పవర్ రేంజర్స్ | scouts and guides, a complete training to the life | Sakshi
Sakshi News home page

పవర్ రేంజర్స్

Published Mon, Nov 25 2013 11:32 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

scouts and guides, a complete training to the life

 అబ్బాయి బీటెక్ పూర్తయింది.
 బెంగుళూరులోని పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం.
 రెండ్రోజుల్లో వెళ్లి జాయిన్ అవ్వాలి.
 ఇప్పుడేం చేస్తున్నాడు?
 ఆకలవుతుంటే... ఆఫీస్ నుంచి అమ్మ ఎప్పుడొస్తుందా అని నకనకలాడుతూ ఎదురుచూస్తున్నాడు!
 ఎట్లీస్ట్ ఆమ్లెట్ వేసుకోవడం కూడా తెలీని అబ్బాయి!
 అమ్మాయి ఉద్యోగం చేస్తోంది.
 ఆఫీస్ అయ్యాక ఇంటికి వచ్చే దారిలో క్యాబ్ ట్రబులిస్తే  డ్రైవర్ మధ్యలోనే దింపేశాడు.
 అదేం ఏరియానో తనకు తెలీదు.
 బిక్కుబిక్కుమంటూ నాన్నకు ఫోన్ చేసింది.
 ‘‘ఇప్పుడు ఎక్కడున్నావమ్మా...’’ అంటే సరిగ్గా చెప్పలేకపోతోంది!
 ఎట్లీస్ట్ ఇంటికి కూడా దారి తెలీని అమ్మాయి!
 ఆలోచిస్తే ఈ రెండూ చాలా చిన్న సమస్యలు.
 పరిష్కరించుకోలేక పోతే అవే పెద్ద సమస్యలు.
 చదువుతోపాటు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ని మనం పెద్దగా పట్టించుకోం కానీ,
 ఈ శిక్షణ పిల్లల్ని ‘పవర్ రేంజర్స్’లా తీర్చిదిద్దుతుంది.
 జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సందర్భాలలో...
 పిల్లలకు ఉపయోగపడుతుంది.
 పిల్లలకే కాదు, వారి ద్వారా సమాజానికి కూడా!
 ఎలా అన్నదే... ఈవారం ‘ప్రజాంశం’.

  స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పదం వినే ఉంటారు. చదువుతోపాటు పిల్లలకు సమాజం పట్ల బాధ్యత, తోటివారికి రక్షణగా నిలబడే స్థైర్యం...  ఇవన్నీ నేర్పేదే స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ స్వచ్ఛంద సంస్థ మన దేశానికొచ్చి శతాబ్దం దాటినా చాలామంది విద్యార్థులకు దీని గురించి తెలియదు. దేశానికి బాధ్యతగల పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ సేవల్ని ప్రపంచంలో వంద దేశాలు పూర్తిస్థాయిలో అందుకుంటున్నాయి. మన రాష్ర్టంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏం చేస్తోందో చెప్పేదే ఈ కథనం...
 
 స్కౌట్స్ అనేది ఆర్మీకి సంబంధించిన పదం. శత్రువుల సమాచారం సేకరించే వ్యక్తిని స్కౌట్ అంటారు. గైడ్ అంటే సంరక్షణ. ఇంగ్లండ్‌కి చెందిన రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ అనే ఆర్మీ వ్యక్తి పదేళ్ల పిల్లల కోసం 1907లో ఒక క్యాంప్ ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కి వచ్చి, పదిరోజుల పాటు పిల్లలు ఎవరిసాయం లేకుండా ఉంటారు. ఈ విషయాన్ని గమనించి ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం మన దేశానికి కూడా వచ్చింది. 1920 నాటికి స్కౌట్స్ పేరున కొన్ని, గైడ్స్ పేరుతో కొన్ని శిబిరాలు ఏర్పాటయ్యాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఉన్న అన్ని శిబిరాలకు ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశ్యంతో 1950లో ఢిల్లీ కేంద్రంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయింది.
 
 ఆ లోకం వేరు...
 
 స్కూల్లో తరగతి వేళల తర్వాత ఓ గంటపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాసులు ఉంటాయి. ఇందులో చేరిన విద్యార్థులకు, టీచర్లకు కూడా యూనిఫాం ఉంటుంది. 3 - 5 ఏళ్ల వయసున్న విద్యార్థుల్ని బన్నీస్ అనీ, 6 - 10 వయసున్న అమ్మాయిల్ని బుల్‌బుల్స్ అనీ, అబ్బాయిల్ని కబ్స్ అనీ, 10 - 16 ఏళ్ల విద్యార్థుల్ని రోవర్స్ అండ్ రేంజర్స్ అనీ పిలుస్తారు. వారి పాఠాలను... ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్ అని మూడు విభాలుగా విభజిస్తారు. ఇవి పూర్తయ్యాక రాజ్య పురస్కార్ ఉంటుంది.

రోవర్స్ అండ్ రేంజర్స్‌కి వెళ్లాక సోపాన్‌లతో పాటు రాష్ట్రపతి పురస్కార్ కూడా ఉంటుందన్నమాట. ప్రథమ సోపాన్‌లో... ప్రథమ చికిత్స మొదలు పరిశుభ్రత వరకూ అన్ని విషయాల్ని బోధించి ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు. ప్రకృతి పరిశీలన, పరోపకారం కూడా ప్రథమ సోపాన్‌లో భాగం. ద్వితీయ సోపాన్‌లో... వంట చేయడం నుంచి హెరిటేజ్ అండ్ కల్చర్ వరకూ పాఠాలుంటాయి. తృతీయ సోపాన్‌లో... క్యాంపులు, స్విమింగ్, జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయాలపై బోధన, ప్రాక్టికల్స్ ఉంటాయి.

ఈ క్యాంపుల్లో విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న గుడారాల్లో ఉంటారు. ‘‘పౌరులను... చదువొక్కటే గొప్పవారిగా తీర్చిదిద్దదు. తోటివారికి ఉపయోగపడాలన్న భావన కలగడానికి కావలసిన శిక్షణ మా సంస్థ మాత్రమే ఇవ్వగలదని నేను గర్వంగా చెప్పగలను’’ అంటారు ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ జి. పరమేశ్వర్.
 
 సమైక్యత కోసం...
 
 జాతీయ సమైక్యత క్యాంపుల కోసం... విద్యార్థుల్ని జిల్లాలు, రాష్ట్రాలు దాటిస్తోంది. రెండేళ్లకిత్రం మెదక్‌జిల్లాలోని శంకర్‌పల్లిలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌కి దేశవ్యాప్తంగా 20 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు హాజరయ్యారు. ఆహారపదార్థాల నుంచి ఆహార్యం వరకూ అన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. ‘‘చదువొక్కటే మనిషిని శభాష్ అనిపించదు. కళ్లెదురుగా ఎవరికైనా గాయమైతే వెంటనే సహాయపడాలి’’ అని స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేశారు.
 
 ఎన్ని నేర్పితే ఏం లాభం...
 
 ‘‘స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇచ్చే రాజ్యపురస్కార్, రాష్ర్టపతి పురస్కార్ సర్టిఫికెట్లు వల్ల మాకు ఉపయోగం ఏంటి?’’ అనే విద్యార్థులూ ఉంటారు. ఎన్‌సిసి సర్టిఫికెట్‌ల వల్ల ఉద్యోగాల సమయంలో ఉపయోగం ఉంటుంది. అలాంటి ఉపయోగం స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్‌కి కూడా ఉండాలి. లేదంటే ఈ సంస్థల ప్రాధానత్య తగ్గిపోతుంది. ‘మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం వరకూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయం సాధించగలదు. ఇందులో చేరడం వల్ల మా పిల్లాడికి ఏం లాభం?’ అని అడిగే తల్లిదండ్రులకు మా దగ్గర జవాబు లేదు. ‘‘విద్యార్థికి ఇచ్చిన మెరిట్ సర్టిఫికెట్ చూసి, ఉద్యోగ అవకాశాలు కలిగించాలని కోరుకుంటున్నాం.


దాని కోసం మన రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ కూడా రాశాం’’ అని వివరించారు పరమేశ్వర్. విద్య సర్టిఫికెట్‌తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ తీసికెళ్లిన విద్యార్థికి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉందని తెలిస్తే ప్రతి పాఠశాలలోనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్లాస్‌లు ప్రత్యక్షమవుతాయి. ప్రయోజనం లేకుండా ప్రేమించడం కూడా దండగనుకునే రోజుల్లో సేవలు పొందడానికి తాయిలాలు తప్పనిసరి. ఆ రకంగానైనా స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠాలు ప్రతి విద్యార్థికి అందే అవకాశం ఉంటుంది. ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుందాం.
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు: ఎస్. ఎస్. ఠాగూర్

 
  మీ స్కూల్లో ఉండాలంటే..

 స్కౌట్స్ అండ్ గైడ్స్ బోధనలు మీ స్కూల్లో కూడా ఉండాలంటే హైదరాబాద్‌లోని  స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయానికి  దరఖాస్తు చేసుకోవాలి. మీ స్కూలు టీచర్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ ఇచ్చి మీ విద్యార్థులకు క్లాసులు చెప్పిస్తారు.
 - జి. పరమేశ్వర్, ఆర్గనైజింగ్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్కౌట్స్
 అండ్ గైడ్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement