తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.
వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.
గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.
భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.
నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.
చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు.
కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.
ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment