వైఎస్సార్‌సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..
ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు.
విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి.
మొత్తం 11 సీట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి.
విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి..
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు.
బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది.
మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి.
ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్‌సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం.
ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్‌సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి.
చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!
మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్‌సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment