కొత్త సంవత్సరం... కొత్తగా..!
వాయనం
న్యూ ఇయర్ కే కాదు... జీవితంలోకి కొంత గుడ్‌నెస్‌కు కూడా వెల్కమ్ చెప్పాల్సిన సమయం ఇది. కొన్ని తీర్మానాలు చేసుకొని అలవాట్లలోనూ, దృక్పథంలోనూ కొంత మార్పు తీసుకురావడం ద్వారా జీవితాన్ని కొత్త రకంగా ఆస్వాదించవచ్చు. మరి నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్న సందర్భంగా జంటగా ఆహ్వానించదగ్గ రెజల్యూషన్స్ ఇవి..
అభినందనతో ఆప్యాయత కురిపించండి...
సహాయం చేస్తే కృత జ్ఞత, పదాలతోనే ఒక అభినందన... భార్యాభర్తల మధ్య ఇవి అవసరమా? అనొచ్చు. అయితే జీవిత భాగస్వామికి మానసిక ఆనందాన్ని అందించడంలో కృతజ్ఞత తెలపడం, పదాలతో ప్రేమను వ్యక్తీకరించడం అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి అంటారు రిలేషన్‌షిప్ అండ్ మ్యారిటల్ కౌన్సిలర్‌లు. ఈ అలవాటు చాలా జంటల్లో ఉండదని కూడా వారు చెబుతున్నారు. వారిలో మీరూ ఒకరైతే అభినందనతో అప్యాయతను కురిపించడం మొదలు పెట్టండి.
జంటగా బయటకు వెళ్లండి!
భార్యాభర్తలిద్దరూ కలసి చివరి సారి సినిమాకు వెళ్లింది ఎప్పుడు? ఈ మధ్యలో ఇద్దరూ కలసి చిన్న ట్రిప్ ఎక్కడికైనా వెళ్లారా? ఇలాంటి లోటు ఏమైనా ఉంటే దాన్ని భర్తీ చేస్తూ బయటకు వెళ్లడం అనే అలవాటును చేసుకోవాల్సిన సమయం ఇదే. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా బిజీగా మారిపోయిన జీవితంలో కొంత రిలీఫ్ తీసుకోండి. దంపతులు ఇద్దరూ కలసి ఇన్ని రోజులకొకసారి అన్నట్టుగా క్యాండిల్‌లైట్ డిన్నర్‌కో, సినిమాకో.. లేక ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా టూర్‌కో వెళ్లే ప్లాన్ చేసుకోండి. ఇవి బంధాన్ని బలోపేతం చేయడమే గాక లైఫ్‌లో కొత్త జోష్‌ను ఇస్తాయనడంలో సందేహం లేదు.
మీతో పాటు వాళ్లనూ హ్యాపీగా ఉంచండి...
పరిధిని పెంచుకోండి. నలుగురి బాగు కోసం మీ శక్తిని ఉపయోగించండి. అనాథాశ్రమాల వరకూ వె ళ్లండి. అక్కడి పిల్లలను సరదాగా పలకరించి రావడంతో పాటు, విద్య విషయంలో వారికి మెంటర్స్‌గా కూడా వ్యవహరించవచ్చు. ఓల్డేజి హోమ్స్‌లోని వృద్ధులను పలకరించి రండి. తద్వారా జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. మనుషుల నుంచి ప్రేమాఆప్యాయతలు ఆశించే వారి సాంగత్యం జీవితంపై కొత్త ప్రభావాన్ని చూపగలదు.
భవిష్యత్తు కోసం ఆదాను ప్రారంభించండి...
దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రేమాప్యాయతలే కాదు... డబ్బు కూడా అవసరమే. అలాంటి ఇంధనం విషయంలో కూడా కొత్త దృక్పథాన్ని అలవరచుకోండి. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ‘ఆదా’ ఆలోచనను ఇప్పుడే అమలు పెట్టండి. దుబారా నిరోధించి పొదుపు ఖాతాను ప్రారంభించండి. ప్లాన్ చేసుకొని పొదుపు మొదలుపెడుతూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పడం కన్నా గొప్ప స్టార్ట్ ఇంకేముంటుంది!
⇒ భాగస్వామి ఉద్యోగ, వ్యక్తిగత బాధ్యతలకు సమాధాన పడటంలో చొరవ చూపండి.
⇒ అడగాలనుకొని ఆగిపోయిన మాటలను అడిగేయడం మొదలుపెట్టండి. చెప్పాలనుకొన్నది సూటిగా చెప్పడం అలవాటు చేసుకోండి. మనసులోని అపోహలను తగ్గించుకోవడానికి ఇంతకన్నా మార్గం ఉండదు కదా!
⇒ భాగస్వామిని యథాతథంగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. తను మారాలి... అనే భావనను వదిలి న్యూ ఇయర్ నుంచి తనకు అనుగుణంగా నడచుకోండి.
⇒ ఎలాంటి సమస్య విషయంలోనైనా ఇంతకు మించిన పరిష్కారం లేదు కదా.
⇒ ఇలాంటివే కాకుండా... వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులనుబట్టి దాంపత్యం ఆనందమయం అయ్యేందుకు తగిన కొత్త ఆలోచన చేయండి. రానున్న మూడు రోజుల్లో ఆలోచించి జనవరి ఒకటో తేదీ నుంచి దాన్ని అమల్లో పెట్టేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!