో మరచిపోయి స్నేహితులవుతారు. పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు. పుట్టిన రోజులకు ఇరుగుపొరుగు కూడా హడావిడి చేసేవారు. అదే ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటే ‘ఇన్నేళ్లు వచ్చాక ఇంకా పుట్టినరోజు చేసుకోవడమేంటి’ అని నవ్వుకుంటారు. మన ఇంట్లో లేనివి వాళ్ల ఇంట్లో ఏమేమి ఉన్నాయో బేరీజు వేసుకుని స్నేహం చేసే వాతావరణం అక్కడ ఉండదు. ‘ఆర్మీలో ఉన్నప్పుడే బాగుంది’ అని నా భార్య విజయలక్ష్మి ఇప్పటికీ అంటోంది. నా పిల్లలు స్నిగ్ధ, స్పందన కూడా అప్పటి జీవితాన్ని ఆనందక్షణాల్లాగా గుర్తు చేసుకుంటుంటారు’’. డబ్బుసంపాదనలో మునిగిపోతే ఇన్ని ఆనందాలను కోల్పోయేవాడినంటారు డాక్టర్ అశోక్. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దానిని పంచడం ఆయన సిద్ధాంతం. - వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అది 2000 సంవత్సరం డిసెంబర్... సురాన్‌కోట్ గ్రామం. అర్ధరాత్రి రెండు గంటలప్పుడు నొప్పులు పడుతోన్న మహిళను మంచం మీద తెచ్చారు. బిడ్డ అడ్డం తిరిగింది. సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. మాకు గైనకాలజీ విభాగం ఉండదు. ఆ కేసు తీసుకోవడానికి ఆర్మీ సర్జన్ సుముఖంగా లేరు. ‘నేను అనస్థీషియా నిపుణుడిగా చాలా సిజేరియన్ కేసులు చూశాను. ప్రతి స్టెప్ చెప్తాను చేయండి’ అని భరోసా ఇచ్చాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీశాం. అప్పుడా గ్రామస్థుల సంతోషం అంతా ఇంతా కాదు. - డాక్టర్ అశోక్, రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి -
వైకల్యానికి కొత్త అర్థం...సంకల్పబలం!
వైకల్యం అంటే ఏమిటి? చూపు లేకపోవడమా? చూడలేకపోవడమా? చూడలేకపోవడమే కదా? అలాగైతే, అంధులు వికలాంగులు కారు. మనోనేత్రంతో వారు అన్నీ చూడగలరు. వైకల్యం అంటే ఏమిటి? కాళ్లూచేతులూ లేకపోవడమా? లేనట్లు ఉండిపోవడమా? లేనట్లు ఉండిపోవడమే కదా! అలాగైతే అవిటివాళ్లు వికలాంగులు కారు. కార్యదీక్షతో వారు పరుగులు తీయగలరు. ఈ ‘స్పెషల్ ఎబిలిటీ’స్ ఇక్కడితో పూర్తి కాలేదు. వీరిలో కొందరు చక్కగా పాడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. సృజనాత్మకంగా బొమ్మలు గీస్తున్నారు. ఇలా రకరకాల నైపుణ్యాలను వెలికితీసి, వైకల్యం అంటే సంకల్పబలం తప్ప మరొకటి కాదని రుజువు చేసేందుకు కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేస్తున్న కృషి... పడుతున్న ప్రయాసే... ఈరోజు ప్రజాంశం! ‘‘వీల్‌చైర్‌ని డిజేబిలిటీకి సింబల్‌గా కాదు ఎబిలిటీకి చిహ్నంగా మార్చాలనుకున్నాను. మా పిల్లల్ని డిజేబుల్డ్ అనొద్దు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనండి’’ అంటారు సయ్యద్ సలావుద్దీన్ పాషా. విభిన్న రకాల శారీరక, మానసిక సమస్యలున్న యువతీ యువకులను ఒకచోట చేర్చి ఓ గొప్ప కళాకారుల బృందంగా తీర్చిదిద్దారు ఈ ఢిల్లీవాసి, నృత్యనిపుణులు పాషా. ఈ బృందం పలుమార్లు హైదరాబాద్‌లో సైతం తమ వీల్‌చైర్ విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పాషా మాట్లాడారు. తాను ముస్లిం కాబట్టి హిందూ సంప్రదాయ నృత్యాన్ని నేర్పడానికి మొదట్లో ఓ గురువు నిరాకరించారని, అయితే ఆ తర్వాత ఎందరో నృత్యగురువులు తనను వారి ప్రియశిష్యుడిగా భావించారని గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ నృత్యాల్లో అందెవేసిన చేయి అయిన పాషా ఆ నైపుణ్యాన్ని వికలాంగులను తీర్చిదిద్దడానికి వినియోగిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. లోపాలే ఇంటిపేర్లా... ‘‘దేశంలో ఏడు కోట్లమంది శారీరక, మానసిక లోపాలున్నవారు ఉన్నారు. గ్రామాల్లో ఈ లోపాల్ని శాపాలుగా, గత జన్మ పాపఫలితంగా భావిస్తారు. విధివశాత్తు లేదా ప్రమాదవశాత్తూ ఏర్పడ్డ బాధల్ని ఇంటిపేర్లుగా మార్చేసి గుడ్డిరమేష్, కుంటి దానయ్య, పిచ్చిపుల్లయ్య... అంటూ అవమానకరంగా పిలుస్తారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పాషా... 30 సంవత్సరాలుగా వికలాంగుల సేవలో ఉన్నారు. వైకల్యబాధితులను విజయ వంతమైన కళాకారులుగా తీర్చిదిద్దాలనే ఆయన కసిలో నుంచి రూపుదిద్దుకున్నదే‘ఎబిలిటీ అన్లిమిటెడ్’ సంస్థ. ఈ బృందంలో అంధులు, మూగ, చెవిటి, పోలియో, డిజ్లెక్సియా, సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం బాధితులు ఎందరెందరో ఉన్నారు. క్రచ్‌లు, వీల్చైర్లతోనే అనితరసాధ్యమైన ప్రదర్శనల ద్వారా గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లను ఈ బృందం స్వంతం చేసుకుంది. అమెరికా, కెనడా, వెస్ట్ ఇండీస్ సహా బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ కామన్స్లోనూ ప్రదర్శన ఇచ్చింది. ‘‘ప్రారంభంలో ఈ సంస్థ మనుగడను ఎవరూ విశ్వసించలేదు. ‘వికలాంగుల నృత్యరూపకమా? ఇదెలా సాధ్యం?’ అన్నారు. దీనిని సాకారం చేయడం కోసం స్వయంగా రోజుకి 10 గంటల పాటు వీల్‌చైర్ మీద సాధన చేసి మరీ, సాధ్యం చేశాను. మా బృందం ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు నా బృందంలో 160 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారు’’ అంటూ సగర్వంగా చెప్పారాయన. వైకల్యం నుంచి విజయాల బాట... ‘‘అచ్చం ఆ కృష్ణభగవానుడిలాంటి గురూజీ సారథ్యంలో నన్ను నేను అర్జునుడిలా భావిస్తున్నాను’’ అంటాడు మనోజ్. వీల్‌చైర్‌తో కాలం వెళ్లదీయాల్సిందేనని భావించిన మనోజ్‌ని భారతదేశపు తొలి డిజేబుల్డ్ డ్యాన్స్ట్రూప్లో సభ్యత్వం... తన కాళ్లమీద తాను నిలబడి విజయవంతమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. ‘‘నృత్యం నాకు సరికొత్త జీవితాన్నిచ్చింది’’ అంటున్న పోలియో బాధితుడు గుల్షన్‌కుమార్ ఒక నిమిషంలో 63 స్పిన్స్ (మెలికలు) తిరగడం ద్వారా వ్యక్తిగత గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఈ బృందంలో ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల దాకా విభిన్న వయసుల వికలాంగ కళాకారులున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఆన్ వీల్స్, రామాయణ ఆన్ వీల్స్, ఫ్రీడమ్ ఆన్ వీల్స్, దుర్గావతారాలు, భగవద్గీత, పంచతంత్ర కథలు, భరతనాట్యం, యోగా, సూఫీ, క రవాల నృత్యం... వీల్‌చైర్ మీదే ప్రదర్శిస్తారు. ‘‘అంగవికలురకు సంబంధించి విద్య, ఉద్యోగాల పరంగా ఉన్న వ్యతిరేక ఆలోచనాధోరణులను, సందేహాలను పటాపంచలు చేయాలనే ఉద్దేశ్యంతో మేం కృషి చేస్తున్నాం’’ అన్నారు పాషా. క్లాసికల్ డ్యాన్స్, మూవ్మెంట్ థెరపీ, స్టేజ్ లైటింగ్, ఫొటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, పిడబ్ల్యుడిలకు యానిమేషన్ వంటి వాటిలో వికలాంగులకు ఈ సంస్థ శిక్షణ అందిస్తోంది. ప్రసిద్ధ నృత్యగురువులు, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఈ సంస్థ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తరగతులు నిర్వహిస్తుంటారు. వాయిస్ మాడ్యులేషన్, స్పీచ్ థెరపీ, స్పెషల్ కొరియోగ్రాఫిక్ మూవ్‌మెంట్స్‌లో శిక్షణ అనంతరం ట్రూప్‌లోకి తీసుకుంటారు. ఇదో థెరపీ... ‘‘డిజేబిలిటీ ఉన్నవారికి డ్యాన్స్ సైడ్ ఎఫెక్ట్స్‌లేని మాత్ర వంటిది’’ అంటారు పాషా. ప్రదర్శనలనే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగపరమైన సామర్థ్యం ఒనగూరుతుందని విశ్లేషిస్తారాయన. లైటింగ్ నుంచి కాస్ట్యూమ్, స్టేజ్సెట్టింగ్ సహా అన్నీ చేయగల సామర్థ్యం మా బృందం సభ్యుల స్వంతం. ‘‘హ్యాండీక్యాప్డ్‌కు చాలా తక్కువ విద్యావసతులు, ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. వికలాంగులకు సానుభూతి అక్కర్లేదు. నిరూపించుకునేందుకు అవకాశం కావాలి’’ అంటారు పాషా. - ఎస్.సత్యబాబు ఆద్యంతం... అద్భుతం... శీర్షాసన, మయూరాసన వంటి యోగాసనాలతో మిళితం చేసిన భరతనాట్యం కళ్ల ముందు మెరుపులు మెరిపిస్తుంది. బీట్‌కు, రిథమ్‌కు అనుగుణంగా వీల్‌చైర్ కదిలే తీరు చూసి తీరాల్సిందే. మంత్రముగ్ధుల్ని చేసే వీరి ప్రదర్శనలను చూసి తీరాలనుకునే వారెందరో ఉన్నారు. -
పవర్ రేంజర్స్
అబ్బాయి బీటెక్ పూర్తయింది. బెంగుళూరులోని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. రెండ్రోజుల్లో వెళ్లి జాయిన్ అవ్వాలి. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆకలవుతుంటే... ఆఫీస్ నుంచి అమ్మ ఎప్పుడొస్తుందా అని నకనకలాడుతూ ఎదురుచూస్తున్నాడు! ఎట్లీస్ట్ ఆమ్లెట్ వేసుకోవడం కూడా తెలీని అబ్బాయి! అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చే దారిలో క్యాబ్ ట్రబులిస్తే డ్రైవర్ మధ్యలోనే దింపేశాడు. అదేం ఏరియానో తనకు తెలీదు. బిక్కుబిక్కుమంటూ నాన్నకు ఫోన్ చేసింది. ‘‘ఇప్పుడు ఎక్కడున్నావమ్మా...’’ అంటే సరిగ్గా చెప్పలేకపోతోంది! ఎట్లీస్ట్ ఇంటికి కూడా దారి తెలీని అమ్మాయి! ఆలోచిస్తే ఈ రెండూ చాలా చిన్న సమస్యలు. పరిష్కరించుకోలేక పోతే అవే పెద్ద సమస్యలు. చదువుతోపాటు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ని మనం పెద్దగా పట్టించుకోం కానీ, ఈ శిక్షణ పిల్లల్ని ‘పవర్ రేంజర్స్’లా తీర్చిదిద్దుతుంది. జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సందర్భాలలో... పిల్లలకు ఉపయోగపడుతుంది. పిల్లలకే కాదు, వారి ద్వారా సమాజానికి కూడా! ఎలా అన్నదే... ఈవారం ‘ప్రజాంశం’. స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పదం వినే ఉంటారు. చదువుతోపాటు పిల్లలకు సమాజం పట్ల బాధ్యత, తోటివారికి రక్షణగా నిలబడే స్థైర్యం... ఇవన్నీ నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ స్వచ్ఛంద సంస్థ మన దేశానికొచ్చి శతాబ్దం దాటినా చాలామంది విద్యార్థులకు దీని గురించి తెలియదు. దేశానికి బాధ్యతగల పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ సేవల్ని ప్రపంచంలో వంద దేశాలు పూర్తిస్థాయిలో అందుకుంటున్నాయి. మన రాష్ర్టంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం చేస్తోందో చెప్పేదే ఈ కథనం... స్కౌట్స్ అనేది ఆర్మీకి సంబంధించిన పదం. శత్రువుల సమాచారం సేకరించే వ్యక్తిని స్కౌట్ అంటారు. గైడ్ అంటే సంరక్షణ. ఇంగ్లండ్‌కి చెందిన రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ అనే ఆర్మీ వ్యక్తి పదేళ్ల పిల్లల కోసం 1907లో ఒక క్యాంప్ ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కి వచ్చి, పదిరోజుల పాటు పిల్లలు ఎవరిసాయం లేకుండా ఉంటారు. ఈ విషయాన్ని గమనించి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం మన దేశానికి కూడా వచ్చింది. 1920 నాటికి స్కౌట్స్ పేరున కొన్ని, గైడ్స్ పేరుతో కొన్ని శిబిరాలు ఏర్పాటయ్యాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఉన్న అన్ని శిబిరాలకు ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశ్యంతో 1950లో ఢిల్లీ కేంద్రంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయింది. ఆ లోకం వేరు... స్కూల్లో తరగతి వేళల తర్వాత ఓ గంటపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాసులు ఉంటాయి. ఇందులో చేరిన విద్యార్థులకు, టీచర్లకు కూడా యూనిఫాం ఉంటుంది. 3 - 5 ఏళ్ల వయసున్న విద్యార్థుల్ని బన్నీస్ అనీ, 6 - 10 వయసున్న అమ్మాయిల్ని బుల్బుల్స్ అనీ, అబ్బాయిల్ని కబ్స్ అనీ, 10 - 16 ఏళ్ల విద్యార్థుల్ని రోవర్స్ అండ్ రేంజర్స్ అనీ పిలుస్తారు. వారి పాఠాలను... ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్ అని మూడు విభాలుగా విభజిస్తారు. ఇవి పూర్తయ్యాక రాజ్య పురస్కార్ ఉంటుంది. రోవర్స్ అండ్ రేంజర్స్‌కి వెళ్లాక సోపాన్లతో పాటు రాష్ట్రపతి పురస్కార్ కూడా ఉంటుందన్నమాట. ప్రథమ సోపాన్‌లో... ప్రథమ చికిత్స మొదలు పరిశుభ్రత వరకూ అన్ని విషయాల్ని బోధించి ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు. ప్రకృతి పరిశీలన, పరోపకారం కూడా ప్రథమ సోపాన్‌లో భాగం. ద్వితీయ సోపాన్‌లో... వంట చేయడం నుంచి హెరిటేజ్ అండ్ కల్చర్ వరకూ పాఠాలుంటాయి. తృతీయ సోపాన్‌లో... క్యాంపులు, స్విమింగ్, జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయాలపై బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ క్యాంపుల్లో విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న గుడారాల్లో ఉంటారు. ‘‘పౌరులను... చదువొక్కటే గొప్పవారిగా తీర్చిదిద్దదు. తోటివారికి ఉపయోగపడాలన్న భావన కలగడానికి కావలసిన శిక్షణ మా సంస్థ మాత్రమే ఇవ్వగలదని నేను గర్వంగా చెప్పగలను’’ అంటారు ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ జి. పరమేశ్వర్. సమైక్యత కోసం... జాతీయ సమైక్యత క్యాంపుల కోసం... విద్యార్థుల్ని జిల్లాలు, రాష్ట్రాలు దాటిస్తోంది. రెండేళ్లకిత్రం మెదక్జిల్లాలోని శంకర్‌పల్లిలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌కి దేశవ్యాప్తంగా 20 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు హాజరయ్యారు. ఆహారపదార్థాల నుంచి ఆహార్యం వరకూ అన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. ‘‘చదువొక్కటే మనిషిని శభాష్ అనిపించదు. కళ్లెదురుగా ఎవరికైనా గాయమైతే వెంటనే సహాయపడాలి’’ అని స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు. ఎన్ని నేర్పితే ఏం లాభం... ‘‘స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చే రాజ్యపురస్కార్, రాష్ర్టపతి పురస్కార్ సర్టిఫికెట్లు వల్ల మాకు ఉపయోగం ఏంటి?’’ అనే విద్యార్థులూ ఉంటారు. ఎన్సిసి సర్టిఫికెట్ల వల్ల ఉద్యోగాల సమయంలో ఉపయోగం ఉంటుంది. అలాంటి ఉపయోగం స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్‌కి కూడా ఉండాలి. లేదంటే ఈ సంస్థల ప్రాధానత్య తగ్గిపోతుంది. ‘మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం వరకూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయం సాధించగలదు. ఇందులో చేరడం వల్ల మా పిల్లాడికి ఏం లాభం?’ అని అడిగే తల్లిదండ్రులకు మా దగ్గర జవాబు లేదు. ‘‘విద్యార్థికి ఇచ్చిన మెరిట్ సర్టిఫికెట్ చూసి, ఉద్యోగ అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాం. దాని కోసం మన రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ కూడా రాశాం’’ అని వివరించారు పరమేశ్వర్. విద్య సర్టిఫికెట్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ తీసికెళ్లిన విద్యార్థికి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉందని తెలిస్తే ప్రతి పాఠశాలలోనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాస్‌లు ప్రత్యక్షమవుతాయి. ప్రయోజనం లేకుండా ప్రేమించడం కూడా దండగనుకునే రోజుల్లో సేవలు పొందడానికి తాయిలాలు తప్పనిసరి. ఆ రకంగానైనా స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠాలు ప్రతి విద్యార్థికి అందే అవకాశం ఉంటుంది. ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాగూర్ మీ స్కూల్లో ఉండాలంటే.. స్కౌట్స్ అండ్ గైడ్స్ బోధనలు మీ స్కూల్లో కూడా ఉండాలంటే హైదరాబాద్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. మీ స్కూలు టీచర్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చి మీ విద్యార్థులకు క్లాసులు చెప్పిస్తారు. - జి. పరమేశ్వర్, ఆర్గనైజింగ్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati -
రోటీ, కపడా ఔర్ మకాన్ దయతో నాస్తి దీనత్వం
కరుణ గల కళ్లల్లో అభయమిచ్చే శక్తి ఉంటుంది. సాయం చేసే చేతుల్లో అద్భుతదీపం ఉంటుంది. అన్నం పెట్టే ఆప్యాయతలో అక్షయపాత్ర ఉంటుంది. ఒళ్లు కప్పే ఆదరణలో మానవత్వం ఉంటుంది. దయగల హృదయం ఇవన్నీ చేస్తుంది. రేపు ‘ప్రపంచ దయార్ద్ర హృదయుల దినోత్సవం’. ఆ సందర్భంగా... అలాంటి హృదయాలను మీటే ప్రయత్నమే ఈవారం... ‘ప్రజాంశం’ కళ్లెదుట కూడు, గూడు, గుడ్డ కరవైన జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నప్పుడు మనం సాధించిన అభివృద్ధికి అర్థం ఏమిటి? కొందరిని ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. కొందరికి తమదైన పరిధిలో సమాధానాలు దొరుకుతుంటాయి. అన్నం శరణం గచ్ఛామి ‘‘అన్నం దొరక్కపోతే మనిషి ఆత్మగౌరవానికే భంగం’’ అంటారు డాక్టర్ సూర్యప్రకాష్. ‘‘ఆశ్రమాలు కట్టించడం, వేలరూపాయలు ఖర్చు చేయడం లాంటి పెద్దపెద్ద పనులు చేయకపోయినా ఓ ముద్ద అన్నం పెట్టలేమా?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో తాను ఏర్పాటుచేసిన ‘అందరి ఇల్లు (ఓపెన్ హౌస్)’ ద్వారా తాను కేవలం ప్రశ్నల మనిషిని మాత్రమే కానని ఆయన నిరూపించుకుంటున్నారు కూడా. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హౌస్ ఎందరో అన్నార్తుల కడుపు నింపింది. ఇంకా నింపుతోంది. దాదాపు 310 గజాల స్థలంలో నిర్మితమైన భవనంలో ఆయన నిర్వహిస్తున్న ఈ హౌస్‌కి ఎవరైనా వెళ్లవచ్చు. అక్కడ ఉన్న కూరగాయలు, దినుసులు ఉపయోగించి వంట వండుకుని కడుపునిండా తిని రావచ్చు. ఈ ఇంట్లో వండుకునేందుకు వంటసామానులతో పాటు చదువుకునేందుకు పుస్తకాలు, అత్యవసరంగా వినియోగించుకునేందుకు కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. ‘‘ఈ మహానగరానికి వచ్చినవారిలో ఎందరో నిరుద్యోగులు, వృద్ధులు, చిన్నారులు... ఒక్కోసారి కడుపునింపుకునే దారి కనపడక అల్లాడుతుంటారు. వారికోసమే ఈ ఓపెన్‌హౌస్’’ అని చెప్పారు సూర్యప్రకాష్. నీడనిచ్చిన మానవత్వం... చిన్న వయసులోనే జైలుపాలైన పిల్లలు విడుదలైన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? మామూలు వారికే నీడ దొరకడం కష్టమైపోతోంది. అలాంటిది... జైలు నుంచి వచ్చిన పిల్లలను ఆదరించేవారెవరు? ‘క్రిస్టోస్’ ఆధ్వర్యంలో హైదరాబాద్, అల్వాల్‌లోని లోతుకుంటలో నిర్వహిస్తున్న ఓ హోమ్ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకుంటోంది. ‘‘దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన కారాగారాలకు వెళ్లేందుకు నాకు అధికారిక అనుమతి ఉంది’’ అని ఈ సంస్థ నిర్వాహకుడు నాయర్ అంటున్నారు. ప్రస్తుతం ఆల్వాల్‌లో రెండు అద్దె భవనాలలో హోమ్‌ను నిర్వహిస్తున్నారు. ‘‘ఒకదాంట్లో పూర్తిగా ఆడపిల్లలు, మరో భవనంలో మగపిల్లలు, మా కుటుంబం ఉంటున్నాం’’ అని చెప్పారాయన. జైలుకు వెళ్లొచ్చినంత మాత్రాన ఆ పిల్లలు జీవితాంతం చెడ్డవారిగానే మిగిలిపోరనే తన అభిప్రాయం ఎంత గట్టిదో వారితో కలిసి జీవించడం ద్వారా చెప్పకనే చెబుతున్నారాయన. ప్రస్తుతం మానసికంగా ఎదగని పిల్లలు, కుష్ఠు వంటి తీవ్రవ్యాధులున్న చిన్నారులు సైతం హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారంటున్న నాయర్... గత పదిహేనేళ్లుగా ఈ హోమ్‌ను నిర్వహిస్తున్నానని చెప్పారు. బోలెడంత భవిష్యత్తున్న చిన్నారులకు నీడ కల్పించడం అనేది తనకు ఎంతో ఆనందాన్ని అందిస్తోందంటున్నారాయన. ఈ ఏడాది చంచల్‌గూడ జైలులో పిల్లలతో కలిసి తమ హోమ్ పిల్లలు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకోనున్నారని చెప్తున్నప్పుడు ఆయనలో ఆ ఆనందం ప్రస్ఫుటమైంది. దుస్తుల్లేని దుస్థితిని తప్పిస్తూ... తాజాగా విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న అమ్మాయి రూ.లక్షలు ఖరీదు చేసే రెండు పీలికల బికినీ వేసుకుందనేది ఓ విశేషం. ఇంత సుసంపన్నమైన ప్రపంచంలోనే సిగ్గు దాచుకోవడానికి సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో కోట్లాదిమంది జీవిస్తున్నారనేది ఓ కఠిన వాస్తవం. సరైన దుస్తులు ధరించేందుకు కూడా అవకాశంలేని నిరుపేదల కోసం షేర్ ఎ సర్వీస్ సంస్థ వస్త్రదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్త్రాలను సేకరించి వాటిని అవసరార్థులకు పంపిణీ చేసేందుకు డిసెంబరు 31ని ‘వస్త్రదానదినం’ గా మార్చింది. ‘‘సేకరించిన దుస్తులను పంపిణీ చేసేందుకు మురికివాడలకు వెళుతున్నప్పుడు... మనిషికి అవసరమైన కనీస వసతులు కూడా ఎంత కరవైపోయాయో అర్థం అవుతోంది’’ అని ఈ సంస్థ నిర్వాహకులు గౌరీశంకర్ అన్నారు. పేరుకు ఏడాదికి ఒకసారి అనుకున్నా... ప్రజల నుంచి స్పందన బాగుండడంతో... ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని వీలున్నప్పుడల్లా నిర్వహిస్తున్నామన్నారాయన. - ఎస్.సత్యబాబు -
ఆహారం కోసం...ఆధునిక మానవుల వేట
ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతారు. ఒకరి కోసం ఒకరు అన్వేషణ సాగిస్తారు. పరస్పరం ప్రణాళికలు రచిస్తారు. పక్కా ప్లానింగ్‌తో కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇదంతా ఎందుకంటారా? నచ్చింది తినడానికి! జస్ట్... తినడం కోసం ఇంత అవసరమా? ఇదేనా మీ సందేహం? అయితే మీరు.... ‘హైదరాబాద్ ఫుడీస్’ సభ్యుల్ని కలవాల్సిందే. నగరాల్లో రోజుకో రెస్టారెంట్ వెలుస్తోంది. గంటకో మెనూ మారుతోంది. నెక్ట్స్వీక్ ఫలానా చోట లంచ్ చేద్దామనో, డిన్నర్ చేద్దామనో ప్లాన్ చేసుకునేలోపే లే‘టేస్’్టకి అడ్రెస్ మారిపోతోంది. అలా నచ్చిన రుచితో జిహ్వ చాపల్యం తీర్చుకున్నామో లేదో ఇలా సరికొత్త రుచుల వాసన నాసికకు రాసుకుంటోంది. ఈ నేపథ్యంలో తినే ప్లేస్‌లను ఎంచుకోవడంలో కన్ఫ్యూజన్కు చెక్‌పెట్టడానికి, విభిన్నరుచులను ఆస్వాదించడంలో ముందుండడానికి హైదరాబాద్‌కు చెందిన ఆహారప్రియులు చక్కని మార్గం కనిపెట్టారు. రుచుల వేటలో గజి‘బిజీ’గా ఉన్నవారందరినీ కలుపుకుని ‘హైదరాబాద్ ఫుడీస్’ను ప్రారంభించారు. బిర్యానీని తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో తినాలంటే ఎక్కడని వెతకాలి? హైదరాబాద్ ఫుడీస్ని అడగండి. దాదాపు పది సమాధానాలకు తక్కువరావు. అడిగినవారు సిటీలో ఇన్ని ప్లేస్లుఉన్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే. ‘‘ఎంత రాత్రయినా, పగలైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు’’ అని ధీమాగా చెప్తారు హర్షిత్. ఆయన హైదరాబాద్ ఫుడీస్ నిర్వాహకుల్లో ఒకరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి బెన్నీసమర్ యాంథాన్ ఆలోచనతో గత ఏడాది ఈ గ్రూప్ ప్రారంభమైంది. స్థానికురాలు కాని బెన్నీ... తక్కువ ధరలో రుచికరమైన ఆహారం దొరికేచోటు కోసం పడిన కష్టాల నుంచి పుట్టిన ఆలోచనే హైదరాబాద్ ఫుడీస్. అందుబాటు ధరల్లో రుచికరమైన ఆహారం దొరికే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ వేదికకు రూపకల్పన చేశారు. ఒకరొకరుగా ఈ గ్రూపులో సభ్యుల సంఖ్య నాలుగు వేలకు పైగా పెరగడంతో... నెలకోసారి కలిసేవారు కాస్తా వారానికోసారి కలవడం మొదలైంది. దీనిని సభ్యులంతా ‘ఫుడ్ మీట్’ అని పిలుస్తారు. ఒక్కో మీట్‌కి కనీసం 40 నుంచి 80 మంది హాజరవుతారు. ‘‘ఎక్కడికి వెళ్లాలో ప్లేస్ ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ తర హాలో సీట్స్ ఆఫర్ చేస్తాం. రెస్టారెంట్ నిర్వాహకులతో మాట్లాడి సీట్లు రిజర్వ్ చేసుకుంటాం’’ అని చెప్పారు క్లబ్నిర్వాహకుల్లో ఒకరైన సంకల్ప్. అది ఫైవ్‌స్టార్ రెస్టారెంట్ కావచ్చు లేదా ఫుట్‌పాత్ మీది పానీపురి బండి కావచ్చు.. కాదేదీ విజిట్‌కు అనర్హం అన్నట్టుంటుంది వీరి శైలి. ఈ గ్రూప్‌లో కనీసం 12 నుంచి 60 దాకా విభిన్న వయసులున్న సభ్యులున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి చిరుద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు, చదువుకోవడానికి వచ్చినవాళ్లు... తక్కువధరలో మంచి ఫుడ్ కోసం రోజుల తరబడి చేసే అన్వేషణకు ముగింపు పలకడం కూడా ఈ గ్రూప్ ఏర్పాటుకు దోహదం చేసిందంటారు సంకల్ప్. ‘సరసమైన’ రుచులు... ఈ మీట్లకు ఎంపిక చేసుకున్న రెస్టారెంట్‌కు ఒకేసారి గ్రూప్‌గా వెళతారు కాబట్టి ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గింపు లభిస్తుంది. దాంతో నగరంలో ఈగ్రూప్కు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతున్నాయి. తమ ఫుడ్ రుచి చూడమంటూ పలురెస్టారెంట్ల నుంచి వీరికి ప్రత్యేక ఆహ్వానాలు అందుతున్నాయి. ‘‘మాకు ఈ విషయంలో అనుభవం ఎక్కువ అనే భావనే దీనికి కారణం. అలాగే మేం మా అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చెబుతాం కూడా’’ అని సంకల్ప్ చెప్పారు. ఈ ఫుడీలకు ఆహారంతో పాటు అందులో కలిపే ముడిపదార్థాలకు సంబంధించి కూడా అవగాహన బాగా ఉంటుంది. ‘‘మన ఆంధ్రా క్విజీన్ను మించిన రుచుల సంపద ఎక్కడా ఉండదు. ఏ విదేశీ క్విజీన్ను దీనితో పోల్చలేం’’ అని సంకల్ప్ తేల్చేస్తారు. రాష్ట్రవ్యాప్త టూర్లకూ రెడీ... వివిధ రంగాల్లో ఉన్న వర్గాబ్ భక్షి, సంకల్ప్, రాహుల్ బోస్, హర్షిత్ జైన్, సవ్యసాచి రాయ్ చౌదరిలతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం దీన్ని నడిపిస్తోంది. రెస్టారెంట్ రివ్యూస్ మీద చర్చలు, సరికొత్త రుచుల అన్వేషణ వీరి బాధ్యత. అనాథాశ్రమాల్లో, ఓల్డేజ్హోమ్లలో ఉన్నవారికి చక్కని రుచులను ఆస్వాదించే అవకాశం ఇవ్వడానికి వీరు నెలకోసారి చారిటీ ఈవెంట్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఈ గ్రూప్ రాష్ట్రవ్యాప్త ఫుడ్టూర్లు నిర్వహించబోతోంది. ‘‘పసందైన విందుతో పాటు పర్యటనలను కూడా ప్రేమించే వారి కోసం వైవిధ్యభరితమైన ఆహారపు రీతులను ఈ టూర్లలో పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’అని సంకల్ప్ చెప్పారు. అదే విధంగా వైన్ టేస్టింగ్ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేయాలని వీరు నిర్ణయించారు. వెల్డన్ ఫుడీస్... ‘ఫుడీస్’ చెప్పిన విశేషాలు... హైదరాబాద్, ఫిలిమ్నగర్లో ఉన్న థియా కిచెన్‌లో మెడిటరేనియన్ (ఇటలీ, నార్వే, యూరప్‌లో కొంత భాగంగా ప్రవహించే మెడిటరేనియన్ సముద్రం చుట్టూరా ఉండే దేశాలు) ఫుడ్ లభిస్తుంది. హైదరాబాద్, మాదాపూర్ దగ్గరున్న చాట్ బజార్లో నగరంలోనే ఎక్కడా లేనంత తక్కువ ధరకు చాట్ లభిస్తుంది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న అయ్యప్ప సొసైటీ దగ్గర్లో మామా చికెన్ అనే తోపుడు బండి ఉంటుంది. మన ముందే బొగ్గుల మీద కాల్చి ప్లేట్లో వేసి ఇస్తారు. అద్భుతమైన రుచి... అత్యల్పమైన ధర. హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ దగ్గర ఫేమస్, బిలాల్ ఐస్‌క్రీమ్ పార్లర్స్‌లో హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్స్ లభిస్తాయి. సీజనల్‌గా లభించే సీతాఫలం ఐస్‌క్రీమ్, సపోటా ఐస్‌క్రీమ్... వంటివి అద్భుతంగా ఉంటాయి. అత్యంత సహజమైన పద్ధతుల్లో తయారయే వీటి ధర రూ.25 నుంచి మొదలని తెలుసా? - ఎస్. సత్యబాబు ‘ఫుడీస్’కి ఆఫర్లే ఆఫర్లు... రూ.1600 ఖరీదు చేసే ఫుల్ 5 కోర్స్ మీల్‌ను ఓ రెస్టారెంట్ రూ.450కే వీరికి అందించింది. ఓ రెస్టారెంట్ వాళ్లు ప్రస్తుతం గ్రూప్ సభ్యుల్లో కొందరికి ఉచితంగా గ్రీకు దేశపు వంటకాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. గచ్చిబౌలిలో ఉన్న ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో ఈ గ్రూప్‌కి రూ.200కే అన్లిమిటెడ్ ఐస్‌క్రీమ్స్ అందించారు. అక్కడ ఒక్కో ఐస్‌క్రీమ్ ధర రూ.150కి తక్కువ వుండదు. -
శిఖరస్వారీమణులు!
శిఖరాన్ని లొంగదీసుకోవడం అంటే... వెయ్యి గుర్రాల్ని ఒకేసారి అదిలించడం! ఎవరి వల్ల అవుతుంది? వీరులు? కష్టం. శూరులు? కష్టం. అరివీర భయంకరులు? కష్టం. దృఢకాయులైన కింకరులు? కష్టం. ఇంకెవరి వల్ల అవుతుంది? విల్ పవర్ ఉండాలి... డేర్ డెవిల్స్‌లా ఉండాలి. ఉంటే? నారీమణులు సైతం శిఖరాన్ని అధిరోహిస్తారు. ఓపన్ గంగ్నమ్ స్టెయిల్లో దౌడు తీయిస్తారు. ఈ నలుగుర్నీ చూడండి. శిఖరాలు ఎంత చిన్నవై కనిపిస్తాయో! సాహస యాత్రలు చేస్తున్నవారిలో సాధారణ గృహిణుల దగ్గర్నుంచి చిరుద్యోగినుల దాకా ఉన్నారు. వడ్డించిన విస్తరి లాంటి జీవితమున్నా... కేవలం తమను తాము నిరూపించుకోవడం కోసం, రేపటి భవిష్యత్తును మరింత సమర్థవంతంగా మలచుకోవడం కోసం వీరు అడ్వంచరస్‌గా మారుతున్నారు. వ్యయప్రయాసలను ఎదుర్కొని మరీ సంక్లిష్టమైన సాహసాల కలలను సాకారం చేసుకుంటున్నారు. ఆ మహిళలతో మాట్లాడితే... కొండలు పిండి చేసే వాళ్లెక్కడి నుంచో ఊడిపడలేదని అవగతమవుతుంది. ప్రయత్నం చేస్తే, మన కాలక్షేపపు అభిరుచులనే అడ్వెంచరస్‌గా మారిస్తే... జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునని అర్థమవుతుంది. 138: ‘‘లక్ష్యాలు ఉన్నతంగా ఉంటే మనం పెద్దవిగా భావించే చాలా సమస్యలు అసలు సమస్యలే కావని అర్థం అవుతాయి’’ అని కిరణ్మయి అంటారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్మయి...ఇటీవలే దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. అందులో విశేషం ఏమీలేదు. డబ్బుంటే ఎవరైనా వెళ్లిరావచ్చు. కాని అక్కడి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. అది ఉంది కాబట్టే కిరణ్మయి కిలిమంజారో పర్వతారోహణ చేసిన తొలి తెలుగు వనిత అయ్యారు. ‘‘పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక, వాళ్ల భవిష్యత్తు వాళ్లు చూసుకోగల సత్తా వారికి అందించాక... అప్పుడు నా గురించి నేను ఆలోచించుకున్నాను. చిన్నప్పుడు సరదాగా కొండకోనల్లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నాను. సహజమైన, సాహసోపేతమైన అనుభవాల్ని రుచి చూడాలనుకున్నాను’’ అని చెప్పారామె. అనుకోవడమే తడవు ‘గ్రేట్ హైదరాబాద్ అడ్వంచరస్ క్లబ్’ లో చేరడం ద్వారా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఒకటొకటిగా పర్వతాలను అధిరోహిస్తూ ఇప్పటికి 138 ట్రెక్స్ పూర్తి చేశారు. వీటన్నింటిలోకి కిలిమంజారో అత్యంత ప్రమాదకరమైన అనుభవం అంటారామె. ‘‘కిలీ మంజోరా పర్వతప్రాంతంలో రాత్రి 12గంటలకు ప్రారంభమై ఉదయం 5గంటల లోపు ట్రెక్ పూర్తవ్వాలి. నేను వెళ్లినప్పుడు వెదర్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఎక్కేటప్పుడు పాములు, తేళ్లూ, తీవ్రమైన విషం చిమ్మే జైలు... వరుస కట్టాయి. హఠాత్తుగా వడగళ్ల వాన పడడం మొదలైంది. ఏమాత్రం తేడా వచ్చినా కోమాలోకి వెళ్లాల్సి వచ్చేది. పరుగు తీయడం ఆపేస్తే కండరాలు బిగుసుకుపోతాయి. అంతటి చలి’’ తన అనుభవాన్ని వివరిస్తున్నపుడు ఆమెలో ఆ జ్ఞాపకం తాలూకు ఉద్వేగం కనపడింది. రన్నింగ్, సైక్లింగ్... వీటన్నింటిలోనూ కిరణ్మయి రాణిస్తున్నారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్, కోయంబత్తూర్‌లో జరిగిన మారథాన్‌లో 2గంటల 20నిమిషాల్లో 21.1 కి.మీ పరుగు పూర్తి చేసి 10వ స్థానం సాధించారు. స్విమ్మింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే జుకాడో అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ ఫార్టీ ప్లస్ టీచర్... ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్ అన్నీ సాహసయాత్రల ద్వారా పొందగలిగానని చెప్పారు. 127: ‘‘మహారాష్ట్రలోని కోకన్కొడా ప్రాంతంలో చేసిన 1800 అడుగుల దూరం రోప్లింగ్ (తాడుతో వేళ్లాడుతూ పర్వతాలు, లోయల నడుమ చేసే సాహసం) అద్భుతమైన అనుభవం’’ అని గుర్తు చేసుకున్న ఫరీదా... ఇటు కుటుంబ బాధ్యతల్ని, అటు ఉద్యోగ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూనే తన సాహసయాత్రల్ని కొనసాగిస్తున్నారు. ‘‘ఇప్పటికి దాదాపు 127 ట్రెక్స్ పూర్తి చేశాను’’ అని ఉత్సాహంగా చెప్పారు ఫరీదా. చిన్నప్పుడు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగిన హాబీ వల్ల ఏమో రోప్లింగ్ తన అభిమాన సాహసక్రీడగా మారిపోయిందని చెప్పే ఫరీదా మహారాష్ట్రలోని కార్జత్ జలపాతాల మీదుగా చేసిన రోప్లింగ్ను ఎప్పటికీ మరచిపోలేనంటారు. సినిమాలు, టీవీల ముందు వృథా చేసే సమయాన్ని ఇలా మళ్లిస్తే... ఆత్మవిశ్వాసం పెరగడం లాంటి లాభాలెన్నో కలుగుతాయని ఆమె మహిళలకు సూచిస్తున్నారు. 112: ‘‘పర్వతాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ నుంచి నక్షత్రాల్ని చూడడం ఎంత బాగుంటుందో’’ అంటున్న పద్మజలో గొప్ప భావుకురాలు కనిపిస్తుంది. ఇప్పటికి 112 పర్వతాలను అధిరోహించానని ఆమె చెప్పినప్పుడు బాప్రే...అనిపిస్తుంది. ‘‘పెళ్లికాకపోవడం సాహసయాత్రలకు సంబంధించి నాకున్న అదనపు అర్హత’’ అంటూ నవ్వేస్తారు పద్మజ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్ఎపి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న పద్మజ పశ్చిమకనుమలలోని సహ్యాద్రి రేంజ్లో హరిశ్చంద్రఘాట్ తన అభిమాన ట్రెక్ అని పేర్కొన్నారు. 71: అడ్వంచరస్ క్లబ్లో సభ్యురాలిగా మూడేళ్ల వయసున్న స్వాతి... సాహస యాత్రికురాలిగా మారకముందు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు స్వంతంగా ఆన్లైన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ‘‘ఈ అడ్వంచర్స్ వల్ల మన జీవితాన్ని మనమే శాసించుకునే తత్వం అలవడుతుంది’’ అని చెప్పే స్వాతి హైదరాబాద్‌లోని మౌలాలితో మొదలుపెట్టి తిరుపతిలోని నాగల్లపురం... ఇంకా అనేక ప్రాంతాల్లోని పర్వతాలను చుట్టేసి... ఇప్పటికి 71 ట్రెక్స్ పూర్తి చేశారు. ‘‘మొదట ఇంట్లో భయపడ్డారు. కాని ఇప్పుడు వారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు’’ అని చెప్పారీమె. - ఎస్. సత్యబాబు -
గోల్డెన్ లెగ్స్!
పవన్ చల్లా... జీవితం సడెన్‌గా బ్రేక్ కొడితే ఒక్కొక్కరూ... ఒక్కోలా ఎగిరిపడినవాళ్లు! అంత జరిగిందా... ఒక్కరి ఆత్మవిశ్వాసమూ చెక్కుచెదర్లేదు! ఒంటికాలితోనే లక్ష్యంవైపు అడుగులు వేస్తున్నారు. పరుగులు తీస్తున్నారు. ఎగిరి దూకుతున్నారు. వైకల్యాన్ని ‘గోల్డెన్ లెగ్’ గా బిగించుకుని అన్నీ బాగున్న వారికి సైతం స్ఫూర్తిగా,ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వస్తూ, అనంతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యార రవి శ్రీవాత్సవ. ఆయనది హైదరాబాద్‌లోని నాగోల్. మధ్యవయసులో, సంసారమనే నావను నడిపే సారధిగా ఉన్నప్పుడు ఎదురైన అంగవైకల్యం ఆయనను కొంతకాలం నిశ్చేష్టుడ్ని చేసింది. రవి తండ్రి హార్టీ కల్చరిస్ట్. ఆయన హృద్రోగం కారణంగా రవి, అతని సోదరుడు ఇద్దరూ పన్నెండేళ్ల వయసు నుంచే దినసరి వేతనానికి వెళ్లేవారు. తమ రెక్కల కష్టంతో ఇంటిని నడుపుతూనే, చదువుకునేవారు. తండ్రిని కోల్పోయేనాటికే చెల్లి, సోదరుడు తనూ కాస్త స్థిరపడుతుండగా ప్రమాదం కారణంగా మోకాలి కింద వరకూ కాలు పోగొట్టుకున్నారు రవి. దాదాపు ఐదు సర్జరీలు, రక రకాల థెరపీలు జరిగాక తేరుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాలు. భార్య అండతో, వైద్యుల సహకారంతో వైకల్యం లేనివారికన్నా బాగా నడ వడం మాత్రమే కాదు, పరుగు పోటీల్లో సైతం పాల్గొనే స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్టెల్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. విప్రో 5కెలో కూడా పాల్గొన్నారు. వచ్చే డిసెంబరు 1న చెన్నైలో, 15న ఢిల్లీలో, 25న చత్తీస్‌ఘడ్‌లో జరిగే మారథాన్లలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. రోజూ పొద్దున్న మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్న రవి తనకు మరిన్ని మారథాన్లలో పాల్గొనాలని ఉందని చెప్తున్నారు. విజయవాడలో ఉంటున్న శ్రీనివాసనాయుడిది ఇంకో స్ఫూర్తిగాథ. మొదట అందరూ ఆయన ఉద్యోగం చేయలేడన్నారు. చేశారు. ‘అయ్యో పాపం, పెళ్లి ఎలా అవుతుంది’ అన్నారు. అయ్యింది. అంతమాత్రాన తన ను తాను నిరూపించుకోవడానికి మరేమీ లేదని శ్రీనివాసనాయుడు అనుకోవడం లేదు. ప్రస్తుతం ఎం.కాం. చదువుతున్న 41 ఏళ్ల శ్రీనివాసనాయుడికి పదవ తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌బాల్ తగిలి కాలు వాచింది. అది అలా అలా ముదిరి ఆఖరికి మోకాలిపై వరకు కాలిని తొలగించే వరకూ వచ్చింది. అయితే ఆయన తన దురదృష్టాన్ని నిందించుకుంటూ చక్రాల కుర్చీకి పరిమితం కాలేదు. అలాగే చదువుకుని సెంట్రల్గవర్న్మెంట్ జాబ్ సాధించారు. పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు. అన్నీ బావున్నవాళ్లు కూడా హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని బండి లాగించేయాలని భావించే మధ్య వయసులో... తనకెంతో నచ్చిన స్విమ్మింగ్‌ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. విఎంసి స్విమ్మింగ్‌పూల్‌లో జేరి ఈత నేర్చుకున్నారు. అదే సంవత్సరం మిగిలిన సాధారణ వ్యక్తులతో కలిసి మాస్టర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. కన్సొలేషన్ ప్రైజ్ గెలుపొందారు. రిపబ్లిక్‌డే సందర్బంగా కృష్ణానదిలో జరిగిన కృష్ణా రివర్ క్రాస్ ఈవెంట్లో అంగవైకల్యం లేని సాధారణ వ్యక్తులతో కలిసి పాల్గొన్నారు. నగదు బహుమతి గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైథ్లాన్లో పాల్గొని 30 నిమిషాల్లో 750 మీటర్ల ఈతను పూర్తి చేసి వహ్వా అనిపించారు. తన వయసు దాటిపోయింది కానీ లేకపోతే వికలాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనాలని అందనీ శ్రీనివాసనాయుడు అంటున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్నుంచి కెరీర్‌ను వెదుక్కుంటూ హైదరాబాద్‌కి వచ్చిన కిరణ్ కనోజియా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా చేరి ఒక్కోమెట్టు ఎక్కుతున్న తరుణంలో... నడిచే రైలు నుంచి జారిపడి కాలు విరగ్గొట్టుకున్నారు. ఆ సంఘటన గురించి వివరిస్తూ... తానెంతో ముచ్చటపడి నెల ముందే బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి కొన్న బంగారు నగను బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుని రైల్లో కిటికీ దగ్గర కూర్చున్నానని, ఆ బ్యాగ్‌ను ఇద్దరు వ్యక్తులు లాక్కోని పరిగెత్తుతుంటే వారిని పట్టుకునే ప్రయత్నంలో కాలు జారి అప్పుడే కదిలిన రైలు కింద పడిపోయానని గుర్తు చేసుకున్నారామె. ఆ సంఘటనలో ఆమె కేవలం బంగారునగను మాత్రమే కాదు అంతుకు మించిన విలువైన అవయవాన్ని కూడా కోల్పోయారు. ‘‘అమ్మానాన్న ఇంటికి తీసుకెళ్లారు. కొన్నినెలలు అక్కడున్నాను. సుధాచంద్రన్ లాంటివాళ్లను జ్ఞాపకం చేసుకున్నాను. పిచ్చి పట్టుదల వచ్చింది. ఇంట్లోవాళ్లు వారిస్తున్నా వినకుండా మళ్లీ హైదరాబాద్ వచ్చాను. మళ్లీ అంతకు ముందు పనిచేసిన కంపెనీకి వెళ్లాను. ఉద్యోగం చేస్తానని చెప్పి ఒప్పించాను. కంపెనీ వాళ్లు కూడా మాన వత్వంతో స్పందించి అంతకుముందు చేసిన ఉద్యోగాన్నే అదే జీతంతో తిరిగి ఇచ్చారు’’ అని చెప్పారు కిరణ్. అలా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడామె మారథాన్ రన్నర్‌గా మారారు. అద్భుతమైన భవిష్యత్తువైపు నడవడమే కాదు, ఏకంగా పరుగులు తీస్తున్నారు. ‘‘బస్ దిగి, రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దేసిందండీ’’ అంటూ కాలికి బ్లేడ్ బిగించుకుంటున్న పవన్‌ని చూసినప్పుడు అంగవైకల్యం ఉందన్న భావనే ఆయనలో కనిపించలేదు. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటారు పవన్. ‘‘లోపం అని భావిస్తేనే కదా సమస్య?’’అని ప్రశ్నించే రవి ఆ భావనను అధిగమించడం మాత్రమే కాదు, అంతకు మించిన విజయాలను సాధించే దిశగా దూసుకుపోతున్నారు. కొడుకు పరిస్థితికి తగ్గట్టుగా, కూచుని పని చేసుకునేందుకు వీలు అవుతుందని సినిమా ఎడిటర్‌గా అవ్వమని తండ్రి ఇచ్చిన సూచనను పాటించిన పవన్ అంతటితో ఆగిపోలేదు. తనను తను నిరూపించుకునేందుకు కఠినమైన క్రీడలవైపు ప్రయాణిస్తున్నాడు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బ్లేడ్న్న్రర్‌గా ఎవరూ లేరు. అందుకే ఆ క్రీడను నేను ఎంచుకున్నాను’’ అని చెప్పారు పవన్. రెండేళ్లక్రితం భారతదేశం ప్రపంచకప్ సాధించింది. ఆ మ్యాచ్ చూడాలనే ఆదుర్దాతో బయలుదేరిన మనీష్‌పాండే ఒక కాలు పోగొట్టుకున్నాడు. ‘‘ఎప్పుడూ బస్‌లో వెళ్లేవాడ్ని. మ్యాచ్ టైమ్‌కి ఇంటికి చేరుకోవాలని రెలైక్కా. బాగా రద్దీగా ఉంది. తోపులాటలో కిందపడిపోయా’’నని గుర్తుచేసుకున్నాడీ చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌పూర్ కుర్రాడు. పైలట్ కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మనీష్ ఆ సంఘటన తర్వాత కొంతకాలం తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. ఆ తర్వాత తేరుకుని లక్ష్యాన్ని మార్చుకున్నాడు. అందుకు అనుగుణంగా క్రీడలవైపు లాంగ్‌జంప్ చేశాడు. జాతీయస్థాయి లాంగ్జంపింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అంతేకాదు బ్లేడ్న్న్రర్గానూ రాణిస్తున్నాడు. పారాఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. జీవితమనే రహదారిలోని మలుపుల్ని ఏ గూగుల్‌మ్యాప్ కూడా పసిగట్టలేదు. అందుకేనేమో అవి అంత తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తమ కాళ్ల మీద తాము నిలబడాలని తపించేవారిని ఆత్మవిశ్వాసం ఉన్నవారంటాం. ఒక కాలు కోల్పోయినా... ఆ ప్రభావాన్ని దరిచేరనీయని ధైర్యం చూపేవారిని ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉన్నవారనాలేమో. - ఎస్.సత్యబాబు ‘‘అంగవికలుర క్రీడల కోసం ప్రత్యేక అకాడమీ రావాల్సిన అవసరం ఉంది’’ అంటు న్నారు ఆదిత్యమెహతా. వైకల్యంపై పైచేయి సాధించిన వారందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న ఆదిత్య కూడా అంగవికలురే. గత మే నెల 28 న లండన్‌లో తన ఒంటికాలితోనే దాదాపు 500 కి.మీ ప్రతిష్టాత్మక చాలెంజ్‌ను మూడున్నర రోజుల్లో పూర్తి చేసి అందులో పాల్గొన్న తొలి అంగవికలుడైన సైక్లిస్ట్‌గా ఘనత సాధించారు ఆదిత్యామెహతా. కాలేజీ సరదాలు, కుర్రవయసు హుషారులతో జీవితం పరుగులు తీస్తున్నప్పుడు... బైక్ మీద వెళుతుంటే హైదరాబాద్, బాలానగర్ సమీపంలో ఆదిత్యను ఆరీ్టిసీబస్సు వెనుకనుంచి గుద్దేసింది. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండి... అతి కష్టమ్మీద కళ్లు తెరిచి కాళ్లు కదిలించబోతే... అర్థమైంది. తనకు ఓ కాలు లేదని, వికలాంగుడిగా మిగిలానని. పిచ్చిగా అరిచాడు. చచ్చిపోవాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచనల్లేని అంధకారంలోకి జారిపోయాడు. కొన్ని రోజుల పాటు అయిన వాళ్లంతా ఇచ్చిన మద్దతుతో మెల్లగా మామూలు మనిషయ్యాడు. కృత్రిమకాలు అమర్చుకుని నడవడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రోత్సాహంతో కిలోమీటరు మొదలుకుని 11కి.మీ దాకా నడిచే స్థాయికి చేరాడు. అదే ఊపులో సైకిలెక్కాడు. హైదరాబాద్‌లో జరిగిన కొన్ని చిన్నచిన్న సైకిల్రేస్లలో పాల్గొన్నాడు. తిరిగే చక్రం... రికార్డులే గమ్యం... వేగంగా 100 కి.మీ (5.5 గంటల్లో) పూర్తి చేసిన అంగవైకల్యం కలిగిన సైక్లిస్ట్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు ఆదిత్య. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు అంటే 540 కి.మీ దూరాన్ని కేవలం 3 రోజుల్లో సైకిల్ మీద చేరుకున్నాడు. ఏషియన్ పారా సైకిల్ ఛాంపియన్ షిప్లో 2 రజత పతకాలు గెలుచుకున్నాడు. తాజాగా లండన్-ప్యారిస్ సైక్లింగ్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం మీద గత ఏడాదిన్నరగా తాను సైక్లింగ్ చేసిన దూరాన్ని లెక్కిస్తే దాదాపు 17 వేలకి.మీ వస్తుందని చెప్పాడు ఆదిత్య. ఏ మనిషికైనా ఆలోచనల్లో లోపం లేకపోతే అవయవ లోపం అనేది లోపమే కాదంటాడు. -
యువ సేవకులు
మంచి మంచి ఉద్యోగాలు. లక్షల్లో సాఫ్ట్వేర్ జీతాలు. పైగా ఇరవైల్లో ఉన్నవారు. టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఏమైనా చెయ్యొచ్చు. టూర్లు కొట్టొచ్చు, మాల్స్ తిరగొచ్చు. పాలసీలు, ఇ.ఎం.ఐ.లలో... తలమునకలు కావచ్చు. నెలకింత కడితే ముప్పై ఏళ్ల తర్వాతఎంత వస్తుందని లెక్కలు కట్టొచ్చు. కానీ వీళ్లు... అవేం చేయడం లేదు! ‘యూత్ ఫర్ సేవ’ అంటూ... సెలవు రోజుల్ని, బరువు పర్సుల్ని సార్థకం చేసుకుంటున్నారు. ఎలా అన్నదే... ఈవారం ‘ప్రజాంశం’. పంజాగుట్ట...అమీర్‌పేట్ మెయిన్‌రోడ్డు పక్కనున్న చెత్తకుండీల దగ్గర ఓ పాతికమంది అబ్బాయిలు... అమ్మాయిలు రోడ్లు ఊడ్చే సీన్... దారినపోయేవారిని కూడా ఆలోచింపచేసింది. చీపుర్లు పట్టుకుని కార్లలోంచి దిగిన వారంతా ఎంతో శ్రద్ధగా చెత్తకుండీల చుట్టూ శుభ్రం చేయడం చూసి ఆ పక్కనే ఉన్న స్వీపర్స్ కూడా ముక్కున వేలేసుకున్నారు. కాని, వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా చకచకా రోడ్లు ఊడ్చేసి... గోడలకు సున్నాలు వేస్తే అటుగా వెళుతున్న ఓ ఇద్దరు కుర్రాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘మాకు పెయింటింగ్ వచ్చు’ అని చెప్పి బ్రష్ అందుకుని ఆ గోడలపై వివేకానందుని బొమ్మలు వేశారు. ఈ లోగా మిగిలిన యువత చుట్టుపక్కల షాపులదగ్గరకెళ్లి చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకూడదంటూ కౌన్సెలింగ్ ఇచ్చింది. ఈ నెల రెండోతేది....గాంధీ జయంతిరోజు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండు గంటలవరకూ ‘యూత్ ఫర్ సేవ’ సభ్యులు హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో రోడ్లు ఊడ్చి గాంధీజీకి వినూత్నరీతిలో గౌరవ నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా ఈ యువత చేస్తున్న వినూత్న సేవాకార్యక్రమాలే ఏడువేల మంది యువతను ఆ సంస్థ సభ్యులుగా చేసుకున్నాయి. ఈ ఐటీ యువత చేస్తున్న కృషి గురించి మరిన్ని వివరాలు.... బెంగుళూరులో పుట్టి... ఆరేళ్లక్రితం బెంగుళూరులో ‘యూత్ ఫర్ సేవ’ (వైఎఫ్ ఎస్) సంస్థని అక్కడి ఐటీ యువత స్థాపించారు. వారి సేవాకార్యక్రమాలలో అక్కడ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ సంస్థని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న తమ స్నేహితులతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే చాలామంది ముందుకొచ్చారు. మన రాష్ర్టం నుంచి శోభిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ముందుకొచ్చి 2010లో హైదరాబాద్‌లో ‘యూత్ ఫర్ సేవా’ సంస్థని స్థాపించారు. మొదట్లో కేవలం పదుల్లోనే ఉన్న సభ్యుల సంఖ్య ... ప్రస్తుతం ఏడు వేలకు చేరింది. వీరంతా కూడా స్వచ్ఛందంగా ‘యూత్ ఫర్ సేవ’కు తమ స్నేహ హస్తాలనందించారు. మూడు వందలమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఓ పన్నెండుమంది తమ ఉద్యోగాలు కూడా వదిలేసి యూత్ ఫర్ సేవ కోసమే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. సంఘం హైదరాబాద్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న స్వాతిరాం మాటల్లో చెప్పాలంటే ‘‘యువతకు అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని ఉన్నప్పటికీ వారిని ముందుకు నడిపించే వేదిక అంటూ ఏమీ లేకపోవడం వల్ల వారు ఏమీ చేయలేకపోతున్నారు. దీనిని గుర్తించే మేము మా సేవాకార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక అవసరం అనుకున్నాం. అందుకే ‘యూత్ ఫర్ సేవ’ను స్థాపించాం. గడిచిన మూడేళ్లలో ఊహించినదానికంటే ఎక్కువగా సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాం. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని...కొన్నాళ్లుపాటు వీకెండ్లో యూత్ ఫర్ సేవలో పనిచేసి తర్వాత ఇంట్లోవాళ్లని ఒప్పించి పూర్తిసమయం ఈ సంస్థలో పనిచేయడానికి సిద్ధపడ్డాను. ప్రస్తుతం మన నగరంలో పన్నెండుమంది తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఈ సంస్థ చేసే సేవాకార్యక్రమకాలకే అంకితమయ్యారు’’ అంటూ సంతోషంగా చెప్పారామె. 60 కంపెనీల ఉద్యోగులతో... హైదరాబాద్ నగరంలోని 60 కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో పాటు ఓ పది కళాశాలల్లోని విద్యార్థులు కూడా యూత్ ఫర్ సేవాలో సభ్యులుగా ఉన్నారు. సంస్థ స్థాపించిన కొత్తల్లో పేద విద్యార్థులకు శని, ఆదివారాల్లో చదువు చెప్పడం, ప్రభుత్వపాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు పంచారు. ప్రస్తుతం విద్య మొదలు పారిశుధ్యం వరకూ తమ దృష్టికి ప్రతి ఒక్క సమస్య పట్లా స్పందించి తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. పార్ట్‌టైం, ఫుల్‌టైం, వీక్లీ వన్స్, మంత్లీ ట్రిప్...అంటూ రకరకాల సమయాల్లో సేవకు అందుబాటులో ఉంటున్నారు. వీరి సేవలను నగరానికే పరిమితం చేయకుండా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రభుత్వపాఠశాలలకు కూడా విస్తరించారు. వీటితో పాటు ఏడాదికొకసారి ‘వనయాత్ర’ పేరుతో అటవీప్రాంతాలకు వెళ్లి అక్కడి గిరిజనులతో కలిసి మెలిసి గడుపుతూ, వారి జీవన విధానాలను పరిశీలించి వస్తుంటారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖాండ్ వరద బీభత్సంలో కకావికలమైన వారిని ఆదుకోడానికి యూత్ ఫర్ సేవ సభ్యుల బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితులకు తమ సేవాహస్తం అందించారు. పేదల చదువుకోసం... అభివృద్ధి అనే పదం చదువుతోనే మొదలవుతుందంటారు ఈ సంస్థ సభ్యులు. ‘‘పెద్ద చదువులు చదువుకుని ఏసీ గుదుల్లో పనిచేసే ఉద్యోగాలు సంపాదించాం. మరి పూరిగుడిసెల్లో అక్షరాలకోసం వెతుక్కునే పేదవిద్యార్థుల కోసం మేము ఏం చేయగలమా అని ఆలోచించాం. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్కిట్లు పంచి చేతులు దులుపుకోలేకపోయాం. మా ఆఫీసులకు దగ్గరగా ఉన్న మురికివాడల చిరునామాలు సంపాదించాం. అంజయ్యనగర్, సిద్ధిన్నగర్, వినాయక్‌నగర్, గుట్టాల బేగంపేట, మార్తాండ్‌నగర్, హఫీజ్‌పేట్‌లలో ఉన్న మురికివాడలకు వెళ్లి అక్కడ బడికి వెళ్లే విద్యార్థులకు సంబంధించిన వివరాలు సేకరించి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు, కొన్ని చోట్ల శని, ఆది వారాల్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాం. వారితో హోమ్‌వర్క్ చేయించడం ఒక్కటే కాకుండా ఫోన్లు, లాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు...అన్నింటిపై కనీస అవగాహన పెంచుతామన్నమాట. దాంతో పిల్లలంతా మా క్లాస్లకోసం ఎదురుచూస్తుంటారు. ఆదివారం రోజైతే పుస్తకాలు, చదువులు కాకుండా వారికిష్టమైన కళకు సంబంధించి మాకు తెలిసిన విషయాలు చెప్పి వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఉన్న ఆనందాన్ని వర్ణించలేము’’ అంటూ సంతృప్తితో చెప్పారు స్వాతిరాం. జిల్లా విద్యాధికారి దగ్గర అనుమతి తీసుకుని హైదరాబాద్‌లోని 65 ప్రభుత్వపాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పే బాధ్యత తీసుకుంది యూత్ ఫర్ సేవ సంస్థ. దీనికోసం ఓ వందమంది వాలంటీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. చెత్త ఎత్తి... పరిశుభ్రతే మనని పదికాలాలపాటు పచ్చగా ఉండనిస్తుంది. చెప్పుకోవడానికి నగరమే కాని కొన్ని ప్రాంతాల్లో నిండిపోయిన చెత్తకుండీలతో ఉన్న రోడ్లు...చూస్తే జబ్బులొచ్చేలా ఉంటాయి. వాటిపై కూడా దృష్టిసారించారు ఈ యువత. ‘‘గాంధీజయంతి నాడు ఓ నలభైమంది యూత్ ఫర్ సేవ సభ్యులు నగరంలో నాలుగు ప్రధాన రహదార్లు శుభ్రం చేశారు. నెలకో, రెండు నెలలకో ఇలా రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు పెట్టుకుంటాం. శుభ్రం చేసి ఊరుకోకుండా ఆ ప్రాంతంలోని షాపులకు, ఇళ్లకు తిరిగి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దని కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. వీటితో పాటు చెరువుల క్లీనింగ్ కూడా చేస్తున్నాం. దుర్గం చెరువు, హుసేన్సాగర్, సరూర్‌నగర్ లేక్, నేరెళ్ల లేక్‌లలోని చెత్తను చాలాసార్లు తీశాం. చెరువులో దిగి చెత్తను లాగడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ‘కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకునే కుర్రాళ్ళు ఈ బండపనులేం చేస్తారని’ ఆ చుట్టుపక్కలవాసులు చాలామంది ఎద్దేవా చేసేవారు. తీరా శుభ్రం చేసిన తర్వాత చూసి బాగుందంటూ మెచ్చుకునేవారు. మాతోపాటు అమ్మాయిలు కూడా మాకు ఏమాత్రం తీసిపోకుండా పాల్గొనడం మాకు మరింత స్ఫూర్తినిస్తుంది’’ అని చెప్పారు శోభిత్. సాధారణంగా శని, ఆదివారాలనగానే టెక్ ఉద్యోగులకు విహారాలు, విలాసాలు మాత్రమే గుర్తుకొస్తాయనే ముద్రను పూర్తిగా చెరిపివేసే పనిలో ఉన్న యూత్ ఫర్ సేవ సంస్థ దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘‘మేం చేసే పనికి మాకు ప్రశంసా పత్రాలు, గుర్తింపు ఏమీ అక్కర్లేదు... సేవాభావం ఉన్న యువత మాతో చేయి కలిపితే చాలు... మాతోపాటు మా చుట్టూ ఉన్న వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది’’ అని పలికే వీరి కలలు నెరవేరాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ముందు ‘చూపు’తో... మురికివాడలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు కళ్లకు సంబంధించిన పరీక్షలు చేయించి అవరమైతే కళ్లద్దాలు ఇస్తున్నాం. ఈ ఏడాది 4000 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇచ్చాం. దీంతోపాటు మేం వెళ్లే అన్ని పాఠశాలల్లో ఆరోగ్యపట్టికలు ఏర్పాటు చేసి పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాం. - స్వాతిరాం, వైఎఫ్ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ -
యువతరాల అంతర్యానం
ఇరవై నాలుగేళ్ల ఇంటీరియర్ డిజైనర్ మనాలీ రాథోడ్, ఒక్క ఉదుటున ఇహ బంధాలన్నిటినీ తెంచుకుని... తనలోని ఆధ్యాత్మిక అంతర్లోకాలను అలంకరించుకునేందుకు ‘దీక్ష’ పట్టారు. సాధ్వి అవడం కోసం సకల విలాసాలను, సదుపాయాలను, ఆఖరికి... కనీస అవసరాలను సైతం పరిత్యజించిన ఈ సంపన్న యువతి, నిష్ఠతో కూడిన ఇంత కఠిన జీవనశైలిని ఎందుకు ఎన్నుకున్నట్లు? మనాలిలా, ఇప్పటికే భక్తిపారవశ్యపు దారిలో తదాత్మ్యతతో ప్రయాణిస్తున్న యువతరానికి ప్రేరణనిస్తున్నది ఏమిటి?! విలాసవంతమైన జీవితంలోని ఉరుకులూ పరుగులా? సాధుజీవనంలో వారు వీక్షిస్తున్న పరలోకపు సిరిసంపదలా? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో. ఆమె పేరు మనాలి రాథోడ్. సంపన్న జైన్ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసింది. కోయంబత్తూరులోని వస్త్రవ్యాపారి మోతీలాల్ రాథోడ్ కుమార్తె ఆమె. మోతీలాల్... పిల్లల్ని కాలు కిందపెట్టనివ్వకుండా, ఎండకు కందకుండా పెంచాడు. నాలుగేళ్ల క్రితం ఒక రోజు ఉన్నట్లుండి ‘తాను సాధ్విగా మారాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది మనాలి. ఈ మాట ఏ తల్లిదండ్రులకైనా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే ఇటీవల మనాలిలాగానే తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్న యువతీయువకులు ఎక్కువగానే ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న వారిలో వజ్రాల వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలు, కోట్లాదిరూపాయల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు కూడా ఉంటున్నారు. సేవామార్గాన్ని ఎంచుకుంటున్న వీరందరూ దైవత్వానికి దగ్గరగా జీవించాలనుకుంటున్నారు. జీవితాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సేవకు అంకితం చేసిన అన్నాచెల్లెళ్లు వంశీ, సుమలత. వీరిద్దరూ హైదరాబాద్‌లో పెరిగిన ఉన్నత విద్యావంతులు. ఇద్దరూ డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఈశ్వరీయ మార్గంలో నడవాలనుకునే వారికి మార్గదర్శనం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. క్రైస్తవ సన్యాసినులదీ దాదాపుగా ఇదే దారి. జీవితాన్ని ప్రభువు సేవకు అంకితం చేయాలనుకునే వాళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. సాటి మానవునికి సేవ చేయడం అంటే ప్రభువుని సేవించడమే అనేటంత విశాల దృక్పథం వీరిది. సేవ చేయాలంటే సన్యసించాల్సిందేనా? ఆశ్రమ జీవనం, గృహస్థ జీవనం... ఉన్నట్లే సాధు జీవనం కూడా ఒక రకమైన జీవనశైలి అంటారు వంశీ. ‘జీవితం అంటే ఇప్పుడు గడుపుతున్నది కాదు, సమాజం కోసం ఏదైనా చేయాలి, ముందుగా ‘నేనెవరు’ అనేది తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాలి, దానిని పదిమందికి తెలియచెప్పాలనే ఆలోచనలే వీరిని సాధు జీవనం వైపు మళ్లిస్తున్నాయి. కొన్ని మతాల్లో సన్యాసి జీవనం కఠోరంగా ఉంటుంది. ఇటీవల సాధ్విగా మారిన మనాలి రాథోడ్ సాధ్విగా మారడానికి ముందే ఇంట్లో జైనసన్యాసులు ఆచరించాల్సిన నియమాలను ఏడాదికి పైగా ఆచరించింది. రావలసిన చోటుకే వచ్చాను..! ‘బ్రదర్ వంశీ’ గచ్చిబౌలి శాంతిసరోవర్ (ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చురుకైన నిర్వహకుడు. ‘‘ఆధ్యాత్మికంగా పయనించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. క్రమంగా పెద్దయ్యే కొద్దీ సృష్టిలో ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనిపించేది. నా తోటి విద్యార్థులలో చాలామంది పరీక్షల ముందు గుడికి వెళ్లి పూజలు చేసేవాళ్లు. అలాంటి సంఘటన కంటపడిన ప్రతిసారీ ‘ఇంత స్వార్థం ఎందుకు, దేవుని మీద భక్తి ఉంటే ఎల్లప్పుడూ పూజించవచ్చు కదా!’ అనిపించేది. నాకు నేనుగా ధ్యానంలో నిమగ్నం కావడాన్ని గమనించిన మా అమ్మానాన్నలు నన్నోసారి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సంస్థకు తీసుకెళ్లారు. ధ్యానంలో ఒక్కోదశ దాటుతూ ఉంటే క్రమంగా నాకు ‘నేను రావల్సిన చోటుకే వచ్చాను’ అనిపించసాగింది. నాకు తెలియకుండానే నేను దేని గురించో పరిశోధిస్తున్నానని కూడా తెలిసింది. నాకు దేవతలంటే ఇష్టం. దైవత్వగుణాన్ని గౌరవిస్తాను. అయితే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికంటూ చేసే క్రతువులను విశ్వసించను. ప్రతి మనిషీ ఎదుటి మనిషిని గౌరవించాలి, అంతే తప్ప పూజించకూడదు. మా జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్లవారు జామున మూడున్నరకు లేస్తాం. ధ్యానం ఇత్యాదివన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సంస్థ నిర్వహణ పనుల్లో నిమగ్నం అవుతాం. ధ్యానసాధన కోసం వచ్చిన వారికి మేము విలువల ఆధారిత ఆధ్యాత్మిక చింతన గురించి వివరిస్తాం. ఉద్యోగం చేస్తూనే... ఆధ్యాత్మికత మార్గంలో..! ‘సాధుజీవనం మీద సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. ఏమీ సాధించలేని అసమర్థులే ఆధ్యాత్మిక చింతన, సమాజ సేవ అంటూ ఈ రకమైన జీవనశైలికి ఆకర్షితమవుతారనే అపోహ కూడా ఉంది. నేను 22 ఏళ్ల వయసులో ఈశ్వరీయ సేవకు అంకితం అయ్యాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కొంత ఇబ్బందికి లోనయ్యారు. నీ మీద అలాంటి ముద్ర పడితే మాకది కష్టంగా ఉంటుంది. ముందు నువ్వు ఏదైనా సాధించు, నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. అప్పుడు నీకు నచ్చిన మార్గంలో నడిస్తే అది మాతోపాటు నీకూ సంతృప్తినిస్తుంది’ అని చెప్పారు. వారు చెప్పినట్లే... నేను ఎంఎస్సీ కంప్యూటర్స్, పీజీ డిప్లమో ఇన్ మల్టీమీడియా వంటి కోర్సులు చేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూనే ఆధ్యాత్మిక బాటను కొనసాగించాను. మనసులో స్పిరిచ్యువల్ థాట్ బలంగా ఉంటే ఇతర కారణాలేవీ మనల్ని అడ్డుకోలేవు. మనిషి వికారాలకు అతీతంగా జీవించినప్పుడు, వికారాలను జయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడే మనిషి భగవంతుడు కోరుకున్న విధానంలో వెళ్లగలుగుతాడు. నేను దీనిని విశ్వసిస్తాను, కాబట్టి ఈ జీవనాన్ని ఎంచుకున్నాను’’ అన్నారు. ధ్యానంతో పరిష్కారం..! సిస్టర్ సుమలత... ‘‘చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో కలిసి సత్సంగాలకు వెళ్లేదాన్ని. అప్పట్లో మతానికి, ఆధ్యాత్మిక చింతనకీ మధ్య ఉన్న తేడా తెలిసేది కాదు. స్కూల్లో ఇతర మతాల వాళ్లు చెప్పిన విషయాలతో ఏర్పడిన సందేహాలకు సమాధానం నాకు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ధ్యానం ద్వారా ఏకత్వ భావన, ప్రశాంతత వంటివి అనుభవంలోకి వచ్చాయి నాకు చిన్నప్పుడు వెన్నునొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండేవి. రోజూ స్కూలుకెళ్లడం కూడా నా వల్ల అయ్యేది కాదు. అలాంటి సందర్భంలో ధ్యానం చేసుకుంటూ ఇంట్లోనే ఉండి చదువుకుని సెవెన్త్, టెన్త్ క్లాసులను డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆ తర్వాత ఎం.ఎ, ఎం.ఎస్సీ పూర్తి చేశాను. భగవంతుని మీద విశ్వాసం ఉంచి ధ్యానం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని నేను చాలా గట్టిగా విశ్వసించాను. అందుకే శారీరక, మానసిక బాధలతో జీవిస్తున్న వారిని చైతన్యవంతం చేయడానికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. నేనలా అంకితం అయ్యి 15 ఏళ్లయింది’’ అని చెప్పారు. ప్రార్థనలోనే అనిర్వచనీయమైన సంతృప్తి! మానవ సేవకే జీవితాన్ని అంకితం చేసిన క్రైస్తవ సన్యాసిని సిస్టర్ శోభ... దేవుని ప్రార్థనలో అసలైన సంతోషం ఉందంటారు. ‘అసలైన సంతోషాన్ని సన్యసించిన తర్వాత మాత్రమే పొందుతున్నాను’ అంటున్నారామె. ‘‘ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, ఎవరి పట్లా ఈర్ష్యాసూయలు ఉండకూడదు. డబ్బు, సుఖాలు ఇవ్వలేని ఆత్మసంతృప్తి సృష్టికర్తను ప్రార్థించినప్పుడు కలుగుతుంది. దేవుని బోధనలకు ప్రభావితం అయిన తర్వాత ప్రార్థన చేసిన ప్రతిసారీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది. దానిని మళ్లీ మళ్లీ పొందాలనే కాంక్ష కూడా పెరిగింది. సృష్టికర్త మీద ప్రేమను పెంచుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. మనిషి మరణిస్తాడు, ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మను దేవుని మార్గంలో నడిపించే పనిని మనిషి చేయాలి. అందుకోసమే నా జీవితాన్ని దేవుని కోసం, దేవుని మాటలను బోధించడానికే అంకితం చేశాను’’ అంటారామె. ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి సాధువులుగా మారిన వాళ్లు ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి సృష్టికి మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బుద్ధుడు, ఆదినాథ్ జైన తీర్థంకరుడు, జీసస్, ప్రజాపిత బ్రహ్మ... వంటి పరమాత్మస్వరూపులు చెప్పిన మాటల ప్రభావం ప్రతి తరం మీద ఉంటుంది. అయితే ఈ తరం మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉందేమో అనిపిస్తోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యువతలో చాలామంది చదువు, పరీక్షలు, ఇతర ఆనందాల్లో మునిగిపోతున్నారు. మత విశ్వాసాల ఆచరణ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. నేను లౌకికంగా నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. ఇక నుంచి సాధ్విగా జీవించాలనుకుంటున్నాను. - మనాలి రాథోడ్, జైనసాధ్వి సాధ్వి నియమాలు ఇలా ఉంటాయి! తొలి భోజనం సూర్యోదయానికి ముందు, మలి భోజనం సూర్యాస్తమయానికి ముందు తీసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత పురుషులతో సంభాషించరాదు సంవత్సరానికి రెండుసార్లు ఎవరి తలవెంట్రుకలను వారే తీసివేసుకోవాలి చాప లేదా బల్ల మీద నిద్రించాలి కాలి నడకనే పయనించాలి భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని మాత్రమే ఆరగించాలి కూర్చునే ముందు ఆ ప్రదేశాన్ని నెమలి పింఛాలతో తుడవాలి. మా అమ్మాయి మూడేళ్ల క్రితం ఒకరోజు తాను సాధ్విగా మారాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆ మాట వినగానే హతాశులయ్యాం. సాధ్విగా జీవించడం కష్టం అనీ, నియమాలు కఠినంగా ఉంటాయనీ నచ్చచెప్పే ప్రయత్నం చేశాం. కానీ గడచిన ఏడాది కాలంగా మనాలి ఇంట్లోనే సాధ్విగా జీవించింది. దాంతో ఆమె నిర్ణయం ఎంత గట్టిదో తెలిసి, ఆమెను ప్రోత్సహించాం. మనాలి ఇక మా ఇంటికి రాదు, తనని చూడాలంటే మేమే ఆమె ఉన్న చోటకు వెళ్లాలి. -మోతీలాల్ రాథోడ్, మనాలి తండ్రి తరిగిపోతున్న మానవ సంబంధాలే కారణం ఆధునిక కాలంలో తరిగిపోతున్న మానవసంబంధాలు యువత ఆధ్యాత్మిక చింతనవైపు ఆకర్షితం కావడానికి కారణమవుతున్నాయి. సన్యసిస్తున్న చాలామంది విషయంలో... వారికి బిఎండబ్ల్యుకార్లు ఉంటున్నాయి, చేతి నిండా డబ్బు ఉంటోంది, కానీ ప్రశాంతత కరువవుతోంది. డబ్బుతో దేనినైనా కొనవచ్చు, కానీ ప్రశాంతతను కాదు అని తెలుసుకుంటున్నారు. దాంతో వేదాంత ధోరణి అలవడి, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. - డాక్టర్ కల్యాణ్,సైకియాట్రి్స్ట్ -
చట్టం వచ్చినా... మనకు పట్టదా?
ప్రేమగా చెవి మెలిపెట్టి, తియ్యగా లడ్డూ తినిపించే చట్టం... రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్! ఆర్‌నుంచి పద్నాలుగేళ్ల వయసు పిల్లలంతా చదివి తీరాల్సిందే. డబ్బుల్లేవా? ప్రభుత్వం ఇస్తుంది. సీట్లు లేవా? ప్రభుత్వమే ఇప్పిస్తుంది. చదవడం ముఖ్యం. పిల్లలంతా చదువుకుని పైకి రావడం ముఖ్యం. ఇదే మన ప్రభుత్వం ధ్యేయం, లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా. ఇదెంత గొప్ప చట్టమో తెలుసా? మూడేళ్ల క్రితం - ఈ చట్టం అమలుకు ముందు మన్మోహన్ సింగ్ పెద్ద స్పీచ్ ఇచ్చారు! భారతదేశ చరిత్రలోనే ఇలా ఒక కొత్త చట్టం గురించి దేశ ప్రధాని ప్రసంగించడం అదే మొదటిసారి!! చట్టం రానైతే వచ్చింది. కంప్లైంట్లే ఎక్కువయ్యాయి. ‘ఉచిత నిర్బంధ విద్య’ బాలల హక్కు అయినప్పుడు... ఆ హక్కుకు భంగం వాటిల్లినప్పుడు ఫిర్యాదు ఎవరికి చేయాలన్నదే అసలు ఫిర్యాదు! దీనిపై ‘సాధన’ చేస్తున్న నిర్విరామ పోరాటమే ఈవారం ‘ప్రజాంశం’. ఇప్పటికీ కొన్ని గ్రామాలకెళితే...అమ్మానాన్నలతోపాటు పిల్లలు కూడా పొలానికెళ్లే దృశ్యాలు మన కంటపడతాయి. కొన్ని ఊళ్లలో అయితే బడి పక్కనే ఉన్న కల్లుదుకాణాలు కనిపిస్తాయి. గిరిజన తండాలకెళితే బడి ఆవరణలోనే కట్టేసి ఉన్న బర్రెలు, బడి వరండాల్లోనే ఏర్పాటు చేసిన సంతలు కూడా కనిపిస్తాయి. ‘విద్యాహక్కు చట్టం’ వచ్చాక కూడా ఇదేం దుస్థితి అని ప్రశ్నిస్తారు సిహెచ్ మురళీమోహన్. గత ఇరవైఏళ్లుగా ఆయన ‘సాధన’ పేరుతో విద్యాహక్కు చట్టం కోసం పోరాడి... ఇప్పుడు చట్టం వచ్చాక దాని అమలు కోసం పోరాడుతున్నారు! ‘‘2010 ఏప్రిల్ 1 తేదీని సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. ఆ రోజు విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. ప్రపంచమంతా ఒక్క గొడుగుకిందకు చేరుతున్న తరుణంలో అక్షరజ్ఞానం లేని వ్యక్తిని వింతపశువుతో కూడా పోల్చలేం. విద్యాహక్కు చట్టం కోసం ఉన్నికృష్ణన్ కోర్టులో కేసు వేసినపుడు తీర్పుసమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ...‘ప్రస్తుతం మన దేశంలో చదువుకున్నవారే జీవించినట్టు...మిగతావారంతా మృతజీవులే’ అన్నారు. అంతటి ప్రాధాన్యత గల చట్టం వచ్చాక లెక్క ప్రకారం మన విద్యావిధానాల్లో గొప్ప మార్పులు రావాలి. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రానికి మాత్రం ఆ చట్టం అందని ద్రాక్ష చందాన తయారయింది’’....అని అంటోన్న మురళీమోహన్ ఆవేదన వెనకున్న సత్యాలు వింటే అక్షర జ్ఞానం లేనివారికి కూడా ఆవేశం వస్తుంది. చదివించుకునే స్తోమత ఉంటేనే పిల్లల్ని చదివించాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ చట్టం పుణ్యాన దేశంలోని బాలలందరూ బడుల్లోనే ఉండాలి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఒక్క రూపాయి కూడా విద్యార్థి నుంచి ఆశించకుండా విద్యబోధించాలన్నది ఆ చట్టం లక్ష్యం. విద్య ఒక్కటే కాదు దానికి సంబంధించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే విద్యాచట్టం కళ్లెర్రజేస్తుంది. అవసరమైతే కర్ర పట్టుకుంటుంది కూడా. ఈ అవగాహననంతటినీ ప్రతి ఇంటి ముంగిటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మురళీమోహన్. ‘సాధన’ లక్ష్యం... బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘సాధన’ సంస్థ హైదరాబాద్‌లో 1992లో స్థాపించారు. 2010 వరకూ బాలలకు ఏ అన్యాయం జరిగినా... వీధుల్లోకి వెళ్లి ధర్నాలు, ర్యాలీలు చేసి పోరాడిన మురళీమోహన్ ఇప్పుడు నేరుగా ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పటివరకూ సాధన లక్షమంది బాలకార్మికుల్ని బడుల్లో చేర్పించింది. మెదక్, కర్నూలు, నిజామాబాద్ జిల్లాలోని 700 గ్రామాల్లో సాధన సిబ్బంది పని చేస్తున్నారు. ఆ గ్రామాల్లో పిల్లలెవరూ పనుల్లోకి వెళ్లరు. ఒకవేళ అలా జరిగితే...సాధన వెంటనే స్పందిస్తుంది. సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి అక్షరాలు దిద్దిస్తోంది. ‘‘గ్రామాల్లో బాలకార్మికుడిని బడికి పంపడం అంటే చిన్న విషయం కాదు. ముందు తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. తర్వాత ఆ చిన్నారి ఎవరిదగ్గరయితే పనిచేస్తున్నాడో ఆ పెద్దమనిషిని ఒప్పించాలి. పోలీసుల్ని, మమ్మల్ని చూసి భయపడి స్కూల్లో చేర్పించినా...ఆ కుర్రాణ్ని మళ్లీ పనిలో పెట్టేవరకూ నిద్రపోరు కొందరు. ‘అక్షరం అన్నం పెట్టాలంటే పదేళ్లు పడుతుంది. అదే వాడు పనిలోకి పోతే...వాడి పొట్టకి వాడు తెచ్చుకుంటాడు’ అనే పేద తల్లిదండ్రుల్ని ఒప్పించడం తేలికే గాని...వారి పిల్లల్ని బడిలో కొనసాగించడం మాత్రం చాలా కష్టం. అందుకే డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవడాన్ని కూడా ‘సాధన’ తన బాధ్యతగా తీసుకుంది. అలాగే పల్లెబడుల్లో ఆడపిల్లలకు రక్షణ కల్పించడంకోసం ఉద్యమిస్తోంది. హక్కుల పెట్టె... ‘‘బాలలు ఏడు, ఎనిమిది తరగతులు దాటగానే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయాన్ని నేరుగా వచ్చి మాకు చెప్పలేరు. దీనికోసం మేం వంద పాఠశాలలో ‘బాలల హక్కుల పెట్టె’ పెట్టాం. పదిరోజులకొకసారి మా సిబ్బంది వెళ్లి అందులో పిల్లలు వేసిన చిట్టీలు తీసి చదివి... వారికి న్యాయం జరిగేలా చూస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య మామూలే. ఇప్పుడు ఈ చట్టం వచ్చాక... తేలిగ్గా తీసుకోవడం కుదరదు. మా కంటపడ్డ ఏ పాఠశాలనూ మేం వదల్లేదు. అన్నింటిపై ఫిర్యాదు చేసి దగ్గరుండి కట్టించేవరకూ ఊరుకోలేదు. అలాగే సంస్థ పెట్టిన కొత్తలో ‘సాధన’ పేరుతో మాసపత్రికను నడిపించాం. అందులో మన విద్యావిధానంలో రావాల్సిన మార్పులు, దేశంలో ఇతర ప్రాంతాల్లో విద్యలో వచ్చిన మార్పులు...వంటి విషయాలు ఉండేవి. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గరున్న సిలబస్ బతకడానికి ఉపయోగపడేది కాదంటూ మేం రాసిన కథనాలు చాలామంది ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి’’ అంటూ మురళీమోహన్ తమ సంస్థ కార్యకలాపాల గురించి వివరంగా చెప్పారు. బాలల హక్కుల గురించి సాధన లాంటి సంస్థలు చాలా ఉన్నప్పటికీ విద్యాహక్కు చట్టం గురించి ప్రచారం చేసే పనిమాత్రం ‘సాధన’ స్థాయిలో జరగడం లేదనే చెప్పాలి. బస్సు యాత్ర... విద్యాహక్కు చట్టంపై అవగాహన పెంచేందుకు సాధన కొత్త పథకం తయారుచేసింది. సేవ్ ద చిల్డ్రన్‌తో చేయి కలిపి ‘విద్యా హక్కు ప్రచార రథం’ పేరుతో ఒక బస్సుని మెదక్ జిల్లా మొత్తం తిప్పుతోంది. విద్యాహక్కు చట్టం అనే ఆయుధం ప్రతి ఒక్కరు చేతబడితే మన విద్యావ్యవస్థలోనే కాదు సమాజంలో కూడా ఊహకందని మార్పులొస్తాయని అంటున్నారు మురళి. ‘‘ఈ చట్టంలో ప్రధానమైన విషయం ఎస్సి, ఎస్టి పిల్లల్లో ఇరవై అయిదుశాతం పిల్లలకు కార్పోరేట్ బడులు ఉచితంగా విద్య చెప్పాలి. ఆ పనిని ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చేయించాలి. చట్టంవచ్చి మూడేళ్లవుతున్నా...మన రాష్ట్రంలో ఒక్క ఎస్సి, ఎస్టి విద్యార్థి కూడా ఉచితంగా కార్పోరేట్ బడిలో అక్షరం నేర్చుకోలేదు. అదొక్కటేనా...బడుల్లో పిల్లల్ని గురువులు దండించడంపై రాష్ర్టంలో ఏదో ఒక పాఠశాల నుంచి రోజుకో వార్త వినిపిస్తోంది. అలాంటి సంఘటనల్లో ఉపాధ్యాయుడ్ని యాజమాన్యం మందలించడం, లేదంటే ఉద్యోగం నుంచి తీసేయడం వంటివి చేసి ఊరుకుంటున్నారు. అలాకాకుండా... కొన్ని సీరియస్ కేసుల్లో సెక్షన్ 17 చట్టం కింద కేసు పెట్టొచ్చు అన్న విషయం కూడా ఈ చట్టంకిందకే వస్తుంది. దీని గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియకపోతే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కాని దురదృష్టవశాత్తు ఉపాధ్యాయుల్లో కూడా చాలామందికి తెలియదు. ఈ అవగాహన సమస్యలన్నీ తీరాలంటే...మన రాష్ర్టంలో స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ రావాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఢిల్లీస్థాయిలో ధర్నాలు, ర్యాలీలు చేశాం. దాంతో తాత్కాలికంగా రాజీవ్ విద్యా మిషన్ కింద ‘రైట్ టు ఎడ్యుకేషన్ సెల్’ ఏర్పాటు చేశారు కాని దానివల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు. దాంతో మేం ప్రతి చిన్న విషయానికి జాతీయ బాలల హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తున్నాం. మానవ హక్కులతో సమానంగా విద్యాహక్కుకి ప్రచారం పెరగాలి. ఈ చట్ట ప్రయోజనాల్ని ప్రజలు పూర్తిస్థాయిలో పొందేవరకూ మా ‘సాధన’ పోరాటం ఆగదు’’ అంటూ ముగించారు మురళీమోహన్. దేశాభివృద్ధికి విద్యకి మించిన పెట్టుబడి మరొకటిలేదు. ప్రపంచపటంలో మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోకూడదంటే దేశంలో విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలవ్వాలి. అందరికీ అక్షరం ఉంటే...అభివృద్ధి మన దేశానికి టాగ్ లైన్ అవుతుంది. దీనికోసం మురళీమోహన్లాంటివారు చాలామంది కృషిచేయాలి. అలాంటివారు ఎదురైతే వారితో చేయి కలపడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘విద్యాహక్కు చట్టం వచ్చి మూడేళ్లు అవుతున్నా...మన రాష్ర్టంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ని ఏర్పాటుచేయలేకపోయింది ప్రభుత్వం. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చట్టం వచ్చిన వెంటనే ‘స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్’ని ఏర్పాటు చేసుకున్నారు. విద్యాపరంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం చట్టాన్ని తీసుకెళ్లి అందనంత దూరంలోనే ఉంచారు. నేనంటే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాను కాబట్టి నేరుగా ఢిల్లీలోని ‘బాలల హక్కుల జాతీయ కమిషన్’కి ఫిర్యాదు చేస్తున్నాను. మరి గ్రామాల్లోని సామాన్యులు ఫిర్యాదు చేయాలంటే ఎలా?చేసేది లేక...మా సంస్థ సిబ్బంది తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని ఇంగ్లీషులోకి మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం. వాళ్లు వెంటనే స్పందించి సంబంధిత జిల్లా కలెక్టర్‌కి సమన్లు పంపిస్తున్నారు. అదే కమిషన్ ఇక్కడ ఉంటే ఇంకా చాలా సమస్యలు బయటకి వస్తాయి. చాలామంది సామాన్యులకు న్యాయం జరుగుతుంది’’ -
ఆత్మాభిమానం షెల్టర్ ఇచ్చింది
బస్టాప్! ఇరుగ్గా ఉంటుంది. మురిగ్గా ఉంటుంది. వానకు చెరువవుతుంది. ఎండకు చెమటౌతుంది. చలికి చచ్చేచావౌతుంది. తప్పనిసరైతే తప్ప, అక్కడెవ్వరూ... ఎక్కువసేపు ఉండాలనుకోరు. అలాంటిది ఏడాదిగా బస్టాప్‌లోనే ఉంటోంది అనసూయమ్మ! అక్కడే ఉండడం, అక్కడే తినడం. పిల్లల్లేరా? ఉన్నారు. ఎనిమిది మంది! వాళ్లకు ఇళ్లే లేవా? ‘ఉన్నాయ్ కానీ, నేనుండలేను’ అంటోంది ఈ వృద్ధమాత! ఎందుకని? కొడుకుల మనసుల కంటే బస్టాపే విశాలంగా అనిపించిందా? ఈ మాటకు నవ్వుతుంది. ఏమిటా నవ్వుకు అర్థం? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’ ! ‘అమ్మని యాదగిరి గుట్టలో వదిలివెళ్లిన కొడుకు’, ‘తల్లి దగ్గర బంగారం తీసుకుని ఇంటినుంచి వెళ్లగొట్టిన పుత్రుడు’... ఇలాంటి శీర్షికలతో రోజుకొక వార్త చదువుతుంటాం. ఒక నిమిషం.. ‘అయ్యో... ఎంత దారుణం’ అనుకుని ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటాం. పెద్దవాళ్లయితే ‘కలికాలం... కన్నతల్లి అని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు...’ అంటూ రెండు మూడు శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. తల్లికి బిడ్డ బరువు కాదు. ఆమాటకొస్తే... బిడ్డలెందరయినా బరువు కాదు. కాని ఇప్పుడు బిడ్డకు తల్లి బరువవుతోంది. రోడ్డుపై భిక్షాటన చేసుకునే వృద్ధ మాతృమూర్తులందరూ బిడ్డలు లేని వారు కాదు... పట్టెడన్నం పెట్టలేని నిరుపేదబిడ్డల తల్లులు అంతకంటే కాదు. అలాంటి తల్లుల్లో అనసూయ ఒకరు. హైదరాబాద్ హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ దిగగానే చండ్రరాజేశ్వరరావు వృద్ధాశ్రమానికి ఆనుకునే ఉన్న బస్‌స్టాప్‌లో గత ఏడాదికాలంగా ఉంటున్న ఈ వృద్ధురాలిని పలకరిస్తే.... తన పేగు పంచుకున్న ఎనిమిదిమంది కొడుకుల కబుర్లు ఓపిగ్గా చెప్పుకొచ్చింది. బిడ్డలేని తల్లి అయితే అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకునేది. పదిమందిని కని పెంచిన ఆ తల్లిప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్వగా... ఏడ్వగా... నవ్వే మిగిలినట్లుంది! ‘ఫలానా బస్‌స్టాప్‌లో ఒక ముసలావిడ చాలా రోజుల నుంచి ఉంటోంది. సాయంత్రం అవగానే ఏవో కూనిరాగాలు తీసుకుంటూ వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ చాలా హుషారుగా కనిపిస్తుంది. చూడబోతే.. బాగా బతికినావిడలా ఉంది. ఎవరూ లేని వ్యక్తి మాత్రం కాదనిపిస్తుంది...’ అని అటుగా వెళ్తున్నవాళ్లు అనుకోవడం విని అక్కడికి వెళ్లినపుడు... ఆమె అప్పుడే నిద్రలేచినట్టుంది. గోడకు చేరగిలబడి తనలో తాను ఏవో మాట్లాడుకుంటోంది. ‘నీ పేరేంటమ్మా...’ అని అడగ్గానే...‘అనసూయ తల్లీ... అయినా నా పేరు నీకెందుకమ్మా’ అంటూ అడిగింది. విషయం చెప్పగానే తన గురించి చక్కగా చెప్పుకొచ్చింది. మధురైలో పుట్టి... ‘‘నేను పుట్టింది మధురైలోని మధురమీనాక్షి గుడి దగ్గర. మా నాన్న మిలటరీలో పనిచేసేవాడు. నాకు నాలుగేళ్లప్పుడే చనిపోయాడు. మా ఇంటి దగ్గరున్న ఒక పెద్దాయన అమ్మనీ, నన్నూ వరంగల్‌లోని పరకాల దగ్గర పుత్తాలపల్లి రాజేంద్రస్వామికి అమ్మేశాడు. అతను అమ్మని తన దగ్గరపెట్టుకుని నాకు ఆరేళ్ల వయసప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఆరువందల రూపాయలకు నన్ను అమ్మేశాడు. నాకు పదకొండేళ్లు వచ్చాక అతను తన కొడుకు మొగులయ్యకి ఇచ్చి పెళ్లి చేశాడు’’ అంటూ గతం గుర్తుచేసుకుంటున్నప్పుడు అనసూయ పదహారేళ్ల అమ్మాయిలా మారిపోయి తన పెళ్లినాటి కబుర్లు చెప్పుకొచ్చింది. మొగులయ్య చాలా మంచివాడు. అనసూయని కళ్లలో పెట్టుకుని చూసుకున్నాడు. వీరిద్దరి ప్రేమకు సాక్ష్యాలుగా పదిమంది పిల్లలు కళ్లముందు కదలాడుతుంటే చూసుకుని మురిసిపోయారు. కిరాణాకొట్టు... పెరుగు కుండ మొగులయ్య కిరాణాకొట్టు నడుపుతూ... అనసూయ పెరుగు అమ్ముతూ ఎనిమిదిమంది మగపిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్దచేశారు. ‘‘నా అదృష్టం బాగలేక ఇద్దరు మగపిల్లలు చిన్నప్పుడే రోగమొచ్చి సచ్చిపోయిండ్రు. మిగతావాళ్లని చేతనైనకాడికి చదివించినం. సత్యనారాయణ, వేణుగోపాల్, శంకర్లింగం, సదానందం, జయరాములు, సాంబమూర్తి, రాజేంద్రస్వామి, లక్ష్మీనారాయణస్వామి....’’ అంటూ బిడ్డల పేర్లు తలుచుకుంటుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘మిగిలిన పిల్లలంతా ఆ దేవుని దయవల్ల క్షేమంగానే ఉన్నారు’’ అంటూ ఆ కన్నీళ్లని ఆనందబాష్పాలుగా మార్చుకుంది. నాలుగేళ ్లక్రితం చనిపోయిన తన భర్తని గుర్తు చేసుకుంటూ ‘‘ఇంకా చానాకాలం బతికేటోడే.... ఏం చేస్తడు... మంచంబట్టి కొడుకులకు బరువైండు. సమయానికి నేను కూడా లేను, అన్యాయంగా సచ్చిపోయిండు మారాజు’’. ఈసారి కన్నీళ్లు ఆగలేదు. కాసేపు భర్తని తలుచుకుంటూ, తన పరిస్థితికి బాధపడుతూ ఏడ్చింది. పాతబస్తీలో వదిలేశాడు పిల్లలు పెద్దవాళ్లయ్యాక అందరికీ పెళ్లిళ్లు చేశారు. అంతా బాగుందనుకున్న సమయంలో అనసూయకు మతిస్థిమితం తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. ‘‘అవునమ్మా... ఎక్కడికో వెళ్లిపోయాను. పాపం నా భర్త నాకోసం చాలా వెతికిండంట. నాకు జబ్బు నయమై పిల్లలు, భర్త గుర్తొచ్చి ఇంటికి చేరేసరికి నా భర్త చనిపోయిండు. పిల్లలు కొన్నిరోజులు ఒకదగ్గర, కొన్ని రోజులు ఒకదగ్గర అంటూ నన్ను పంచుకున్నారు. రెండు మూడేళ్లయినంక ఎవ్వరూ చూడమన్నరు. ఒకనాడు నా పెద్దకొడుకు డాక్టరు దగ్గరికి తీసుకపోతా అని చెప్పి... ఆటోల ఎక్కించుకుని పాతబస్తీ దర్గ దగ్గర వదిలిపెట్టి వచ్చేసిండు. పిచ్చోడు... నాకు హైదారాబాద్ మొత్తం తెలుసునన్న సంగతి వాడికి తెల్వదు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే వాడు ఇక్కడ్నే ఈ ఆశ్రమంలో పని చేస్తున్నడని తెలిసి ఇక్కడే వాడి కళ్లెదురుగా ఉండాలనే పట్టుదలతో ఈ బస్టాపులో ఉంటున్న’’ అంటున్నప్పుడు అనసూయ కోపం మాటల్లోనే కాదు కళ్లలో కూడా కనిపించింది. ఆ పూజలెందుకు... బస్‌స్టాప్ పక్కనే తోపుడు బండిలో కొబ్బరిబోండాలమ్మే లక్ష్మి మాట్లాడుతూ... ‘‘నేను బండి పెట్టేటప్పటికే ఈమె ఇక్కడుంది. ఆమె కొడుకుల్లో ఒకరు గుళ్లో పూజారిగా, ఇంకో కొడుకు కొండాపూర్‌లోని ఒక వెల్డింగ్షాప్లోనూ పనిచేస్తున్నాడు. మిగతా కొడుకులు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బాగానే ఉన్నారు. అయినా, తల్లిని చూడని కొడుకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం?అలాంటి వాళ్లు ఉంటే ఎంత... లేకుంటే ఎంత’’ అని నిట్టూర్పు విడిచింది. చిన్నప్పుడు అమ్మ ధైర్యంగా ఉండి అన్ని పనులూ చక్కబెడితే మా అమ్మ చాలా స్ట్రాంగ్ అని గర్వంగా చెప్పుకుంటాం. అదే అరవైఏళ్లు దాటిన అమ్మ సలహా ఇస్తే ‘నీకెందుకు... కృష్ణా..రామా అని పడి ఉండక’ అంటాం. అలా అనే అనసూయకు బస్స్టాప్ని ఇల్లు చేశారు. ‘‘ఈ బస్టాపు నా బిడ్డల ఇల్లు కంటే విశాలంగా ఉంది. మనుషులు కనిపిస్తారు. కొందరు బిడ్డల్లా ప్రేమగా పలకరిస్తారు. ఇంకొందరు ఇంత తిండి పెడుతున్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి’’అంటూ కళ్లొత్తుకుందా పెద్దామె. ప్రతి తల్లికి బిడ్డల చిన్నప్పుడు పచ్చని జీవితం ఉంటుంది. పండుటాకై రాలి కిందపడే లోపు బిడ్డల చేతిలో నరకం చూస్తున్న అనసూయవంటి దురదృష్టవంతులైన తల్లులూ ఉంటారు. ఈమె కథ తల్లిని నిర్లక్ష్యం చేసే కొడుకులకు కనువిప్పు అయితే చాలు! - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఫేట్‌బుక్ ఫ్రెండ్స్!
ఫేస్బుక్ తెలిసిందే. పేద్ద ఫ్రెండ్షిప్ చైన్! ఎంతమందినైనా ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. దేన్నైనా షేర్ చేసుకోవచ్చు. మరి - ఈ ఫేట్‌బుక్ ఏమిటి? నెట్లో ఎక్కడా లేదే! ఉండదు. జీవితంలో ఉంటుంది. రియల్ లైఫ్‌లో. అదీ అందరి దగ్గర ఉండదు. జీవితాన్ని చూసినవాళ్ల దగ్గర ఉంటుంది. ప్రవీణ్‌కుమార్ అలానే చూశాడు... క్లోజప్‌లో! చుట్టూ అకలి, అనారోగ్యం, దుఃఖం, విషాదం... ఎలా పోగొట్టాలి... ఈ బాధల్ని, వ్యథల్ని? ఫ్రెండ్స్‌ని కలుపుకున్నాడు. కలుపుకుంటూ వెళ్తున్నాడు. అంతా కలిసి విధివంచితులకు సేవ చేస్తున్నారు. అందుకే వీరు ఫేట్‌బుక్ ఫ్రెండ్స్! మీరూ వెళ్లి కలుస్తారా? లైక్ కొట్టక్కర్లేదు. లైక్‌మైండెడ్ అయితే చాలు. అతను అందరిలోనూ తన తల్లినే చూసుకున్నాడు. కిడ్నీ వ్యాధితో తల్లి రాధిక పడిన బాధను తన బాధగా అనుభవించాడు. అలా టీనేజీలో ఆస్పత్రిలో గడపాల్సి రావడం అతడి జీవిత దృక్పథాన్నే మార్చేసింది. నెల్లూరు రామలింగాపురానికి చెందిన కోరెం ప్రవీణ్‌కుమార్ వయసు అప్పటికి 19 ఏళ్లు. పెద్దగా చదువేంలేదు. పదో తరగతి పూర్తి చేశాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లికి నెల్లూరులోని అరవింద్ ఆస్పత్రిలో ఏడాది పాటు ట్రీట్మెంట్ ఇప్పించాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం, తీసుకు రావడం ప్రవీణ్ డ్యూటీ. కిడ్నీలు పాడైన తల్లులనే కాదు, పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదన నూ దగ్గరగా చూశాడు. రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులు, వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న ప్రాణాలను చూసి కలత చెందాడు. వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఆ యువకుడిలో ఇంతింతై అన్నట్టు ‘నేస్తం’ ఫౌండేషన్ స్థాపించేలా చేసింది . సేవా రంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి వందలాది మందితో వ్యవస్థను నిర్మించాడు. రక్తం ఇచ్చి, ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడు తున్నాడు. అనాథలు, అభాగ్యుల పాలిట అమ్మైఆకలితో అలమటిస్తున్న వారికి పిడికెడన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ వయసు 27 సంవత్సరాలు. వెంకటేశ్వరరావు, మధు, వెంకట్, శివ, సతీష్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే వందలామంది స్నేహితుల (సేవకుల) బృందంతో శక్తిగా మారాడు. రక్తం దానంతో మొదలుపెట్టి.. రోగుల కోసం ఏమీ చేయలేమా అని నిరంతరం బాధపడేవాడు. ఏమీ చేయకుండా ఊరికే ఉండలేకపోయాడు. మొదట రక్తదానంతో సేవాకార్యక్రమాలు ప్రారంభించాడు. ఇప్పటికి ప్రవీణ్ ఒక్కడే ఇరవై ఐదుసార్లు రక్తదానం చేశాడు. ఒక్కోసారి 200 మంది మిత్రులతో రక్తదానం చేయించిన సందర్భాలు లేకపోలేదు. ఇలా మూడు వేల యూనిట్ల రక్తం దానం చేసిన వీరు... 2012-13 ఒక్క ఏడాదిలోనే 750 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. కదిలించిన ఘటన... ప్రతి మనిషి జీవితంలో ఒక్కో ఘటన ఒక్కో గొప్ప కార్యానికి కారణమవుతుందంటారు. ప్రవీణ్ జీవితంలో కూడా ఒక ఘటన చోటుచేసుకుంది. అతను ఉంటున్న రామలింగాపురంలో కుష్ఠురోగి, మానసిక వికలాంగుడు అయిన ఒక వ్యక్తి కనిపిస్తుండేవాడు. ఎవరైనా అన్నం పెట్టినా విసిరి కొట్టడమే తప్ప తినడం తెలియని స్థితి అతనిది. అతడిని చూసిన ప్రవీణ్ మనసు చలించింది. ‘పిచ్చివాడితో మనకెందుకులే’ అనుకోకుండా మిత్రులతో కలిసి బలవంతంగా దుస్తులు మార్పించాడు. అమ్మలా అన్నం పెట్టి ఆదరించాడు. అంతటితో అతని మనసు శాంతించలేదు. ఇలాంటి వారు ఇంకెందురున్నారో, వారికి దిక్కెవరనే ఆలోచన అతడిని వెంటాడింది. నగరంలో 50 మంది కుష్ఠురోగులు, కదల్లేని స్థితిలో 1500 మంది వికలాంగులు, వెయ్యి మందికి పైగా అనాథలు ఉన్నట్టు లెక్క తేలింది. వీరందరికీ ఒక్కపూటైనా అన్నం పెట్టాలని ప్రవీణ్ మిత్రబృందం నిర్ణయించింది. ఆలోచన గొప్పగానే ఉన్నా ఆచరించాలంటే అందుకు డబ్బు కావాలి. ప్రవీణ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ సమయంలో ప్రవీణ్‌లో ఒక కొత్త ఆలోచన కలిగింది. అన్నం వృథా కానివ్వకుండా... పుట్టినరోజు, పెళ్లిళ్లు , పెళ్లి రోజు... ఈ ఫంక్షన్లలో మిగిలిపోతున్న ఆహార పదార్థాలు వృథా కాకుండా వాటిని తీసుకెళ్లి అనాథల కడుపు నింపితే ఎలా ఉంటుందనే ఆలోచన అతని మనసులో మెదిలింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరణలో పెట్టాడు. నగరంలోని వందలాది ఫంక్షన్ హాల్స్ వద్దకు వెళ్లి తమ ఆశయాన్ని నిర్వాహకులకు వివరించారు. ‘మిగిలిన భోజనాలే కదా! వృథా కావడం కంటే ఆకలిగొన్న వారి ఆకలి తీర్చడం కంటే పుణ్యం ఏముంటుంది’ అని నిర్వాహకులు తమ అంగీకారం తెలిపారు. దీంతో నేస్తం ఫౌండేషన్ సెల్‌నంబర్లు ప్రతి ఫంక్షన్ హాల్లో ప్రత్యక్షమయ్యాయి. భోజనాలు మిగిలాయని అక్కడి నుంచి సమాచారం రాగానే, మిత్రులంతా వెళ్లి ఆ అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి... రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్స్టాండ్లలో అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్లి వారికి అందచేయడం ప్రారంభించారు. ఒక్కోరోజు వెయ్యి మందికి అన్నం పెట్టిన సందర్భాలున్నాయి. ప్రత్యేక నిధి ప్రతిరోజూ పండుగలు, ఫంక్షన్లు ఉండవు. అప్పుడు వారి ఆకలి తీరేదెలా? అందుకే మిత్రబృందం 50 మంది తమ శక్తి మేరకు తలో మూడు వేల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. వచ్చిన డబ్బుతో ఫంక్షన్లు లేని సమయంలో ప్రతి శనివారం అన్నం వండి వందలాది మంది అనాథల కడుపు నింపేవారు. ఇప్పుడు మంగళవారం కూడా అంటే వారంలో రెండు రోజులు అన్నం పెడుతున్నారు. అనాథాశ్రమాల్లో బర్త్‌డేలు మిత్రుల పుట్టినరోజులను అనాథాశ్రమాల్లో జరుపుకోవాలని ‘నేస్తం’ నిశ్చయించుకుంది. ఆ రోజులలో పండ్లు, భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికి 200 ఫంక్షన్లు అనాథాశ్రమాల్లో జరుపుకున్నామని నేస్తం సభ్యులు తెలిపారు. - బిజివేముల రమణారెడ్డి, నెల్లూరు ఫొటోలు: ముత్యాల వెంకటరమణ ‘‘రక్తం లేక ఎవరూ చనిపోకూడదు. ఆకలితో ఎవరూ అలమటించకూడదు. ఇదీ మా ధ్యేయం. అభాగ్యులకు అన్నం పెట్టే కార్యక్రమం మరింతగా విస్తృత పరుస్తున్నాం. అలాగే ఏ క్షణంలో అడిగినా వెయ్యిమందికి రక్తం దానం చేసేందుకు మా సంస్థ సిద్ధంగా ఉంది. నగరంలో బాగా పనిచేసే 10 అనాథ ఆశ్రమాలకు సహాయం చేస్తున్నాం. అవి సక్రమంగా నడిచేలా నెల్లూరులో ఇంటింటికీ వెళ్లి, ప్రతి కుటుంబం నుంచి కిలో బియ్యం చొప్పున సేకరించి ఆ సంస్థలకు సరఫరా చేయాలనుకుంటున్నాం’’. - ప్రవీణ్, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనాథలకు సేవ చేయడంలో ఆత్మసంతృప్తి ఉంది. ముఖ్యంగా కుష్ఠురోగులు అన్నం లేక అలమటించకూడదనే ఉద్దేశంతో ‘నేస్తం’ పని చేస్తోంది. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే గాకుండా, రక్తాన్ని సేకరించడం మా ప్రధాన ఆశయం. ఎవరికి రక్తం కావాలన్నా క్షణంలో ఇచ్చేందుకు నేస్తం సభ్యులం సిద్ధంగా ఉన్నాం. మా సంస్థలో చిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మానవతావాదులు మాకు సహకారం అందించి ప్రోత్సహించాలని కోరుతున్నాం. - ఆర్.వెంకట్, నేస్తం సభ్యుడు -
దులిపేశారు.. వదిలించారు
సెటిల్మెంట్. పెద్దమాట! వీళ్లు చేస్తున్నదీ సెటిల్మెంటే అయినా ఇక్కడ ఆ మాట వాడేందుకు వీల్లేదు. వీళ్లేమీ తుపాకీ చేతబట్టిన వాళ్లు కాదు. బెదిరించి, నాలుగు పీకే వీర నారీమణులూ కారు. అధికారం ఉన్నవారు అసలే కాదు. మరెవరు? మామూలు మహిళలు. సాటి మహిళ కష్టానికి స్పందించే మనసున్నవాళ్లు. ఆ కష్టానికి కారణమైన మగవాళ్ల వ్యసనాలను ప్రశ్నించినవారు. మొదట పేకల్ని దులిపేశారు. తర్వాత మద్యం మత్తును వదిలించారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సాధారణ మహిళల్లోని ఈ అసాధారణ ఉద్యమశక్తే ఈవారం మన ‘ప్రజాంశం’. పల్లెటూళ్లలో భర్తని పోగొట్టుకుని లేదా భర్త నుంచి విడిపోయి ఆర్థికంగా నష్టపోయిన మహిళల గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరు. అదే పట్టణాల్లో అయితే కేసులు, కోర్టులు అంటూ ఎంతో కొంత పోరాటం చేసే అవకాశం ఉంటుంది. పైగా పల్లెల్లో భర్తలేని మహిళ ఏం మాట్లాడినా, ఏం అడిగినా తప్పు. అలాంటివారికి ఆసరాగా నిలిచి తమ ప్రత్యేకతను చాటుకున్నారు వెల్టూరు గ్రామం మహిళలు. పెద్దగా చదువులేక పోయినా...అన్యాయానికి ఎదురునిలబడి పోరాడే శక్తిని సంపాదించుకున్న ఆ మహిళల వెనక ఉద్యమశక్తి దాగి ఉంది. ఏడాదికిత్రం వరకూ వెల్టూరు అన్ని గ్రామాలలాంటిదే. అన్యాయం, ఆస్తి...గురించి కాదు కదా సాయంత్రం అయితే మగవాళ్లతో మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. మద్యం, పేకాట కలిసి వెల్టూరుకి వెలుగుని దూరం చేశాయి. ఆరే ఆరు నెలల్లో అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు మహిళావికాసం కోసం ముందు నిలబడ్డారు ఆ ఊరి మహిళలు. ‘‘మా ఊళ్లో ఒకతను భార్యని వదిలేసి, రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బాగోగులు, కష్టాసుఖాలు పట్టించుకోవడం లేదు. ఆ కేసుని మేం తీసుకుని అతనికున్న రెండెకరాల పొలాన్ని ఇద్దరు భార్యలకూ చెరో ఎకరం రాయించాం. ఎవరి పంట వారు తీసుకునేలా ఒప్పందం కుదిర్చాం. అలాగే మరో అమ్మాయి గర్భిణిగా ఉండి అత్తింటినుంచి పుట్టింటికి వచ్చేసింది. ఏళ్లు గడిచిపోతున్నా ఆమెను తీసుకెళ్లడానికి భర్త రావడంలేదు. మేం అతని దగ్గరికి వెళ్లి భార్యని తీసుకెళ్లనందుకు ఆస్తిలో సగం వాటా రాయమని చెప్పి న్యాయపరంగా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా ఆమెకు రాయించాం. ఇలా...చాలా కేసులు పరిష్కరించి మా ఊరి ఆడపిల్లలకు న్యాయం జరిగేలా పోరాడాం’’ అని కమలమ్మ అనే మహిళ చెప్పింది. అంతే కాదు...ముగ్గురు బిడ్డల తల్లిని వదిలేసి ఊరొదిలి పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి అతని ఆస్తిలో భార్యకు, పిల్లలకు సగభాగం రాయించారు. భార్యని వదిలేసి పారిపోయిన భర్త నుంచి పెళ్లినాడు భార్యకు పెట్టిన బంగారంతో సహా ఇప్పించారు. ఇరువర్గాలకు న్యాయం చేయడం ఈ గ్రామ మహిళల సెటిల్మెంట్ ప్రత్యేకం. సెటిల్మెంట్ సిస్టమ్... ఈ మహిళల్లో ఎవరు పెద్దగా చదువుకున్నవారు లేరు. చాలావరకూ వేలిముద్రలే. ఆస్తులు, వాటాలు అంటున్నారంటే పట్టణజ్ఞానం ఏమైనా ఉందా అంటే ఏనాడు పల్లెదాటి ఎరగరు. మరి వీరికింత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే? బాధల నుంచేనంటూ టక్కున సమాధానం చెబుతారు. కావాలంటే కాసింత సాయం చేస్తామనేవారుంటారు కాని కుటుంబవ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇంటిమనుషుల్లా న్యాయం చేసే మహిళల్ని చూడాలంటే మెదక్ జిల్లా కలెక్టరేట్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్టూరు గ్రామానికి వెళ్లాల్సిందే. పత్తిని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాల్లో పత్తాలు(పేకలు) చిచ్చుపెట్టాయి, కిరాణాదుకాణాల్లో కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో పాటు దొరికే క్వార్టర్ బాటిల్స్ పేదల జీవితాల్ని పేకమేడల్లా కూల్చేశాయి. అలాంటి సమయంలో మహిళా సంఘాలన్నీ కలిసి కలిసి ఉద్యమం చేసి తమ ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏ ఉద్యమం విజయం సాధించాలన్నా... ప్రభుత్వ అధికారుల సాయం ఉండాలి. వారి దగ్గరికెళ్లి గోడు చెప్పుకుంటే అన్ని ఊళ్లలో ఉన్న బాధలే కదా అంటారు. ఆ సమయంలో వారికి తోచిన అద్భుతమైన ఆలోచన... బ్యాంకు రుణాల చెల్లింపు నిలిపి వేయడం. ‘‘మా ఊళ్లో చాలామంది మగాళ్లకు పత్తాలంటే ప్రాణం. బతుకులు కూలిపోతున్నా... వాటిని ముట్టడం మానరు. ఇక లాభం లేదని మహిళా సంఘాల మీటింగుల్లో ఈ విషయం గురించి బాగా చర్చించుకున్నాక... బ్యాంకు రుణం కట్టకుండా, గ్రామసంఘం మీటింగు రద్దు చేసి పంచాయితీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామనుకున్నాం. మా ఊళ్లో 450 మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. వీరితో పాటు మిగతా మహిళలు కూడా ధర్నాకు దిగారు. మా ఊళ్లో ఉన్న ఆరు కిరాణాదుకాణాల్లో మద్యం అమ్మడం ఆపేయాలనేది మా మొదటి డిమాండ్. అలాగే ఎవరు పత్తాలు ఆడినా తమ పర భేదాల్లేకుండా వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. గంట రెండు గంటలు కాదు, ఏకంగా మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేశాం. ఆ మూడు దినాల్లో...ఒక్క మహిళ కూడా ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. పిల్లల కోసమన్నా...వంట వండమని మగోళ్లు బతిమిలాడితే హోటళ్లలో తినిపించుకోమని చెప్పాం. మా ధర్నా సంగతి తెలిసి అధికారులు వచ్చి మా బాధలు విని మాకు సాయం చేస్తామన్నారు.’’ అని ఆర్నెల్లకిత్రం జరిగిన తమ పోరాటం మొదటిరోజుని గుర్తుచేసుకుంది వెల్టూరు గ్రామ సంఘం అధ్యక్షురాలు మల్లమ్మ. జరిమానా...బహుమతి నిరాహార దీక్ష, ధర్నా, ర్యాలీలు, షాపుల్లోకి చొరబడి సీసాలు పలకొట్టడంతో సరిపెట్టకుండా మద్యం తాగినవారికి 5000, అమ్మినవారికి 500 రూపాయల జరిమానా. తాగుతున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు చూసి, ఫిర్యాదు చేసిన వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామని మహిళా సంఘాల తరపున ప్రకటించారు. వివరాలు చెప్పినవారి విషయాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దాంతో బహుమతుల కోసం చాలామంది అమ్మినవారి, కొన్నవారి వివరాలు వీరికి చేరవేయడంతో నేరుగా దాడులు చేసి మహిళలందరూ కూడి ఆందోళన చేయడం మొదలెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను ఇంట్లోవారు కాని, బయటివారు కాని ఏ చిన్నమాట అన్నా... వారు ఊరి మహిళలందరికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు.‘‘మేం కిరాణాషాపులపై దాడిచేసినపుడు ఆ షాపు ఓనర్లు మాతో ఒక మాట అన్నారు. ‘ముందు మీ మొగోళ్లతో పత్తాలు ఆడుడు మాన్పించండి. ఆ తర్వాత మందు...’ అన్నారు. మా మాట వినాలంటే ముందు మందు మానాలి. చాయ్‌కి బదులు మందు తాగేవాడి దగ్గర మా మాట ఏం వినిపిస్తుంది అని వాదించాం. మందు బాధ తగ్గిన తర్వాత పత్తాలపై దాడికి దిగాం’’ అని వివరించింది సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మి. పత్తాల పని పట్టాం... వెల్టూరు గ్రామం పత్తి పంటలు పండించడంలో ప్రసిద్ధి. నేలసారమో, రైతుల కష్టమో పత్తి విపరీతంగా పండుతుంది.పత్తి ఎండబెట్టి మార్కెట్‌కి పంపే సమయానికి పొలాల్లోని పొదలన్నీ పత్తాలకు పరదాలుగా మారిపోతాయి. పంట అమ్మిన సొమ్ములేవని అడిగితే తాగొచ్చి తల్లీ, పెళ్లాం తేడా లేకుండా కొట్టడం...‘‘మాలోని చాలామంది మహిళలకు సెల్ఫోన్లు ఉన్నాయి. ధర్నా సమయంలో మా ఊరొచ్చిన ఎస్ఐ సారుతో పత్తాల విషయం చెప్పి ఆయన ఫోన్ నెంబరు తీసుకున్నాం. మా వివరాలు చెప్పకుండా ఆడేవారిని అరెస్టు చేయాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాం. పత్తాలు ఆడుతున్నట్టు ఎవరికి సమాచారం అందినా వెంటనే ఎస్ఐకి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాం. పోలీసులు వెంటనే వచ్చి వారిని జీపు ఎక్కించుకుని వెళ్లిపోయేవారు. ఇలా రెండు మూడు సంఘటనలు జరగడంతో పత్తాల ప్యాకెట్ల అమ్మకం ఆగిపోయింది. సమాచారం అందించిన మహిళలను ఆమె భర్త కొట్టబోతుంటే మా సంఘం మహిళలంతా వెళ్లి అడ్డుకుని అతనికి బుద్ధి చెప్పాం. ఈ ఊళ్లో ఏ మహిళా ఒంటరి కాదని ఆ సందర్భంగా గట్టిగా చెప్పాం’’ అంటూ మరో మహిళ వివరించింది. ‘‘ఆ రోజు వీరిలో ఎంత పట్టుదల ఉందో ఈ రోజూ అంతే ఉంది. ప్రతి గ్రామంలో మహిళ ధైర్యంగా నిలబడితే పల్లె పచ్చగా ఉంటుంది. దేశ అభివృద్ధి పల్లెల మీదే ఆధారపడి ఉంది’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు స్వరూప, అనూష. ఇబ్బందులకు ఎదురు నిలబడి, గెలిచిన వారి విజయాన్ని మిగతా పల్లెటూళ్లు కూడా ఆహ్వానించాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మరుగుదొడ్లు కట్టించకుంటే రేషన్ కట్..! మద్యం, పత్తాలు సమస్యలు తీరడంతో కాస్త తేరుకున్న మహిళలంతా ఊరి బాగుకోసం ఆలోచించడం మొదలెట్టారు. అందులో భాగంగా ముందుగా ఇంటింటికీ మరుగుదొడ్లు ఉంటే బాగుండుననుకున్నారు. అందుకోసం ప్రభుత్వసాయం తీసుకుని కొంత డబ్బుని పొదుపు సంఘాల నుంచి అప్పు ఇప్పించి 412 మరుగుదొడ్లు కట్టించారు. దీనికి సహకరించనివారికి రేషన్, ఫించన్ సౌకర్యాలు ఆపేస్తామని చెప్పారు. దాంతో ఊళ్లో పారిశుద్ధ్యం కూడా మెరుగయ్యేలా చేయగలిగారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఇందిరాక్రాంతి పథకం అధికారులు అండగా నిలిచారు. -
బిగ్షాట్ల భిక్షాటన!
కోట్ల రూపాయలున్నాయి. కానీ డబ్బులతో అయ్యే పని కాదు! ఏసీ రూములున్నాయి. కానీ చల్లదనంతో తీరే తాపం కాదు! ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ టైర్లు వెళ్లగలిగిన దారి కాదు! సూట్లు, బూట్లు ఉన్నాయి. కానీ ఏవీ సూటయ్యేవి కాదు! దీక్షాదక్షతలున్నాయి. కానీ మాటల వ్యాపారం కాదు! కాదు... కాదు... కాదు... కాదు!! ఇన్ని ఉండి... ఎందుక్కాదు? ఎందుకంటే అది... ‘సాధుజీవితం’! అందుకే వాళ్లు అన్నీ వదులుకున్నారు! ఒక్కరోజైనా ‘సాధు సంపన్నంగా’... ఉండాలనుకున్నారు. నోటికి వస్త్రం కట్టుకుని... మౌనంగా భిక్షాటనకు బయల్దేరారు. చివరికి ఏం సాధించారు? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో. మడత నలగని సూట్లూ, కాలికి మట్టి అంటనివ్వని కార్లూ, కాస్తయినా చెమటపట్టనివ్వని ఎయిర్కండిషనర్లూ, మెత్తని డబుల్కాట్లూ... ఇన్నిరకాల సౌకర్యాల మధ్య అత్యంత ‘ఖరీదైన’ జీవితం గడిపే ఆ సంపన్నులు...తాము ధనవంతులమని మరిచిపోయారు. ధవళవస్త్రాలు ధరించారు. కార్లు వదిలారు. కాలిబాట పట్టారు. ‘బిజీ’నెస్ వదిలి రోజంతా భిక్షాటన చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే సన్యసించారు. ఈ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఓ పూటంతా మౌనవ్రతం ఉండమంటే ప్రాణం పోయినట్టు ఫీలైపోయేవాళ్లుంటారు. టీవీ చూడకుండా క్షణం గడపలేని వాళ్లు, గంటసేపు సెల్‌ఫోన్ మోగకపోతే గిలగిలలాడేవాళ్లు సగటుమనుషుల్లోనే ఎందరో! అలాంటిది కోట్లరూపాయల వ్యాపారాలు చేసే సంపన్నుల సంగతి ఇక చెప్పేదేముంది... కాలాన్ని కాసుల్తో లెక్కించే ఈ రోజుల్లో... వ్యాపారం నుంచి కాస్త విరామం తీసుకోవడానికే విలవిల్లాడే పరిస్థితుల్లో ఒక బిజినెస్ పర్సన్ రోజంతా అన్నింటికీ దూరంగా గడపడమంటే మాటలు కాదు. అటువంటిది ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా వెయ్యిమంది అదే పనిచేస్తే... కోట్లరూపాయల లావాదేవీలు స్తంభించడం అటుంచి... కార్లు, ఏసీలు ఆఖరికి ఫ్యాన్లూ కూడా లేకుండా ఒక రోజంతా గడపడం, ఏమీ లేనితనాన్ని అనుభవిస్తూ యాచించడం... సాధ్యమేనా? ‘భిక్షూదయ’ దీన్ని సాధ్యం చేసింది. ఏమిటీ ‘భిక్షూదయ’? మన సంప్రదాయంలో సన్యాసులకు, సాధుపుంగవులకు విశిష్ట స్థానం ఉంది. వారి జీవనశైలిని గొప్పగా కీర్తిస్తాం కానీ, అనుసరించలేం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి... కుటుంబాన్ని, సౌకర్యాలను వదిలి పూర్తిగా ఒక సాధువుగా మారలేడు. ఈ నేపథ్యంలో జైన్ కమ్యూనిటీ... ప్రస్తుత జైనుల పండుగ రోజుల్ని పురస్కరించుకుని... ఓ వైవిధ్యభరితమైన ఆలోచన చేసింది. వ్యాపారం, లాభనష్టాలు అంటూ అందులో కూరుకుపోతూ... సాధువులు, సన్యాసులు, ప్రవక్తలు వచ్చినప్పుడు మాత్రం ఇంటికి తీసుకువచ్చి వారిని పూజించి దీవెనలు అందుకోవడంతో సరిపెట్టుకోకుండా... ఒక సాధువు జీవితంలోని నిజమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని ఆధునికులకు అందించాలని జైన్ సమాజం తలచింది. ఒక్కరోజైనా పూర్తిగా సాధు జీవితాన్ని అనుభవించే అవకాశమది. దానికి పెట్టిన పేరే భిక్షూదయ. క్షణం తీరిక లేకుండా వ్యాపార వ్యవహారాల్లో మునిగితేలే వారిని ఒప్పించి అరుదైన విన్యాసానికి తెరతీసింది భిక్షూదయ. ఈ కార్యక్రమానికి వందమంది వచ్చినా చాలనుకుంటే... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, వెయ్యిమంది సంపన్నులు సాధువులుగా మారి ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఒక అద్భుతమైన, అపురూపమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా అందర్నీ ఆకట్టుకుంది. బొల్లారంలోని సదార్ బజార్, బర్టన్ రోడ్లో ఉన్న శివ్కుశాల్ గార్డెన్‌లోని ఓ ఇల్లు. ఆ ఇంట్లో... కోట్లరూపాయల వ్యాపారం చేసే వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలు, వృత్తి నిపుణులు... అన్నీ త్యజించి (తాత్కాలికంగా) సన్యాసులుగా మారి, ఒకచోటకు చేరారు. ప్రార్థనా మందిరంగా పిలువబడే ఈ భవనంలో అత్యంత నిరాడంబరంగా, ఆధునికతకు ఎటువంటి అవకాశమూ ఉండకూడదని ఎటువంటి విద్యుత్ సౌకర్యాలూ లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా గడిచింది? ఆ రోజు ప్రార్థన, శాంతి ర్యాలీలతో ప్రారంభమైంది. పాదరక్షలు లేకుండా, చోల్పాట, దుపట్టి అని పిలిచే దుస్తులను ధరించారు. ముహపటి పేరుతో పిలిచే మాస్క్‌లాంటిది నోటికి కట్టుకున్నారు. అనంతరం భిక్షువులుగా మారారు. (ఆ రోజున భిక్షువులు కోరికలతో, ఆకాంక్షలతో ఉన్న అనుబంధాల్ని, హద్దులను తెంచుకునేందుకున్న అడ్డంకుల్ని అధిగమించి ఆత్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తారు. మానవులెవరి హానికీ తాము కారణం కాకుండా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. అంతర్గత ఆలోచనల నియంత్రణ సాధించేందుకు అవసరమైన ‘సమైక్య’ పేరిట ధ్యానం, బ్రహ్మచర్యం అలవరచుకుంటారు) అడగడం అలవాటే లేని వీరు... భిక్షాటనకు సైతం వెరవక సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి యాచించారు. అదీ మౌనవ్రతం పాటిస్తూనే. అలావచ్చిన భిక్ష ‘గోచారి’ని ప్రార్థనామందిరంలో పంచుకున్నారు. ఇందులో ఒక్క మెతుకు కూడా వృథా పోనీయకుండా, తినగా మిగిలిన ఆహారం ఏమైనా ఉంటే... అన్నార్తులకు అందజేశారు. ప్రతిక్రమణ్ (సకల చరాచర జీవుల పాపాలను క్షమించాలని చేసే ప్రార్థన)తో ఈ దీక్ష ముగిసింది. అనంతరం ‘తమ జీవిత కాలంలో భూమి మీద నివసించే ఏ ప్రాణికీ ఎటువంటి హానీ తలపెట్టము’ అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వెయ్యి భిక్షపాత్రల్ని ఉచితంగా అందించడంతో పాటు వీరందరితో కలిసి ఆధ్యాత్మిక ఆస్వాదన చేయడం ప్రశాంత చిత్తాన్ని అందించిందని, ఇది తనకు అంతర్గతంగా ఎంతో శక్తిని అందించిన భావన కలుగుతోందని, దీని ప్రభావం తనమీద కనీసం మరో ఆరు నెలలైనా బలంగా ఉంటుందని వీరికి అవసరమైన భిక్షాపాత్రల్ని సమకూర్చడమేగాక, ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆదర్శ్గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కేవల్‌చంద్ రాథోడ్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపసంహారం... ఏమీ లేకుండా ఈ లోకంలోకి వచ్చే మనం, ఏమీ లేకుండానే ఇక్కడినుంచి నిష్ర్కమిస్తాం. ఎందరో మనుషులు, ఎన్నెన్నో అనుబంధాలు, ఆశలు, ఆకాంక్షలు, జయాపజయాలు... ఇవన్నీ ఆగమనానికి, నిష్ర్కమణకు మధ్య చోటు చేసుకుంటాయి. ఇదంతా మెలకువ రాగానే మాయమయ్యే కలలాంటిదేనని తెలిసినా అందులోనే కూరుకుపోతాం. నిద్రావస్థ నుంచి... అప్పుడప్పుడైనా మేలుకోవడం అవసరం. ఆ తరహా మేలుకొలుపే ‘భిక్షూదయ’. అశాశ్వతంగా ఎన్నున్నా... శాశ్వతమైన ఏమీలేనితనాన్ని అంగీకరించగల సామ ర్థ్యాన్ని సంతరింపజేసే ఇలాంటి కార్యక్రమాల అవసరం ఈ ఆధునిక కాలంలో ఎంతైనా ఉంది. - ఎస్.సత్యబాబు కంటి ఆసుపత్రి నిర్మాణం కోసం... జైనగురు శ్రీ గౌతమ్ మునీజీ మహరాజ్, ఆయన శిష్యుడు శ్రీ వైభవ్ మునీజీలు చెన్నై నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేశారు. దీని ద్వారా సేకరించిన నిధులతో హైదరాబాద్‌లోని బొల్లారం చుట్టుపక్కల ఉన్న నిరుపేదల కోసం అన్ని సదుపాయాలు ఉండేలా అత్యాధునికమైన కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అద్భుతమైన అనుభవం... ఒక నియమబద్ధత కలిగిన సన్యాసి జీవితం అత్యంత కఠినమైనది. అయితే ఇది మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించడమే కాక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తుంది. స్వయంగా సాధు జీవనం ఆస్వాదించడం అనేది నాకు ఒక పూర్తి భిన్నమైన, అద్భుతమైన అనుభవం. - మనోజ్ కొఠారి, కొఠారి క్రెడిట్ కార్పొరేషన్ నన్ను నేను తరచి చూసుకునేందుకు... నాలో నేను తరచి చూసుకునేందుకు ఈ సాధు జీవితం అరుదైన అవకాశాన్ని అందించింది. ఆధునిక ప్రపంచపు ప్రభావానికి ఎంతగా లోనవుతున్నా... మనల్ని మనం సమీక్షించుకునేందుకు ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ముఖ్యం గా యువతకు ఇటువంటివి చాలా అవసరమని నా అభిప్రాయం. - మంగిలాల్ సురానా, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ -
కామాఠి కలువ
మర్యాదస్తులు తప్పుకుని తిరిగే ‘కామాఠిపురా’ ప్రాంతానికి చరిత్రలోనే తొలిసారిగా గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెట్టిన శ్వేతాకట్టి... పడుపువృత్తిలో ఉన్నవారికే కాకుండా, యావత్ మహిళాలోకానికే స్ఫూర్తిదాయకం అనదగిన అడుగు వేసింది. చదువులో అసమానమైన ప్రతిభను కనబరిచి, దాదాపు ముప్పై లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో అందివచ్చిన ఆహ్వానంపై ఉన్నత విద్యకోసం ఇటీవలే అమెరికా వెళ్లింది! ఊహ తెలిసిన నాటి నుంచి నిత్యం జుగుప్సాకరమైన పరిస్థితుల మధ్య దుర్భర జీవనం సాగించిన శ్వేత జీవితంలో ఎన్ని మలుపులున్నాయి? మలుపు మలుపులో ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి? ఇదే ఈవారం ‘ప్రజాంశం’... ‘‘ఏయ్ పిల్లా... వస్తావా?’’... ఏ ఆడపిల్లా వినకూడని మాట ఇది. ఒక ఆడపిల్లని ఏ మగాడూ వేయకూడని ప్రశ్న ఇది. కానీ ఎంతోమంది మగాళ్లు నన్నా ప్రశ్న అడిగారు. పదకొండేళ్ల వయసులో... అరుగుమీద నిలబడి తల దువ్వుకుంటున్నప్పుడు... తొలిసారి విన్నానా ప్రశ్నని! ఏం జవాబివ్వాలో అంతుపట్టలేదు. చేతిలో దువ్వెనను వదిలేసి లోనికి పరుగెత్తుకుపోయాను. అప్పుడు నాకు తెలీదు... ఆ ప్రశ్న నుంచి నేను చాలాసార్లు పారిపోవాల్సి వస్తుందని. కామాఠిపురా... ఆసియాలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో రెండోది. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా, బాలీవుడ్ లాంటి ప్రతిష్టాత్మక విషయాలే కాదు... కామాఠిపురా లాంటి కారు చీకటి కమ్మిన ప్రదేశాలూ ఉన్నాయి. నాగరిక జనాలే కాదు... అనాగరికమైన ఆచారాల కారణంగా అట్టడుగుకు కూరుకుపోయిన జీవితాలూ ఉన్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనం... మా అమ్మ వందన! అమ్మది కర్ణాటక. తాతయ్య బ్రోతల్ హౌస్ నడిపేవాడు. తాగి తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకున్నాడు. సత్తువ చచ్చిపోయాక బ్రోతల్ హౌస్ చూసుకొమ్మని అమ్మమ్మకు చెప్పాడు. అప్పుడే అమ్మమ్మ ఆలోచనలో పడింది. తమ తర్వాత తన కూతురు మళ్లీ ఇదే పని చేయాలా అని ఆందోళన చెందింది. తన బిడ్డ జీవితం తనలా కాకూడదని, తనకో మంచి జీవితాన్ని ఇవ్వాలనీ అనుకుంది. కానీ, అమ్మ ఆ దిశగా ఆలోచించలేకపోయింది. ప్రేమలో పడింది. అది కూడా... అప్పటికే పెళ్లి కుదిరిన వ్యక్తితో. అతడెలాగూ తాళి కట్టడు కాబట్ట్టి... పెళ్లి కోసం ఆశపడలేదు అమ్మ. కానీ అతడి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కావాలనుకుంది. దాని ఫలితంగా పుట్టినదాన్ని నేను! అతడికి పెళ్లయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా పోవడంతో అమ్మ కష్టాల్లో కూరుకుపోయింది. తనకవన్నీ అలవాటైపోయినా, నా కడుపు మాడ్చకూడదని, నాకోసం రాష్ట్రాన్ని దాటి, కామాఠిపురా చేరింది. జీవితం గురించి చాలామంది రచయితలు, కవులు అందంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారయినా కామాఠిపురాను చూసివుంటే వాళ్లలా రాసి ఉండేవారు కాదేమో! ఎందుకంటే, అక్కడ ఉన్నవాళ్లెవరికీ జీవితమే ఉండదు. ఏవేవో కారణాల చేత అక్కడకు వచ్చి, ఆ సాలెగూటి నుంచి బయటపడలేక విలవిల్లాడుతుంటారు. మనసు మొరాయిస్తున్నా పట్టెడన్నం తినాలంటే తనువు తనది కాదనుకోవాలి. మరో మార్గమే లేదు. అందుకే వారి జీవితాల్లో జీవం ఉండదు. అక్కడ పుట్టి పెరిగిన నాలాంటి అమ్మాయిల చెంపల్లో చారలు కట్టిన కన్నీళ్లు తప్ప గులాబీనిగ్గులు ఉండవు. అక్కడి తల్లుల కళ్లల్లో విషాదం తప్ప వెలుగన్నదే కనిపించదు. తాగి తూగి వాగే విటుల అరుపులు, నిస్సహాయ మహిళల ఆక్రందనలు, తల్లుల దారుల్లో నడవడం తప్ప మరో మార్గమే లేదనుకునే ఆడపిల్లలు, పేదరికం... ఇలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగాను నేను. దేవదాసీకి జన్మించిన ఆడపిల్లకి అంతకన్నా గొప్ప బాల్యం దక్కుతుందా? సెక్స్‌వర్కర్ల మధ్యే ఉన్నా మా అమ్మ సెక్స్ వర్కర్ కాదు. ముంబై వచ్చాక మరో వ్యక్తికి చేరువయ్యింది. అతనితోనే ఉండిపోయింది. కానీ పాపం... అమ్మకు సుఖమంటే ఏంటో తెలీదు. తాగి వచ్చి తూలనాడే నాన్న మాటల్ని మౌనంగా భరించడమే తనకు తెలుసు. తాగింది దిగేవరకూ చితకబాదుతుంటే చీరకొంగును నోట్లో కుక్కుకుని బాధను అణచుకోవడమే తెలుసు. నేను తనలా కాకుండా కాపాడుకోవడం కోసం రాత్రీపగలూ కష్టపడి పనిచేయడమే తెలుసు. తన అవస్థను, ఆవేదనను చూసి ఎప్పుడూ అనుకునేదాన్ని... ఎందుకీ పిచ్చి అమ్మ ఇవన్నీ భరిస్తోంది, నాన్నను వదిలేసి ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. కానీ పిచ్చిది అమ్మ కాదు... నేను. మేము ఉంటున్న చోటు నుంచి కదలడం సాధ్యం కాదని, కదిలినా ఆదుకునే నాథుడే ఉండడని నాకు తెలీదు. ఆ నిజం తెలిసి రావడానికి నేను కొన్ని భయంకర అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది. ఊహ తెలిసేనాటికి నాకు నాన్నగా ఉన్న వ్యక్తి... లోకం తెలిసేనాటికి నాన్న కాకుండా పోయాడు. అమ్మ అతడితో ఉండిపోయిందని, అతడు నాకు నాన్నలా వ్యవహరిస్తున్నాడని అర్థమయ్యింది. అప్పుడే తొలిసారి దేవదాసీ అన్న పదానికి నిర్వచనం తెలిసి వచ్చింది. అతడిని నేను నాన్న అనే అనుకున్నాను. అతడి నుండి నాన్న ప్రేమనే కోరుకున్నాను. కానీ అతడు మాత్రం నానుండి వేరేదో కోరుకున్నాడు. క్షోభపెట్టాడు. ‘‘నీ మనసు నీకంటే వికారంగా ఉంది’’... అతడన్న ఆ మాట నా మనసును ఎన్ని ముక్కలు చేసిందో నాకు మాత్రమే తెలుసు. అవును... నేను వికారంగానే ఉన్నాను. నల్లగానే ఉన్నాను. అందంగా లేను. కానీ అందులో నా తప్పేముంది! నా రూపాన్ని చూసి అంతా నవ్వేవాళ్లే. నల్లపిల్ల, నల్లమొద్దు, నల్లదిమ్మ... ఇవా నా పేర్లు? నల్లగా పుట్టాలని నేను కోరుకున్నానా! నల్లగా ఉన్నంత మాత్రాన నేను మనిషిని కాకుండా పోతానా! ఇంటి దగ్గర, బడిలోను, నా ఈడు పిల్లలంతా నన్ను ‘పేరులో తెలుపు... ఒళ్లంతా నలుపు’ అంటూ అవహేళన చేస్తుంటే ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చివరకు తండ్రిలా భావించినవాడు కూడా అదే మాట అన్నాడు. అది కూడా ఎందుకు? అతడి వికారానికి నేను తలవంచనందుకు. ఏం... దేవదాసీ కూతురయితే ఇలాంటి వాటికి తలవంచి తీరాలా? గౌరవంగా బతకాలని అనుకోకూడదా? ‘‘ఏం చేయాలనుకుంటున్నావ్?’’... మా పక్కింటి ఆంటీ అడిగింది. ‘‘ఏముంది చేయడానికి?’’... లైట్‌గా తేల్చేశాను. ‘‘బాగా చదువుకో’’... చెప్పింది. ‘‘దానివల్ల ఏంటి ఉపయోగం!’’ అన్నాన్నేను. ‘‘అలా అనొద్దు శ్వేతా... చదువు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. చదువు లేకపోవడం వల్లే మేమంతా ఇక్కడ మగ్గిపోతున్నాం. నాలుగక్షరాలు వచ్చివుంటే, మాకీ గతి పట్టేది కాదు’’... ఆమె మాటలు వింటూండిపోయాను నేను. వాళ్ల జీవితాలెలా నలిగిపోతున్నాయో, వారి నిస్సహాయత ఏమిటో బోధపడింది. నిరక్షరాస్యతే వారి నిస్సహాయత. నాకా పరిస్థితి రాకూడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకుని తీరాలని నిర్ణయించుకున్నాను. నా కోరికను విని అమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది... ఆనందంతో! కామాఠిపురాకు దగ్గరలో ఉన్న ‘అప్నే ఆప్’ అనే బడిలో చేర్పించింది నన్ను. ఆ బడిని క్రాంతి అనే ఎన్జీవో నడుపుతోంది. దాని స్థాపకులు రాబిన్ చౌరాసియా, త్రినా తాలూక్దార్. వారి పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. తమ సంస్థ ద్వారా సెక్స్ వర్కర్ల జీవితాలను బాగు చేయడానికి కృషి చేస్తున్నారు రాబిన్, త్రినాలు. సెక్స్‌వర్కర్లను, వారి పిల్లలను తీసుకెళ్లి, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. వాళ్లు నా కథ విన్నారు. చదువుకుంటేనే జీవితం ఉంటుంది అన్న నా అభిప్రాయం, పట్టుదల వారికి నచ్చాయి. కామాఠిపురా నుంచి నన్ను బయటకు తీసుకెళ్లారు. చదివించారు. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు నేను రాసిన ఓ ఆర్టికల్‌ని, నా ప్రొఫైల్‌తో పాటు విదేశీ యూనివర్శిటీలకు పంపారు. అది చూసి ఇంప్రెస్ అయిన న్యూయార్క్‌లోని బార్డ్ యూనివర్శిటీ నాకు స్కాలర్షిప్ను మంజూరు చేసింది. నా జీవితం ఇప్పుడు నేను కోరుకున్నట్టుగా ఉంది. నా చుట్టూ డేగకళ్లు లేవు. అవమానాలు లేవు. అంతా ఆనందమే. కానీ నాలా బయటకు రాలేక పోతున్న వారి సంగతేంటి! వాళ్లకోసం ఏదైనా చేయాలి. గతాన్ని వదిలేసి భవిష్యత్తువైపు కొత్తగా అడుగులు వేయడమెలాగో వాళ్లకు చెప్పాలి. సైకాలజీయే చదవాలనుకోవడానికి కారణమదే. చదువు పూర్తి కాగానే వచ్చి, ఓ కౌన్సెలింగ్ సెంటర్ పెడతాను. ఏ అమ్మాయీ ఆ జీవితం వైపు వెళ్లకుండా చూస్తాను. ఒకవేళ వెళ్లినా బయటకు తీసుకొస్తాను. అంతా నేను అనుకున్నట్టు జరిగితే... నాలా మరికొందరు పట్టుదలగా ప్రయత్నిస్తే... కామాఠిపురాలే ఉండవు. వందనలు, శ్వేతలు కూడా ఉండరు. నా లక్ష్యం అదే! కూర్పు, కథనం: సమీర నేలపూడి నా చదువు, జీవితం వారికోసమే! సెక్స్ వర్కర్లన్నా, దేవదాసీలన్నా అందరూ చిన్న చూపు చూస్తారు. అది ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే, ఎవరూ కావాలని అలా అవ్వరు. పరిస్థితులు అటువైపు నడిపిస్తాయి. బల వంతంగా అందులోకి తోస్తాయి. వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ అందరు ఆడపిల్లల్లాగా ఆనందంగా బతకాలని ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ మురికికూపంలో దిగాక బయటపడటం తేలిక కాదు. ఒకవేళ బయటపడినా తమను ఎవరు ఆదరిస్తారు, ఎవరు గౌరవిస్తారు అనే సంశయం ఆ దిశగా ఆలోచించనివ్వదు. అందుకే వాళ్లు అందులోనే మగ్గిపోతుంటారు. ఇవన్నీ తెలిశాక నేను వాళ్ల గురించి ఆలోచించకపోతే ఎలా! మా అమ్మను, మా అమ్మలాంటి ఇతర స్త్రీలను, వారి కష్టాలనూ కన్నీళ్లనూ చూసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉంటే ఎలా! అందుకే నా చదువు, జీవితం వాళ్ల కోసం, వాళ్ల బాగు కోసమే అంకితం చేయాలనుకుంటున్నాను.