మహిళలు.. మనీ రాణులు | One Man Show .. sorry .. One Woman Show | Sakshi
Sakshi News home page

మహిళలు.. మనీ రాణులు

Published Fri, Aug 15 2014 10:55 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

మహిళలు.. మనీ రాణులు - Sakshi

మహిళలు.. మనీ రాణులు

మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్‌బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్)  నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్‌లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం.
 
టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్‌మెంట్ విషయంలో మహిళలే నంబర్‌వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్‌మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని..
 
లక్ష్యం నిర్దేశించుకోవడం..

లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్‌లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్‌లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.
 
విద్య ఎంపికలో..
 
చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్‌మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్‌గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్‌గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు.
 
సెల్ఫ్-హెల్ప్..
 
ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్‌కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్‌ఫెక్షనిస్టులు కూడా.
 
రోజువారీ రికార్డు..
 
ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు.
 
నేర్చుకోవడానికి ప్రాధాన్యం..
 
మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్‌ను మరోసారి చేయరు. ఏదైనా డీల్‌తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు.
 
ప్లాన్ బీ..
 
ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర  ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు.
 
అప్పులు..
 
సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం.
 
రిస్కుకి రెడీ..
 
మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం.
 
మనీ మేనేజ్‌మెంట్..
 
కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్‌మెంట్‌లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement