టైమ్స్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాలో భారతీయ మహిళకు చోటు..! | Purnima Devi Barman Makes Times Women Of The Year List | Sakshi
Sakshi News home page

టైమ్స్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాలో భారతీయ మహిళకు చోటు..!

Published Fri, Feb 21 2025 12:36 PM | Last Updated on Fri, Feb 21 2025 12:47 PM

Purnima Devi Barman Makes Times Women Of The Year List

టైమ్స్ విడుదల చేసిన 2025 విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఒకే ఒక్క భారతీయ మహిళకు చోటు దక్కింది. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణులు సంరక్షణాధికారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ నిలిచింది. ఈ జాబితాలో నటి నికోల్‌ కిడ్మాన్‌, ఫ్రాన్‌కు చెందని గిసెల పెలికాట్‌ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఏకైక భారతీయ మహిళగా నిలిచిన పూర్ణిమా దేవి బర్మాన్‌కి ఇంత పెద్ద గుర్తింపు ఎలా లభించింది..? ఆమె ఏం చేశారంటే..

అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. ఆమెకు చిన్నప్పటి నుంచి పక్షులంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసేందుకు దారితీస్తుంది. ఆ సమయంలోనే గ్రేటర్‌ ఆజిటెంట్‌ స్టార్క్‌ (కొంగల) గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్‌ ఆజిటెంట్‌ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయని తెలుసుకుని కలవరపడింది. 

దీన్ని నివారించడానికి తన వంతుగా ప్రయత్నం చేయాలనుకుంది. అలా పూర్ణిమ తన పీహెచ్‌డీ పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్‌ ఆజిటెంట్‌ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్‌లు, రోడ్లు, మొబైల్‌ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతున్నాయని గుర్తించింది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు.

ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకొచ్చేలా పూర్ణిమ ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. దీంతో చిన్నగా మార్పు మొదలవ్వడం ప్రారంభమైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారు చేసింది. అ

స్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ.

తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్‌ సెంటర్‌’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేయడం వంటివిచ చేసింది ఈ హర్గిల ఆర్మీ. 

ఈ నెట్‌వర్క్ అస్సాం నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాల తోపాటు కంబోడియాకు వరకు విస్తరించింది. చివరికి ఫ్రాన్స్‌ వరకు వెళ్లడమే గాక అక్కడ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా  ఈ పక్షుల గురించి బోధించడం వంటివి చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా ఈ ఆర్మీ సభ్యులు నేసినవే. ఎందుకంటే వాటి వల్లే వారి జీవనోపాధి కలుగుతుంది. 

ఇలా పూర్ణిమ ప్రకృతిని కాపాడటమే గాక..అంతరించిపోతున్న పక్షి జాతి కోసం గ్రామీణ మహిళలతో హర్గిల ఆర్మీనిని ఏర్పాటు చేసి అంతిరించిపోతున్న కొంగల జాతి వృద్దికి కృషి చేసింది, అలాగే గ్రామీణ మహిళలకు వాటితోనే జీవనోపాధిని కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే టైమ్స్‌ పూర్ణిమ కృషని గుర్తించి ఈ ఏడాది ఉమన్‌ ఆఫ్‌ది ఇయర్‌ జాబితాలో చేర్చి గౌరవించింది. 

టైమ్స్‌ మ్యాగ్జైన్‌ ప్రతి ఏడాది ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాను విడుదల చేస్తుంది . హిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల మధ్య మెరుగైన ప్రపంచం కోసం కృషి చేసే శక్తిమంతమైన మహిళలను గుర్తించి ఇలా విమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ జాబితాలో చోటు కల్పించి గౌరవిస్తుంది. కానీ ఈ ఏడాది పర్యావరణ పరంగా మన భారతీయ జీవశాస్త్రవేత్త బర్మాన్‌ ఆ గౌరవాన్ని దక్కించుకుంది. 

(చదవండి: అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement