యువతి తలపై బండరాయితో మోది చంపిన దుండగులు
అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై అంతమొందించినట్లు ఆనవాళ్లు
మేడ్చల్ పరిధి మునీరాబాద్ ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద ఘటన
మేడ్చల్‌రూరల్: ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి మునీరాబాద్ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. నిందితులు యువతి తలపై బండరాయితో మోది.. హత్య చేసి.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నాయి. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మునీరాబాద్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పని చేసే ఓ యువకుడు శుక్రవారం ఉదయం కల్వర్టులో నుంచి ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్తుండగా ఓ యువతి మృతదేహం కనిపించింది.
భయాందోళనకు గురైన యువకుడు ట్రాన్స్‌పోర్టు యజమానికి విషయం చెప్పగా.. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. 25 ఏళ్ల వయసున్న వివాహిత తలపై బండరాయితో బాది హత్య చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిందితులు నిప్పంటించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
తెలిసిన వ్యక్తుల పనేనా?
ఓఆర్‌ఆర్ కల్వర్టు కింద యువతి దారుణ హత్యకు గురైన యువతి పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. సదరు యువతి తనకు తెలిసిన వ్యక్తి లేదా వ్యక్తులతోనే ఇక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. యువతిని ఏకాంతంగా కలిసిన అనంతరం విభేదాల కారణంగా పక్కనే ఉన్న బండరాయితో బాది హత్య చేశారా? లేదా పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారా? లేదంటే యువతి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బండరాయితో బాది.. పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారా? నిందితుడు ఒక్కరా లేక ఇద్దరు.. ముగ్గురు ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 దిశ కేసు తరహాలో రోడ్డు పక్కన యువతి దారుణ హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది.
మృతురాలి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..
హత్యకు గురైన యువతి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్లు ఉన్నాయి. కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో.. రోహిత్ అనే పేరు ఇంగ్లిష్‌లో.. ఎడమ చేతిపై నరేంద్ర అనే పేరు ఇంగ్లిష్ లో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల వయసున్న యువతికి కాళ్ల వేళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా వివాహితగా గుర్తించారు. ఇతర పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులు, ఆయా కేసుల్లో చేతిపై పచ్చబొట్లు ఉన్న వివరాల కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య?
Comments
Please login to add a commentAdd a comment