యువ సేవకులు | Youth for seva Hyderabad service to society | Sakshi
Sakshi News home page

యువ సేవకులు

Published Thu, Oct 17 2013 10:57 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

Youth for seva Hyderabad service to society

మంచి మంచి ఉద్యోగాలు.
 లక్షల్లో సాఫ్ట్‌వేర్ జీతాలు.
 పైగా ఇరవైల్లో ఉన్నవారు.
 టైమ్ దొరికితే ఏం చేస్తారు?
 ఏమైనా చెయ్యొచ్చు.
 టూర్‌లు కొట్టొచ్చు, మాల్స్ తిరగొచ్చు.
 పాలసీలు, ఇ.ఎం.ఐ.లలో... తలమునకలు కావచ్చు.
 నెలకింత కడితే ముప్పై ఏళ్ల తర్వాతఎంత వస్తుందని లెక్కలు కట్టొచ్చు.
 కానీ వీళ్లు...
 అవేం చేయడం లేదు!
 ‘యూత్ ఫర్ సేవ’ అంటూ...
 సెలవు రోజుల్ని, బరువు పర్సుల్ని  సార్థకం చేసుకుంటున్నారు.
 ఎలా అన్నదే... ఈవారం ‘ప్రజాంశం’.

 పంజాగుట్ట...అమీర్‌పేట్ మెయిన్‌రోడ్డు పక్కనున్న చెత్తకుండీల దగ్గర ఓ పాతికమంది అబ్బాయిలు... అమ్మాయిలు రోడ్లు ఊడ్చే సీన్... దారినపోయేవారిని కూడా ఆలోచింపచేసింది.  చీపుర్లు పట్టుకుని కార్లలోంచి దిగిన వారంతా ఎంతో శ్రద్ధగా చెత్తకుండీల చుట్టూ శుభ్రం చేయడం చూసి ఆ పక్కనే ఉన్న  స్వీపర్స్ కూడా ముక్కున వేలేసుకున్నారు. కాని, వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా చకచకా రోడ్లు ఊడ్చేసి... గోడలకు సున్నాలు వేస్తే అటుగా వెళుతున్న ఓ ఇద్దరు కుర్రాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘మాకు పెయింటింగ్ వచ్చు’ అని చెప్పి బ్రష్ అందుకుని ఆ గోడలపై వివేకానందుని బొమ్మలు వేశారు.

ఈ లోగా మిగిలిన యువత చుట్టుపక్కల షాపులదగ్గరకెళ్లి చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకూడదంటూ కౌన్సెలింగ్ ఇచ్చింది. ఈ నెల రెండోతేది....గాంధీ జయంతిరోజు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండు గంటలవరకూ ‘యూత్ ఫర్ సేవ’ సభ్యులు హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో రోడ్లు ఊడ్చి గాంధీజీకి  వినూత్నరీతిలో గౌరవ నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా ఈ యువత చేస్తున్న వినూత్న సేవాకార్యక్రమాలే ఏడువేల మంది యువతను ఆ సంస్థ సభ్యులుగా చేసుకున్నాయి. ఈ ఐటీ యువత  చేస్తున్న కృషి గురించి మరిన్ని వివరాలు....

బెంగుళూరులో పుట్టి...

ఆరేళ్లక్రితం బెంగుళూరులో ‘యూత్ ఫర్ సేవ’ (వైఎఫ్ ఎస్) సంస్థని అక్కడి ఐటీ యువత స్థాపించారు. వారి సేవాకార్యక్రమాలలో అక్కడ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ సంస్థని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న తమ స్నేహితులతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే చాలామంది ముందుకొచ్చారు. మన రాష్ర్టం నుంచి శోభిత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ముందుకొచ్చి 2010లో హైదరాబాద్‌లో ‘యూత్ ఫర్ సేవా’ సంస్థని స్థాపించారు. మొదట్లో కేవలం పదుల్లోనే ఉన్న సభ్యుల సంఖ్య ... ప్రస్తుతం ఏడు వేలకు చేరింది. వీరంతా కూడా స్వచ్ఛందంగా ‘యూత్ ఫర్ సేవ’కు తమ స్నేహ హస్తాలనందించారు. మూడు వందలమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఓ పన్నెండుమంది  తమ ఉద్యోగాలు కూడా వదిలేసి యూత్ ఫర్ సేవ కోసమే  పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

 సంఘం హైదరాబాద్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న స్వాతిరాం మాటల్లో చెప్పాలంటే ‘‘యువతకు అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని ఉన్నప్పటికీ వారిని ముందుకు నడిపించే వేదిక అంటూ ఏమీ లేకపోవడం వల్ల వారు ఏమీ చేయలేకపోతున్నారు. దీనిని గుర్తించే మేము మా సేవాకార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక అవసరం అనుకున్నాం. అందుకే ‘యూత్ ఫర్ సేవ’ను స్థాపించాం. గడిచిన మూడేళ్లలో ఊహించినదానికంటే ఎక్కువగా సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాం. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని...కొన్నాళ్లుపాటు వీకెండ్‌లో యూత్ ఫర్ సేవలో పనిచేసి తర్వాత ఇంట్లోవాళ్లని ఒప్పించి పూర్తిసమయం ఈ సంస్థలో పనిచేయడానికి సిద్ధపడ్డాను. ప్రస్తుతం మన నగరంలో పన్నెండుమంది తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఈ సంస్థ చేసే సేవాకార్యక్రమకాలకే అంకితమయ్యారు’’ అంటూ సంతోషంగా చెప్పారామె.
 
60 కంపెనీల ఉద్యోగులతో...

హైదరాబాద్ నగరంలోని 60 కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో పాటు ఓ పది కళాశాలల్లోని విద్యార్థులు కూడా యూత్ ఫర్ సేవాలో సభ్యులుగా ఉన్నారు. సంస్థ స్థాపించిన కొత్తల్లో పేద విద్యార్థులకు శని, ఆదివారాల్లో చదువు చెప్పడం, ప్రభుత్వపాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు పంచారు. ప్రస్తుతం విద్య మొదలు పారిశుధ్యం వరకూ తమ దృష్టికి ప్రతి ఒక్క సమస్య పట్లా స్పందించి తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. పార్ట్‌టైం, ఫుల్‌టైం, వీక్లీ వన్స్, మంత్లీ ట్రిప్...అంటూ రకరకాల సమయాల్లో సేవకు అందుబాటులో ఉంటున్నారు. వీరి సేవలను నగరానికే పరిమితం చేయకుండా మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రభుత్వపాఠశాలలకు కూడా విస్తరించారు. వీటితో పాటు ఏడాదికొకసారి ‘వనయాత్ర’ పేరుతో అటవీప్రాంతాలకు వెళ్లి అక్కడి గిరిజనులతో కలిసి మెలిసి గడుపుతూ, వారి జీవన విధానాలను పరిశీలించి వస్తుంటారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖాండ్ వరద బీభత్సంలో కకావికలమైన వారిని ఆదుకోడానికి యూత్ ఫర్ సేవ సభ్యుల  బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితులకు తమ సేవాహస్తం అందించారు.

 పేదల చదువుకోసం...

 అభివృద్ధి అనే పదం చదువుతోనే మొదలవుతుందంటారు ఈ సంస్థ సభ్యులు. ‘‘పెద్ద చదువులు చదువుకుని ఏసీ గుదుల్లో పనిచేసే ఉద్యోగాలు సంపాదించాం. మరి పూరిగుడిసెల్లో అక్షరాలకోసం వెతుక్కునే పేదవిద్యార్థుల కోసం మేము ఏం చేయగలమా అని ఆలోచించాం. ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌కిట్‌లు పంచి చేతులు దులుపుకోలేకపోయాం. మా ఆఫీసులకు దగ్గరగా ఉన్న మురికివాడల చిరునామాలు సంపాదించాం. అంజయ్యనగర్, సిద్ధిన్‌నగర్, వినాయక్‌నగర్, గుట్టాల బేగంపేట, మార్తాండ్‌నగర్, హఫీజ్‌పేట్‌లలో ఉన్న మురికివాడలకు వెళ్లి అక్కడ బడికి వెళ్లే విద్యార్థులకు సంబంధించిన వివరాలు సేకరించి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు, కొన్ని చోట్ల శని, ఆది వారాల్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాం.

వారితో హోమ్‌వర్క్ చేయించడం ఒక్కటే కాకుండా ఫోన్లు, లాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు...అన్నింటిపై కనీస అవగాహన పెంచుతామన్నమాట. దాంతో పిల్లలంతా మా క్లాస్‌లకోసం ఎదురుచూస్తుంటారు. ఆదివారం రోజైతే పుస్తకాలు, చదువులు కాకుండా వారికిష్టమైన కళకు సంబంధించి మాకు తెలిసిన విషయాలు చెప్పి వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఉన్న  ఆనందాన్ని వర్ణించలేము’’ అంటూ సంతృప్తితో చెప్పారు స్వాతిరాం.

జిల్లా విద్యాధికారి దగ్గర అనుమతి తీసుకుని హైదరాబాద్‌లోని 65 ప్రభుత్వపాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పే బాధ్యత తీసుకుంది యూత్ ఫర్ సేవ సంస్థ. దీనికోసం ఓ వందమంది వాలంటీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు.

చెత్త ఎత్తి...

పరిశుభ్రతే మనని పదికాలాలపాటు పచ్చగా ఉండనిస్తుంది. చెప్పుకోవడానికి నగరమే కాని కొన్ని ప్రాంతాల్లో  నిండిపోయిన చెత్తకుండీలతో ఉన్న రోడ్లు...చూస్తే జబ్బులొచ్చేలా ఉంటాయి. వాటిపై కూడా దృష్టిసారించారు ఈ యువత.

 ‘‘గాంధీజయంతి నాడు ఓ నలభైమంది యూత్ ఫర్ సేవ సభ్యులు నగరంలో నాలుగు ప్రధాన రహదార్లు శుభ్రం చేశారు. నెలకో, రెండు నెలలకో ఇలా రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు పెట్టుకుంటాం. శుభ్రం చేసి ఊరుకోకుండా ఆ ప్రాంతంలోని షాపులకు, ఇళ్లకు తిరిగి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దని కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. వీటితో పాటు చెరువుల క్లీనింగ్ కూడా చేస్తున్నాం.

దుర్గం చెరువు, హుసేన్‌సాగర్, సరూర్‌నగర్ లేక్, నేరెళ్ల లేక్‌లలోని చెత్తను చాలాసార్లు తీశాం. చెరువులో దిగి చెత్తను లాగడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ‘కంప్యూటర్ ముందు కూర్చుని పనులు చేసుకునే కుర్రాళ్ళు ఈ బండపనులేం చేస్తారని’ ఆ చుట్టుపక్కలవాసులు చాలామంది ఎద్దేవా చేసేవారు. తీరా శుభ్రం చేసిన తర్వాత చూసి బాగుందంటూ మెచ్చుకునేవారు. మాతోపాటు అమ్మాయిలు కూడా మాకు ఏమాత్రం తీసిపోకుండా పాల్గొనడం మాకు మరింత స్ఫూర్తినిస్తుంది’’ అని చెప్పారు శోభిత్.
 
సాధారణంగా శని, ఆదివారాలనగానే టెక్ ఉద్యోగులకు విహారాలు, విలాసాలు మాత్రమే గుర్తుకొస్తాయనే ముద్రను పూర్తిగా చెరిపివేసే పనిలో ఉన్న యూత్ ఫర్ సేవ సంస్థ దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘‘మేం చేసే పనికి మాకు ప్రశంసా పత్రాలు, గుర్తింపు ఏమీ అక్కర్లేదు... సేవాభావం ఉన్న యువత మాతో చేయి కలిపితే చాలు... మాతోపాటు మా చుట్టూ ఉన్న వాతావరణం కూడా పచ్చగా ఉంటుంది’’ అని పలికే వీరి కలలు నెరవేరాలని కోరుకుందాం.


 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ముందు ‘చూపు’తో...


 మురికివాడలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు కళ్లకు సంబంధించిన పరీక్షలు చేయించి అవరమైతే కళ్లద్దాలు ఇస్తున్నాం. ఈ ఏడాది 4000 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇచ్చాం. దీంతోపాటు మేం వెళ్లే అన్ని పాఠశాలల్లో ఆరోగ్యపట్టికలు ఏర్పాటు చేసి పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాం.
 - స్వాతిరాం, వైఎఫ్‌ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement