bharatha natyam
-
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సూర్యతేజ, మీనాక్షి, హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం భరతనాట్యం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా టాలీవుడ్ అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు.తాజాగా భరతనాట్యం చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సినిమా రిలీజైన దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీతోనే సూర్యతేజ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో వైవా హర్ష కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. -
టీబీతో చీకటిరోజులు..పోరాడి గెలిచింది,టైమ్స్ మ్యాగజీన్లో చోటు
నందితా వెంకటేషన్ నృత్య, సంగీత ప్రేమికురాలు. పాదం కదలాలంటే పదం వినిపించాల్సిందే. నాట్యంలో మంచి పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో క్షయ బారిన పడింది. మందులు వాడి వాడి శరీరం గుల్ల అయింది. బాగయ్యాక కొన్ని రోజులకు ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది. అలా అని ఆమె నాట్యం ఆపలేదు. ఆ నాట్యమే తన బలం అయింది. తక్కువ ధరలకు క్షయవ్యాధి గ్రస్తులకు మందులు దొరికేలా దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి కృషి చేసి విజయం సాధించింది నందిత. టైమ్స్ మ్యాగజీన్ 2023 (100–ఎమర్జింగ్ లీడర్స్) జాబితాలో నందితా వెంకటేశన్‌కు చోటు లభించింది.... ‘క్షయ వ్యాధి నా పాత స్నేహితురాలు’ అని సరదాగా చెబుతుంది ముంబైలో పుట్టి పెరిగిన నందితా వెంకటేశన్. డిగ్రీ కాలేజీలో చేరిన సంతోషంలో ఒకవైపు స్నేహితులంతా తలమునకలై ఉండగా, నందిత మాత్రం టీబీతో పోరాడుతోంది. పద్నాలుగు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.కొంతకాలానికి...పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత జటిలం అయింది. భరించలేని కడుపు నొప్పి, బరువు తగ్గడం మొదలైంది.వైద్యుల సూచన మేరకు సర్జరీ కోసం ఆస్పత్రిలో పదిరోజులు ఉంది. డిశ్చార్జి తరువాత పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దీంతో పెద్ద మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. ‘చికిత్సలో భాగంగా రోజుకు పది నుంచి పదిహేను మాత్రల వరకు వేసుకోవాల్సి వచ్చేది. వాంతులు అయ్యేవి. డిపెష్రన్కు గురయ్యేదాన్ని. టీబీ కంటే నరకమే నయం అనిపించేది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నందిత. పీక్కుపోయిన ముఖంతో, రాలిపోయిన తల వెంట్రుకలతో తనను తాను అద్దంలో చూసుకోవాలన్నా భయపడేది నందిత. ఇలా భయపడుతూ, బాధపడుతూ ఉంటే వైద్యుల చికిత్స ఎలాంటి ఫలితం ఇవ్వదని తనకు తెలుసు. ముందు మనోధైర్యం తెచ్చుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అనుకుంది. తనకు కావల్సిన శక్తులు సంగీతంలో దొరికాయి. రెండు నెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. 22 కిలోల బరువు తగ్గింది. మందులు వాడీ వాడీ శరీరం చచ్చుబడినట్లుగా అనిపించింది. అయితే ఇంటికి వచ్చిన సంతోషం ఆ బాధని దూరం చేసింది. అయితే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. నెలరోజుల తరువాత వినికిడి శక్తి కోల్పోయింది. ఎంత పెద్ద శబ్దమైనా వినిపించేది కాదు. వినికిడి శక్తి కోల్పోయినా తనకు ఇష్టమైన నృత్యంపై ప్రేమను మాత్రం కోల్పోలేదు నందిత. మ్యూజిక్ వినిపించకపోయినా డ్యాన్స్ చేసేది. ఇది తనకు బాధ నుంచి ఉపశమనంగా అనిపించేది. ఏడు సంవత్సరాల వయసులో భరతనాట్యంలో శిక్షణ మొదలుపెట్టిన నందిత...‘భరత నాట్యం అనేది నాకు కేవలం అభిరుచి కాదు. అంతకంటే ఎక్కువ. నన్ను నేను ప్రేమించుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి. నన్ను నేను వ్యక్తీకరించుకునే బలమైన మాధ్యమం’ అంటుంది. చీకటిరోజులు వెళ్లి పోయాయి. నందిత మళ్లీ మామూలు మనిషి అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసిన నందిత జర్నలిస్ట్‌గా తనకు ఇష్టమైన అక్షర సేద్యం చేస్తోంది. క్షయవ్యాధి చికిత్సలో భాగంగా తనలాగే వినికిడి శక్తి కోల్పోయిన దక్షిణ ఆఫ్రికాకు చెందిన పుమెజా టిసిలీతో కలిసి ఒక అమెరికన్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన క్షయవ్యాధి ఔషధానికి రెండోసారి పేటెంట్ ఇవ్వకూడదంటూ భారత ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేసి విజయం సాధించింది. ఈ విజయం ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకు తక్కువ ధరలకు మందులు దొరికే అవకాశం ఏర్పడింది. ఇద్దరూ టైమ్స్ జాబితాలో చోటు సాధించారు. -
Radhika Merchant Arangetram: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం
ముంబై: నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది. అక్కడి జియో వరల్డ్ సెంటర్లోని గ్రాండ్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి మర్చంట్, అంబానీ కుటుంబాల వారితోపాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు కూడా తరలి వచ్చారు. కృష్ణుడు–గోపిక నాట్య గురువు భావన ఠాక్రే వద్ద సుమారు ఎనిమిదేళ్లుగా భరత నాట్యం నేర్చుకుంటున్న రాధికా మర్చంట్.. ఆదివారం తన అరంగేట్రంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దైవానికి పుష్పాంజలి సమర్పించి.. గణేశ వందనంతో నాట్యాన్ని ప్రారంభించారు. రాగమాలిక, రాముడి కోసం శబరి పడిన తపన, కృష్ణుడు–గోపికల నృత్యం, యశోదా కృష్ణుల కథ, నటరాజ నృత్యం వంటి అంశాలను ప్రదర్శించారు. చివరగా అష్టరసాలు, థిల్లానా నృత్యంతో ముగించారు. రాధికా మర్చంట్ నాట్యానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత సంస్కృతిలో భాగమైన భరత నాట్యం సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించేందుకు మరో కళాకారిణి రూపంలో రాధికా మర్చంట్ తెరపైకి వచ్చారని అతిథులు అభినందించారు. నీతా అంబానీ కూడా.. అంబానీల కుటుంబంలో రాధికా మర్చంట్ రెండో భరత నాట్య కళాకారిణి కానుంది. ముఖేశ్ అంబానీ భార్య నీతా కూడా భరతనాట్య కళాకారిణి. దేశ విదేశాల్లోని తమ కంపెనీల బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నా కూడా నీతా అంబానీ భరత నాట్యాన్ని సాధన చేస్తూనే ఉంటారు. చదవండి: అయ్యయ్యో అదానీ...అదరగొట్టిన అంబానీ -
సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు అన్నా నేహాథామస్ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్‌కు పలువురు అభినందనలు తెలిపారు. -
డ్యాన్స్ బామ్మా.. డ్యాన్స్
స్థ్థలం.. కేరళలోని కొచ్చి. అక్కడి ఎడప్పల్లి నృత్య ఆస్వాదక సదస్‌లో 26 మంది మహిళలు భరతనాట్యం, మోహినీ ఆట్టం నేర్చుకుంటున్నారు. అందరూ యాభైఏళ్లు పైబడ్డవాళ్లే. ఆ గ్రూప్‌లోని అందరికన్నా పెద్దావిడకు 75 ఏళ్లు. వాళ్లకు డాన్స్ నేర్పుతున్న టీచరమ్మకు 30 ఏళ్లుంటాయి. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలని ఉన్నా.. కుటుంబం, పరిస్థితులు, ఇతర కారణాల ఆ ఇష్టాన్ని మనసులోనే దాచుకొని .. కళ పట్ల ఆరాధన పెంచుకుంటూ... జీవితంలో ఎప్పుడు అవకాశం దొరికినా నృత్యం నేర్చుకొని తీరాలన్న కలను సాకారం చేసుకుంటున్న వారే అందరూ. తమను తాము ప్రేమించుకుంటూ.. తమ కోసం సమయం చిక్కించుకున్న వారే అంతా! ‘మాలాంటి వాళ్ల కోసమే ఈ డాన్స్ ఇన్స్ స్టిట్యూట్ స్టార్ట్ అయింది. మొదట్లో అడుగులు వేయడానికి చాలా కష్టపడ్డాం. అయినా ప్రాక్టీస్ ఆపలేదు. చిన్నప్పుడు చేయాలనుకున్నది ఇప్పటికి గానీ సాధ్యపడలేదు. బెటర్ లేట్ దేన్స్ ఎవర్ అంటారు కదా (నవ్వుతూ). నిజం చెప్పొద్దూ.. మాకు నచ్చింది చేసుకోవడానికి మా పిల్లలూ ప్రోత్సహిస్తున్నారు’ అంటూ 60 ఏళ్ల లీనా చెప్తూంటే ‘పిల్లలు అంటే కొడుకులు అనుకుంటారేమో.. కాదు కూతుళ్లు, కోడళ్లు అని చెప్పండి లీనా’ అంటూ ఆమె పక్కనే ఉన్న ఉష మాటందుకున్నారు. ‘అవునవును.. నా విషయంలో నా మనవలు, మనవరాళ్లు కూడా’ అంటూ శ్రుతి కలిపింది 75 ఏళ్ల మామ్మ. గత సంవత్సరం దసరా రోజున ప్రారంభమైంది ఈ నృత్య ఆస్వాదక సదస్. ఈ 26 మందిలో గృహిణి నుంచి టీచర్, డాక్టర్, రిటైర్డ్ ఉద్యోగినుల దాకా ఉన్నారు. ఈ నాట్యాలయానికి వచ్చాకే వీళ్లంతా స్నేహితులయ్యారు. ‘ఈ ఇన్స్టిట్యూట్ మాకొక థెరపీ క్లినిక్ లాంటిది. డ్యాన్స్ సరే.. ఈ వయసులో ఇంతమంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. రకరకాల అభిరుచులు ఉన్నవాళ్లమే అంతా. ఇంటి విషయాల నుంచి హాబీస్, స్పోర్ట్స్, సినిమాలు.. వరల్డ్ పాలిటిక్స్ దాకా అన్ని విషయాల మీద చర్చించుకుంటాం.. ఒకరినొకరం టీజ్ చేసుకుంటాం’ అంటుంది డాక్టర్ ప్రేమ. ‘అందరూ ఒకే వయసు వాళ్లు కాదు కాబట్టి.. అందరూ తేలిగ్గా చేయగలిగే స్టెప్స్‌ను కంపోజ్ చేసి నేర్పిస్తున్నాను. వాళ్ల పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. పిల్లల్లా అల్లరి చేస్తారు.. జోక్స్ వేస్తూంటారు.. నవ్వుతారు... నవ్విస్తారు.. వీళ్లున్నంతసేపు టైమే తెలియదు. సందడిగా ఉంటుంది. కొత్త శక్తి వస్తుంది. వాళ్లు నా దగ్గర నేర్చుకునే కంటే వీళ్ల దగ్గర నేను నేర్చుకునేదే ఎక్కువ’ అంటుంది వీళ్ల డ్యాన్స్ మాస్టర్ ఆఎల్వి మి«థున. అన్నట్టు ఈ డ్యాన్స్ స్కూల్ యానివర్సరీకి వీళ్లందరి చేత పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పించబోతోంది ఈ టీచరమ్మ. అందుకు రిహార్సల్స్ కూడా మొదలెట్టేశారు ఈ బేబీలు.‘యూత్‌కి మేము ఎగ్జాంపుల్‌గా ఉండాలనుకుంటున్నాం..’ అంటారు ముక్తకంఠంతో. అన్నట్టు ఈ మధ్య హిట్టయిన ‘ఓ బేబీ’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిందేగా! -
క్షేత్రయ్య పదాలతో భరతనాట్య ప్రదర్శన
దంపతుల శిష్య బృంద కోలాట నృత్యం మొవ్వ(కూచిపూడి): కృష్ణా పుష్కరాల సందర్భంగా మొవ్వ గ్రామంలోని మువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్షేత్రయ్య పద నృత్యాలు కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన మంగళవారం చంద్రగిరికి చెందిన సాంప్రదాయ స్కూల్ ఫర్ భరతనాట్యం నిర్వాహకురాలు చింతం పుష్పం శిష్యబృందం, విజయవాడకు చెందిన భారతీయ భారతి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వాహకులు హేమంత్‌కుమార్, పద్మశ్రీ దంపతుల శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య శైలిలో ప్రదర్శించిన అంశాలు ప్రేక్షకులను సమ్మోహనపరిచాయి. ఆర్.వరలక్ష్మి, ఈ.నాగసాయి మేఘన, పి.అనూష, ఎం.బాలనాగఇంద్రాని, యు.దివ్యశ్రీలు, జస్విన్, నిర్మల, లేక్య, హిమజ, గాయత్రి, సిరి కుసుమ, మాళిక, ప్రియాంక, లహరి, సాహితి, శ్రీకరి, సుస్మితాలు క్షేత్రయ్య పదాలు, అన్నమాచార్య కీర్తనలను భరతనాట్య శైలిలో ప్రదర్శించి ప్రేక్షకులను రజింప చేశారు. కార్యక్రమాలను సాంస్కృతిక ప్రదర్శనల కోఆర్డినేటర్ వేదాంతం వెంకటనాగచలపతి పర్యవేక్షించారు.