ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!.
కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు.
ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్‌లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం.
మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు.
ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అ
అంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి.
చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై
కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు.
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు.
మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment