ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?..
.. వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు.
రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!.
ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్‌లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్‌టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?.
ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు.
చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment