
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.
వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్‌లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్‌గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్‌బెల్ (అలిస్టర్ క్యాంప్‌బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment