
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!
క్లైమెట్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్‌లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది.
పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్‌లను సిద్ధం చేసింది.
మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో
‘జాయేద్ సస్టైన్‌బిలిటీ ప్రైజ్‌లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది.
పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్‌లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది.
మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్‌ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్‌ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్‌ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది.
ఈ టైల్స్‌ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్‌లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.
మరిన్ని ఆవిష్కరణలు...
మా పేరెంట్స్, స్కూల్లో టీచర్‌ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్‌నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్
– కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..)
Comments
Please login to add a commentAdd a comment