ఫేట్‌బుక్ ఫ్రెండ్స్! | To serve needy is his passion | Sakshi
Sakshi News home page

ఫేట్‌బుక్ ఫ్రెండ్స్!

Published Mon, Sep 16 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

ఫేట్‌బుక్ ఫ్రెండ్స్!

ఫేట్‌బుక్ ఫ్రెండ్స్!

ఫేస్‌బుక్ తెలిసిందే. పేద్ద ఫ్రెండ్‌షిప్ చైన్!
 ఎంతమందినైనా ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు.
 దేన్నైనా షేర్ చేసుకోవచ్చు.
 మరి -
 ఈ ఫేట్‌బుక్ ఏమిటి? నెట్‌లో ఎక్కడా లేదే!
 ఉండదు.
 జీవితంలో ఉంటుంది. రియల్ లైఫ్‌లో.
 అదీ అందరి దగ్గర ఉండదు.
 జీవితాన్ని చూసినవాళ్ల దగ్గర ఉంటుంది.
 ప్రవీణ్‌కుమార్ అలానే చూశాడు... క్లోజప్‌లో!
 చుట్టూ అకలి, అనారోగ్యం, దుఃఖం, విషాదం...
 ఎలా పోగొట్టాలి... ఈ బాధల్ని, వ్యథల్ని?
 ఫ్రెండ్స్‌ని కలుపుకున్నాడు.
 కలుపుకుంటూ వెళ్తున్నాడు.
 అంతా కలిసి విధివంచితులకు సేవ చేస్తున్నారు.
 అందుకే వీరు ఫేట్‌బుక్ ఫ్రెండ్స్!
 మీరూ వెళ్లి కలుస్తారా? లైక్ కొట్టక్కర్లేదు.
 లైక్‌మైండెడ్ అయితే చాలు.

 
అతను అందరిలోనూ తన తల్లినే చూసుకున్నాడు. కిడ్నీ వ్యాధితో తల్లి రాధిక పడిన బాధను తన బాధగా అనుభవించాడు. అలా టీనేజీలో ఆస్పత్రిలో గడపాల్సి రావడం అతడి జీవిత దృక్పథాన్నే మార్చేసింది.
 
నెల్లూరు  రామలింగాపురానికి చెందిన కోరెం ప్రవీణ్‌కుమార్ వయసు అప్పటికి 19 ఏళ్లు. పెద్దగా చదువేంలేదు. పదో తరగతి పూర్తి చేశాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లికి నెల్లూరులోని అరవింద్ ఆస్పత్రిలో ఏడాది పాటు ట్రీట్‌మెంట్ ఇప్పించాడు. ప్రతిరోజూ  ఉదయం, సాయంత్రం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం, తీసుకు రావడం ప్రవీణ్ డ్యూటీ. కిడ్నీలు పాడైన తల్లులనే కాదు, పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదన నూ దగ్గరగా చూశాడు. రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులు, వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న  ప్రాణాలను చూసి కలత చెందాడు. వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఆ యువకుడిలో ఇంతింతై అన్నట్టు ‘నేస్తం’ ఫౌండేషన్ స్థాపించేలా చేసింది . సేవా రంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి వందలాది మందితో వ్యవస్థను నిర్మించాడు. రక్తం ఇచ్చి, ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడు తున్నాడు. అనాథలు, అభాగ్యుల పాలిట అమ్మైఆకలితో అలమటిస్తున్న వారికి  పిడికెడన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ వయసు 27 సంవత్సరాలు. వెంకటేశ్వరరావు, మధు, వెంకట్, శివ, సతీష్‌బాబు ఇలా చెప్పుకుంటూ పోతే వందలామంది స్నేహితుల (సేవకుల) బృందంతో శక్తిగా మారాడు.
 
 రక్తం దానంతో మొదలుపెట్టి..
 
 రోగుల కోసం ఏమీ చేయలేమా అని నిరంతరం బాధపడేవాడు. ఏమీ చేయకుండా ఊరికే ఉండలేకపోయాడు. మొదట రక్తదానంతో సేవాకార్యక్రమాలు ప్రారంభించాడు. ఇప్పటికి ప్రవీణ్ ఒక్కడే ఇరవై ఐదుసార్లు రక్తదానం చేశాడు. ఒక్కోసారి 200 మంది మిత్రులతో రక్తదానం చేయించిన సందర్భాలు లేకపోలేదు. ఇలా మూడు వేల యూనిట్ల రక్తం దానం చేసిన వీరు... 2012-13 ఒక్క ఏడాదిలోనే 750 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు.  
 
 కదిలించిన ఘటన...
 
 ప్రతి మనిషి జీవితంలో ఒక్కో ఘటన ఒక్కో గొప్ప కార్యానికి కారణమవుతుందంటారు. ప్రవీణ్ జీవితంలో కూడా ఒక ఘటన చోటుచేసుకుంది. అతను ఉంటున్న రామలింగాపురంలో కుష్ఠురోగి, మానసిక వికలాంగుడు అయిన ఒక వ్యక్తి కనిపిస్తుండేవాడు. ఎవరైనా అన్నం పెట్టినా విసిరి కొట్టడమే తప్ప తినడం తెలియని స్థితి అతనిది. అతడిని చూసిన ప్రవీణ్ మనసు చలించింది. ‘పిచ్చివాడితో మనకెందుకులే’ అనుకోకుండా మిత్రులతో కలిసి బలవంతంగా దుస్తులు మార్పించాడు. అమ్మలా అన్నం పెట్టి ఆదరించాడు. అంతటితో అతని మనసు శాంతించలేదు. ఇలాంటి వారు ఇంకెందురున్నారో, వారికి దిక్కెవరనే ఆలోచన అతడిని వెంటాడింది. నగరంలో 50 మంది కుష్ఠురోగులు, కదల్లేని స్థితిలో 1500 మంది వికలాంగులు, వెయ్యి మందికి పైగా అనాథలు ఉన్నట్టు లెక్క తేలింది. వీరందరికీ ఒక్కపూటైనా అన్నం పెట్టాలని ప్రవీణ్ మిత్రబృందం నిర్ణయించింది. ఆలోచన గొప్పగానే ఉన్నా ఆచరించాలంటే అందుకు డబ్బు కావాలి. ప్రవీణ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ సమయంలో ప్రవీణ్‌లో ఒక కొత్త ఆలోచన కలిగింది.
 
 అన్నం వృథా కానివ్వకుండా...
 
 పుట్టినరోజు, పెళ్లిళ్లు , పెళ్లి రోజు... ఈ ఫంక్షన్లలో మిగిలిపోతున్న ఆహార పదార్థాలు వృథా కాకుండా వాటిని తీసుకెళ్లి అనాథల కడుపు నింపితే ఎలా ఉంటుందనే ఆలోచన అతని మనసులో మెదిలింది. ఆలస్యం చేయకుండా  వెంటనే ఆచరణలో పెట్టాడు. నగరంలోని వందలాది ఫంక్షన్ హాల్స్ వద్దకు వెళ్లి తమ ఆశయాన్ని నిర్వాహకులకు వివరించారు. ‘మిగిలిన భోజనాలే కదా! వృథా కావడం కంటే ఆకలిగొన్న వారి ఆకలి తీర్చడం కంటే పుణ్యం ఏముంటుంది’ అని నిర్వాహకులు తమ అంగీకారం తెలిపారు. దీంతో నేస్తం ఫౌండేషన్ సెల్‌నంబర్లు ప్రతి ఫంక్షన్ హాల్లో ప్రత్యక్షమయ్యాయి. భోజనాలు మిగిలాయని అక్కడి నుంచి సమాచారం రాగానే, మిత్రులంతా వెళ్లి ఆ అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి... రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్‌స్టాండ్లలో అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్లి వారికి అందచేయడం ప్రారంభించారు. ఒక్కోరోజు వెయ్యి మందికి అన్నం పెట్టిన సందర్భాలున్నాయి.
 
 ప్రత్యేక నిధి
 
 ప్రతిరోజూ పండుగలు, ఫంక్షన్లు ఉండవు. అప్పుడు వారి ఆకలి తీరేదెలా? అందుకే మిత్రబృందం 50 మంది తమ శక్తి మేరకు తలో మూడు వేల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. వచ్చిన డబ్బుతో ఫంక్షన్లు లేని సమయంలో ప్రతి శనివారం అన్నం వండి వందలాది మంది అనాథల కడుపు నింపేవారు. ఇప్పుడు మంగళవారం కూడా అంటే వారంలో రెండు రోజులు అన్నం పెడుతున్నారు.
 
 అనాథాశ్రమాల్లో బర్త్‌డేలు

 
 మిత్రుల పుట్టినరోజులను అనాథాశ్రమాల్లో జరుపుకోవాలని ‘నేస్తం’ నిశ్చయించుకుంది. ఆ రోజులలో పండ్లు, భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికి 200 ఫంక్షన్లు అనాథాశ్రమాల్లో జరుపుకున్నామని నేస్తం సభ్యులు తెలిపారు.
 
 - బిజివేముల రమణారెడ్డి, నెల్లూరు
 ఫొటోలు: ముత్యాల వెంకటరమణ

 
 ‘‘రక్తం లేక ఎవరూ చనిపోకూడదు. ఆకలితో ఎవరూ అలమటించకూడదు. ఇదీ మా ధ్యేయం. అభాగ్యులకు అన్నం పెట్టే కార్యక్రమం మరింతగా విస్తృత పరుస్తున్నాం. అలాగే  ఏ క్షణంలో అడిగినా వెయ్యిమందికి రక్తం దానం చేసేందుకు మా సంస్థ సిద్ధంగా ఉంది. నగరంలో బాగా పనిచేసే 10 అనాథ ఆశ్రమాలకు సహాయం చేస్తున్నాం. అవి సక్రమంగా నడిచేలా నెల్లూరులో ఇంటింటికీ వెళ్లి, ప్రతి కుటుంబం నుంచి కిలో బియ్యం చొప్పున సేకరించి ఆ సంస్థలకు సరఫరా చేయాలనుకుంటున్నాం’’.    
 - ప్రవీణ్, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
 
 అనాథలకు సేవ చేయడంలో ఆత్మసంతృప్తి ఉంది. ముఖ్యంగా కుష్ఠురోగులు అన్నం లేక అలమటించకూడదనే ఉద్దేశంతో ‘నేస్తం’ పని చేస్తోంది. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే గాకుండా,  రక్తాన్ని సేకరించడం మా ప్రధాన ఆశయం. ఎవరికి రక్తం కావాలన్నా క్షణంలో ఇచ్చేందుకు నేస్తం సభ్యులం సిద్ధంగా ఉన్నాం.  మా సంస్థలో చిరుద్యోగులు, విద్యార్థులు కూడా  ఉన్నారు. మానవతావాదులు మాకు సహకారం అందించి ప్రోత్సహించాలని కోరుతున్నాం.  
 - ఆర్.వెంకట్, నేస్తం సభ్యుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement