
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.
సచిన్ టెండ్కులర్‌కు రెండో స్థానం
ఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్‌లో టాప్-5 ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..
అప్పుడే తొలిసారిగా చూశాను
చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్‌కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో గేల్ మూడు శతకాలు బాదాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్‌ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.
అతడిని చూసే నేర్చుకున్నా
అదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. మ్యాచ్‌ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.
చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్‌కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్‌లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.
సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు
ఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్‌కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.
అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్‌గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.
అతడొక ఛేజ్‌మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఫిట్‌నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతడు పెట్టింది పేరు’’అని రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు
1. విరాట్ కోహ్లి(ఇండియా)
2. సచిన్ టెండుల్కర్(ఇండియా)
3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)
4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)
5. క్రిస్ గేల్(వెస్టిండీస్).
చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment