నందితా వెంకటేషన్ నృత్య, సంగీత ప్రేమికురాలు. పాదం కదలాలంటే పదం వినిపించాల్సిందే. నాట్యంలో మంచి పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో క్షయ బారిన పడింది. మందులు వాడి వాడి శరీరం గుల్ల అయింది. బాగయ్యాక కొన్ని రోజులకు ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది. అలా అని ఆమె నాట్యం ఆపలేదు.
ఆ నాట్యమే తన బలం అయింది. తక్కువ ధరలకు క్షయవ్యాధి గ్రస్తులకు మందులు దొరికేలా దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి కృషి చేసి విజయం సాధించింది నందిత. టైమ్స్ మ్యాగజీన్ 2023 (100–ఎమర్జింగ్ లీడర్స్) జాబితాలో నందితా వెంకటేశన్‌కు చోటు లభించింది....
‘క్షయ వ్యాధి నా పాత స్నేహితురాలు’ అని సరదాగా చెబుతుంది ముంబైలో పుట్టి పెరిగిన నందితా వెంకటేశన్. డిగ్రీ కాలేజీలో చేరిన సంతోషంలో ఒకవైపు స్నేహితులంతా తలమునకలై ఉండగా, నందిత మాత్రం టీబీతో పోరాడుతోంది. పద్నాలుగు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.కొంతకాలానికి...పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత జటిలం అయింది. భరించలేని కడుపు నొప్పి, బరువు తగ్గడం మొదలైంది.వైద్యుల సూచన మేరకు సర్జరీ కోసం ఆస్పత్రిలో పదిరోజులు ఉంది. డిశ్చార్జి తరువాత పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దీంతో పెద్ద మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు.
‘చికిత్సలో భాగంగా రోజుకు పది నుంచి పదిహేను మాత్రల వరకు వేసుకోవాల్సి వచ్చేది. వాంతులు అయ్యేవి. డిపెష్రన్‌కు గురయ్యేదాన్ని. టీబీ కంటే నరకమే నయం అనిపించేది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నందిత. పీక్కుపోయిన ముఖంతో, రాలిపోయిన తల వెంట్రుకలతో తనను తాను అద్దంలో చూసుకోవాలన్నా భయపడేది నందిత. ఇలా భయపడుతూ, బాధపడుతూ ఉంటే వైద్యుల చికిత్స ఎలాంటి ఫలితం ఇవ్వదని తనకు తెలుసు. ముందు మనోధైర్యం తెచ్చుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అనుకుంది. తనకు కావల్సిన శక్తులు సంగీతంలో దొరికాయి. రెండు నెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. 22 కిలోల బరువు తగ్గింది.
మందులు వాడీ వాడీ శరీరం చచ్చుబడినట్లుగా అనిపించింది. అయితే ఇంటికి వచ్చిన సంతోషం ఆ బాధని దూరం చేసింది. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. నెలరోజుల తరువాత వినికిడి శక్తి కోల్పోయింది. ఎంత పెద్ద శబ్దమైనా వినిపించేది కాదు. వినికిడి శక్తి కోల్పోయినా తనకు ఇష్టమైన నృత్యంపై ప్రేమను మాత్రం కోల్పోలేదు నందిత. మ్యూజిక్ వినిపించకపోయినా డ్యాన్స్ చేసేది. ఇది తనకు బాధ నుంచి ఉపశమనంగా అనిపించేది. ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంలో శిక్షణ మొదలుపెట్టిన నందిత...‘భరత నాట్యం అనేది నాకు కేవలం అభిరుచి కాదు. అంతకంటే ఎక్కువ.
నన్ను నేను ప్రేమించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి. నన్ను నేను వ్యక్తీకరించుకునే బలమైన మాధ్యమం’ అంటుంది. చీకటిరోజులు వెళ్లి పోయాయి. నందిత మళ్లీ మామూలు మనిషి అయింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసిన నందిత జర్నలిస్ట్‌గా తనకు ఇష్టమైన అక్షర సేద్యం చేస్తోంది.
క్షయవ్యాధి చికిత్సలో భాగంగా తనలాగే వినికిడి శక్తి కోల్పోయిన దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి ఒక అమెరికన్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన క్షయవ్యాధి ఔషధానికి రెండోసారి పేటెంట్ ఇవ్వకూడదంటూ భారత ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించింది. ఈ విజయం ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకు తక్కువ ధరలకు మందులు దొరికే అవకాశం ఏర్పడింది. ఇద్దరూ టైమ్స్ జాబితాలో చోటు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment