kiranmayi
-
చలం భావజాలంతో...
పలు రచనలు చేయడంతో పాటు, అనేక డాక్యుమెంటరీలు తీసిన కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రాళ్ళలో నీరు’. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని అనల్ప నిర్మించారు. ‘‘తెలుగులో ‘కన్యాశుల్కం’లా ఇంగ్లిషులో ‘ఏ డాల్స్ హౌస్’ ఫేమస్. 19వ శతాబ్దానికి చెందిన రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాశారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్ థాట్స్ (ప్రగతిశీల ఆలోచనలు)తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇందులో ఐదు పాత్రలే ఉంటాయి. సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే లాస్ఏంజిల్స్లో ‘అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
నువ్వు నువ్వుగా...
ఆ రోజంతా ప్రవల్లికను ఏదో తెలియని బాధ వెంటాడుతోంది. ఎటుచూసినా భర్త మాటలే తగుల్తున్నాయి. తానేం చేసింది? భర్తే సర్వస్వం అనుకొని బతికేయడం తప్పా? ఆమెకు ఎటూ పాలుపోలేదు. విడాకులు ఇచ్చే దాకా వెళ్లిపోయాడా? అసలెందుకంట విడాకులు? చంద్రహాస్ మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి.‘‘చూడు ప్రవల్లికా! ఓ ఇద్దరు మనుషులు కలిసి బతకాలంటే వారిద్దరి మధ్యా ప్రేమ మాత్రమే ఉంటే చాలని నమ్మే వ్యక్తివి నువ్వు. నీ ఆలోచనల్లో నేను తప్ప ఇంకేం ఉండదు. భార్యాభర్తల మధ్య ఆకర్షణ జీవితాంతం నిలబడితేనే ఆ ఇద్దరి జీవితం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు, నన్ను నేను గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవడం నాకిష్టం. అదే నా ప్రియారిటీ కూడా. వాటిని అర్థం చేసుకొని, నాకు కావాల్సిన స్పేస్ నువ్వివ్వాలన్నది నా కోరిక. కానీ నువ్వు నా గురించే ఆలోచిస్తూ, నేను తప్ప ఇంక వేరే ఏదీ లేనట్లు ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. నాకది తెలుసు. కానీ అలా వ్యక్తిత్వాన్ని, ఉనికిని మరచిపోయి బతికేవారంటే నాకు అసహ్యం. నువ్వు నువ్వుగానే ఉండాలని అనుకున్నా. అదెందుకో సాధ్యపడేలా కనిపించట్లేదు. అందుకే విడిపోదామనే నిర్ణయానికే వచ్చేశా.’’ భర్తే అన్నీ అనుకొని ప్రేమించడం, ఇప్పుడు ఆ భర్తనే తనకు దూరం చేస్తోందా? అన్న ఆలోచనే ప్రవల్లికను మరింత బాధపెట్టింది. బాధలో తనకు గుర్తొచ్చే ఏకైక ఫ్రెండ్.. కిరణ్మయి. ఎక్కువ ఆలోచించలేదు. కిరణ్మయికి ఫోన్ చేసింది. ప్రవల్లిక రమ్మనడంతోనే కిరణ్మయి అన్ని పనులూ వదిలేసుకొని వచ్చింది. ప్రవల్లిక జరిగిందంతా చెప్పుకొని బాధపడింది. ఓదార్చే ప్రయత్నం చేసింది కిరణ్మయి. ప్రవల్లిక పరిస్థితేంటో ఆమెకే అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. ‘‘ఇదంతా నీకు నువ్వే గీసుకున్న పిచ్చి గీతలు. నీ చుట్టూ నువ్వే కట్టుకున్న గోడలు. నువ్వు మారితే అంతా మారుతుంది’’ అంది కిరణ్మయి.ప్రవల్లిక ఏడుస్తూనే ఉంది. ఏడుపు ఆపి ఏదైనా చెప్పన్నట్టు చూసింది కిరణ్మయి.‘‘నువ్వేం చెప్తావో అర్థం కాదు. ఒకరిని అంతలా ప్రేమించడం కూడా తప్పా?’’ ప్రవల్లిక బాధనంతా కోపంగా మలచి చిన్న స్వరంతో సమాధానం ఇచ్చింది. ‘‘తప్పని అనను. కానీ విను.. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంత మందితో కలిసి బతకాల్సి ఉంటుందో చూడూ!! పేరెంట్స్, వైఫ్, ఫ్రెండ్స్, సొసైటీ.. ఇది ఎక్కడా ఆగేది కాదు. అదో ప్రవాహం. అందరితో కలిసిపోయినప్పుడే మనకు ఒకరిదగ్గరి నుంచి ఆశించే గుణం తగ్గుతుంది. దాన్ని అలా అర్థం చేసుకొని సాగిపోవడమే జీవితం. మన ప్రేమను అందరితో పంచుకోగలిగినప్పుడే ఎమోషనల్ డిపెండెన్సీ అన్నది తగ్గిపోతుంది. నీ విషయంలో జరుగుతున్నది ఏంటో నువ్వే చూడూ.. నీ ప్రేమనంతా ఒక్క వ్యక్తికే పరిమితం చేశావ్. ఇప్పుడు అదే వ్యక్తి నాకిది కష్టంగా ఉందంటున్నాడు. అతి అన్నది ఏ బంధాన్నైనా దెబ్బతీస్తుంది. ప్రేమన్నది బ్యాలెన్స్డ్గా సాగాలి. నీ విషయంలో అది జరగట్లేదు. ‘ప్రపంచంతో నేను’ అన్న ఆలోచన తెచ్చుకో! మార్పు నీ దగ్గరే ఉంది.’’ కిరణ్మయి ఎక్కడా ఆపకుండా తన స్నేహితురాలికి ఎప్పట్నుంచో చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేసింది. ప్రవల్లిక మౌనంగా ఉండిపోయింది. ‘‘నువ్వేది చెప్పినా ‘నువ్వే కరెక్ట్’ అని చెప్పి ఓదార్చే ఫ్రెండ్‌ని కాదు నేను. నీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండాలి. పరిస్థితులను నీకు నువ్వు అర్థం చేస్కోవాలి. వాటికి నువ్వు నీలా స్పందించాలి. ఇంతవరకు చెప్పగలను ప్రవల్లికా! ఆ తర్వాత ఇంక నీకే వదిలేస్తున్నా’’ అంటూ ముగించింది కిరణ్మయి.ప్రవల్లికకు ఏదో అర్థమైనట్టనిపించింది. కిరణ్మయిని గట్టిగా హత్తుకొని ‘‘థ్యాంక్స్ కిరణ్!’’ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సమాజానికి, మనిషికి ఎక్కడ లింక్ తెగిపోతోందో ప్రవల్లికకు మెల్లిమెల్లిగా తెలుస్తోంది. తన తప్పూ అర్థం కాసాగింది. ‘‘ఆంటీ.. నేను వేసిన ఈ పువ్వుల పెయింటింగ్ ఎలా ఉందో చెప్పరా?’’ అంటూ చుట్టుముట్టింది ఓ చిన్నారి.‘‘ఆంటీ.. నేను వేసిన ఈ సీనరీ పెయింటింగ్ ఎలా ఉందో చెప్పరూ!?’’ అని గడుసుగా అడిగాడో గడుగ్గాయి.మాట్లాడటానికి వీలులేకుండా ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలు వారి గడుసు చేష్టలు, పెయింటింగ్ నేర్చుకుంటూ, అది తనకు చూపించాలని వారు పడే తపన.. అంతా ప్రవల్లికకు ఓ కొత్త ప్రపంచంలా ఉంది. ఈలోపు వెనకనుంచి వచ్చి కళ్లు మూసాడు ఇంకో గడుగ్గాయి. ‘‘ఆంటీ మీకోసం నేనేం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం..’’ ఆ చిన్నారుల నవ్వుల్లో ప్రవల్లికకు కాలం కూడా తెలియలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రపంచంతో కలిసి దాన్ని ప్రేమించడంలో ఉన్న అందమేదో ఆమెకు అర్థమవుతూ వస్తోంది. అన్నీ కొత్తగా కనిపించసాగాయి. జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త వెలుగేదో ఆమె చుట్టూ చేరింది. అది ఆమె ముఖంలో నవ్వుగా మెరిసింది. మెల్లిగా ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యింది ప్రవల్లిక. ఇప్పుడు ప్రవల్లికకు భర్తతో పాటు ఇంకో ప్రపంచం కూడా ఉంది. తన భర్త కోరుకున్న ఒక స్పేస్ ఇవ్వగల ప్రపంచం. నువ్వు నువ్వుగా బతకడం అంటే నీకున్న అభిరుచుల్ని అందంగా మలచుకొంటూ అందరికీ ఉపయోగపడేలా బతకడమే అన్న విషయం ప్రవల్లికకు అర్థమవుతోన్న రోజులవి. ప్రవల్లిక భర్త చంద్రహాస్ కూడా ఆమెలో వస్తోన్న మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఏ కారణంతోనైతే ప్రవల్లికకు దూరం కావాలని చందూ అనుకున్నాడో ఆ కారణానికి ఇప్పుడు అర్థమే లేదు. కాలగమనంలో, ప్రవల్లికలో వచ్చిన మార్పులో ఆ కారణం కొట్టుకుపోయింది. రోజులలా దొర్లిపోయాయి. ‘‘కిరణ్మయీ.. నువ్ చేసిన హెల్ప్‌కు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలీడం లేదు.’’ చందూ చెప్తోన్న మాటలను సంతోషంగా వింటోంది కిరణ్మయి. ‘‘అవేం మాటలు చందూ.. ప్రవల్లిక నీ భార్యే కాదు.. నా ఫ్రెండ్ కూడా! తనలో ఈ మార్పు కోసమే మనం ఇంత చేశాం. ఇప్పుడది కనిపిస్తుందంటే అందరికీ సంతోషమేగా!’’ కిరణ్మయి కూడా తన సంతోషాన్ని పంచుకుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కిరణ్. అత్తయ్య వాళ్ల ఆనందానికి కూడా అవధుల్లేవు. ఎప్పుడూ పుట్టింటికి పోవడానికి కూడా ఇష్టపడని తను, ఇప్పుడు వాళ్లతో ఆనందంగా గడపటం.. ఒకప్పటి తన ఇష్టాల్లో ఒకటైన పెయింటింగ్ లోకంలో మునిగిపోవడం, ఈ ప్రపంచాన్ని ప్రేమించడాన్ని అలవాటు చేసుకోవడం.. అంతా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ప్రవల్లిక తనలా తాను బతకాలని కోరుకున్నా. ఇప్పుడదే నిజం అవుతోంటే ఎందుకో సంతోషాన్ని మాటల్లో చెప్పలేకున్నా. ఇంకా చెప్పాలంటే తనకోసం మేమొక పెయింటింగ్ స్కూల్ కూడా పెట్టాలనుకుంటున్నాం.’’ చందూ సంతోషాన్ని ఆపుకోలేక మాట్లాడుతూనే వెళుతున్నాడు. ‘‘కూల్ చందూ..’’ ‘‘కానీ ఒక భయం ఉంది కిరణ్..’’‘‘దేనికి భయం?’’‘‘మనం ఆడిన విడాకుల నాటకం బయటపెట్టాల్సిన రోజు వచ్చేసింది కదా! ఇదంతా నాటకమని తెలిస్తే తనెలా రియాక్ట్ అవుతుందో?’’‘‘అంతా మంచే జరుగుతుంది చందూ..’’చందూ ఫోన్ కట్ చేసి హాల్లో ఆరోజే గోడకు పెట్టిన ఒక పెద్ద సైజు ప్రవల్లిక ఫోటో చూస్తూ నవ్వాడు. అందులో నవ్వుతూ ఉన్న ప్రవల్లికతో అతడు కొద్దిసేపట్లో మాట్లాడాలి. అసలు విషయం చెప్పాలి. -
స్త్రీకి పురుష లక్షణాలుంటే...
లడ్డు కుళ్ల బూంది బూంది చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు చిత్ర దర్శకుడు జీన్స్. అంత కొత్తగా ఉండే అంశం ఏమిటన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ చిత్ర కాన్సెప్ట్ వినూత్నంగా ఉంటుందన్నారు. లడ్డు కుళ్ల బూంది బూంది (లడ్డులో బూంది) అంటే లడ్డు అనేది ప్రపంచం అయితే అందులో స్త్రీ, పురుషులు బూంది లాంటివారన్నారు. అలాంటి స్త్రీ, పురుషులు వారు వీరు - వీరు వారుగా మారితే ఎలాగుంటుందన్న చిన్న తమాషానే లడ్డు కుళ్ల బూంది బూంది చిత్రం అని చెప్పారు. స్త్రీ గుణగణాలు పురుషులకు, పురుషుల లక్షణాలు స్త్రీలకు సంక్రమిస్తే ఎలాగుంటుందన్నది వినోద భరితంగా తెరపై ఆవిష్కరిస్తున్నట్లు వివరించారు. ఒక వినూత్న ప్రయోగంగా చిత్రం ఉంటుందన్నారు. చిత్ర కథ సీరియస్‌గా సాగుతున్నా చూసే ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. చిత్రంలో హీరోగా కిరణ్మయి (నటి) హీరోయిన్గా జీన్స్ (నటుడు) నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తలైవాసల్ విజయ్, మహానది శంకర్, ఆలై, మధుమిత నటిస్తుండగా విలన్‌గా దేవదర్శిని నటించడం విశేషం. -
శిఖరస్వారీమణులు!
శిఖరాన్ని లొంగదీసుకోవడం అంటే... వెయ్యి గుర్రాల్ని ఒకేసారి అదిలించడం! ఎవరి వల్ల అవుతుంది? వీరులు? కష్టం. శూరులు? కష్టం. అరివీర భయంకరులు? కష్టం. దృఢకాయులైన కింకరులు? కష్టం. ఇంకెవరి వల్ల అవుతుంది? విల్ పవర్ ఉండాలి... డేర్ డెవిల్స్‌లా ఉండాలి. ఉంటే? నారీమణులు సైతం శిఖరాన్ని అధిరోహిస్తారు. ఓపన్ గంగ్నమ్ స్టెయిల్లో దౌడు తీయిస్తారు. ఈ నలుగుర్నీ చూడండి. శిఖరాలు ఎంత చిన్నవై కనిపిస్తాయో! సాహస యాత్రలు చేస్తున్నవారిలో సాధారణ గృహిణుల దగ్గర్నుంచి చిరుద్యోగినుల దాకా ఉన్నారు. వడ్డించిన విస్తరి లాంటి జీవితమున్నా... కేవలం తమను తాము నిరూపించుకోవడం కోసం, రేపటి భవిష్యత్తును మరింత సమర్థవంతంగా మలచుకోవడం కోసం వీరు అడ్వంచరస్‌గా మారుతున్నారు. వ్యయప్రయాసలను ఎదుర్కొని మరీ సంక్లిష్టమైన సాహసాల కలలను సాకారం చేసుకుంటున్నారు. ఆ మహిళలతో మాట్లాడితే... కొండలు పిండి చేసే వాళ్లెక్కడి నుంచో ఊడిపడలేదని అవగతమవుతుంది. ప్రయత్నం చేస్తే, మన కాలక్షేపపు అభిరుచులనే అడ్వెంచరస్‌గా మారిస్తే... జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునని అర్థమవుతుంది. 138: ‘‘లక్ష్యాలు ఉన్నతంగా ఉంటే మనం పెద్దవిగా భావించే చాలా సమస్యలు అసలు సమస్యలే కావని అర్థం అవుతాయి’’ అని కిరణ్మయి అంటారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, భారతీయ విద్యాభవన్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్మయి...ఇటీవలే దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. అందులో విశేషం ఏమీలేదు. డబ్బుంటే ఎవరైనా వెళ్లిరావచ్చు. కాని అక్కడి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. అది ఉంది కాబట్టే కిరణ్మయి కిలిమంజారో పర్వతారోహణ చేసిన తొలి తెలుగు వనిత అయ్యారు. ‘‘పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక, వాళ్ల భవిష్యత్తు వాళ్లు చూసుకోగల సత్తా వారికి అందించాక... అప్పుడు నా గురించి నేను ఆలోచించుకున్నాను. చిన్నప్పుడు సరదాగా కొండకోనల్లో తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నాను. సహజమైన, సాహసోపేతమైన అనుభవాల్ని రుచి చూడాలనుకున్నాను’’ అని చెప్పారామె. అనుకోవడమే తడవు ‘గ్రేట్ హైదరాబాద్ అడ్వంచరస్ క్లబ్’ లో చేరడం ద్వారా తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఒకటొకటిగా పర్వతాలను అధిరోహిస్తూ ఇప్పటికి 138 ట్రెక్స్ పూర్తి చేశారు. వీటన్నింటిలోకి కిలిమంజారో అత్యంత ప్రమాదకరమైన అనుభవం అంటారామె. ‘‘కిలీ మంజోరా పర్వతప్రాంతంలో రాత్రి 12గంటలకు ప్రారంభమై ఉదయం 5గంటల లోపు ట్రెక్ పూర్తవ్వాలి. నేను వెళ్లినప్పుడు వెదర్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఎక్కేటప్పుడు పాములు, తేళ్లూ, తీవ్రమైన విషం చిమ్మే జైలు... వరుస కట్టాయి. హఠాత్తుగా వడగళ్ల వాన పడడం మొదలైంది. ఏమాత్రం తేడా వచ్చినా కోమాలోకి వెళ్లాల్సి వచ్చేది. పరుగు తీయడం ఆపేస్తే కండరాలు బిగుసుకుపోతాయి. అంతటి చలి’’ తన అనుభవాన్ని వివరిస్తున్నపుడు ఆమెలో ఆ జ్ఞాపకం తాలూకు ఉద్వేగం కనపడింది. రన్నింగ్, సైక్లింగ్... వీటన్నింటిలోనూ కిరణ్మయి రాణిస్తున్నారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్, కోయంబత్తూర్‌లో జరిగిన మారథాన్‌లో 2గంటల 20నిమిషాల్లో 21.1 కి.మీ పరుగు పూర్తి చేసి 10వ స్థానం సాధించారు. స్విమ్మింగ్‌లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే జుకాడో అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ ఫార్టీ ప్లస్ టీచర్... ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్ అన్నీ సాహసయాత్రల ద్వారా పొందగలిగానని చెప్పారు. 127: ‘‘మహారాష్ట్రలోని కోకన్కొడా ప్రాంతంలో చేసిన 1800 అడుగుల దూరం రోప్లింగ్ (తాడుతో వేళ్లాడుతూ పర్వతాలు, లోయల నడుమ చేసే సాహసం) అద్భుతమైన అనుభవం’’ అని గుర్తు చేసుకున్న ఫరీదా... ఇటు కుటుంబ బాధ్యతల్ని, అటు ఉద్యోగ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూనే తన సాహసయాత్రల్ని కొనసాగిస్తున్నారు. ‘‘ఇప్పటికి దాదాపు 127 ట్రెక్స్ పూర్తి చేశాను’’ అని ఉత్సాహంగా చెప్పారు ఫరీదా. చిన్నప్పుడు చెట్ల కొమ్మలు పట్టుకుని ఊగిన హాబీ వల్ల ఏమో రోప్లింగ్ తన అభిమాన సాహసక్రీడగా మారిపోయిందని చెప్పే ఫరీదా మహారాష్ట్రలోని కార్జత్ జలపాతాల మీదుగా చేసిన రోప్లింగ్ను ఎప్పటికీ మరచిపోలేనంటారు. సినిమాలు, టీవీల ముందు వృథా చేసే సమయాన్ని ఇలా మళ్లిస్తే... ఆత్మవిశ్వాసం పెరగడం లాంటి లాభాలెన్నో కలుగుతాయని ఆమె మహిళలకు సూచిస్తున్నారు. 112: ‘‘పర్వతాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ నుంచి నక్షత్రాల్ని చూడడం ఎంత బాగుంటుందో’’ అంటున్న పద్మజలో గొప్ప భావుకురాలు కనిపిస్తుంది. ఇప్పటికి 112 పర్వతాలను అధిరోహించానని ఆమె చెప్పినప్పుడు బాప్రే...అనిపిస్తుంది. ‘‘పెళ్లికాకపోవడం సాహసయాత్రలకు సంబంధించి నాకున్న అదనపు అర్హత’’ అంటూ నవ్వేస్తారు పద్మజ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్ఎపి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న పద్మజ పశ్చిమకనుమలలోని సహ్యాద్రి రేంజ్లో హరిశ్చంద్రఘాట్ తన అభిమాన ట్రెక్ అని పేర్కొన్నారు. 71: అడ్వంచరస్ క్లబ్లో సభ్యురాలిగా మూడేళ్ల వయసున్న స్వాతి... సాహస యాత్రికురాలిగా మారకముందు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు స్వంతంగా ఆన్లైన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ‘‘ఈ అడ్వంచర్స్ వల్ల మన జీవితాన్ని మనమే శాసించుకునే తత్వం అలవడుతుంది’’ అని చెప్పే స్వాతి హైదరాబాద్‌లోని మౌలాలితో మొదలుపెట్టి తిరుపతిలోని నాగల్లపురం... ఇంకా అనేక ప్రాంతాల్లోని పర్వతాలను చుట్టేసి... ఇప్పటికి 71 ట్రెక్స్ పూర్తి చేశారు. ‘‘మొదట ఇంట్లో భయపడ్డారు. కాని ఇప్పుడు వారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు’’ అని చెప్పారీమె. - ఎస్. సత్యబాబు