మ్యారేజ్ కౌన్సెలింగ్ | Marriage Counseling | Sakshi
Sakshi News home page

మ్యారేజ్ కౌన్సెలింగ్

Published Tue, Jun 16 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

మ్యారేజ్ కౌన్సెలింగ్

మ్యారేజ్ కౌన్సెలింగ్

సాఫీగా సాగిపోతే అది జీవితం అవుతుందా?కానీ దాంపత్యం మాత్రం సాఫీగానే సాగాలి. ఏం? ఎందుకని? దాంపత్యం... జీవితంలో ఒక భాగం కాదా? భాగమే. అయితే జీవితాన్నే ప్రభావం చేసే శక్తి దాంపత్యానికి ఉంటుంది. సరిగా లేనిదాంపత్యం... ఆ ఇద్దరి జీవితాలనే కాదు, చుట్టూ అల్లుకుని ఉన్న జీవితాలను కూడా అల్లకల్లోలం చేస్తుంది. అందుకే ఏడడుగులు వేసి భార్యాభర్తలు అయిపోతే సరిపోదు. ఆ తర్వాత వేసే ప్రతి అడుగునూ  ఆచితూచి వెయ్యాలి.
 
ప్రశ్న - జవాబు
మాకు ఒక్కగానొక్క కూతురు. ఆమె పెళ్లిని బోలెడంత కట్నం ఇచ్చి ఎంతో ఘనంగా చేశాము. మా అల్లుడికి లేని చెడ్డ అలవాట్లు లేవు. దానికితోడు అదనపు కట్నం కోసం నా కూతుర్ని చాలా వేధింపులకు గురి చేశాడు. తన కూతురు కోసం మా అమ్మాయి తన భర్త దుశ్చర్యలన్నీ మౌనంగా భరించింది. అయితే ఆ దుర్మార్గుడు ఒక రోజు ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. రెండుమూడురోజులపాటు నరకయాతన అనుభవించి చనిపోయింది మా అమ్మాయి. ఇది జరిగి రెండేళ్లయింది. మేము కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక అతని మీద కేసు పెట్టలేదు. తల్లిలేని పిల్లగా ఉన్న మా మనవరాలిని మేము ఇంటికి తెచ్చుకుని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాము. మా కూతురు లేని లోటును మనవరాలి ద్వారా తీర్చుకుంటున్నాము. ఇంతలో మా అల్లుడు వచ్చి పాపను తనతో తీసుకుపోతానని చాలా గొడవ చేశాడు. బంధువులు కలగజేసుకుని అతణ్ణి ఎలాగో బయటకి పంపారు. మా అల్లుడు వెళ్లి క ష్టడీ ఆఫ్ చైల్డ్ కోసం కోర్టులో కేసు పెట్టాడు. ప్రతివారం తనకు పాపను చూపాలని విజిటేషన్ రైట్స్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. అసలు ఆ దుర్మార్గుడికి కూతురి మీద ప్రేమ ఏమీ లేదు. మా అమ్మాయి చనిపోగానే వెంటనే మరోపెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఒక బాబు కూడా పుట్టాడు. ఈ పరిస్థితుల్లో మాకు మా మనవరాలి కష్టడీని అతనికి ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. మేము ఏమి చేయాలి?
 - మణెమ్మ, చెన్నై

 
మీరు మొదట మీ తరఫున అడ్వకేట్‌ను నియమించుకుని కౌంటర్ వేయండి. మీరిప్పుడు నాకు చెప్పిన విషయాలన్నీ కోర్టులో కౌంటర్‌లో మీ అడ్వకేట్‌తో రాయించండి. ఐ.ఎ.లో కూడా కౌంటర్ ఫైల్ చేయండి. పాపను తండ్రి కష్టడీకి ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి. నిజానికి చట్టప్రకారం మైనర్ పిల్లలకు తండ్రే సహజ సంరక్షకుడు. అయితే ఇప్పుడు తను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి పాపను సరిగ్గా చూస్తుందో లేదో తెలియదు కాబట్టి కోర్టుకు ఇదే విషయాన్ని వివరించండి. పాప పెంపకం, ఆమె చదువు, ఇతర ఖర్చులకు మీరేమి గ్యారంటీగా చూపగలరో, తన పేరు మీద బ్యాంక్ డిపాజిట్ కానీ, ఇతర ఆస్తులు కానీ ఏమైనా ఉంటే కోర్టుకు సాక్ష్యాధారాలు చూపండి. జడ్జిగారు పాపను కూడా విచారించి, ఆమె అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీరు, మీ వారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆర్థికంగా ఫర్వాలేదు కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జడ్జిగారు పాప సంరక్షణ బాధ్యతను మీకు అప్పగించే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి.
 
మా పెళ్లయి పద్ధెనిమిదేళ్లయింది. నా భర్త రైల్వేలో ఉన్నతాధికారి. పెళ్లయినప్పటినుంచి నాతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేవాడు. తన పర స్త్రీ లోలత్వంతో నన్ను రోజూ హింస పెట్టేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నన్ను, పిల్లల్ని వదిలేసి, వేరొక ఆమెతో కలిసి రైల్వే క్వార్టర్స్‌లోనే కాపురం పెట్టాడు. ఇది జరిగి ఇప్పటికి పదేళ్లకు పైనే అయింది. నాకు విడాకులూ ఇవ్వలేదు. మెయింటెనెన్స్‌కు డబ్బూ ఇవ్వడం లేదు. నేను ఒక ప్రయివేట్ ఉద్యోగం చేసుకుంటూ, పుట్టింటివారు అడపాదడపా చేసే ఆర్థిక సాయంతో ఇప్పటివరకూ ఎలానో నెట్టుకొచ్చాను కానీ, పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్లకి మంచి చదువులు చెప్పించడం నా వల్ల అయ్యేట్టు కనిపించడం లేదు. నేను ఏం చేయాలి?
 - రేవతి, ఆదిలాబాద్

 
మీరు వెంటనే ఒక లాయర్‌ను కలిసి మీకు, మీ ముగ్గురు పిల్లలకు మెయింటెనెన్స్ కోసం కోర్టులో కేస్ ఫైల్ చేయండి. మీ భర్త రైల్వేలో ఉన్నతోద్యోగి కాబట్టి ఆయన సంపాదనా సామర్థ్యాన్ని బట్టి మీకు మనోవర్తి మంజూరవుతుంది. ఆయనకు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయంటున్నారు కాబట్టి, ఆయన ఆస్తిపాస్తులు, సంపాదన వివరాలు తదితరాలన్నింటినీ జాబితా రాసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద కేసు ఫైల్ చేయండి.
 
సాక్ష్యాధారాలను బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ మంజూరవుతుంది. ఆయన సర్వీస్ రికార్డ్స్‌లో మీ పేరు, మీ పిల్లల పేర్లు ఉంటాయి. ఒకసారి ఆఫీస్‌లో ఎంక్వయిరీ చేయించండి. దీనితోబాటు రైల్వే క్వార్టర్స్‌లో భార్య కాని మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నట్లు సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేయండి. వాళ్లు వెంటనే అతని చేత క్వార్టర్స్ ఖాళీ చేయిస్తారు.
 మీరు దిగులు పడకండి. మీకు మెయింటెనెన్స్ తప్పక వస్తుంది. ధైర్యంగా పిల్లలను బాగా చదివించండి.
 
మాకు పెళ్లయి ఇరవై ఏళ్లయింది. ఒక బాబు. మాకిద్దరికీపెళ్లయినప్పటినుంచీ గొడవలు. నా భర్తకు నామీద అకారణమైన అనుమానం. మా ఇంటికి మగవాళ్లెవరయినా వచ్చినా, నేను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్లతో నాకు అక్రమ సంబంధం అంటగట్టి, నాతో గొడవ పెట్టుకునేవాడు. చాలాకాలం భరించాను కానీ, ఇక నా వల్ల కాక పుట్టినింటికి వచ్చి, కోర్టులో డైవోర్స్ కోసం కేసు ఫైల్ చేశాను. కేసు కౌన్సెలింగ్ దశలో ఉండగా ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. బంధువుల ఒత్తిడితో బాబుని తీసుకుని, వెళ్లి అంతిమ సంస్కారాలు చేయించాను. ఆస్తులన్నీ బందోబస్తుగా కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ రాయించి ఉంచారు. ఇల్లు ఒకటి ఆయన పేరు మీదే ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి?
 - విమల, హైదరాబాద్


మీరు వెంటనే కోర్టులో డైవోర్స్ కేసు విత్ డ్రా చేసుకోండి. మీ వారు ప్రభుత్వాధికారి కాబట్టి మీకు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ వస్తుంది లేదా అవసరమైతే కోర్టులో మీరు, మీ కొడుకు కలిసి లీగల్ హైర్ సర్టిఫికెట్ కోసం ఫైల్ చేయండి. మీ వారి పేరు మీదున్న ఆస్తులన్నీ మీ పేరు మీద కానీ, మీ కొడుకు పేరు మీద కానీ మ్యూటేషన్ చేయించుకోండి. బ్యాంక్ డిపాజిట్లన్నింటినీ మీవారి డెత్ సర్టిఫికెట్ పెట్టి మీ పేరు మీద లేదా మీ అబ్బాయి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయించుకోండి. ఆయన జాబ్‌లో డెత్ బెనిఫిట్స్ ఎలాగూ లీగ్ హైర్స్ కాబట్టి మీకే చెందుతాయి. దిగులు పడకండి. ధైర్యంగా ముందుకెళ్లండి.
 
కేస్ స్టడీ... పాజిటివ్ అని తేలింది
రుచికకు, ప్రసాద్‌కు పెళ్లయి పదిహేనేళ్లయింది. ఇద్దరు  పిల్లలు. దురలవాట్లకు బానిస అయిన ప్రసాద్ భార్యాపిల్లల్ని బాగా వేధించేవాడు. ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు పైసా కూడా ఇచ్చేవాడు కాదు. రుచిక  సొంత సంపాదనతోనే ఇంటిని నడుపుకుంటూ, పిల్లల్ని చదివించుకునేది. ప్రసాద్ ఆస్తులు కరగబెట్టుకుంటూ, క్లబ్బులు, తాగుడు, రేస్‌లు, పేకాట, పరస్త్రీలతో ఊరిమీద జల్సాగా తిరుగుతుండేవాడు. రుచిక అతన్ని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. దురలవాట్ల మూలంగా అతని ఆరోగ్యం బాగా పాడయిపోయింది. పరీక్షలు చేయిస్తే హెచ్.ఐ.వీ పాజిటివ్ అని తేలింది. దాంతో రుచిక పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఆ ఇంటిలోంచి వచ్చేసి, వేరే ఇల్లు తీసుకుని విడిగా జీవించడం ప్రారంభించింది.

ప్రసాద్ ఆమె మీద కక్షతో కోర్టులో డైవోర్స్, పిల్లల సంరక్షణ కేసులు ఫైల్ చేశాడు. రుచిక డైవోర్స్ కేసులో నోఅబ్జెక్టన్ చెబుతూ, కౌంటర్ దాఖలు చేసింది. దాంతో విడాకులు మంజూరయ్యాయి. ఇక కష్టడీ ఆఫ్ చిల్డ్రన్ కేసులో పిల్లలు తమను తండ్రి నిర్లక్ష్యంగా చూస్తాడనీ, ఏనాడూ తమ ఆలనాపాలనా చూడలేదనీ కాబట్టి అతనితో ఉండటం తమకు ఇష్టం లేదని జడ్జిగారి ముందు చెప్పారు. దాంతో జడ్జిగారు పిల్లల కష్టడీని అతనికి ఇవ్వక పోవడమే మేలని భావించి, వారి సంరక్షణ బాధ్యతను తల్లికే అప్పగించడంతో ప్రసాద్ తోక ముడవక తప్పలేదు.
ఎంత చదువుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, దురలవాట్లను మానుకోలేకపోవడం, దానికి తోడు అహంభావం, అలసత్వం, భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేయడం వల్ల కాపురాలు కూలిపోతాయనడానికి ఇదే సాక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement