
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్ బయోటక్ దిగ్గజం కేవల్ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..
2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్‌రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్‌రమణి. ఆమె ఈ ఏడాది టైమ్ మ్యగజైన్ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది.
నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్ ప్రోఫైల్ కూడా దీన్నే హైలెట్ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది.
అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్‌ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.
రేష్మా విద్యా నేపథ్యం..
ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందింది.
ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్‌లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.
(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్ జాగ్రత్త..!)