వైకల్యానికి కొత్త అర్థం...సంకల్పబలం! | differently abled people have special abilities | Sakshi
Sakshi News home page

వైకల్యానికి కొత్త అర్థం...సంకల్పబలం!

Published Tue, Dec 3 2013 1:31 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

differently abled people have special abilities

వైకల్యం అంటే ఏమిటి?
 చూపు లేకపోవడమా? చూడలేకపోవడమా?
 చూడలేకపోవడమే కదా?
 అలాగైతే, అంధులు వికలాంగులు కారు.
 మనోనేత్రంతో వారు అన్నీ చూడగలరు.
 వైకల్యం అంటే ఏమిటి?
 కాళ్లూచేతులూ లేకపోవడమా?
 లేనట్లు ఉండిపోవడమా?
 లేనట్లు ఉండిపోవడమే కదా!
 అలాగైతే అవిటివాళ్లు వికలాంగులు కారు.
 కార్యదీక్షతో వారు పరుగులు తీయగలరు.
 ఈ ‘స్పెషల్ ఎబిలిటీ’స్ ఇక్కడితో పూర్తి కాలేదు.
 వీరిలో కొందరు చక్కగా పాడుతున్నారు.
 అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు.
 సృజనాత్మకంగా బొమ్మలు గీస్తున్నారు.
 ఇలా రకరకాల నైపుణ్యాలను వెలికితీసి,
 వైకల్యం అంటే సంకల్పబలం తప్ప మరొకటి కాదని రుజువు చేసేందుకు
 కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేస్తున్న కృషి... పడుతున్న ప్రయాసే...
 ఈరోజు  ప్రజాంశం!


 ‘‘వీల్‌చైర్‌ని డిజేబిలిటీకి సింబల్‌గా కాదు ఎబిలిటీకి చిహ్నంగా మార్చాలనుకున్నాను. మా పిల్లల్ని డిజేబుల్డ్ అనొద్దు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనండి’’ అంటారు సయ్యద్ సలావుద్దీన్ పాషా. విభిన్న రకాల శారీరక, మానసిక సమస్యలున్న యువతీ యువకులను ఒకచోట చేర్చి ఓ గొప్ప కళాకారుల బృందంగా తీర్చిదిద్దారు ఈ ఢిల్లీవాసి, నృత్యనిపుణులు పాషా. ఈ బృందం పలుమార్లు హైదరాబాద్‌లో సైతం తమ వీల్‌చైర్ విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పాషా మాట్లాడారు. తాను ముస్లిం కాబట్టి హిందూ సంప్రదాయ నృత్యాన్ని నేర్పడానికి మొదట్లో ఓ గురువు నిరాకరించారని, అయితే ఆ తర్వాత ఎందరో నృత్యగురువులు తనను వారి ప్రియశిష్యుడిగా భావించారని గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ నృత్యాల్లో అందెవేసిన చేయి అయిన పాషా ఆ నైపుణ్యాన్ని వికలాంగులను తీర్చిదిద్దడానికి వినియోగిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
 
లోపాలే ఇంటిపేర్లా...

 ‘‘దేశంలో ఏడు కోట్లమంది శారీరక, మానసిక లోపాలున్నవారు ఉన్నారు.  గ్రామాల్లో ఈ లోపాల్ని శాపాలుగా, గత జన్మ పాపఫలితంగా భావిస్తారు. విధివశాత్తు లేదా ప్రమాదవశాత్తూ ఏర్పడ్డ బాధల్ని ఇంటిపేర్లుగా మార్చేసి గుడ్డిరమేష్, కుంటి దానయ్య, పిచ్చిపుల్లయ్య... అంటూ  అవమానకరంగా పిలుస్తారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పాషా... 30 సంవత్సరాలుగా వికలాంగుల సేవలో ఉన్నారు. వైకల్యబాధితులను విజయ వంతమైన కళాకారులుగా తీర్చిదిద్దాలనే ఆయన కసిలో నుంచి రూపుదిద్దుకున్నదే‘ఎబిలిటీ అన్‌లిమిటెడ్’ సంస్థ. ఈ బృందంలో అంధులు, మూగ, చెవిటి, పోలియో, డిజ్‌లెక్సియా, సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం బాధితులు ఎందరెందరో ఉన్నారు.

క్రచ్‌లు, వీల్‌చైర్‌లతోనే అనితరసాధ్యమైన ప్రదర్శనల ద్వారా గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లను ఈ బృందం స్వంతం చేసుకుంది. అమెరికా, కెనడా, వెస్ట్ ఇండీస్ సహా బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లోనూ ప్రదర్శన ఇచ్చింది. ‘‘ప్రారంభంలో ఈ సంస్థ మనుగడను ఎవరూ విశ్వసించలేదు. ‘వికలాంగుల నృత్యరూపకమా? ఇదెలా సాధ్యం?’ అన్నారు. దీనిని సాకారం చేయడం కోసం స్వయంగా రోజుకి 10 గంటల పాటు వీల్‌చైర్ మీద సాధన చేసి మరీ, సాధ్యం చేశాను. మా బృందం ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు నా బృందంలో 160 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారు’’ అంటూ సగర్వంగా చెప్పారాయన.
 
వైకల్యం నుంచి విజయాల బాట...

‘‘అచ్చం ఆ కృష్ణభగవానుడిలాంటి గురూజీ సారథ్యంలో నన్ను నేను అర్జునుడిలా భావిస్తున్నాను’’ అంటాడు మనోజ్. వీల్‌చైర్‌తో కాలం వెళ్లదీయాల్సిందేనని భావించిన మనోజ్‌ని భారతదేశపు తొలి డిజేబుల్డ్ డ్యాన్స్‌ట్రూప్‌లో సభ్యత్వం... తన కాళ్లమీద తాను నిలబడి విజయవంతమైన వ్యక్తిగా నిలిచేలా చేసింది. ‘‘నృత్యం నాకు సరికొత్త జీవితాన్నిచ్చింది’’ అంటున్న పోలియో బాధితుడు గుల్షన్‌కుమార్ ఒక నిమిషంలో 63 స్పిన్స్ (మెలికలు) తిరగడం ద్వారా వ్యక్తిగత గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఈ బృందంలో ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల దాకా విభిన్న వయసుల వికలాంగ కళాకారులున్నారు.

మార్షల్ ఆర్ట్స్ ఆన్ వీల్స్, రామాయణ ఆన్ వీల్స్, ఫ్రీడమ్ ఆన్ వీల్స్, దుర్గావతారాలు, భగవద్గీత, పంచతంత్ర కథలు, భరతనాట్యం, యోగా, సూఫీ, క రవాల నృత్యం... వీల్‌చైర్ మీదే ప్రదర్శిస్తారు. ‘‘అంగవికలురకు సంబంధించి విద్య, ఉద్యోగాల పరంగా ఉన్న వ్యతిరేక ఆలోచనాధోరణులను, సందేహాలను పటాపంచలు చేయాలనే ఉద్దేశ్యంతో మేం కృషి చేస్తున్నాం’’ అన్నారు పాషా. క్లాసికల్ డ్యాన్స్, మూవ్‌మెంట్ థెరపీ, స్టేజ్ లైటింగ్, ఫొటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, పిడబ్ల్యుడిలకు యానిమేషన్ వంటి వాటిలో వికలాంగులకు ఈ సంస్థ శిక్షణ అందిస్తోంది. ప్రసిద్ధ నృత్యగురువులు, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఈ సంస్థ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తరగతులు నిర్వహిస్తుంటారు. వాయిస్ మాడ్యులేషన్, స్పీచ్ థెరపీ, స్పెషల్ కొరియోగ్రాఫిక్ మూవ్‌మెంట్స్‌లో శిక్షణ అనంతరం ట్రూప్‌లోకి తీసుకుంటారు.  
 
ఇదో థెరపీ...

 ‘‘డిజేబిలిటీ ఉన్నవారికి డ్యాన్స్ సైడ్ ఎఫెక్ట్స్‌లేని మాత్ర వంటిది’’ అంటారు పాషా. ప్రదర్శనలనే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగపరమైన సామర్థ్యం ఒనగూరుతుందని విశ్లేషిస్తారాయన. లైటింగ్ నుంచి కాస్ట్యూమ్, స్టేజ్‌సెట్టింగ్ సహా అన్నీ చేయగల సామర్థ్యం మా బృందం సభ్యుల స్వంతం. ‘‘హ్యాండీక్యాప్డ్‌కు  చాలా తక్కువ విద్యావసతులు, ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి.  వికలాంగులకు సానుభూతి అక్కర్లేదు. నిరూపించుకునేందుకు అవకాశం కావాలి’’ అంటారు పాషా.

 - ఎస్.సత్యబాబు
 
 ఆద్యంతం... అద్భుతం...

 శీర్షాసన, మయూరాసన వంటి యోగాసనాలతో మిళితం చేసిన భరతనాట్యం కళ్ల ముందు మెరుపులు మెరిపిస్తుంది. బీట్‌కు, రిథమ్‌కు అనుగుణంగా వీల్‌చైర్  కదిలే తీరు చూసి తీరాల్సిందే. మంత్రముగ్ధుల్ని చేసే వీరి ప్రదర్శనలను చూసి తీరాలనుకునే వారెందరో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement