శిఖరస్వారీమణులు! | The will power adventurous women | Sakshi
Sakshi News home page

శిఖరస్వారీమణులు!

Published Mon, Oct 28 2013 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

శిఖరస్వారీమణులు!

శిఖరస్వారీమణులు!

శిఖరాన్ని లొంగదీసుకోవడం అంటే...
 వెయ్యి గుర్రాల్ని ఒకేసారి అదిలించడం!
 ఎవరి వల్ల అవుతుంది?
 వీరులు? కష్టం. శూరులు? కష్టం.
 అరివీర భయంకరులు? కష్టం.
 దృఢకాయులైన కింకరులు? కష్టం.
 ఇంకెవరి వల్ల అవుతుంది?
 విల్ పవర్ ఉండాలి... డేర్ డెవిల్స్‌లా ఉండాలి.
 ఉంటే?
 నారీమణులు సైతం శిఖరాన్ని అధిరోహిస్తారు.
 ఓపన్ గంగ్నమ్ స్టెయిల్‌లో దౌడు తీయిస్తారు.
 ఈ నలుగుర్నీ చూడండి.


 శిఖరాలు ఎంత చిన్నవై కనిపిస్తాయో!

సాహస యాత్రలు చేస్తున్నవారిలో సాధారణ గృహిణుల దగ్గర్నుంచి చిరుద్యోగినుల దాకా ఉన్నారు. వడ్డించిన విస్తరి లాంటి జీవితమున్నా... కేవలం తమను తాము నిరూపించుకోవడం కోసం, రేపటి భవిష్యత్తును మరింత సమర్థవంతంగా మలచుకోవడం కోసం వీరు అడ్వంచరస్‌గా మారుతున్నారు. వ్యయప్రయాసలను ఎదుర్కొని మరీ సంక్లిష్టమైన సాహసాల కలలను సాకారం చేసుకుంటున్నారు. ఆ మహిళలతో మాట్లాడితే... కొండలు పిండి చేసే వాళ్లెక్కడి నుంచో ఊడిపడలేదని అవగతమవుతుంది. ప్రయత్నం చేస్తే, మన కాలక్షేపపు అభిరుచులనే అడ్వెంచరస్‌గా మారిస్తే... జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునని అర్థమవుతుంది.
 
138: ‘‘లక్ష్యాలు ఉన్నతంగా ఉంటే మనం పెద్దవిగా భావించే చాలా సమస్యలు అసలు సమస్యలే కావని అర్థం అవుతాయి’’ అని కిరణ్మయి అంటారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్మయి...ఇటీవలే దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. అందులో విశేషం ఏమీలేదు. డబ్బుంటే ఎవరైనా వెళ్లిరావచ్చు. కాని అక్కడి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. అది ఉంది కాబట్టే కిరణ్మయి కిలిమంజారో పర్వతారోహణ చేసిన తొలి తెలుగు వనిత అయ్యారు. ‘‘పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక, వాళ్ల భవిష్యత్తు వాళ్లు చూసుకోగల సత్తా వారికి అందించాక... అప్పుడు నా గురించి నేను ఆలోచించుకున్నాను.

చిన్నప్పుడు సరదాగా కొండకోనల్లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నాను. సహజమైన, సాహసోపేతమైన అనుభవాల్ని రుచి చూడాలనుకున్నాను’’ అని చెప్పారామె. అనుకోవడమే తడవు ‘గ్రేట్ హైదరాబాద్ అడ్వంచరస్ క్లబ్’ లో చేరడం ద్వారా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఒకటొకటిగా పర్వతాలను అధిరోహిస్తూ ఇప్పటికి 138 ట్రెక్స్ పూర్తి చేశారు. వీటన్నింటిలోకి కిలిమంజారో అత్యంత ప్రమాదకరమైన అనుభవం అంటారామె. ‘‘కిలీ మంజోరా పర్వతప్రాంతంలో రాత్రి 12గంటలకు ప్రారంభమై ఉదయం 5గంటల లోపు ట్రెక్ పూర్తవ్వాలి.

నేను వెళ్లినప్పుడు వెదర్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఎక్కేటప్పుడు పాములు, తేళ్లూ, తీవ్రమైన విషం చిమ్మే జైలు... వరుస కట్టాయి. హఠాత్తుగా వడగళ్ల వాన పడడం మొదలైంది.  ఏమాత్రం తేడా వచ్చినా కోమాలోకి వెళ్లాల్సి వచ్చేది. పరుగు తీయడం ఆపేస్తే కండరాలు బిగుసుకుపోతాయి. అంతటి చలి’’ తన అనుభవాన్ని వివరిస్తున్నపుడు ఆమెలో ఆ జ్ఞాపకం తాలూకు ఉద్వేగం కనపడింది.
 
రన్నింగ్, సైక్లింగ్... వీటన్నింటిలోనూ కిరణ్మయి రాణిస్తున్నారు. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్, కోయంబత్తూర్‌లో జరిగిన మారథాన్‌లో 2గంటల 20నిమిషాల్లో 21.1 కి.మీ పరుగు పూర్తి చేసి 10వ స్థానం సాధించారు. స్విమ్మింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే జుకాడో అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ ఫార్టీ ప్లస్ టీచర్...  ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్ అన్నీ సాహసయాత్రల ద్వారా పొందగలిగానని చెప్పారు.

 127: ‘‘మహారాష్ట్రలోని కోకన్‌కొడా ప్రాంతంలో చేసిన 1800 అడుగుల దూరం రోప్లింగ్ (తాడుతో వేళ్లాడుతూ పర్వతాలు, లోయల నడుమ చేసే సాహసం) అద్భుతమైన అనుభవం’’ అని గుర్తు చేసుకున్న ఫరీదా...  ఇటు కుటుంబ బాధ్యతల్ని, అటు ఉద్యోగ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూనే తన సాహసయాత్రల్ని కొనసాగిస్తున్నారు. ‘‘ఇప్పటికి దాదాపు 127 ట్రెక్స్ పూర్తి చేశాను’’ అని ఉత్సాహంగా చెప్పారు ఫరీదా. చిన్నప్పుడు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగిన హాబీ వల్ల ఏమో రోప్లింగ్ తన అభిమాన సాహసక్రీడగా మారిపోయిందని చెప్పే ఫరీదా మహారాష్ట్రలోని కార్జత్ జలపాతాల మీదుగా చేసిన రోప్లింగ్‌ను ఎప్పటికీ మరచిపోలేనంటారు. సినిమాలు, టీవీల ముందు వృథా చేసే సమయాన్ని ఇలా మళ్లిస్తే... ఆత్మవిశ్వాసం పెరగడం లాంటి లాభాలెన్నో కలుగుతాయని ఆమె మహిళలకు సూచిస్తున్నారు.

 112: ‘‘పర్వతాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ నుంచి నక్షత్రాల్ని చూడడం ఎంత బాగుంటుందో’’ అంటున్న పద్మజలో గొప్ప భావుకురాలు కనిపిస్తుంది. ఇప్పటికి 112 పర్వతాలను అధిరోహించానని ఆమె చెప్పినప్పుడు బాప్‌రే...అనిపిస్తుంది. ‘‘పెళ్లికాకపోవడం సాహసయాత్రలకు సంబంధించి నాకున్న అదనపు అర్హత’’ అంటూ నవ్వేస్తారు పద్మజ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్‌ఎపి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న పద్మజ పశ్చిమకనుమలలోని సహ్యాద్రి రేంజ్‌లో హరిశ్చంద్రఘాట్ తన అభిమాన ట్రెక్ అని పేర్కొన్నారు.
 
71: అడ్వంచరస్ క్లబ్‌లో సభ్యురాలిగా మూడేళ్ల వయసున్న స్వాతి... సాహస యాత్రికురాలిగా మారకముందు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు స్వంతంగా ఆన్‌లైన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ‘‘ఈ అడ్వంచర్స్ వల్ల మన జీవితాన్ని మనమే శాసించుకునే తత్వం అలవడుతుంది’’ అని చెప్పే స్వాతి హైదరాబాద్‌లోని మౌలాలితో మొదలుపెట్టి తిరుపతిలోని నాగల్లపురం... ఇంకా అనేక ప్రాంతాల్లోని పర్వతాలను చుట్టేసి... ఇప్పటికి 71 ట్రెక్స్ పూర్తి చేశారు. ‘‘మొదట ఇంట్లో భయపడ్డారు. కాని ఇప్పుడు వారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు’’ అని చెప్పారీమె.

 - ఎస్. సత్యబాబు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement