అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్‌లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....
‘వైట్‌హౌజ్ ఫెలోస్‌ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.
బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.
ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్‌ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్‌ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్‌డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్‌సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.
2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.
రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్‌డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.
ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment