విశాఖ : ఏపీలో తారా స్థాయికి వెళ్లిన అధికార టీడీపీ నేతల నారా లోకేష్ భజనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంలో టీడీపీ నేతల డిమాండ్‌పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చెయ్యడానికి మేం ఎవరు..? డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు. మరి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు- 2025 జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు పాల్గొన్నారు. అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు.
ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు సైతం టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తామేం తక్కువ కాదన్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment