
ఇంకొన్ని గంటలే! కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తాం. వచ్చేస్తామా? వెళ్లిపోతామా.. కొత్త సంవత్సరంలోకి? ఏదైనా ఒకటే. ‘వచ్చేయడం’ అంటే కాలం మనల్ని దాటించడం. ‘వెళ్లిపోవడం’ అంటే, కాలాన్ని మనం దాటేయడం. గడిచిపోయిన యేడాదిని అందరూ నెలల్లో కొలుస్తారు. గడిచిపోయిన జీవితాన్ని మాత్రం ఎవరికివారు గెలుపు ఓటములతో కొలుచుకుంటారు. ఈ యేడాది బాగోలేకపోతే వచ్చే ఏడాది బాగుంటుందన్న ఆశ. ఈ యేడాది ఎలా ఉన్నా, అంతా మన మంచికే అనుకుని ముందుకు వెళ్లిపోవడం ఒక మంచి భావన. క్యాలెండర్‌లో నెలలు, తేదీలు ఉన్నంత తిన్నగా జీవితం సాగిపోదు. మహానుభావులు చెప్పిన విషయమే. ఆలోచిస్తే మనకూ అనిపిస్తుంది. ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజు పూర్తి అవడం డేట్‌ల స్లిప్పులను ఏరోజుకారోజు తీసి పారేసినంత తేలికైతే కాదు. మరి ప్లాన్ చేసుకుని, పొద్దున్నే నిద్రలేవడం ఎందుకు? అయినప్పుడే అవుతుందలే అని వదిలేయొచ్చు కదా! అప్పుడది పనిని వదిలేయడం అవదు. జీవితాన్ని వదిలేయడం అవుతుంది. జీవితాన్ని వదిలేస్తే ఏమౌతుంది? ఏమౌతుందా! జీవితమే మనల్ని లాక్కుపోతుంది. అప్పుడు జీవితంలోని గెలుపు మనది కాదు, ఓటమీ మనది కాదు. మన ప్రయత్నం, మన ప్రమేయం లేకుండా పన్నెండు నెలల కాలం గడిచిపోయిందంటే మనం ఏమాత్రం జీవించలేదని, మనం ఏమీ నేర్చుకోలేదని! ఇక మన పిల్లలకు నేర్పడానికి మన దగ్గర ఏం జమ అవుతుంది?
కాలం మనకు అనుభవాలను ఇస్తుంది. అనుభూతులను పంచుతుంది. అయితే దానంతట అదే వచ్చి తలుపుతట్టి ఈ అనుభవాలను, అనుభూతులను పుష్పగుచ్ఛంలా అందించదు. కాలంతో పాటు మనం పరుగులన్నా తీయాలి. కాలాన్నైనా మన వెనుక పరుగులు తీయించాలి. కదలిక జీవకణం. జీవితానికి లక్ష్యాన్ని ఏర్పరిచే లక్షణం. కొత్త సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాలను సాధించామా? లేదా? అన్నది ముఖ్యం కాదు. సాధించే ప్రయత్నంలో, సాధించలేకపోయిన వైఫల్యంలో జీవితం మనకు ఏదో నేర్పే ఉంటుంది. ఆ నేర్చుకున్నదే మన సఫలత.
Comments
Please login to add a commentAdd a comment