కొత్త జీవితం కావాలి
కొత్తదనం అంటే
పైపై అలంకారాలు, పేరులు మార్చడం కాదు, వస్తువు
నాణ్యతలో మార్పు రావాలి.
మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం
ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం.
ప్రతి నూతన సంవత్సరం మనమొక నూతనత్వాన్ని కోరుకోవటం పరిపాటి. నూతనత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. నేటి ప్రపంచంలో కొత్తదనమన్నది ప్రతి రంగంలో అవసరం. పాతవి గతిస్తేనే గాని కొత్తదనానికి నాంది పలకలేము. గతం పాత అయితే రాబోతున్నది ఏదో అది కొత్తది. కాలం ఒక ప్రయాణమైతే జరిగిపోయే ప్రతి విషయం మనం దాటి వెళ్లే ఓ మైలురాయి అవుతుంది. ఇలా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు, తరాలు మన జీవితంలో దొరలిపోతాయి. ఈ ప్రయాణంలో జరిగినవన్ని మంచివి కాకపోవచ్చు.
అవి మేలు-కీడుల, లాభ-నష్టాల, సుఖ-దుఃఖాల సమ్మిళితం. గతంలో కొందరి జీవితంలో ఒక గాయం, కాని అట్టి గాయం కొందరి జీవితాలలో ఒక పాఠమే నేర్పుతుంది. మన గతమంతా జ్ఞాపకాలే. వాటిని తలంచినంతా గుండెల్లో బాధ, కళ్లల్లో కన్నీళ్లు. అలా జీవితంలో గాయపడిన, దగాపడిన, నిరాశ నిసృ్పహల్లోకి దిగజారిన వారినుద్దేశించి ఆ దేవాదిదేవుడు ఇలా సెలవిచ్చాడు ‘‘మునుపటి వాటిని జ్ఞాపక ం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును మీరు దాని నాలోచింపరా?’’ - (యెషయా 43:18:19) గతం ఓ జ్ఞాపకాల సుడిగుండం.
నిరాశ నిర్లిప్తతల వలయం. అట్టి చేదు గతం నుండి నూతనత్వంలోనికి రావాలని ఆ దేవాదిదేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ‘ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను’ అంటూ మనలో ధైర్యాన్ని, ఒక కొత్త ఆశని కలుగచేయుచున్నాడు. గతాన్ని, పూర్వాన్ని జ్ఞాపక చేసుకొనకుడి, తలంచుకొనకుడి అని ఆ దేవుడు తెలియ చేస్తున్నాడు. అనగా పాత జ్ఞాపకాలకు స్వస్తి పలకాలి. మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఒక నూతన ఆరంభం అవసరమవుతుంది. పౌలు అను భక్తుని జీవితంలో తన గతం ఓ హింసాయుత జీవితం. తన భక్తి, తన మతం, అభిమతం అంతా గతి తప్పిన స్థితి. నేటి పరిభాషలో చెప్పాలంటే అతడు ఓ మత ఉగ్రవాది, చాంధసవాది.
తన విద్య, మతనిష్ట, తన జాతి, పౌరసత్వం, తన కుటుంబ నేపథ్యం అంతా భ్రష్టత్వానికి, స్వార్థానికి, దురహంకారానికి ఉపయోగించాడు. చివరకు సత్యం తెలుసుకున్నవాడుగా -‘‘పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను’’ - (1 తిమోతి 1:15) అని ప్రకటించాడు. తన పాప జీవితమును, పాత జీవితం నుండి మారిన నూతన జీవితంలోనికి వచ్చాడు.
‘‘మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి, నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి,’’- (యెహెజ్కేలు 18:31) అని బైబిలు బోధిస్తుంది. నూతనత్వానికి నిర్వచనం మారిన మన మనసు కావాలి.
సంవత్సరాలు మారినా, మనిషి మనసు మారనిచో మనిషి ప్రవర్తనలో మార్పు రాజాలదు. కొత్తదనం అంటే పైపై అలంకారాలు కాదు. పేరులు మార్చడము కాదు, వస్తువు యొక్క నాణ్యతలో మార్పు రావాలి. అలాగే మన జీవితంలో నూతనత్వం అన్నది తన సంవత్సర ప్రవేశంతో కలుగదు. నూతనత్వం ఓ ప్రత్యామ్నాయం కాదు, అది ఓ పరిష్కారం. మన జీవితంలో నూతన నిర్ణయాలతో, తన ప్రమాణాలతో సరియైన ప్రాధాన్యాలతో దృఢ సంకల్పంతో ముందుకు అడుగు వేయాలి. ఇట్టి ప్రక్రియలోనే మన జీవితం నూతన పరచబడుతుంది. అలాంటి కొత్త జీవితం మనకు కావాలి. మనందరిలో రావాలి.
- రెవ.పి.ఐజాక్ వరప్రసాద్