బంధాలలో అమృతం ఉండాలి విషం కాదు.. | Husband and wife came back from the US to India | Sakshi
Sakshi News home page

అత్తారింటి విషయం

Published Thu, Mar 28 2019 1:18 AM | Last Updated on Thu, Mar 28 2019 8:42 AM

Husband and wife came back from the US to India - Sakshi

అనుబంధాలలో అమృతం ఉండాలి విషం కాదు. నమ్మకం కుప్పకూలిన చోటనీడ కూడా పాములా కనిపిస్తుంది. వాస్తవం భ్రాంతి అవుతుందిభ్రాంతి అశాంతి అవుతుంది. భార్యాభర్తలు.. కుటుంబం.. అందరూ పరస్పరం బలంగా మారినప్పుడే జీవితం బలహీనంగా మారదు.

గర్భంతో ఉన్న భార్యను ‘ఎలా ఉన్నావ్‌?’ అని అడగకపోయినా నష్టం లేదు.‘ఏం తింటావ్‌... నీకిష్టమైనది ఏది?’ అని అడిగి తెచ్చివ్వకపోయినా ప్రమాదం లేదు. ఆమెను పుట్టింటికి పంపకుండా నిరోధించినా పెద్ద సమస్య కాకపోవచ్చు. మగాడు తన భార్య పట్ల ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఏది చేసినా ఏది చేయకపోయినా ఒకటి మాత్రం చేయకూడదు.అదీ – మరో స్త్రీతో సంబంధం. ఆ భార్యాభర్తలు, ఆరేళ్ల పాప అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. అయిదేళ్ల క్రితం వెళ్లి అయిదేళ్ల తర్వాత ఇదే తిరిగి రావడం. ఒక నెల రోజులు ఇండియాలో సరదాగా గడిపి వెళ్లడానికని భర్త చెప్పి భార్యను, కూతురిని తీసుకొని వచ్చాడు. కాని భార్యకు ఆ ఉత్సాహం లేదు. భార్యకు ఆ సంతోషం లేదు. అసలు ఆమెకు ఇండియాకు రావడమే ఇష్టం లేదు. వచ్చినప్పటి నుంచి విపరీతంగా యాంగ్జయిటీకి లోనవుతూ ఉంది. ఎంత త్వరగా సెలవలు ముగిసిపోతాయా ఎంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లిపోదామా అని ఆరాట పడుతూ ఉంది. మొదటి రెండు వారాలు తన తల్లి ఇంట్లో, తర్వాతి రెండు వారాలు ఆమె తల్లి ఇంట్లో ఉందామని చెప్పాడు భర్త. అత్తగారింటికి అతి ఆందోళనతో చేరుకుంది ఆమె.

కాని అత్తామామలతో పూర్తి అభిమానంగా లేదు. పాపను స్వేచ్ఛగా వదలడం లేదు. తను కూడా అలెర్ట్‌గా ఉంటోంది. ఆ సాయంత్రం అత్తగారు పకోడీ చేసి తెచ్చిచ్చింది కోడలికి. పాప కూడా తింది. తిని పాప ఆడుకోవడానికి వెళ్లిన ఐదు నిమిషాలకు కోడలికి వాంతులు అయ్యాయి. పకోడీ సరిపడినట్టు లేదు. ప్రయాణం చేసి రావడం, ఫ్లయిట్‌లో రకరకాల తిండి తిని ఉండటం ఇదీ కారణం కావచ్చు. కాని కోడలు భయభ్రాంతం అయ్యింది. లోలోపల ఆమెకు అర్థమైంది– ఇది నన్ను చంపడానికి అత్త చేసిన పని. భర్త తనను ఇండియా తీసుకొచ్చింది ఇందుకే కదా. మరో రెండు రోజులు గడిచాయి. మధ్యాహ్నం ఎండగా ఉందని మామగారు పాపకు ఐస్‌క్రీమ్‌ తెచ్చిచ్చారు. అది నాసిరకందిలా ఉంది. తిన్న వెంటనే పాపకు వాంతి అయ్యింది. అది చూసిన వెంటనే కోడలు పెద్దగా అరుపులు కేకలు పెట్టి ‘చంపేస్తున్నారు... చంపేస్తున్నారు’ అంటూ స్పృహ తప్పి పడిపోయింది.

సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొస్తే కోడలు చెప్పింది ఇది: ‘మా అత్తగారికి మామగారికి నేనంటే ఇష్టం లేదు. అందుకే నన్ను చంపి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. ఇది అర్థం చేసుకునే నేను నా భర్తమీద ఒత్తిడి పెట్టి అమెరికా తీసుకెళ్లిపోయాను. కాని అక్కడ మా ఇంట్లో ఏం జరుగుతున్నదో మా అత్తామామలు ఇక్కడ సిసి కెమెరాలతో చూస్తున్నారని నా అనుమానం. అక్కడికెళ్లాక అప్పుడప్పుడు మేం జబ్బుపడుతున్నాం. వీళ్లు ఇక్కడ ఉండి చేయిస్తున్న చేతబడే కారణం అని అనుమానం. మేము బయటకు వెళ్లినా వీళ్లు మా వెనుక స్పైలను పంపిస్తున్నారు. మా ప్రతి కదలికా వారికి తెలుసు. నా భర్త కొంత కాలం నా పక్షాన ఉన్నా మెల్లగా వాళ్ల వల్లో పడిపోయాడు. అందుకే నన్ను, నా కూతురిని చంపడానికి ఇండియాకు తీసుకొచ్చారు. వీళ్లు విషం కలిపిన ఆహారం పెట్టి మమ్మల్ని చంపుదామని చూస్తున్నారు.సైకియాట్రిస్ట్‌కు ఇదంతా నమ్మశక్యంగా లేదు. అసలేం జరిగింది.ప్రమీలకు మంచి ఉద్యోగం ఉంది. భాస్కర్‌కు కూడా మంచి ఉద్యోగం ఉంది. ఇద్దరూ మేట్రిమొనీ ఏజెన్సీ ద్వారా తెలిశారు. పెద్దలు పెళ్లి చూపులు నిర్వహించారు. ఇద్దరూ ఒకరినొకరు నచ్చారు.

కాని భాస్కర్‌ తల్లిదండ్రులకు పెళ్లి చేసే పద్ధతి దగ్గర, లాంఛనాల దగ్గరా పేచీ వచ్చింది. సంబంధం వద్దనుకున్నారు. అది ప్రమీలకు ఆ కుటుంబం పట్ల ఏర్పడిన వ్యతిరేకతకు తొలి బీజం. కాని ప్రమీల భాస్కర్‌ను తొలి చూపులోనే ప్రేమించింది. సంబంధం వద్దనుకున్నా తను ఈ మెయిల్‌ చేయడం, చాట్‌ చేయడం కొనసాగింది. భాస్కర్‌ కూడా ఆమెను ఇష్టపడ్డాడు. మళ్లీ ఇద్దరూ కలిసి పెద్దల్ని కూచోబెట్టారు. అయినా సరే భాస్కర్‌ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇంతకు ముందైతే అపరిచితుడు. ఇప్పుడు ప్రేమికుడు తన తరఫు మాట్లాడతాడు అని ప్రమీలా అనుకుంది. భాస్కర్‌ ఏమీ మాట్లాడలేదు. చివరకు అమ్మాయి ముచ్చటపడుతోంది కదా అని ప్రమీల తల్లిదండ్రులే శక్తికి మించి వారు కోరిన పద్ధతిలో పెళ్లి నిర్వహించారు.కాపురం మొదలయ్యింది. మూడో నెలకే ప్రమీల గర్భవతి అయ్యింది. స్కానింగ్‌ చేసిన డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

భాస్కర్‌ ప్రమీలతో బాగానే ఉన్నా ఆరో నెల వచ్చేసరికి వేరే లోకంలో పడిపోయాడు. ఎవరితోనో చాటింగులూ. ఫోన్‌లూ.అరె.. తాను గర్భంతో ఉంటే, తన బిడ్డను మోస్తూ ఉంటే, తన మనసు పట్టించుకోకుండా ఏమిటి ఈ పని? ప్రమీల సాక్ష్యాధారాలతో సహా భాస్కర్‌ను పట్టుకుంది. తనకు ఎవరితోనో సంబంధం ఉంది. ఆ కుటుంబంలో ఆమెకు తగిలిన రెండో దెబ్బ అది.‘చూశారా అత్తయ్యా’ అంది బాధతో అత్తగారితో.‘ఏముంది. మామూలే. ఊరుకో. వాడికే దారికొస్తాడు’ అంది తప్ప కొడుకును పన్నెత్తు మాట అనలేదు. మామగారు మూగ నోము పట్టారు. దాంతో ప్రమీలకు భయం మొదలయ్యింది. ఈ కుటుంబం తనను ఏనాటికైనా బయటకు పంపించేస్తుందని. ఆ భయంతోటే పాప పుట్టాక భర్తను అమెరికాకు తీసుకెళ్లింది. అక్కడికెళ్లాక భాస్కర్‌ మారాడు. భార్యనూ, పాపనూ బాగా చూసుకుంటున్నాడు. కాని తగిలిన దెబ్బ వల్ల ప్రమీల పూర్తిగా డిస్ట్రబ్‌ అయిపోయింది. ఉద్యోగానికి వెళితే భర్త ఇంట్లోనే ఎక్కడ దుకాణం పెడతాడో అని ఉద్యోగం మానుకుంది. ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ ఉండటం వల్ల ఆమెకు నెగెటివ్‌ థాట్స్‌ పెరిగిపోయాయి. సైకోసిస్‌ అయిపోయింది.

భ్రాంతులు మొదలయ్యాయి. చివరకు ఇండియాలో ఉన్న అత్తామామలు తమ కాపురాన్ని నడుపుతున్నారన్నంత వరకూ ఆ భ్రాంతులు వెళ్లాయి. ఇండియాకు వచ్చాక అత్తామామలు ప్రేమగా పెట్టిన పదార్థాలు కూడా విషంగా తోచాయి. సున్నితంగా ఉండే ఒక మనసును విరిచేస్తే వచ్చేప్రమాదాలివి. వాటికి కారణమైన మగాడు బాగానే ఉన్నాడు.కాని ఆడది అనుభవిస్తూ ఉంది. సైకియాట్రిస్ట్‌కు కేసంతా అర్థమైంది.అపనమ్మకమైన మానవ అనుబంధాల వల్ల ఆమె తీవ్ర మానసిక అవస్థ పడుతున్నదని అర్థం చేసుకున్నారు.‘అమ్మా... మీ అల్లుడు మీ కుమార్తె గర్భంతో ఉన్నప్పుడు వేరొకరితో సంబంధం పెట్టుకుంటే మీరెలా వ్యవహరించి ఉండేవారో మీ అబ్బాయి పెట్టుకున్నప్పుడు కూడా అలాగే వ్యవహరించి ఉంటే మీ కోడలు మీ మీద నమ్మకం పెట్టుకుని ఉండేది’ అని అత్తామామలతో అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘నీ చెల్లెలి భర్త ఈ పని చేస్తే ఒక అన్నగా ఎలా స్పందిస్తావో నిన్ను సాక్ష్యాధారాలతో పట్టుకున్నప్పుడు నీ పట్ల నువ్వు అలాగే స్పందించి శిక్ష వేసుకోవాల్సింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి నీ భార్య పట్ల రెట్టింపు ప్రేమ చూపాల్సింది.

లోపలి దెబ్బకు పైపూత పూసి సరిపోతుందనుకున్నావు’ అన్నాడు భర్తతో.కోడలి మానసిక పరిస్థితికి అత్తామామలు నిజంగానే బాధ పడ్డారు. భర్త కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఈ సమయంలో కుటుంబం డిస్ట్రబ్‌ అయితే చిన్నారిపాప నష్టపోతుందని అందరూ గ్రహించారు. నెల రోజులు ఇండియాలో గడిచిపోయాయి. మందులు తీసుకోవడం, అందరూ కలిసి తిరుమల వెళ్లి రావడం, కోడలి వంటనే అందరూ తినడం, ఆమెకు నచ్చిన కానుకలు కొనివ్వడం, తమ ఆస్తి కోడలి పేరున, మనవరాలి పేరున బదలాయింపు చేయడం, భర్త ఎక్కువ సమయం ఆమెతోనే గడపడం ఇవన్నీ ప్రమీలను కోలుకునేలా చేశాయి. మొన్నే వాళ్లు అమెరికా వెళ్లారు. ఈసారి ఐదేళ్లకు కాదు... సంవత్సరం సంవత్సరం వచ్చి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. హ్యాపీ ఫ్యామిలీ.


– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement