భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇండోర్, రేవా జిల్లాల్లో రెండు భయంకరమైన అత్యాచార సంఘటనలు వెలుగుచూశాయి. రేవా జిల్లాలోని ఆలయ సమీపంలోని పిక్నిక్ వెళ్లిన జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా దీనిని వీడియో తీశారు. ఈ విషయాన్నిపోలీసులకు చెబితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తానని బెదిరించారు. ఈ ఘటన అక్టోబర్ 21న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుండగా, ఇండోర్‌లో దినసరి కూలి చేతిలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో మహిళ అర్ధనగ్నంగా, రక్తస్రావంతో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సోను అనే కార్మికుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు తమ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ఒకేసారి రెండు అత్యాచార ఘటనలు వెలుగుచూడటంతో అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మండిపడ్డారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మంత్రి శివాజీ పటేల్.. రెండు కేసుల్లోనూ నిందితులను అరెస్ట్ చేశామని, వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment