సచిన్‌తో ముచ్చటిస్తున్న కోహ్లి
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు విరాట్ కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రఖ్యాత టైమ్స్ మేగజైన్ ప్రతియేడు విడుదల చేసే ‘100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా’లో కోహ్లి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లోని ప్రముఖులు రాస్తుంటారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాశారు.
‘2008లో అండర్–19 ప్రపంచకప్‌కు నేతృత్వం వహిస్తున్న కోహ్లిని తొలిసారి చూశాను. పరుగుల సాధించాలన్న కసి, ఆటలో నిలకడ ప్రదర్శించడం విరాట్ గొప్పదనం. అదే అతన్ని విశిష్టమైన ఆటగాడిగా నిలిపింది. అతని ఆటతో భారత్ ఎన్నో విజయాల్ని సొంతం చేసుకుంది. నేడు విరాట్ కోహ్లి అనే పేరు అందరికీ సుపరిచితమైంది’ అంటూ ప్రొఫైల్‌లో కోహ్లిపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక కోహ్లి వెస్టిండిస్ టూర్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కున్న సందర్భాన్ని సచిన్ ప్రస్తావిస్తూ... ‘మా నాన్న నాకు తరచూ చెప్తుండేవాడు. చేసే పనిలో నిమగ్నమై ముందుకు సాగాలి. నిరంతరం శ్రద్ధతో పనిచేసినప్పుడే మన వైఫల్యాలు దూరమౌతాయి. అంతేకాదు మనల్ని విమర్శించిన వారే పొగుడుతారు అని. ఆయన అప్పుడు చెప్పిన విషయాలన్నీ కోహ్లి విషయంలో రుజువయ్యాయి. పట్టుదలతో ప్రయత్నించి కోహ్లీ తన బలహీనతల్ని అధిగమించాడు. ఆట, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు’ అని సచిన్ ప్రొఫైల్‌లో వివరించాడు.
‘అతను కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయ శిఖరాలకు ఎదగాలి. భారత్‌కు ఎన్నో పేరు ప్రఖ్యాతుల్ని అందించాలి. గో విరాట్..! అంటూ ప్రొఫైల్‌కు ముగింపునిచ్చాడు సచిన్. దీనిపై కోహ్లి తన ట్వీటర్‌లో స్పందించాడు. ‘మీ అమూల్యమైన, స్ఫూర్తిదాయక మాటలకు కృతజ్ఞుడ్ని’ అంటూ ట్వీట్ చేశాడు.
Thank you @sachin_rt paaji for such warm and encouraging words. Truly honored for being able to make it to the @Time's 100 list. #Times100 #grateful 🙏😇
— Virat Kohli (@imVkohli) 20 April 2018
2017లో కోహ్లి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న టైమ్స్ ఈ 29 క్రికెట్ స్టార్‌కి తన 100 మంది జాబితాలో చోటు కల్సించింది. బౌలర్లకు ముచ్చెమటలు పోయించిన కోహ్లి తన అద్భుత ప్రదర్శనలతో 2017లో అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీలు సాధించాడు. 2,818 పరుగులు చేసి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అంశంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర (2014), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (2005) మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. కాగా, ఈ జాబితాలో విరాట్ కోహ్లితో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్-2018లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి తదుపరి ఇంగ్లండ్ పర్యటనకై సిద్ధమౌతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment