కొత్త డైరీ | The new diary | Sakshi
Sakshi News home page

కొత్త డైరీ

Published Tue, Dec 31 2013 12:03 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

కొత్త డైరీ - Sakshi

కొత్త డైరీ

ఇంకొన్ని గంటలయితే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త ఆశలు. కొత్త ఆశ యాలు. అయితే క్యాలెండర్ మారడంతోనే మన జీవితంలోకి కొత్తదనం వచ్చేస్తుందా? గతం గతః అనుకుని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం కేక్ కట్ చేసినంత సులభమా? కాదు. మార్పు అనేది సరిగ్గా ఒకటో తేదీన కాలం మనకిచ్చే బహుమతి కాదు. ఇప్పటివరకూ మన జీవితంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండాలంటే మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ సందర్భంలో నిపుణుల సలహాలు మనకు బాగా ఉపకరిస్తాయి. మన ఆలోచనలకు వారి ఆచరణాత్మకమైన సూచనలు తోడైతే కొత్త సంవత్సరం తప్పకుండా మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. పిల్లల పెంపకం నుంచి వృద్ధుల పట్ల మన బాధ్యత వరకూ ఏడు అంశాలపై ప్రముఖ మానసిక వైద్యులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారిక్కడ. వాటిని మనసు అనే మీ కొత్త డైరీలో  రాసుకుని న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్పండి.
 
జీవితంకల కాదు

పెళ్లయిన నెల రోజుల్లోనే విడాకులు కోరుతూ క్యూ కడుతున్న కొత్తదంపతుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లికి ముందే భవిష్యత్తుపై రంగురంగుల కలలు కని పెళ్లి తర్వాత అలా లేని జీవితం అక్కర్లేదని విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు డాక్టర్ పద్మ పాల్వాయి. ‘‘పెళ్లయిన కొత్తలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్నింటికీ విడిపోవడం పరిష్కారం కాదు. ముందుగా మీరు చేయాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం, మీ విషయాల్లోకి మూడోవ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం. భార్యాభర్తల విషయంలో తలుపులు తీస్తే సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని కోరుకోవడం పొరపాటు. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకోవడం సరైన పద్థతి. అన్నింటికీ ప్రేమ, సహనం అనే ఆయుధాల్ని ఉపయోగిస్తేనే పని జరుగుతుంది’’ అంటారు ఆమె.
 
 ఓడిపోవడం తప్పు కాదు
 
 పదో తరగతి పరీక్ష ఫలితాలు తెలిసిన మర్నాడు ‘విద్యార్థి ఆత్మహత్య’ అని వార్తాపత్రికల్లో మూడునాలుగు వార్తాకథనాలైనా కనిపిస్తాయి. కోరుకున్నది దక్కనపుడు, అనుకున్నది చేయలేనపుడు, వేధింపులకు తట్టుకోలేనపుడు ‘ఆత్మహత్య’ ఒక్కటే మెడిసిన్ అనుకుంటున్నారు కొందరు. ఓర్పులేని వాడు మాత్రమే సూసైడ్ మంత్రాన్ని జపిస్తాడంటున్నారు డాక్టర్ ఎస్‌ఆర్‌ఆర్‌వై శ్రీనివాస్. ‘‘బాధని భరించడం, కోపాన్ని అణుచుకోవడం వంటి లక్షణాల్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. విజయం సాధించినపుడు ఆకాశానికి ఎత్తడం, ఓడిపోయినపుడు పాతాళంలోకి తొక్కడం తల్లిదండ్రుల నుంచే మొదలవ్వడం వల్ల ఈ రోజు యువత ఏ సందర్భాన్నీ తట్టుకోలేకపోతోంది. వారు నేర్చుకోవలసిన మొదటి వాక్యం ‘ఓర్పు’ అంటున్నారు.
 
 కీడెంచడం  తప్పు కాదు
 
 ఈరోజు తల్లిదండ్రుల కళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్... బయటికెళ్లిన అమ్మాయి ఇంటికి  క్షేమంగా  తిరిగి రావడం. మృగాళ్లు సంచరిస్తున్నచోట తమ బిడ్డల మనుగడ ఎలా? అంటూ గుండెల్ని పట్టుకుంటున్న తల్లిదండ్రులు ఆడపిల్లలకు రకరకాల జాగ్రత్తలు చెప్పి భయపెట్టడం కాదంటారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి. ‘‘జరుగుతున్న సంఘటనల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని త్వరగా ఇంటికి చేరుకోమని చెబుతున్నారే కాని అలాంటి సంఘటనలు ఎదురైనపుడు ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి, చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి...వంటి విషయాలపై అవగాహన పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి సందర్భాల్ని అయినా ఎదుర్కొనాల్సి రావొచ్చు. అతిజాగ్రత్తలు చెబుతూ అమ్మాయిల్ని మరింత పిరికివారిగా మార్చేకంటే శారీరకంగా, మానసికంగా వారిని దృఢంగా మార్చడం ఉత్తమం’’ అని చెప్పారాయన.
 
 అవసరం తర్వాతే కోరికలు
 
 ‘డబ్బుంటే జీవితంలో సగం సమస్యలుండవు’ అనే మాట వినే ఉంటారు. ఉన్న డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో తెలియక వచ్చే సమస్యలు లెక్కలేనన్ని. వీటిని డబ్బుతో కొనితెచ్చుకున్న సమస్యలు అనవచ్చంటారు డాక్టర్ ప్రశాంత్ ‘‘మొన్నీమధ్యే బడ్జెట్ గురించి తగవులాడుకుంటున్న భార్యాభర్తలిద్దరు  నా దగ్గరకు వచ్చారు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బు విషయంలో ఇద్దరికీ పొత్తు కుదరక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్య ఇద్దరి సంసారజీవితాన్ని నాశనం చేసేవరకూ వెళ్లింది. నాలుగు లక్షలయినా, నాలుగు వేలయినా ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అర్థం చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. వీలైనంతవరకూ పెద్ద బడ్జెట్‌ల వివరాలు రాసిపెట్టుకోవడం మంచిది. సంపాదన ఎంతైనా మీరు వేసే బడ్జెట్ ప్లాన్ లక్ష్యం ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండేలా ఉండాలి’’ అంటారు డాక్టర్ ప్రశాంత్.
 
 మీకోసం మీరు మారండి

 జీవితంలో నష్టపోయిన వారి డైరీలో వ్యసనం తాలూకు వాసనలు ఉంటాయి. పొగ తాగడం, మద్యం సేవించడం...ఈ రెంటి నుంచి బయటపడడానికి తొంభైతొమ్మిది ముహూర్తాలు దాటిపోయినవారిని చాలామందిని చూస్తుంటాం... అంటున్నారు డాక్టర్ ఫణి ప్రశాంత్. ‘‘అమ్మకోసం, భార్యం కోసం, పిల్లల కోసం వ్యసనాలు వదులుకోవాలనుకునేవారు మాట మీద నిలబడడం కష్టం. నిజంగా మీరు రేపటి నుంచి వ్యసనాల్ని వదిలేయదల్చుకుంటే ముందుగా మీరు నష్టపోయినవాటి గురించి  తెలుసుకోండి. సమయం, ఆరోగ్యం, కుటుంబం, తెలివితేటలు, అనుబంధాలు... ఇలా ఇన్నిరోజుల్లో మీరు కోల్పోయిన ప్రతి చిన్న విషయాన్ని వివరంగా తెలుసుకోండి. వీలైతే ఓ డైరీలో రాసుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే మీ జీవితంపై మీరు ఓ పరిశీలన చేసుకోండి. అప్పుడు మానాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోండి. మీకు మీరుగానే మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే దానికి తిరుగుండదు ’’ అన్నారు. ఈ రాత్రికే ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది మీరు పోగొట్టుకున్నవన్నీ మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం.
 
 మనమే మలుపు తిప్పుకోవాలి
 
 టర్నింగ్ పాయింట్ అనే మాట వినే ఉంటారు. నిజానికి జీవితం మలుపు తిరగదు. మనమే నడవాలి, మనమే పరిగెత్తాలి, మలుపు కూడా మనమే తిరగాలి. ఆ మలుపు మన తలపుల్ని బట్టి ఉంటుందంటారు డాక్టర్ మయూర్‌నాథ్‌రెడ్డి. ‘‘ఉద్యోగాల గురించి చదువుకునే వయసునుంచే కలలు కనడం, ఆ కల తీరకపోతే జీవితం ముగిసిపోయినట్టు ఫీలయిపోవడం యువతలో అక్కడక్కడా చూస్తున్నాం. నిజానికి ప్రయత్నించేవారికి, కష్టపడేవారికి బోలెడు ఉపాధి అవకాశాలున్నాయి. చదువు పూర్తవ్వగానే మన చుట్టూ ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవాలి. నాకు తెలియని విద్య కదా అనుకుని చాలామంది తమకొచ్చిన అవకాశాల్ని వదులుకుంటుంటారు. అవకాశం వచ్చినచోట మీకున్న తెలివిని చూపించండి. జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తొందర పడకండి’’ అని చెప్పారు మయూర్‌నాథ్‌రెడ్డి.
 
పెద్ద మనసు చేసుకోండి

 కొడుకుకోడళ్లిద్దరూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ‘అమ్మా’, ‘అత్తయ్యా’ అంటూ ఆప్యాయంగా పలకరించి ఓ పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడతారని ఎదురుచూసే పెద్దలు అందరి ఇళ్లలో కనబడతారు. అలా పలకరించి ప్రేమను పంచే పిల్లలెంతమంది ఉన్నారు... అంటున్నారు డాక్టర్ నరేష్ వడ్లమాని. ‘‘మా పిల్లల ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమంలో ఉండడం మేలనే వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బిజీలైఫ్‌లో బంధాల గురించి ఆలోచించే తీరిక కరువైంది. అమ్మానాన్నల దగ్గర కాసేపు కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక ఎవరిలోనో గాని కనిపించడం లేదు. అలాగని పెద్దల్ని పక్కనపెట్టకూడదు. కనీసం వారానికొకసారైనా ‘అమ్మా’,‘నాన్నా’ అంటూ దగ్గరకెళ్లి నాలుగు మాటలు చెప్పండి. ఓపిక లేకపోతే వారు చెప్పేది వినండి. అమ్మానాన్నలు దూరంగా ఉంటే రెండురోజులకొకసారైనా ఫోన్ చేసి బాగున్నారా... తిన్నారా అంటూ క్షేమాలడగండి. ఆ పని రేపటి నుంచే మొదలుపెట్టండి’’ అని డాక్టర్ నరేష్ ఇచ్చిన సలహా చాలా విలువైంది. అది పాటించడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు మీ మీద పడకుండా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.
 
- భువనేశ్వరి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement