ముంబై: నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది. అక్కడి జియో వరల్డ్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మర్చంట్, అంబానీ కుటుంబాల వారితోపాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు కూడా తరలి వచ్చారు.
కృష్ణుడు–గోపిక
నాట్య గురువు భావన ఠాక్రే వద్ద సుమారు ఎనిమిదేళ్లుగా భరత నాట్యం నేర్చుకుంటున్న రాధికా మర్చంట్.. ఆదివారం తన అరంగేట్రంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దైవానికి పుష్పాంజలి సమర్పించి.. గణేశ వందనంతో నాట్యాన్ని ప్రారంభించారు. రాగమాలిక, రాముడి కోసం శబరి పడిన తపన, కృష్ణుడు–గోపికల నృత్యం, యశోదా కృష్ణుల కథ, నటరాజ నృత్యం వంటి అంశాలను ప్రదర్శించారు. చివరగా అష్టరసాలు, థిల్లానా నృత్యంతో ముగించారు. రాధికా మర్చంట్ నాట్యానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత సంస్కృతిలో భాగమైన భరత నాట్యం సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించేందుకు మరో కళాకారిణి రూపంలో రాధికా మర్చంట్ తెరపైకి వచ్చారని అతిథులు అభినందించారు.
నీతా అంబానీ కూడా..
అంబానీల కుటుంబంలో రాధికా మర్చంట్ రెండో భరత నాట్య కళాకారిణి కానుంది. ముఖేశ్ అంబానీ భార్య నీతా కూడా భరతనాట్య కళాకారిణి. దేశ విదేశాల్లోని తమ కంపెనీల బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నా కూడా నీతా అంబానీ భరత నాట్యాన్ని సాధన చేస్తూనే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment