అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్ కమల్ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్ కమల్ (57)తో పాటు ఆయన భార్య టీనా కమల్ (54), కుమార్తె ఆరియానా (18) మృతి చెందడం కలకలం రేపుతోంది.
స్థానిక కాల మానం ప్రకారం.. గురువారం సాయంత్రం 7.30గంటల సమయంలో రాకేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉండే ఖరీదైన డోవర్ భవనంలో చనిపోయినట్లు గుర్తించామని నార్‌ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (డీఏ) మైఖేల్ మొరిస్సే తెలిపారు.
ఈ ఘటనపై మైఖేల్ మొరిస్సే మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన గృహ హింస అయ్యిండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు భర్త రిక్కీ మృతదేహం వద్ద తుపాకీ ఉండడమేనని అన్నారు.
చంపారా? చంపించారా?
ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారా? లేదంటే ఎవరిచేతనైనా చంపబడ్డారా? అనేక అనుమానాలపై స్పష్టత ఇచ్చేందుకు న్యాయ వాది మైఖేల్ మొరిస్సే నిరాకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ సంఘటనను హత్య లేదంటే ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించే ముందు వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉందని చెప్పారు.
ఆర్ధిక సమస్యలే కారణమా?
రాకేష్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణానికి ఆర్ధిక సమస్యలే కారణమని తెలుస్తోంది. సంబంధిత ఆన్‌లైన్‌లోని ఆధారాల్ని స్థానిక పోలీసులు సేకరించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, ఇతర సమస్యలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించ లేదని మోరిస్సే చెప్పారు. ప్రస్తుతం ఈ హత్యలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఆస్తుల అమ్మకం
ది పోస్ట్ నివేదిక ప్రకారం.. రాకేష్ కమల్ కుటుంబం 5.45 మిలియన్ డాలర్ల విశాలమైన భవనంలో నివసిస్తుంది. అయితే ఈ భవనాన్ని ఏడాది క్రితం మసాచుసెట్స్‌కు చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌సీకి 3 మిలియన్లకు విక్రయించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, 2019లో కమల్‌లు 19,000 చదరపు అడుగుల ఎస్టేట్‌లో 11 బెడ్‌రూమ్‌లు ఉన్న భవనాన్ని రిక్కీ 4 మిలియన్లకు కొనుగోలు చేశారు.
సంస్థ కార్యకలాపాల రద్దు
రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్‌లో నివసించే రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
విద్యా వంతులు
ఎడ్యునోవా వెబ్‌సైట్ ప్రకారం..రాకేష్ కమల్ భార్య టీనా కమల్ భారత్‌లోని ఢిల్లీ యూనివర్సీటీ, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్‌సైట్‌లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. ఇక కమల్ బోస్టన్ యూనివర్సిటీ, ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అలాగే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి కూడా. ఎడ్యునోవాలో పని చేయడానికి ముందు రాకేష్ కమల్ ఎడ్యుకేషన్ విభాగంలో అపారమైన అనుభవం ఉంది. ఇక ఎడునోవా మిడిల్ స్కూల్, హైస్కూల్, కాలేజ్‌లలోని విద్యార్థుల గ్రేడ్‌లను మెరుగుపరిచేలా సేవలందిస్తోంది. ఇక, రాకేష్ కమల్, టీనా కమల్ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మోంట్‌లోని మిడిల్‌బరీ కాలేజీ న్యూరోసైన్స్ చదువుతుండేవారు.
అప్పుల ఊబిలో ఉక్కిరి బిక్కిరి
టీనా కమల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. తనకు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల అప్పు ఉందని ఫైలింగ్‌లో తెలిపారు. తగిన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో రెండు నెలల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చివరికి ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే రాకేష్ కమల్ తన భార్య టీనా కమల్, ఆరియాను హత్యా చేశారా? ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దృష్టిసారించారు.
Comments
Please login to add a commentAdd a comment