Times magazines
-
ఇరాన్‌తో యుద్దం.. ట్రంప్ వ్యాఖ్యలపై టెన్షన్?
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా జరగవచ్చు’ అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ఏదైనా జరగవచ్చు.. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడటం అత్యంత ప్రమాదకరమైన విషయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ట్రంప్ హయాంలో ఇరాన్‌పై దాడులు తప్పవని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని పలువురు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇరాన్‌ను పలుమార్లు హెచ్చరించారు. ట్రంప్ మొదటి టర్మ్‌లో 2020లో ఇరాన్‌పై వైమానిక దాడులకు ఆదేశించాడు. ఈ దాడుల్లో భాగంగా టాప్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీని హతమార్చారు. 2015లో ఇరాన్‌తో బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు బప్పందాన్ని సైతం ట్రంప్ విరమించుకున్నారు. అదే సమయంలో ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక ఆంక్షలను సైతం విధించారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా గుర్తించింది. ఈ గౌరవం ఆయనకు దక్కడం ఇది రెండోసారి. 2016లోనూ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్ ఇయర్’ అయ్యారు. ఈ క్రమంలో ‘2024 పర్సన్ ఆఫ్ ఇయర్ ట్రంప్’ అని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ గురువారం ఉదయం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఓపెనింగ్ బెల్ మోగించారు. Trump to Time Magazine on the possibility of war with Iran: “Anything is possible.” pic.twitter.com/LKHA7tJU0p— Open Source Intel (@Osint613) December 12, 2024 -
రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడయ్యింది. బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
టీబీతో చీకటిరోజులు..పోరాడి గెలిచింది,టైమ్స్ మ్యాగజీన్లో చోటు
నందితా వెంకటేషన్ నృత్య, సంగీత ప్రేమికురాలు. పాదం కదలాలంటే పదం వినిపించాల్సిందే. నాట్యంలో మంచి పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో క్షయ బారిన పడింది. మందులు వాడి వాడి శరీరం గుల్ల అయింది. బాగయ్యాక కొన్ని రోజులకు ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది. అలా అని ఆమె నాట్యం ఆపలేదు. ఆ నాట్యమే తన బలం అయింది. తక్కువ ధరలకు క్షయవ్యాధి గ్రస్తులకు మందులు దొరికేలా దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి కృషి చేసి విజయం సాధించింది నందిత. టైమ్స్ మ్యాగజీన్ 2023 (100–ఎమర్జింగ్ లీడర్స్) జాబితాలో నందితా వెంకటేశన్‌కు చోటు లభించింది.... ‘క్షయ వ్యాధి నా పాత స్నేహితురాలు’ అని సరదాగా చెబుతుంది ముంబైలో పుట్టి పెరిగిన నందితా వెంకటేశన్. డిగ్రీ కాలేజీలో చేరిన సంతోషంలో ఒకవైపు స్నేహితులంతా తలమునకలై ఉండగా, నందిత మాత్రం టీబీతో పోరాడుతోంది. పద్నాలుగు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.కొంతకాలానికి...పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత జటిలం అయింది. భరించలేని కడుపు నొప్పి, బరువు తగ్గడం మొదలైంది.వైద్యుల సూచన మేరకు సర్జరీ కోసం ఆస్పత్రిలో పదిరోజులు ఉంది. డిశ్చార్జి తరువాత పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దీంతో పెద్ద మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. ‘చికిత్సలో భాగంగా రోజుకు పది నుంచి పదిహేను మాత్రల వరకు వేసుకోవాల్సి వచ్చేది. వాంతులు అయ్యేవి. డిపెష్రన్కు గురయ్యేదాన్ని. టీబీ కంటే నరకమే నయం అనిపించేది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నందిత. పీక్కుపోయిన ముఖంతో, రాలిపోయిన తల వెంట్రుకలతో తనను తాను అద్దంలో చూసుకోవాలన్నా భయపడేది నందిత. ఇలా భయపడుతూ, బాధపడుతూ ఉంటే వైద్యుల చికిత్స ఎలాంటి ఫలితం ఇవ్వదని తనకు తెలుసు. ముందు మనోధైర్యం తెచ్చుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అనుకుంది. తనకు కావల్సిన శక్తులు సంగీతంలో దొరికాయి. రెండు నెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. 22 కిలోల బరువు తగ్గింది. మందులు వాడీ వాడీ శరీరం చచ్చుబడినట్లుగా అనిపించింది. అయితే ఇంటికి వచ్చిన సంతోషం ఆ బాధని దూరం చేసింది. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. నెలరోజుల తరువాత వినికిడి శక్తి కోల్పోయింది. ఎంత పెద్ద శబ్దమైనా వినిపించేది కాదు. వినికిడి శక్తి కోల్పోయినా తనకు ఇష్టమైన నృత్యంపై ప్రేమను మాత్రం కోల్పోలేదు నందిత. మ్యూజిక్ వినిపించకపోయినా డ్యాన్స్ చేసేది. ఇది తనకు బాధ నుంచి ఉపశమనంగా అనిపించేది. ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంలో శిక్షణ మొదలుపెట్టిన నందిత...‘భరత నాట్యం అనేది నాకు కేవలం అభిరుచి కాదు. అంతకంటే ఎక్కువ. నన్ను నేను ప్రేమించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి. నన్ను నేను వ్యక్తీకరించుకునే బలమైన మాధ్యమం’ అంటుంది. చీకటిరోజులు వెళ్లి పోయాయి. నందిత మళ్లీ మామూలు మనిషి అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసిన నందిత జర్నలిస్ట్‌గా తనకు ఇష్టమైన అక్షర సేద్యం చేస్తోంది. క్షయవ్యాధి చికిత్సలో భాగంగా తనలాగే వినికిడి శక్తి కోల్పోయిన దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి ఒక అమెరికన్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన క్షయవ్యాధి ఔషధానికి రెండోసారి పేటెంట్ ఇవ్వకూడదంటూ భారత ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించింది. ఈ విజయం ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకు తక్కువ ధరలకు మందులు దొరికే అవకాశం ఏర్పడింది. ఇద్దరూ టైమ్స్ జాబితాలో చోటు సాధించారు. -
జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్
దర్శకధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావవంతుల జాబితాలో రాజమౌళికి చోటు దక్కింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు జక్కన్నకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన ఆలియా భట్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సైతం చోటు సంపాదించారు. ఆలియా భట్ మాట్లాడుతూ.. 'తొలిసారి రాజమౌళిని బాహుబలి మూవీ ప్రీమియర్‌లో కలిశా. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయా. ఎలాగైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకున్నా. ఆర్ఆర్ఆర్ మూవీతో నా కోరిక నెరవేరింది. ఆయన దగ్గర పనిచేయడమంటే స్కూల్‌కు వెళ్లినట్టే. ఎన్నో కొత్త అంశాలు నేర్చుకుంటారు. అందుకే ఆయనను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తా. నటనలో ఏదైనా సలహా ఇవ్వాలని కోరగా.. ఏ క్యారెక్టర్ అయినా సరే.. ప్రేమతో చేయాలని చెప్పారు. సినిమా హిట్ కాకపోయినా.. మన క్యారెక్టర్ ప్రజలకు గుర్తుండిపోయేలా చేయాలన్నారు.' అంటూ జక్కన్నను ప్రశంసించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటునాటుకు ఆస్కార్ కూడా రావడంతో ఆయన కీర్తి ఖండాంతరాలు దాటింది. -
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్
Time's person of the year 2021: టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్–2021’గా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అంతరిక్షయాన సంస్థ స్సేస్ ఎక్స్‌కు కూడా మస్క్ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. మధ్యలో ఇద్దరి మధ్య దోబుచులాట నడిచినప్పటికీ.. చివరికి తన సంపదను అమాంతం పెంచేసుకుని అపర కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు యాభై ఏళ్ల మస్క్. ప్రస్తుతం సంపద దాదాపు 253 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీగా గుర్తింపు పొందిన టెస్లాలో మస్క్‌కు 17 శాతం షేర్లున్నాయి(చాలా వరకు అమ్మేసుకుంటూ పోతున్నాడు). 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది. సోషల్ మీడియాలో మస్క్‌కు అసంఖ్యాక అభిమానులు ఉన్నారని, అలాగే ఇన్వెస్టర్లకూ ఆయనపై అంతే నమ్మకమని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ముఖ్యంగా క్రిప్టో మార్కెట్‌ను ఒకే ఒక్క ట్వీట్‌తో శాసిస్తూ వస్తున్నాడంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇక ట్విట్టర్లో ఎలన్ మస్క్ 6.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టెస్లా సీఈవోగానే కాకుండా సొంత రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కూ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్. టెస్లా నుంచి పైసా కూడా జీతంగా తీసుకోకుండా.. తన వాటా ద్వారా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇక స్పేస్ఎక్స్ ఒప్పందాలు-షేర్లతోనూ బిలియన్లు సంపాదిస్తున్నాడు. వీటితో పాటు ది బోరింగ్ కంపెనీ అనే మౌలిక వసతుల కంపెనీ, బ్రెయిన్ చిప్ స్టార్టప్ ‘న్యూరాలింక్’లకు వ్యవస్థాపకుడి హోదాలో పని చేస్తున్నాడు. చదవండి: ఎలన్ మస్క్ వెటకారం! ప్రధాని పైనా సెటైర్లు -
టైమ్స్ జాబితాలో ఇండో అమెరికన్ !
వివిధ రంగాల్లో తమదైన ముద్రవేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచే వందమంది జాబితాను టైమ్స్ మ్యాగజీన్ ఇటీవల విడుదల చేసింది. ‘అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా–2021’లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ , ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లతోపాటు మన దేశానికి చెందిన నలుగురు ప్రముఖులు చోటుదక్కించుకున్నారు. వీరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అడర్ పూనావాల, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏ3పీసీఓఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజుషా పి కులకర్ణిలు ఉన్నారు. మంజుషా ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్(ఏ3పీసీఓఎన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ లక్షలమంది జాత్యహంకారానికి గురైన బాధితులకు సాయం చేస్తున్నారు. నలభైకి పైగా కమ్యూనిటీ సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పదిహేను లక్షలమంది ఆసియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండ్ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాక కోవిడ్–19 తర్వాత జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్టాప్ ఏఏపీఐ(ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్–ఏఏపీఐ) స్థాపించి దాని ద్వారా పోరాడుతున్నారు. మంజుషా ఇండియాలో పుట్టింది. కొన్నాళ్లల్లోనే తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లడంతో ఆమె బాల్యం అంతా అక్కడే గడిచింది. అలబామాలోని మోంట్‌గోమెరీలో ఇండియన్ కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో వాళ్లతో కలిసి పెరుగుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పెరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడంతో తను కూడా ముందుగా డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ తనకు లా అంటే అమితాసక్తి ఉండడంతో మెడిసిన్ కాకుండా లా చదువుతానని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వద్దని వారించినప్పటికీ తనే నిర్ణయం తీసుకుని లా చదివింది. లా తోపాటు పౌరుల హక్కుల గురించి విపులంగా తెలుసుకున్న మంజుషా అవి సక్రమంగా అమలు కావాలని కోరుకునేది. స్కూల్లో చదివేప్పటి నుంచి తన తోటి విద్యార్థులు శరీర రంగు కారణంగా వివక్షకు గురికావడం, తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు జాత్యహంకారంతో చిన్నచూపు చూసిన సందర్భాలు అనేకం ఎదుర్కొంది. ఇవి నచ్చని మంజుషా వాటికి వ్యతిరేకంగా పోరాడాలనుకునేది. లా అయ్యాక.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరీస్ డాక్టర్ లా డిగ్రీ అయ్యాక సదరన్ పావర్టీ లా సెంటర్లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలో పౌరుల హక్కుల గురించి మరింత అధ్యయనం చేసింది. జాత్యహంకారానికి గురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరమైన హక్కులు ఏమి ఉన్నాయో మరింత లోతుగా తెలుసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ హెల్త్ లా ప్రోగ్రామ్(ఎన్హెచ్ఈఎల్పీ)లో చేరి.. శాసన, పరిపాలన, న్యాయపరమైన శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక సహాయం, నిరుపేదలకు న్యాయపరమైన సలహాలు, సూచనలు, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేది. తరువాత ఎన్హెచ్ఈఎల్పీ నుంచి తప్పుకుని సౌత్ ఏషియన్ నెట్వర్క్(సాన్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టి మరికొంతమంది పౌరులకు ఆరోగ్య, పౌరుల హక్కుల గురించి పనిచేసింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్ణ వివక్షపై పోరాడుతూ ఉండేది. తరువాత మరో ఇద్దరితో కలిసి ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ (ఏ3పీసీఓఎన్) ను స్థాపించి దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ జాత్యహంకార దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలబడి పోరాడుతోంది. ఏఏపీఐ.. గతేడాది కోవిడ్–19 ప్రపంచం మీద విరుచుకు పడడంతో..కోవిడ్ వైరస్ చైనాలో పుట్టిందని, చైనా వైరస్, వూహాన్ వైరస్ అని దూషిస్తూ అమెరికాలో ఉన్న చైనీయులపై దాడులు చేయడం, జాత్యహంకార దాడులు పెరగడం, అప్పటి అధ్యక్షుడు ఏషియన్ దేశాలకు వ్యతిరేక విధానాలు అమలు చేయడంతో.. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో... ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ)ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలబడి, కావాల్సిన సాయం చేస్తోంది. అంతేగాక గత రెండు దశాబ్దాలుగా జాతి సమానత్వం కోసం పోరాడుతుండడంతో ఆమెను టైమ్స్ మ్యాగజీన్ 2021 గాను వందమంది అత్యంత ప్రభావవంతమైన జాబితాలో చేర్చింది. 2014లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో వైట్ హౌస్ నుంచి ‘చాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును అందుకుంది. ఒకపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క సమాజ సేవచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నందున మంజుషా కులకర్ణికి టైమ్స్ వందమంది ప్రభావవంతుల జాబితాలో చోటు లభించింది. -
మోదీ కూడా నా కుమారుడే.. భయమెందుకు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల వయసున్న బామ్మ బిల్కిస్ దాదీ టైమ్ జాబితాలో స్థానం పొందారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీని తన కొడుకుగా భావిస్తానని.. ఆయన ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్లి కలుస్తానని తెలిపారు. షాహిన్‌బాగ్ దాదీగా పేరు సంపాదించిన బిల్కిస్ గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా 100 రోజుల పాటు రేయింబవళ్లు పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఒక చేత్తో జపమాల, మరో చేత్తో జాతీయ జెండా పట్టుకొని అణగారిన వర్గాల గళంగా బిల్కిస్ నిలిచారు. మహిళలు, మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రగిలించారు. పొద్దున్నే 8కల్లా ఠంచనుగా నిరసనకు కూర్చొనే ఆమె అర్ధరాత్రయినా కదిలేవారు కాదు. (చదవండి: మోదీ, షాహిన్‌బాగ్ దాదీ) ఈ క్రమంలో ఓ ఆంగ్ల వెబ్సైట్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ‘ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనని కలవడానికి వెళతారా అని ప్రశ్నిస్తే.. ఎందుకు వెళ్లను. తప్పక వెళ్తాను. ఇందులో భయపడటానికి ఏం ఉంది. తను నా కుమారుడిలాంటి వాడు. నేను తనకు జన్మనివ్వకపోవచ్చు. మరో సోదరి ఆ పని చేసింది. అయినా తను నా బిడ్డలాంటి వాడే’ అన్నారు. అంతేకాక ఈ జాబితాలో మోదీ పేరు కూడా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని.. ఆయనను అభినందిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం తమ మొదటి పోరాట కరోనా మహమ్మారి మీద అని స్పష్టం చేశారు దాదీ. ఇక మార్చి 24 నుంచి షాహీన్ బాగ్ నిరసన స్థలం క్లియర్ చేయబడింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. -
అరుదైన గౌరవం
బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రఖ్యాత యూఎస్ మ్యాగజీన్ ‘టైమ్స్’ విడుదల చేసిన ప్రపంచ అత్యంత ప్రభావశీల వ్యక్తుల టాప్–100 జాబితాలో ఆయుష్మాన్ చోటు సంపాదించుకున్నాడు. ఢిల్లీలో బిగ్ ఎఫ్ఎమ్లో ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఆ తర్వాత టీవీ యాంకర్‌గా పనిచేశారు. 2012లో వచ్చిన సూజిత్ సర్కార్ ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించారు. అలాగే ఆయుష్మాన్ నటించిన ‘అంధాదూన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆర్టికల్ –15, డ్రీమ్ గర్ల్, బాలా’ వంటి వినూత్న చిత్రాలతో వరుస హిట్లు అందుకుని బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఇదిలా ఉంటే.. ‘టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సుందర్ పిచాయ్, రవీంద్రగుప్తా, బిల్కిస్ దాది తదితరులు కూడా ఉన్నారు. ‘‘ప్రతిభావంతులు ఉన్న ఈ జాబితాలో స్థానం సంపాదించుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఆయుష్మాన్ ఖురానా. -
టైమ్ మ్యాగజైన్ ప్రభవాశీలుర జాబితాలో ముఖేశ్ అంబానీకి చోటు
-
టైమ్స్ మాగజైన్ ‘హెల్త్ కేర్-50’లో ముగ్గురు మనోళ్లే!
టైమ్స్ మాగజైన్ 2018 ఏడాదికి గాను అమెరికాలో ఆరోగ్య రంగాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ప్రతిభావంతుల జాబితాలో ముగ్గురు భారతీయ సంతతికి చెందినవారికి చోటు దక్కింది. అమెరికాలో ఆరోగ్యరక్షణకు కృషిచేసిన దివ్యానాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండేలకు ఈ గౌరవం దక్కింది. ప్రజారోగ్యం, వైద్యం, టెక్నాలజీ, ధర అనే నాలుగు విభాగాల్లో వీరిని ఎంపిక చేస్తారు. టైమ్స్ మాగజైన్ హెల్త్ ఎడిటర్లు, రిపోర్టర్లు అమెరికాలో ఆరోగ్యపరిరక్షణకు చేసిన సేవలను బట్టి వీరిని నామినేట్ చేస్తారు. ఆరోగ్యపరిరక్షణకు ఎనలేని కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ రంగాల్లోని వారిని ఈ జాబితాలో చేర్చుతారు. దివ్యానాగ్ ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీలో హెల్త్‌కేర్‌లో ప్రత్యేక ప్రాజెక్టు చేస్తున్నారు. ఇటు డాక్టర్లకూ, అటు పేషెంట్లకూ రోగి సమాచారాన్ని, వివరాలనూ అందించే యాప్‌ను రూపొందించారు. ఇది వైద్య రంగంలోనే ఓ అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. వాచ్‌ని ధరించిన వారు స్పందిచకపోయినా, హృదయస్పందనని పర్యవేక్షించే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఆరోగ్యరంగంలో ఓ సంచలనం. రాజ్ పంజాబీ... ఆరోగ్యసేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆరోగ్యకార్యకర్తలకి శిక్షణనిచ్చే గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకుగాను లాస్ట్‌మైల్ హెల్త్ సహ వ్యవస్థాపకులు లైబీరియా నుంచి అమెరికాకి శరణార్థిగా వచ్చిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ రాజ్పంజాబీకి కూడా టాప్ 50 జాబితాలో చోటు దక్కింది. 2014 నుంచి 2016 వరకు ఎబోలాను తరిమికొట్టడంలో లాస్ట్‌మైల్ సంస్థ ఎనలేని కృషి చేసింది. రాజ్ పంజాబీ నేతృత్వంలోని ఈ సంస్థ రిమోట్ ఏరియాలో పనిచేసే ఆరోగ్యకార్యకర్తలకు వీడియో, ఆడియోల్లో సందేశాలను పంపేలా ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కమ్యూనిటీ హెల్త్ ఎకాడమీనీ ఏర్పాటు చేయడం ఎంత వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అతుల్ గవాండే... అమేజాన్, బెర్క్‌షైర్ హాత్వే, జేపీ మోర్గాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసే దాదాపు ఒక కోటి మంది ఉద్యోగులకు ఉచితంగా సేవలందించే ఆరోగ్యపరిరక్షణా కార్యక్రమాన్ని అతుల్ గవాండే ప్రవేశపెట్టినందుకుగాను గవాండేని టాప్ 50 జాబితాలో చేర్చి గౌరవించారు. -
1378.92 కోట్లకు టైమ్ మ్యాగజైన్ అమ్మకం
-
గో విరాట్.. థ్యాంక్స్ సచిన్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రఖ్యాత టైమ్స్ మేగజైన్ ప్రతియేడు విడుదల చేసే ‘100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా’లో కోహ్లి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లోని ప్రముఖులు రాస్తుంటారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాశారు. ‘2008లో అండర్–19 ప్రపంచకప్‌కు నేతృత్వం వహిస్తున్న కోహ్లిని తొలిసారి చూశాను. పరుగుల సాధించాలన్న కసి, ఆటలో నిలకడ ప్రదర్శించడం విరాట్ గొప్పదనం. అదే అతన్ని విశిష్టమైన ఆటగాడిగా నిలిపింది. అతని ఆటతో భారత్ ఎన్నో విజయాల్ని సొంతం చేసుకుంది. నేడు విరాట్ కోహ్లి అనే పేరు అందరికీ సుపరిచితమైంది’ అంటూ ప్రొఫైల్‌లో కోహ్లిపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక కోహ్లి వెస్టిండిస్ టూర్లో విఫలమై విమర్శలు ఎదుర్కున్న సందర్భాన్ని సచిన్ ప్రస్తావిస్తూ... ‘మా నాన్న నాకు తరచూ చెప్తుండేవాడు. చేసే పనిలో నిమగ్నమై ముందుకు సాగాలి. నిరంతరం శ్రద్ధతో పనిచేసినప్పుడే మన వైఫల్యాలు దూరమౌతాయి. అంతేకాదు మనల్ని విమర్శించిన వారే పొగుడుతారు అని. ఆయన అప్పుడు చెప్పిన విషయాలన్నీ కోహ్లి విషయంలో రుజువయ్యాయి. పట్టుదలతో ప్రయత్నించి కోహ్లీ తన బలహీనతల్ని అధిగమించాడు. ఆట, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు’ అని సచిన్ ప్రొఫైల్‌లో వివరించాడు. ‘అతను కెరీర్లో ఇంకా ఎన్నో విజయ శిఖరాలకు ఎదగాలి. భారత్‌కు ఎన్నో పేరు ప్రఖ్యాతుల్ని అందించాలి. గో విరాట్..! అంటూ ప్రొఫైల్‌కు ముగింపునిచ్చాడు సచిన్. దీనిపై కోహ్లి తన ట్వీటర్లో స్పందించాడు. ‘మీ అమూల్యమైన, స్ఫూర్తిదాయక మాటలకు కృతజ్ఞుడ్ని’ అంటూ ట్వీట్ చేశాడు. Thank you @sachin_rt paaji for such warm and encouraging words. Truly honored for being able to make it to the @Time's 100 list. #Times100 #grateful 🙏😇 — Virat Kohli (@imVkohli) 20 April 2018 2017లో కోహ్లి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న టైమ్స్ ఈ 29 క్రికెట్ స్టార్‌కి తన 100 మంది జాబితాలో చోటు కల్సించింది. బౌలర్లకు ముచ్చెమటలు పోయించిన కోహ్లి తన అద్భుత ప్రదర్శనలతో 2017లో అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీలు సాధించాడు. 2,818 పరుగులు చేసి ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అంశంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర (2014), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (2005) మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈ జాబితాలో విరాట్ కోహ్లితో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్-2018లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి తదుపరి ఇంగ్లండ్ పర్యటనకై సిద్ధమౌతున్నాడు. -
ఫొటో షూట్ వద్దు: ట్రంప్
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ అందించే పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండోసారి తనకు వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఏడాది అవార్డుల ప్రదానం కోసం ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలని టైమ్స్ కోరడంతో ట్రంప్ స్పందించారు. ‘గతేడాదిలాగే ఈ సారి కూ నేనే పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యే అవకాశముందని చెప్పేందుకు టైమ్స్ ప్రతినిధులు ఫోన్ చేశారు. అందుకోసం ఓ మేజర్ ఫొటో షూట్‌తో పాటు ఇంటర్వ్యూ కావాలన్నారు. ఇందుకు నేను వద్దని చెప్పా. ఏదేమైనా ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎంపికపై ట్రంప్ పొరపడుతున్నారని టైమ్స్ వ్యాఖ్యానించింది. విజేతను డిసెంబర్ 6న ప్రకటిస్తామని వెల్లడించింది. -
‘టైమ్స్ పర్సన్’ మళ్లీనా.. నాకొద్దు..!!
వాషింగ్టన్ : ‘టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017’ ను తిరస్కరించాలని తాను నిర్ణయించుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్లు చేశారు. ఈ ఏడాది కూడా తానే టైమ్స్ పర్సన్‌గా ఎంపిక అవుతాననే సమాచారం అందినట్లు చెప్పారు. మేగజీన్‌పై ఫొటో కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయాల్సివుంటుందని, అది తనకు ఇష్టం లేదని అన్నారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017ను అవార్డును తాను స్వీకరించబోనని చెప్పారు. టైమ్స్ తదితర మేగజిన్స్ కవర్లపై కనిపించేందుకు ట్రంప్ తెగ ఉబలాటపడిపోయిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. 2015 టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తనను ఎంపిక చేయనందుకు ట్రంప్ టైమ్స్పై ఫైర్ అయ్యారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2016గా ట్రంప్ ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్ ట్వీట్లపై స్పందించిన టైమ్స్ అవార్డును ఇచ్చేందుకు అనుసరించే విధానం గురించి తెలియకుండా అధ్యక్షుడు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2017పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొంది. కాగా, ఈ ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ఇయర్‌ను టైమ్స్ మేగజీన్ వచ్చే నెల ఆరో తేదీన ప్రకటించనుంది. -
ఒబామా నుంచి మలాలా దాకా..
‘టైమ్’ మేగజీన్ 100 మంది ప్రభావశీలుర జాబితాలో మోదీ సహా మహామహులు ‘భారతదేశపు సంస్కరణల సారథి’గా ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా ‘టైమ్ మేగజీన్’లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాసం రాయటం.. భారత ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా పరిగణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ప్రచురితమవుతున్న ప్రఖ్యాత అంతర్జాతీయ వారపత్రిక టైమ్ మేగజీన్. 1923 లో మొదలైన ఈ మేగజీన్ అమెరికాలో తొలి వార్తా వారపత్రిక. లండన్ నుంచి యూరోపియన్ ఎడిషన్, హాంగ్‌కాంగ్ నుంచి ఏసియన్ ఎడిషన్, సిడ్నీ నుంచి సౌత్ పసిఫిక్ ఎడిషన్లను ప్రచురిస్తోంది. ప్రపంచంలో అత్యంత పాఠకాదరణ ఉన్న మేగజీన్ ఇదే. రెండున్నర కోట్ల మంది దీన్ని చదువుతారు. అందులో రెండు కోట్ల మంది అమెరికాలోనే ఉన్నారు. టైమ్ మేగజీన్ 1999లో తొలిసారి 20వ శతాబ్దపు 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను సర్వే ద్వారా ప్రకటించింది. అప్పటి నుంచీ ప్రతి ఏడాదీ ఆ ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రచురిస్తోంది. రాజకీయాలు, వ్యాపారం, కళలు తదితర రంగాల్లో ప్రభావశీలురను ఎంపిక చేస్తోంది. 2015లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల గురించి.. వారి వారి రంగానికి చెందిన ఇతర ప్రముఖుల చేత పరిచయం చేయించటం విశేషం. ఆయా దేశాల ప్రజల సంఖ్యను బట్టి ప్రభావవంతమైన దేశాధ్యక్షులుగా.. భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులను ఎంపిక చేశారు. పోప్ ఫ్రాన్సిస్, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఇజ్రాయెల్ పాలకుడు బెంజమిన్ నెతన్యాహు పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా కంపెనీల ఉత్పత్తులను వాడే వారి సంఖ్యను బట్టి ప్రభావశీలురను ఎంపిక చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, లింక్డ్ఇన్ సీఈఓ రీడ్ హాఫ్మన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్బుక్లో అభిమానుల సంఖ్యను బట్టి వివిధ కళా రంగాలకు చెందిన ప్రభావవంతమైన ప్రముఖ తారలను ఎంపిక చేశారు. ఎమ్మా వాట్సన్, కిమ్ కర్దషియన్, కెవిన్ హార్ట్, బ్రాడ్లీ కూపర్, రీస్ విదర్‌స్పూన్ పేర్లను ఎంపిక చేశారు. ఆరోగ్య రంగంలో భారత్ నుంచి మానసిక వైద్య చికిత్సా నిపుణుడు విక్రమ్పటేల్ పేరు కూడా ఇందులో చోటు సంపాదించుకుంది. భారత ప్రధాని మోదీని పరిచయం చేసిన ఒబామాను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడిగా పేర్కొంటూ టైమ్ మేగజీన్ రాజకీయ వ్యాసరచయిత జో క్లీన్ రాశారు. ఉత్తరకొరియా ‘పీడకుడు’ అంటూ ఆ దేశాధిపతి కిమ్ జాంగ్ ఉన్ గురించీ రాశారు. జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా పాకిస్తాన్‌కు చెందిన బాలికల విద్యా ఉద్యమ కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (17) మరో రికార్డు సృష్టించారు.