ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు.. బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సత్వర విచారణ జరిపి ఆ వాట్సాప్ మెసేజ్ చేసింది ఓ యువతిగా గుర్తించి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పది రోజుల్లోగా యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే.. బాబాను సిద్ధిఖీని హతమార్చినట్లే చంపేస్తామని ఓ నెంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఈ నేరానికి పాల్పడిన యువతిని గుర్తించి, అరెస్టు చేశారు.
నిందితురాలు థానేకు చెందిన ఫాతిమా ఖాన్(24)గా తేలింది. బీఎస్సీ(ఐటీ) చేసిన ఫాతిమాకు గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేదని పోలీసులు తెలిపారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఉల్హాస్‌నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితురాలిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మహారాష్ట్రలో బెదిరింపు సందేశాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న విషయం తెలిసిందే. ఈ మధ్యలోనే ఆయనకు కొన్ని బెదిరింపు సందేశాలు వచ్చాయి. మరోవైపు ఎన్సీపీ నేత బాబా సిద్ధికీ తనయుడు, బాంద్రా ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి కూడా చంపుతామంటూ ఆగంతకులు సందేశాలు పంపుతున్నారు.
మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అయిన బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12వ తేదీన తన కార్యాలయం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యకు తామే బాధ్యులమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అలాగే.. సిద్ధిఖీకి, సల్మాన్ ఖాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: 2009లో ఇంటర్.. 2024లో 8వ తరగతి!!
Comments
Please login to add a commentAdd a comment