Bhubaneswari
-
భువనేశ్వరి భజన
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం పచ్చ రంగు పూసుకుంది. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను టీడీపీ నేత నారా భువనేశ్వరి కార్యక్రమానికి వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ర్యాలీకి వెళ్లకపోతే ఆబ్సెంట్ వేస్తామని, ఇంటర్నెల్ మార్కులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం చేష్టలకు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్పందన లేకే... చిత్తూరు నగరంలో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇలా అయితే చిత్తూరు టికెట్ ఆశిస్తున్న తన పరువుపోతుందని టీడీపీ నేత విజయం కళాశాల నిర్వాహకులను సంప్రదించి విద్యార్థులను పంపాలని కోరారు. అడిగిందే అదునుగా విద్యార్థుల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోని కళాశాల నిర్వాహకుడు ఉన్నపళంగా విద్యార్థులకు ఆదేశాలిచ్చేశాడు. కళాశాలలో చదువుతున్న 500 మందికి పైగా విద్యార్థులు భువనేశ్వరికి స్వాగతం పలుకుతూ రోడ్డుకిరువైపులా నిలబడాలని హుకుం జారీ చేశాడు. కొందరు విద్యార్థినిలు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా పట్టించుకోకుండా కళాశాల నిర్వాహకుడు ఒత్తిడి చేసి రోడు్డపై నిలబెట్టాడు. మరికొందరు విద్యార్థులు రాజకీయ కార్యక్రమాల్లో తాము వెళ్లినట్టు తమ తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లితీరాల్సిందేనని పట్టుబట్టారు. వెళ్లని వారికి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కట్ చేస్తానని, ఆబ్సెంట్ వేస్తానని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు చేసేది లేక దాదాపు మూడు గంటల పాటు చిత్తూరు పీసీఆర్ కూడలిలోని రోడ్లపై నిలబడ్డారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే కళాశాల యాజమాన్యం కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. గతంలోనూ ఇదే తీరు విజయం విద్యా సంస్థలకు ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. గతంలో లోకేష్ యువగళం కార్యక్రమానికి సైతం విద్యార్థులను ఒత్తిడి చేసి పంపించారు. నో డ్రగ్స్ పేరిట టీడీపీ నేతలు చిత్తూరులో నిర్వహించిన ర్యాలీకి కూడా టీడీపీ జెండాలు పట్టుకుని రోడ్లపై వెళ్లాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై అప్పట్లో కళాశాల యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్వాహకుడు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి కార్యక్రమానికి విద్యార్థులను పంపడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసి, రోడ్లపై నిలబెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదుచేసి, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
ట్రాఫిక్ పద్మవ్యూహంలో డాన్సింగ్ స్టార్
-
ఎంసెట్ లీకేజీ కేసులో శ్రీచైతన్య డీన్
-
ఎంసెట్ కేటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల డొంక కదులుతోంది! ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు సాదాసీదా బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ తాజాగా ప్రముఖ కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును అరెస్ట్ చేసింది. ఈయనకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్ కమ్మ వెంకట శివ నారాయణ రావును కూడా గురువారం అరెస్ట్ చేసింది. దిల్సుఖ్నగర్ శ్రీచైతన్య బ్రాంచ్‌తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్. వీరిద్దరూ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ధనుంజయ్ థాకీర్, డాక్టర్ సందీప్‌కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మరో ప్రముఖ కాలేజీకి సంబంధం? ప్రముఖ కార్పొరేట్ కాలేజీలకు ఎంసెట్ లీకేజీ స్కాంతో లింకులుండటం సంచలనంగా మారింది. డీన్ వాసుబాబు నిందితులతో పదేపదే మాట్లాడటంతోపాటు మరికొందరు విద్యార్థులను చేర్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఏజెంట్ శివ నారాయణ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని, మరో ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిపారు. వీరిద్దరూ ప్రధాన నిందితులతో స్కాం బయటపడిన తర్వాత కూడా టచ్‌లో ఉండటం, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లపై మరింత స్పష్టత రావాల్సి ఉందని దర్యాప్తు అధికారులు వివరించారు. అధికారుల పిల్లలకూ ‘ముందస్తు’ శిక్షణ శివ నారాయణ, డీన్ వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్ క్యాంపునకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్‌లో శిక్షణకు తరలించినట్టు సీఐడీ గుర్తించింది. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్ ద్వారా పదే పదే టచ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. కాలేజీ కోసమే చేశా.. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని సీఐడీ తెలిపింది. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో ఎందుకింత ఆలస్యం? సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. కానీ ఆ తర్వాత నుంచి కేసు దర్యాప్తు నెమ్మదించింది. అయితే మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విచారించిన అధికారులు ఎవరి ఒత్తిడి మేరకు వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేశారు? దీని వెనుక ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్ చేశారు. అయినా జంకని అధికారులు శ్రీచైతన్య డీన్‌తోపాటు ఏజెంట్‌ను వదిలిపెట్టడంపై ఇప్పుడు అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సీఐడీ కీలక అధికారి ఒకరు చెప్పారు. పిలిచి పంపించారు గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు తాజాగా బయటపడింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించి వేశారు? కనీసం వాంగ్మూలం కూడా ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి కూడా తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్ కీలక బ్రాంచ్ ప్రిన్సిపల్‌ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్‌కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో డీఎస్పీ వ్యవహారం బయటపడుతుందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు అధికారులు మార్పు వెనుక.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్‌కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు. పదే పదే ఫోన్లు చేసి ఈ రెండు కార్పొరేట్ కాలేజీల జోలికి వెళ్లవద్దని, అటు యూనివర్సిటీ అధికారుల పాత్రపైనా పెద్దగా విచారణ చేయవద్దని, ఏదైనా ఉంటే ఫార్మాలిటీ పూర్తి చేస్తామని, దానికి కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తనతో పదే పదే చెప్పినట్టు సదరు అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే వాటికి తాను ఒప్పుకోలేదని, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకోగా ఉన్నతాధికారులు మరో అధికారికి అప్పగించినట్టు ఆయన వివరించారు. కీలక నిందితుల మృతిపైనా అనుమానాలు ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి కమిలేశ్ కుమార్ సింగ్ సీఐడీ కస్టడీలో మృతి చెందడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చిన రావత్ అనుమానాస్పదంగా చనిపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిలేశ్ సింగ్ గుండెపోటుతో మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని సీఐడీ అధికారులు చెబుతున్నా.. రావత్ మృతిపై మాత్రం నోరుమెదపడం లేదు. కమిలేశ్‌కు కస్టడీలో ఉండగా రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మొదటిసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ రెండోసారి నటన అనుకొని నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మృతి వెనక కూడా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాసుబాబును సస్పెండ్ చేసిన శ్రీచైతన్య ఎంసెట్ లీకేజీ కేసులో అరెస్టయిన డీన్ ఓలేటి వాసుబాబును సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల విద్యాప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆ విద్యాసంస్థల స్టేట్ కో–ఆర్డినేటర్ నరేంద్రబాబు పేర్కొన్నారు. -
రిపోర్టింగ్‌లోనూ.. కమిట్మెంట్
వెండితెరపై భిన్న రూపాల్లో విరబూసి.. దిగంతాలకు చేరిన ఆ నవ్వులో అందరికీ ఓ సాల్మన్‌రాజ్.. ఓ రెనా (రెడ్డినాయుడు).. మరో బొక్కా వెంకట్రావ్.. కనిపిస్తారు. కామన్‌మ్యాన్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీకింగ్ ను స్టార్ రిపోర్టర్‌గా మార్చి ఆయనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది సిటీప్లస్. రీల్‌లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించిన ఎమ్మెస్.. రియల్‌లైఫ్‌లో రిపోర్టర్‌గా అవతారం ఎత్తి తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ముచ్చట్లు మీకోసం.. - భువనేశ్వరి ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్‌గా తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేయడం యాధృచ్చికంగా జరగలేదు. ఎమ్మెస్ ఇంటర్వ్యూ చేయడానికి నాలుగు వృత్తులను సూచిస్తే.. ఆయన మాత్రం కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేస్తానన్నారు. ‘ఎందుకు సార్.. అంత ఇంట్రెస్ట్?’ అని అడిగితే.. ‘రిపోర్టర్‌గా నేను నా మనసును కదిలించిన వారిని పలకరిస్తే వృత్తి తృప్తి కలుగుతుంది. పైగా నాకున్న సందేహాలు తీరడంతో పాటు పాఠకులకూ ఆ వృత్తిని నమ్ముకున్న వారి బాధలు తెలుస్తాయని చెప్పారు. ఇంకా నాడు ఏమన్నారంటే.. చెవిలోన చేరేలా.. తెల్లవారుజామున మంచి నిద్రలో ఉండగా ‘ఆక్కూరలు.. బెండకాయ.. దొండకాయ.... కొత్తిమీర.. కరేపాకో..’ అంటూ ఓ అరుపు వినిపిస్తుంది. తలుపులన్నీ బిడాయించి.. ముసుగు తన్ని పడుకున్నా.. ఆ పిలుపు చక్కగా చెవిలోకి చేరిపోతుంది. వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆ రేంజ్లో ఉంటుంది మరి. ఆ క్షణంలో కాస్త చికాకు పుట్టినా.. వాళ్లు గుమ్మాల దగ్గరికి రాకపోతే.. మనం కాళ్లీడ్చుకుంటూ మార్కెట్ దాకా వెళ్లాల్సి వస్తుంది. నవనవలాడే కూరగాయలు గుమ్మం ముందుకు వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వారంటే నాకు అభిమానం. లైవ్ రిపోర్టర్లు.. వారు ప్రతి ఇంటికీ కావాల్సిన వారే. ఒక వీధిలో పది ఇళ్లుంటే అందరికీ అతను ఆప్తుడే. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కూరగాయలబ్బిపై మక్కువ కాస్త ఎక్కువే. తాజా కూరగాయలు ఇస్తాడనో.. కసురుకోకుండా కొసరు వేస్తాడనో కాదు.. పక్కవీధి నుంచి తాజా తాజా కబుర్లు మోసుకొస్తాడని.ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ.. ఈ ఇంతి ముచ్చట్లు అక్కడ చెప్పే పుల్లారావులు కూడా వీరిలో ఉంటారు. ‘మీలా బేరం ఆడకుండా.. డబ్బులిచ్చే వారు ఎక్కడుంటారు చెప్పండి’ అంటూ కాకాపెట్టే కాకారాయుళ్లూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తోపుడుబళ్ల వాళ్లు మనలో ఒకరన్నమాట’ అని వారిని తను చూసిన యాంగిల్లో వివరించారు ఎమ్మెస్. బహుదూరపు వ్యాపారి.. నాలుగు రకాల కూరగాయలు అమ్ముకుని బతికే వారు.. ఈ డబ్బుతో అంతస్తులు కట్టుకోలేడు. కేవలం పొట్టనింపుకోగలడంతే. బండెడు కూరగాయలు అమ్ముకోవడానికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడో తెలియదు. నేను వాళ్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. పాఠకులకు కొన్ని విషయాలు చెబుదామనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. దండిగా డబ్బున్న వాళ్లు కూడా ఆకుకూరలు కొనే దగ్గర గీచి గీచి బేరాలాడుతుంటారు. ఓ గంట బేరమాడి ఓ కట్ట ఎక్కువ సాధించనంత మాత్రాన మీరు మరింత ధనవంతులు కాలేరు! బేరమాడకుండా మీరు డబ్బులిచ్చినంత మాత్రాన వాటితో అతనేమీ మేడలు కట్టుకోలేడు !! బేరమాడకుండా తీసుకుంటే ‘చల్లంగా ఉండమ్మా’ అని దీవించి ఆ రోజు హ్యాపీగా ఉంటాడు. రిపోర్టర్‌గా వారిని పలకరిస్తే మానవీయ కథనంగానే కాకుండా వారి ఇబ్బందులను కూడా బయటకు తెచ్చిన వాడిని అవుతాను కదా !’ అంటూ వివరించారు ఎమ్మెస్. ఇంటర్వ్యూ ముగిసాక.. రెహ్మత్‌నగర్ బస్తీలో ఓ పదిమంది బండ్లవారిని ఇంటర్వ్యూ చేసే ముందు వారితో.. ‘మిమ్మల్ని స్టార్‌గా పలకరించడం లేదు. సాక్షి తరఫున స్టార్ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీకున్న ఇబ్బందులన్నీ మన సువిప్పి చెప్పుకోవచ్చు. వాటిని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా చేస్తాను’ అన్నారు. రిపోర్టింగ్ ముగిశాక ‘తోపుడు బండ్లకు లెసైన్స్‌ల కోసం ప్రయత్నిస్తానని’ లోకల్ కార్పొరేటర్ కబురు పంపడంతో వారింటికి వెళ్లారు ఎమ్మెస్. మీడియా ముఖంగా ఆ హామీ నెరవేరుస్తానని చెప్పాల్సిందిగా ఆమెను అడిగి.. ఓ బాధ్యతగల రిపోర్టర్‌గా వ్యవహరించారు. కొన్ని రోజుల తర్వాత సాక్షి స్టార్ రిపోర్టర్ సక్సెస్ మీట్ సందర్భంగా మళ్లీ ఎమ్మెస్ను కలిసినపుడు.. ఆ తోపుడుబండ్ల వారి లెసైన్స్‌ల పని ఎంత వరకు వచ్చిందని ఆత్రుతతో అడిగి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాంటి మంచి వ్యక్తికి.. మా స్టార్ రిపోర్టర్‌కు తుది వీడ్కోలు. 2014 సెప్టెంబర్ 14న సిటీప్లస్ లో ప్రచురితమైన రిప్టోరర్ -
బండెడు బాధలు
ఉదయాన్నే ఠంచనుగా వచ్చి టెన్షన్స్ క్లియర్ చేసే కూరగాయలబ్బి ఒకప్పుడు అందరివాడు. తోపుడు బండిపై తాజా తాజా కూరగాయలే కాదు, అంతకన్నా తాజా తాజా కబుర్లు మోసుకొచ్చే అతగాడంటే ఆడాళ్లకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ వీధి విశేషాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు పక్క వీధిలోని అమ్మలక్కల చెవిలో వేసే వార్తాహరుడుగా పనిచేసేవాడు. బేరం విషయంలో పేచీ పడ్డా.. కసురుకోకుండా కొసరు కొలుస్తాడు. కొన్నేళ్ల కిందటి వరకు మూడు ఆకుకూరలు.. ఆరు కాయగూరల్లా వ్యాపారం చేసుకున్న అతడు.. ఇప్పుడు భారంగా బండి తోస్తూ గొంతు చించుకున్నా.. ‘ఇటురా’ అన్న పిలుపునకు నోచుకోవడం లేదు. కూరగాయలబ్బి మారలేదు.. ఆయన తెచ్చే కూరగాయలూ మారలేదు. మారింది మనమే. ఏళ్లుగా ముంగిట్లోకి వస్తున్న ఆరోగ్యాన్ని కాదని కార్పొరేట్ కొట్టులో ఏసీలో మగ్గుతున్న కాయగూరలపై మనసుపడ్డాం. మనలోని ఈ మార్పే కూరగాయలబ్బి బతుకును పుచ్చుల్లో పడేసింది. అరకొర అమ్మకాలతో తోపుడు బండ్లు వేసుకుని వీధుల్లో తచ్చాడుతున్న కూరగాయలు అమ్మేవారిని ‘సిటీప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా కామెడీకింగ్ ఎమ్మెస్ నారాయణ పలకరించారు. ఎమ్మెస్ నారాయణ: ఎలా ఉన్నారయ్యా.. బాగున్నారా? లక్ష్మణ్: ఏదో ఉన్నం సార్. ఎమ్మెస్ నారాయణ: నీ పేరేంటి తమ్ముడు. మారెన్న: మారెన్న సార్... ఎమ్మెస్: ఏదీ ఒక్కసారి కూరగాయలూ.. అని పిలువ్. మారెన్న: కూరగాయలూ...(కాస్త మెల్లగా పిలిచాడు) ఎమ్మెస్: అలా మెల్లగా పిలిస్తే ఎలాగయ్యా.. మా వీధిలో అబ్బాయి అయితే.. ‘కురక్కాయలే...’ అని భలే వెరైటీగా అరుస్తాడు. వాడి అరుపు వింటే ఎంత నిద్రలో ఉన్నవాడైనా లేచి కూర్చుంటాడు.(నవ్వుతూ...) మారెన్న: అరవాలే సార్. లేదంటే మాకు గిరాకీ యాడికెళ్లి వొస్తది. లక్ష్మణ్: అరిచి.. అరిచి గొంతంతా ఎండిపోతది సార్. ఎమ్మెస్: నిజమే.. మారెన్న. నువ్వు రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? మారెన్న: నేను ఇక్కడే రెహ్మత్‌నగర్‌లో ఉంట సార్. పొద్దుగాల నాలుగు గంటలకు నిద్రలేచి మాల్ (పచ్చి మిరపకాయలు) కోసం మూసాపేటకు బండి తోసుకుంటూ పోత. బండి నిండా మాల్ ఏసుకుని తోలుకుంట వచ్చేసరికి ఏడెనమిదైతది. దానికే తొమ్మిది కిలోమీటర్లు ఐతది. ఆడికెళ్లి ఇంటింటికీ తిరిగి మిరపకాయలు అమ్మేసరికి టైం పన్నెండైతది. పది కిలోమీటర్లు తిరుగుడైతది. రాము: ఎంత తిరిగితే గంత బిజినెస్. నడకనే మాకు సగం పెట్టుబడి సార్. ఎమ్మెస్: ఇంతలా తిరుగుతుంటారు కదా బోర్ కొట్టదా? రామకృష్ణ: గిరాకీ వస్తే ఏ బాధలుండవు సార్. ఒక్కోసారి బోణీలుండవు.. బేరాలాడేది మాత్రం మస్తుగుంటది. గప్పుడు చుక్కలు కన్పిస్తయ్. ఎమ్మెస్: అవునమను.. అదే అడుగుదామనుకుంటున్నాను. మార్కెట్‌తో పోలిస్తే కూరగాయుల బండి దగ్గర బేరాలు ఎక్కుమంటాయి, దాని గురించి చెప్పండి..? రామకృష్ణ: కొత్తిమీర కట్ట రూపాయి తగ్గితే కోట్లు సంపాదించినట్టు అనుకుంటరు సార్. గసొంటి బేరాల ను చూస్తే కోపమొస్తది. ఏంద అని గట్టిగంటే.. చానా ఎక్కువ మాట్లాడుతున్నవని తిడ్తరు. మహ్మద్ ఖలేద్: బిర్యానీ ప్యాకెట్ ధర పెరిగితే ఒక్క మాట మాట్లాడరు. సినిమా టికెట్ ధర పెరిగినా ఏమనరు. పొద్దుగాళ్ల లేస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్లు మా దగ్గరికొచ్చేసరికి.. బేరమాడి రూపాయి రూపాయి మిగుల్చుకుంటరు. ఆ పైసలతో ఇల్లు కడతరా. ఎమ్మెస్: ఇల్లు అంటే గుర్తొచ్చింది.. మీలో సొంతిల్లు ఎంత మందికుంది ? మారెన్న: మాకు సొంతిల్లు యాడుంటయ్ సార్. నాకు నల్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లి చేసిన. ఇంకా నలుగురి బాధ్యత ఉంది. రెండు పూటలు సరిగా తింటే ఆ రోజు సొంతిల్లు కట్టినట్టే అనుకుంటం. సంతోష్: మా నాయన తోలిన బండే నేను తోల్తున్నా. పొట్ట నిండనికి తప్ప.. పైసలు మూటగట్టడం ఈ బండితోని అయ్యే పనికాదు సార్. పూటకోసారి కూరగాయల ధరలు మారుతుంటయ్. ధరలు ఎక్కుమన్నప్పుడు కొంటం. తెల్లారి అమ్మే టైమ్‌కి ధరలు పడిపోతయ్. ఏం చేస్తం సార్. ఎమ్మెస్: నేనూ చాలాసార్లు గమనించాను. గిరాకీ లేక, అమ్ముడుపోక బండ్లమీద కూరగాయులు ఎండిపోయి కనిపిస్తాయి. వర్షాలు పడితే కొన్ని కాయుగూరలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి! లక్ష్మణ్: గిసొంటియి మాకు కొత్తకాదు సార్. పొట్ట ఊకోదు కాబట్టి అప్పు చేస్తం. ఎమ్మెస్: మీకు అప్పు కావాలంటే.. మీకు కూరలిచ్చే దళారుల దగ్గరికే వెళ్తారని విన్నాను, నిజమేనా? రామకృష్ణ: అంతేగా సార్. ఎమ్మెస్: నేరుగా రైతుల దగ్గర మాల్ కొంటే గిట్టుబాటు అవుతుంది కదా. ఇలా దళారీలపై ఆధారపడితే లాభాలు అతనికి.. నష్టాలు మీకు మిగులుతాయి. మారెన్న: నిజమే సార్. కానీ ఏం జేస్తం. పేదోళ్లం. మాకు రూపాయిచ్చేటోడే దేవుడు. ధరలతో సంబంధం లేకుండా కొంటం. కాళ్లరిగేలా తిరుగుతం. ఎమ్మెస్: ధరలన్నారుగా.., మీరు రేట్లు ఎక్కువ చెబుతారంటారు నిజమేనా..? సంతోష్: ఈ రోజు మార్కెట్ల ఆలుగడ్డల ధర 27 రూపాయలు. అదే మీరు పెద్ద పెద్ద షాపులల్ల (కార్పొరేట్) పొయ్ చూడండి 19 రూపాయలే ఇస్తుండ్రు. అదెట్లంటే షోరూమ్లోళ్లు బట్టల మీద, చెప్పుల మీద బగ్గ గుంజి.. కూరగాయల ధరలు తగ్గించి గిరాకీ రప్పించుకుంటున్నరు. దీంతో మా రేట్లు ఎక్కువగానే అనిపిస్తయ్. ఏసీ పెట్టి మరీ మా పొట్టలు కొడుతున్నరు సార్. ఎమ్మెస్: కష్టజీవులకు తెలిసినన్ని వాస్తవాలు మిగతావాళ్లకు తెలియవు. కార్పొరేట్ కల్చర్ సామాన్యుడ్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో చూడండి. ఇలా మీలో మీరు బాధపడితే ఎలా..? మీ కష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజేశారా ? లక్ష్మణ్: ఏడ చెబుతం సార్. ఎవరూ ముందుకు రారు. ఎమ్మెస్: అలా అంటే ఎలా? హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా.. సీఎం కేసీఆర్ గారు పేదల సంక్షేమం గురించి బోలెడన్ని పథకాలను ప్రవేశపెడుతున్నారు. మీరు గనక మీ డిమాండ్లను ఆయన ముందుంచితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. రామకృష్ణ: అట్లనే జేస్తం సార్. ఎమ్మెస్: అసలు విషయం మరిచిపోయాను. ఈ బండి ఖరీదు ఎంత ? కొన్ని బండ్ల టైర్లలో గాలి కూడా ఉండదు. అయినా అలా తోసుకుంటూ వెళ్తుంటారు? రాము: కొత్తదైతే ఇప్పుడు 10 వేలకు తక్కువ లేదు సార్. టైర్లళ్ల గాలంటరా.. పంచరైనా, పాడైనా.. మార్పించే స్తోవుత లేక అట్లనే తోసుకుంటూ పోతరు. కొందరు కావాలనే అట్ల వదిలేస్తరు. ఎమ్మెస్: రైతు పొలంలోని కూరలను మార్కెట్‌కి తీసుకొస్తే మీరు ఇంటి ముందుకు తీసుకొస్తారు. వీధుల్లో మీ అరుపులు సందడి తీసుకొస్తాయి. ‘ఫలానా కూరలబ్బి చాలా మంచోడ’ని కితాబు పొందే మీలాంటి క ష్టజీవులను పలకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్టార్ రిపోర్టర్‌కి స్పందన ఎమ్మెస్ నారాయణ రిపోర్టింగ్ గురించి తెలుసుకున్న ఆ ఏరియా కార్పొరేటర్ బి.చంద్రమ్మ వెంటనే స్పందించి తోపుడు బండ్లవారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెస్ ఆమె ఇంటికి వెళ్లి కూరగాయలమ్మేవారి జీవితాలపై దృష్టి పెట్టాలని కోరారు. ‘సాక్షి’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పేదల పక్షాన నిలిచిన ఎమ్మెస్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయులు అమ్మేవారికి సొంతిళ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న మార్కెట్వాసుల క్వార్టర్స్ ప్రాజెక్ట్‌ని పట్టుదలగా పూర్తిచేస్తానని తెలిపారు. తోపుడు బండ్లను నమ్ముకుని బతుకుతున్న మైనారిటీలకు బ్యాంకు రుణాలు అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. - ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
చలికి.. చాయ్ మందు..!
జ్ఞాపకం ‘‘డిసెంబర్ నెలలో హైదరాబాద్‌కి వెళితే...ఎముకలు కొంకర్లు తిరుగుతాయని చెబితే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏభైఅయిదేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చినపుడు నాకెదురయిన సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. వస్తూనే నాంపల్లి దగ్గరున్న ఇంపీరియర్ లాడ్జ్‌లో దిగాను. సాయంత్రం ఐదయ్యేసరికి చలి దాడి మొదలయ్యింది. అప్పటివరకూ లాడ్జి బయట తిరుగుతూ నేనొచ్చిన పని తాలూకు ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాను. చలి పెరగడంతో రూమ్‌కు పరిగెట్టాను. మంచంమీదున్న బెడ్‌షీట్ తీసుకుని ఒళ్లంతా చుట్టేసుకున్నాను. లాభం లేదు....ఎవరో చల్లటినీళ్లను బెడ్‌షీట్‌పై చల్లుతున్న ఫీలింగ్. పళ్లన్నీ జివ్మంటున్నాయి. అడుగు ముందుకు పడడం లేదు. ఇంకో బెడ్‌షీట్ ఇవ్వమని అడిగితే ఒక రూమ్‌కి ఒకే బెడ్‌షీట్ అన్నారు లాడ్జ్వాళ్లు. చాలాసేపు బతిమిలాడితే అతికష్టంమీద మరో బెడ్‌షీట్ ఇచ్చారు. ఈ గొడవంతా చూసిన లాడ్జ్ క్యాషియర్...‘హైదరాబాద్‌కి రావడం మొదటిసారా..’ అన్నాడు జాలిగా. కాదంటూ తలూపుతూనే...అవునని చెప్పాను. ఎందుకంటే అప్పటికి రెండేళ్ల ముందు తొలిసారి వచ్చాను. అది వేసవికాలం కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. నాకు అప్పటివరకూ వేసవి తాపం గురించి తెలుసు. మండుటెండ, ముచ్చెమటలు వంటివి అనుభవమున్నాయి కానీ, ఒళ్లంతా గడ్డకట్టుకుపోయే చలి గురించి తెలీదు. ఆ అనుభవం హైదరాబాద్‌కి వస్తే ఉంటుందని అనేవారు కానీ నాకు ఇక్కడికి వచ్చాక గాని తెలియలేదు. ఆ చలిలో నా పాట్లు చూసి క్యాషియర్ దగ్గరికి పిలిచి ఓ సలహా ఇచ్చాడు. వంటిమీద నుంచి బెడ్‌షీట్ తీసి పక్కన పడేసి బయట రోడ్డుమీదకు వెళ్లి వరసగా రెండు ఇరానీ చాయ్ తాగొచ్చి పడుకుంటే వెచ్చగా ఉంటుందన్నాడు. అతని మాటలు నాకు వైద్యంలా అనిపించాయి. నిజానికి అప్పటివరకూ నాకు టీ, కాఫీల గురించి తెలీదు. చలి తగ్గుతుందంటే ఏమైనా చేసేలా ఉంది నా పరిస్థితి. వెంటనే వెళ్లి రెండు టీలు తాగొచ్చి పడుకున్నాను. కొంచెం వాతావరణం వెచ్చబడిన ఫీలింగ్. ఆ రోజు నేనున్న రూమ్ కిరాయి రూపాయిన్నర. ఇక అక్కడి నుంచి చదువు, ఉద్యోగాలు,సాహిత్య కార్యక్రమాల పేరుతో ఏడాదిలో నాలుగైదు సార్లు హైదరాబాద్‌కి వచ్చేవాడ్ని. ఎప్పుడొచ్చినా ఇంపీరియర్ లాడ్జ్‌లోనే మకాం. అద్దె సామాన్యులకు అందుబాటులో ఉండడం వల్ల తర్వాతర్వాత ఆ లాడ్జ్‌కి బాగా గిరాకి పెరిగిపోయింది. రూపాయిన్నర ఉన్న రూమ్ అద్దె మూడువేలకు పెరిగిందిప్పుడు. నలభైయాభై ఏళ్లక్రితం నగర వాతావరణానికీ, ఇప్పటికీ చాలా చాలా మార్పు వచ్చింది. నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘మునివాహనుడు’ నాటకం, ‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’ పుస్తకాన్ని ఇంపీరియర్ లాడ్జ్ రూములో కూర్చుని ఇరానీ చాయ్‌లు తాగుతూ రాశాను. చాయ్‌లు చలిని చంపుతుంటే...అక్కడి ప్రశాంతమైన వాతావరణం నాలోని రచయితని తట్టి తట్టి లేపుతుండేది. భువనేశ్వరి -
పేద మహిళల కోసంస్నేహ హస్తం
సఫా... అంటే స్వచ్ఛత, స్నేహం అని అర్థం. రుబీనా విజయానికి కారణాలు కూడా ఆ రెండే. ఓ సైనికుడి కడుపున పుట్టినందుకు తండ్రిలో ఉన్న సేవకుణ్ణి చూసి తోటివారికి సాయపడాలన్న ఆలోచన పుట్టిందామెకు. ఆ సేవ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంది. అందుకే ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వందలమంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఏ వ్యాపారైమైనా విజయవంతంగా ముందుకు సాగడానికి స్వచ్ఛత ఉంటే చాలని ‘సఫా’లోని సభ్యులంతా నిరూపించారు. ఈ విజయం వెనక రుబినాతో పాటు బలమైన ఆశయాలు, పట్టుదలతో కూడిన లక్ష్యాలు ఉన్నాయి. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖలో ట్రావెల్ ఆపరేటర్‌గా తొమ్మిదేళ్లు పనిచేసిన రుబీనా నఫీస్ ఫాతిమా చిన్నతనం నుంచే సేవాకార్యక్రమాలంటే ఇష్టపడేది. హైదరాబాద్‌కి చెందిన మిలటరీ అధికారి సులేమాన్ అలాఖాన్ రెండవ సంతానం రుబీనా. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అన్ని ప్రాంతాలను చూసిన రుబీనా తన జీవితంలో పేద మహిళల కోసం ఏదో ఒకటి చేయాలని చదువుకున్నరోజుల్లోనే ప్రణాళికలు తయారుచేసుకుంది. ‘‘సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చాక ఇక్కడ వాడలన్నీ తిరిగి చూశాను. నిరుపేద కుటుంబాల్లో మహిళ దుఃస్థితి నా మనసును కలిచివేసింది. ముఖ్యంగా ముస్లిం వాడల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చదువు లేకపోవడం ఒక్కటే కారణం కాదు, పేదరికం, గృహహింసలకు బలైపోతున్న మహిళలు, వారికి వారసులుగా పిల్లలు. ఇలాంటివారిని ముందు ఆర్థికంగా నిలబెట్టడం ఒక్కటే పరిష్కారమనుకున్నాను. బంధువులు, స్నేహితులతో ఆలోచించి ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ‘సఫా’ అనేది ఉర్దూ పదం. స్వచ్ఛత, స్నేహం అని అర్థం. ఈ రెండు పదాలనే పెట్టుబడిగా పెట్టి గత ఎనిమిదేళ్లుగా మా ప్రయాణం కొనసాగుతోంది’’ అని చెప్పారు రుబీనా. శిక్షణ...: హైదరాబాద్‌లోని ఖాజానగర్, సయ్యద్‌నగర్, బోలానగర్, అహమద్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పేదమహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి రకరకాల పనులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించారు రుబీనా. బంజార్‌హిల్స్‌లోని బోలానగర్ సఫా సంస్థలో వీరికి శిక్షణకు కావాల్సిన ఏర్పాటు చేశారు. మెహెందీ, స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు, కొవ్వొత్తుల... ఇలా చాలా రకాల పనులు చేస్తున్నారక్కడ. ‘‘మొదట్లో నేనొక్కదాన్నే ఇళ్లకు తిరిగి నేను చేయబోయే పని గురించి చెప్పాను. చాలామంది నమ్మలేదు. ఓ ఇద్దరు ముగ్గురు మా సంస్థలో పని నేర్చుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారని తెలిసాక ఒక్కొక్కరూ బయటికి రావడం మొదలుపెట్టారు. పైగా ఇంటి దగ్గరే పనిచేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చనే మాట చాలామంది ముస్లిం మహిళల్ని ‘సఫా’వైపు అడుగులు వేయించింది’’ అని చెప్పారు రుబీనా. వీరిలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు కూడా ఉన్నారు. ఆర్థికంగా నిలబడి, పిల్లల్ని చదివించుకోవాలనే ధ్యేయంతో గడపదాటిన వీరికి ‘సఫా’ చక్కని మార్గంగా నిలిచింది. మార్కెటింగ్...: తమను ఆశ్రయించిన మహిళలకు ఏ పనంటే ఇష్టమో కనుక్కొని దానిపై శిక్షణ ఇప్పించి చేతినిండా పని ఉండేలా ప్లాన్ చేయడంలో విజయం సాధించడం వెనక రుబీనా శ్రమ చాలా ఉంది. వస్తువు తయారుచేయడం ఒకెత్తయితే, దాన్ని మార్కెట్ చేయడం మరొకెత్తు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దీన్ని మించిన సవాలు మరొకటి లేదు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తయారుచేస్తున్న సఫాలోని ప్రతి వస్తువూ ఓ పేదమహిళ కడుపు నింపుతుందని తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరూ వాటిని కొనడానికి ముందుకొస్తారని చెప్పింది అక్కడ ఉపాధి పొందుతున్న హైమది బేగం. పేద పిల్లల కోసం...: కొందరు అనాథ పిల్లలనూ తండ్రి లేక ఆసరా కోల్పోయిన పిల్లలు కొందరినీ రుబీనా ఉచితంగా చదివిస్తున్నారు. ‘‘బోలానగర్లోని 140 మంది పేద పిల్లల్ని స్కూల్లో చేర్పించాం. వారి బాగోగులు ‘సఫా’నే చూసుకుంటుంది. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఉపాధి పొందడానికి వచ్చిన పేదమహిళలు కూడా పని సాయం చేసి పెడుతున్నారు. స్నేహితులు, బంధువులు చేతిసాయం చేస్తున్నారు. చాలావరకూ మా సంస్థలో తయారయిన సరుకు మార్కెటింగ్‌లో వచ్చిన లాభాలే మమ్మల్ని ముందుకు పంపుతున్నాయి. భవిష్యత్తులో మరింతమంది మహిళలకు శిక్షణలు ఇచ్చి, పెద్దఎత్తున వస్తువులను తయారు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం’’ అని చెప్పారు రుబీనా. ‘‘వేడుకలకు వెళ్లకపోయినా ఫరవాలేదు, ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు వెంటనే పరుగులు పెట్టకపోతే మనం మనుషుల లెక్కల్లో లేనట్టే తల్లీ’’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని తాతయ్య చెప్పిన మాటల్ని ఈరోజుకూ గుర్తుచేసుకుంటూ ఉంటారు రుబీనా. ఆమెనూ, ఆమె ఆశయాన్నీ ముందుకు నడిపిస్తున్నది అదే! - భువనేశ్వరి, ఫొటోలు: మోహన్ ‘‘సౌదీ నుంచి హైదరాబాద్‌కి రాగానే ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజమ్ ట్రైనింగ్ సెంటర్‌ని స్థాపించాను. చాలా రకాల కార్పొరేట్ సంస్థలతో నాకు పరిచయాలు ఏర్పాడ్డాయి. సఫాలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులు, లాప్‌ట్యాప్ కవర్లు, హాండ్ బ్యాగులు, సెల్ పౌచ్‌లు, ట్రావెల్ బ్యాగులు, పెన్ స్టాండ్లను ఆ కంపెనీల్లో అమ్మేలా మార్కెటింగ్ చేసుకున్నాను. దీనికోసం ఆన్లైన్ సహకారం కూడా తీసుకుంటున్నాను. www.safaindia.org ద్వారా మా ‘సఫా’ ఉత్పత్తుల్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారు’’ అని వివరించారు రుబీనా. -
జన చైతన్య భూమిక
రేపు ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’ ‘ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ... పరిష్కారాలు సూచించేదే ఆధునిక వీధి నాటకం...’ అంటూ తనదైన శైలిలో వీధి నాటకాలను సామాన్యుల మధ్యకు తీసుకెళ్లిన కళాకారుడు సఫ్దర్ హష్మీ. 1989 జనవరి 1న ఢిల్లీ సమీపంలో ‘హల్లాబోల్’ వీధినాటికను ప్రదర్శిస్తుండగా సఫ్దర్ హష్మీ హత్యకు గురయ్యారు. దేశంలోని ప్రజా కళాకారులంతా ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఆధునిక వీధి నాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కళాకారుడికి నివాళిగా సఫ్దర్ హష్మీ పుట్టినరోజైన ఏప్రిల్ 12న ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’ జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా వీధి నాటకంపై పరిశోధన చేసి ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగస్థల, కళల శాఖాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డిని పలకరిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘‘ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చడానికి వీధి నాటకానికి మించిన ఆయుధం మరొకటి లేదు. ప్రజల్ని ఆలోచింప చేస్తుంది. ఉత్సాహపరుస్తుంది. విజ్ఞానాన్ని ఇస్తుంది. కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు, కవులు, పండితుల దగ్గరికి వెళ్లి కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవారు. అంటే కళాకారులే ప్రేక్షకుల దగ్గరికి వెళ్లడమన్నమాట. తర్వాత ఆడిటోరియం నాటక ప్రదర్శనలు వచ్చాక ప్రేక్షకులే ప్రదర్శనల దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆధునిక వీధి నాటకం ప్రజల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లడం మొదలుపెట్టింది. ఎక్కడ ప్రజలుంటే అక్కడే వేదిక. బస్ స్టాండుల దగ్గర మొదలుపెడితే... పదిమంది గుమిగూడిన ప్రతి ప్రదేశమూ వీధి నాటకానికి వేదికే. మనదేశంలో వీధి నాటకాలకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘బాదల్ సర్కార్’ ఆద్యుడని చెప్పేవారు. అప్పట్లో ఉద్యమాలకూ, అణచివేతపై తిరుగుబాటుకూ వీధి నాటకం ఓ ఆయుధం. ప్రజల్ని చైతన్యపరచడానికి దీన్నో బ్రహ్మాస్త్రంలా ప్రయోగించేవారు. నేను చేసిన పరిశోధనలో మన రాష్ట్రానికి చెందిన తిరునగరి రామాంజనేయులు మొదటిసారి ఆధునిక వీధి నాటకాన్ని పదర్శించినట్టు తేలింది. ‘వెట్టి చాకిరి’తో... 1948లో తెలంగాణా స్వాతంత్య్ర పోరాట ఉద్యమకాలంలో అప్పటి గ్రామీణ సమాజంలో వెట్టిచాకిరీ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, అమీనా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ గ్రామ సేవకుడి కథను రామాంజనేయులు ‘వెట్టిచాకిరీ’గా ప్రదర్శించారు. ఈ వీధి నాటిక ఒక్క ఖమ్మం జిల్లాలోనే వందసార్లకు పైగా ప్రదర్శించబడిందట. అలాగే మన రాష్ట్రం అత్యధిక వీధి నాటకాలు ప్రదర్శించిన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. వీధి నాటకం... వేదికలు, మేకప్‌లు, హంగూ ఆర్భాటమేమీ అక్కర్లేని ప్రసారమాధ్యమం. పైగా స్పందన కూడా వెంటనే ఉంటుంది. చైతన్యానికి చేయూత ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వీధి నాటక కళకు ఆదరణ మధ్యలో కొంత తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. మన రాష్ట్రంలో చాలా స్వచ్ఛంద సంస్థలు మా రంగస్థల విద్యార్థులతో అవగాహన నాటికలు వేయించుకున్నారు. ఎయిడ్స్, నిరక్షరాస్యత, బాలకార్మికులు, భ్రూణహత్యలు, వరకట్నాలు, మూఢనమ్మకాలు... ఇలా చాలా అంశాలపై వీధి నాటకాలు వేయించి ప్రజల్లో అవగాహన తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. నా వరకూ అయితే ఇలాంటి వీధి నాటకాల్ని ఉచితంగానే ప్రదర్శన చేయిస్తున్నాను. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కూడా తమ పథకాలను ప్రజలకు తెలియజెప్పడానికి వీధి నాటకాలను నమ్ముకుంటున్నారు. టీవీలు, రేడియోలు, సెల్ఫోన్లు... ఆధునిక పరికరాలేవీ చేయలేని పని వీధి నాటకం చేసిపెడుతుందన్నది వారి నమ్మకం. అదే నిజం కూడా. పాఠ్యాంశాల్లో చేర్చాలి... నాటకాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో లేని మరో ప్రత్యేకత మన రాష్ట్రానికి ఉంది. మన రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో రంగస్థల కళల శాఖ ఉంది. ఎన్నుంటే ఏం లాభం... నాటక రంగంపై ప్రేక్షకులకు అభిమానం తగ్గుతోంది. వారి మనసులో ప్రదర్శనలకు ఉన్న చోటు వారి పిల్లలను రంగస్థలానికి పంపడంవైపు ఉండడం లేదు. విదేశాలలో అయితే పాఠశాల పుస్తకాల్లో రంగస్థల నాటక అంశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి విద్యార్థీ గొప్ప కళాకారుడు కావాలని వారి ఉద్దేశం కాదు. నటనను బోధించడం వల్ల హావభావాల్లో, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడంలో ప్రతి విద్యార్థీ నిష్ణాతుడు అవుతాడు. కనీసం దీనికోసమైనా మన పాఠ్యపుస్తకాల్లో కళకు చోటు కల్పిస్తే ఆసక్తి ఉన్నవారు కళాకారులుగా మారతారు, లేనివారు మంచి వ్యక్తిగా ఎదుగుతారు. ఈ మధ్యకాలంలో చాలాచోట్ల వీధినాటకాల్లో యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అనిపిస్తుంది...వీధి నాటకానికి మళ్లీ పూర్వపు వైభోగం వస్తుందని! - భువనేశ్వరి మహిళలంతాచితక్కొట్టారు తనికెళ్ల భరణిగారు రాసిన ‘గో గ్రహణం’ నాటకాన్ని మేం మహరాష్ట్రలోని నాగపూర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అందులో ఓ భర్త పాత్ర తన భార్యను కొట్టే సన్నివేశం ఉంది. నేను భర్త పాత్ర పోషించాను. ఆ దృశ్యం చూసిన మహిళలు ఒక్కసారిగా మీదకొచ్చి నన్ను చితక్కొట్టారు. ‘ఇది నాటకం...’ అంటూ ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే... అంత త్వరగా ప్రేక్షకుల మదిని తాకే శక్తి ఒక్క వీధి నాటకానికే ఉంటుంది. - ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డి రంగస్థల కళల శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
తాజా పుస్తకం: ఊరికి పెట్టిన మేలిమి నమస్కారం....
కొన్ని శీర్షికల పుట్టుకలోనే విజయం ఉంటుంది. ‘మా ఊరు’ అలాంటి శీర్షిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, బతుకునిచ్చిన సొంత ఊరునూ తలుచుకోవడానికి ఎవరు ఇష్టపడరు గనక? వారు చెప్పే ఊరి జ్ఞాపకాలలో తమ ఊరి జ్ఞాపకాలను పోల్చుకోవడానికి ఎందరు ప్రయత్నించరు గనక? అందుకే జర్నలిస్టు భువనేశ్వరి ఈ శీర్షిక కోసం అక్కినేని దగ్గరి నుంచి కంచె ఐలయ్య వరకూ అందరినీ కలిసి వారి ఊరి జ్ఞాపకాలను సేకరించి ప్రచురించినప్పుడు విశేష స్పందన వచ్చింది. చిన్నప్పటి ఆటలు గర్తు చేసుకునేవారూ, పండగలను గుర్తు చేసుకునేవారూ, ఈతలనీ వాతలనీ, తీపి చేదూ జ్ఞాపకాలనీ... ఐతే మంచి విషయం ఏమిటంటే దాదాపు అందరూ తమ ఊరికి అంతో ఇంతో సాయం చేయడానికి ప్రయత్నించేవారే. ఆ ప్రేమ చెప్తే వచ్చేది కాదు. చెరిపేస్తే పోయేదీ కాదు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ ఊరి జ్ఞాపకాలను ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. కారంచేడు, చేటపర్రు, పెద్ద కాకుట్ల, తుక్కుగూడ, నీలకంఠాపురం, నిమ్మాడ... వింటుంటేనే పల్లెగాలి తాకడం లేదూ? ఊరంటే పల్లెటూరే. అలాంటి పల్లెటూళ్లలో పుట్టి పెరిగిన యాభై మంది పెద్దలు తమ ఊళ్ల గురించి చెప్పిన అపురూప జ్ఞాపకాల పుస్తకం ఇది. తప్పక చదవదగ్గ పుస్తకం. అన్ని కులాల, వర్గాల, అంతరాలవారు ఉన్న పుస్తకం. అయితే ఒకటి. ముస్లింలకు ఎలాగూ ఈ దేశం గురించి చెప్పుకునే హక్కు లేదు. కనీసం తమ ఊరి గురించి చెప్పుకునే హక్కు కూడా లేదా? ఈ యాభై మందిలో ఒక్కరు కూడా ముస్లిం లేకపోవడం చూస్తుంటే ప్రజాస్వామిక హక్కుల గురించి కొంత తెలిసినవారెవరైనా తగిన సలహా సూచనలు ఇవ్వలేదేమో అనిపిస్తోంది. ఆ ఒక్క లోటు తప్ప తక్కినదంతా శభాష్. మా ఊరు: భువనేశ్వరి; వెల: రూ.351; ప్రతులకు: 9618954174 సున్నితమైన కథాసంపుటి - కాశీబుగ్గ అడవికి వెళ్లిన పిల్లలు తప్పిపోతారు. అంతా గగ్గోలైపోతుంది. కాని తెల్లారే సరికి ఆ పిల్లలు క్షేమంగా అడవిలోనే ఆడుకుంటూ ఉంటారు. అదే నగరంలో అయితే? రచయిత అంటాడు- కాశీబుగ్గ కథలో- పిల్లలపై అడవి దాడి చేయలేదు. ఆ పని చేయగలిగేది నాగరికుడైన మనిషే. మంచి కథ. రచయిత ఈతకోట సుబ్బారావు రాసిన కథాసంపుటి ఇది. మానవ విలువలను తట్టిలేపే సున్నితమైన అంశాలున్న కథలు ఇవి. కాశీబుగ్గ- ఈతకోట సుబ్బారావు కథలు- వెల: రూ.80; ప్రతులకు: 9440529785 డైరీ ఆవిష్కరణ: హక్కుల నేత, సాహితీ విమర్శకుడు బి.చంద్రశేఖర్ స్మృతిలో మార్చి 1 శనివారం సాయంత్రం గుంటూరులో జరగనున్న సభలో ఆచార్య ఆషిష్ నంది స్మారకోపన్యాసం చేయనున్నారు. అలాగే చంద్ర జ్ఞాపకాలను ‘చంద్రస్మృతి’గా, చంద్ర రచనలను ‘చంద్రయానం’గా రెండు పుస్తకాలను డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరిస్తారు. ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యం సభను నిర్వహిస్తారు. వేదిక: గుంటూరు మెడికల్ అసోసియేషన్ హాల్. -
కొత్త డైరీ
ఇంకొన్ని గంటలయితే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త ఆశలు. కొత్త ఆశ యాలు. అయితే క్యాలెండర్ మారడంతోనే మన జీవితంలోకి కొత్తదనం వచ్చేస్తుందా? గతం గతః అనుకుని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం కేక్ కట్ చేసినంత సులభమా? కాదు. మార్పు అనేది సరిగ్గా ఒకటో తేదీన కాలం మనకిచ్చే బహుమతి కాదు. ఇప్పటివరకూ మన జీవితంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండాలంటే మనల్ని మనమే మార్చుకోవాలి. ఈ సందర్భంలో నిపుణుల సలహాలు మనకు బాగా ఉపకరిస్తాయి. మన ఆలోచనలకు వారి ఆచరణాత్మకమైన సూచనలు తోడైతే కొత్త సంవత్సరం తప్పకుండా మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. పిల్లల పెంపకం నుంచి వృద్ధుల పట్ల మన బాధ్యత వరకూ ఏడు అంశాలపై ప్రముఖ మానసిక వైద్యులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారిక్కడ. వాటిని మనసు అనే మీ కొత్త డైరీలో రాసుకుని న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పండి. జీవితంకల కాదు పెళ్లయిన నెల రోజుల్లోనే విడాకులు కోరుతూ క్యూ కడుతున్న కొత్తదంపతుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లికి ముందే భవిష్యత్తుపై రంగురంగుల కలలు కని పెళ్లి తర్వాత అలా లేని జీవితం అక్కర్లేదని విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటున్నారు డాక్టర్ పద్మ పాల్వాయి. ‘‘పెళ్లయిన కొత్తలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్నింటికీ విడిపోవడం పరిష్కారం కాదు. ముందుగా మీరు చేయాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం, మీ విషయాల్లోకి మూడోవ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం. భార్యాభర్తల విషయంలో తలుపులు తీస్తే సమస్యలు పెరుగుతాయి తప్ప తరగవు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలని కోరుకోవడం పొరపాటు. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించుకోవడం సరైన పద్థతి. అన్నింటికీ ప్రేమ, సహనం అనే ఆయుధాల్ని ఉపయోగిస్తేనే పని జరుగుతుంది’’ అంటారు ఆమె. ఓడిపోవడం తప్పు కాదు పదో తరగతి పరీక్ష ఫలితాలు తెలిసిన మర్నాడు ‘విద్యార్థి ఆత్మహత్య’ అని వార్తాపత్రికల్లో మూడునాలుగు వార్తాకథనాలైనా కనిపిస్తాయి. కోరుకున్నది దక్కనపుడు, అనుకున్నది చేయలేనపుడు, వేధింపులకు తట్టుకోలేనపుడు ‘ఆత్మహత్య’ ఒక్కటే మెడిసిన్ అనుకుంటున్నారు కొందరు. ఓర్పులేని వాడు మాత్రమే సూసైడ్ మంత్రాన్ని జపిస్తాడంటున్నారు డాక్టర్ ఎస్‌ఆర్‌ఆర్‌వై శ్రీనివాస్. ‘‘బాధని భరించడం, కోపాన్ని అణుచుకోవడం వంటి లక్షణాల్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. విజయం సాధించినపుడు ఆకాశానికి ఎత్తడం, ఓడిపోయినపుడు పాతాళంలోకి తొక్కడం తల్లిదండ్రుల నుంచే మొదలవ్వడం వల్ల ఈ రోజు యువత ఏ సందర్భాన్నీ తట్టుకోలేకపోతోంది. వారు నేర్చుకోవలసిన మొదటి వాక్యం ‘ఓర్పు’ అంటున్నారు. కీడెంచడం తప్పు కాదు ఈరోజు తల్లిదండ్రుల కళ్ల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్... బయటికెళ్లిన అమ్మాయి ఇంటికి క్షేమంగా తిరిగి రావడం. మృగాళ్లు సంచరిస్తున్నచోట తమ బిడ్డల మనుగడ ఎలా? అంటూ గుండెల్ని పట్టుకుంటున్న తల్లిదండ్రులు ఆడపిల్లలకు రకరకాల జాగ్రత్తలు చెప్పి భయపెట్టడం కాదంటారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి. ‘‘జరుగుతున్న సంఘటనల వల్ల చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని త్వరగా ఇంటికి చేరుకోమని చెబుతున్నారే కాని అలాంటి సంఘటనలు ఎదురైనపుడు ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి, చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి...వంటి విషయాలపై అవగాహన పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి సందర్భాల్ని అయినా ఎదుర్కొనాల్సి రావొచ్చు. అతిజాగ్రత్తలు చెబుతూ అమ్మాయిల్ని మరింత పిరికివారిగా మార్చేకంటే శారీరకంగా, మానసికంగా వారిని దృఢంగా మార్చడం ఉత్తమం’’ అని చెప్పారాయన. అవసరం తర్వాతే కోరికలు ‘డబ్బుంటే జీవితంలో సగం సమస్యలుండవు’ అనే మాట వినే ఉంటారు. ఉన్న డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో తెలియక వచ్చే సమస్యలు లెక్కలేనన్ని. వీటిని డబ్బుతో కొనితెచ్చుకున్న సమస్యలు అనవచ్చంటారు డాక్టర్ ప్రశాంత్ ‘‘మొన్నీమధ్యే బడ్జెట్ గురించి తగవులాడుకుంటున్న భార్యాభర్తలిద్దరు నా దగ్గరకు వచ్చారు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బు విషయంలో ఇద్దరికీ పొత్తు కుదరక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్య ఇద్దరి సంసారజీవితాన్ని నాశనం చేసేవరకూ వెళ్లింది. నాలుగు లక్షలయినా, నాలుగు వేలయినా ఖర్చు పెట్టే విషయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అర్థం చేసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. వీలైనంతవరకూ పెద్ద బడ్జెట్ల వివరాలు రాసిపెట్టుకోవడం మంచిది. సంపాదన ఎంతైనా మీరు వేసే బడ్జెట్ ప్లాన్ లక్ష్యం ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండేలా ఉండాలి’’ అంటారు డాక్టర్ ప్రశాంత్. మీకోసం మీరు మారండి జీవితంలో నష్టపోయిన వారి డైరీలో వ్యసనం తాలూకు వాసనలు ఉంటాయి. పొగ తాగడం, మద్యం సేవించడం...ఈ రెంటి నుంచి బయటపడడానికి తొంభైతొమ్మిది ముహూర్తాలు దాటిపోయినవారిని చాలామందిని చూస్తుంటాం... అంటున్నారు డాక్టర్ ఫణి ప్రశాంత్. ‘‘అమ్మకోసం, భార్యం కోసం, పిల్లల కోసం వ్యసనాలు వదులుకోవాలనుకునేవారు మాట మీద నిలబడడం కష్టం. నిజంగా మీరు రేపటి నుంచి వ్యసనాల్ని వదిలేయదల్చుకుంటే ముందుగా మీరు నష్టపోయినవాటి గురించి తెలుసుకోండి. సమయం, ఆరోగ్యం, కుటుంబం, తెలివితేటలు, అనుబంధాలు... ఇలా ఇన్నిరోజుల్లో మీరు కోల్పోయిన ప్రతి చిన్న విషయాన్ని వివరంగా తెలుసుకోండి. వీలైతే ఓ డైరీలో రాసుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే మీ జీవితంపై మీరు ఓ పరిశీలన చేసుకోండి. అప్పుడు మానాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోండి. మీకు మీరుగానే మీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటే దానికి తిరుగుండదు ’’ అన్నారు. ఈ రాత్రికే ఈ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఏడాది మీరు పోగొట్టుకున్నవన్నీ మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం. మనమే మలుపు తిప్పుకోవాలి టర్నింగ్ పాయింట్ అనే మాట వినే ఉంటారు. నిజానికి జీవితం మలుపు తిరగదు. మనమే నడవాలి, మనమే పరిగెత్తాలి, మలుపు కూడా మనమే తిరగాలి. ఆ మలుపు మన తలపుల్ని బట్టి ఉంటుందంటారు డాక్టర్ మయూర్‌నాథ్‌రెడ్డి. ‘‘ఉద్యోగాల గురించి చదువుకునే వయసునుంచే కలలు కనడం, ఆ కల తీరకపోతే జీవితం ముగిసిపోయినట్టు ఫీలయిపోవడం యువతలో అక్కడక్కడా చూస్తున్నాం. నిజానికి ప్రయత్నించేవారికి, కష్టపడేవారికి బోలెడు ఉపాధి అవకాశాలున్నాయి. చదువు పూర్తవ్వగానే మన చుట్టూ ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవాలి. నాకు తెలియని విద్య కదా అనుకుని చాలామంది తమకొచ్చిన అవకాశాల్ని వదులుకుంటుంటారు. అవకాశం వచ్చినచోట మీకున్న తెలివిని చూపించండి. జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తొందర పడకండి’’ అని చెప్పారు మయూర్‌నాథ్‌రెడ్డి. పెద్ద మనసు చేసుకోండి కొడుకుకోడళ్లిద్దరూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ‘అమ్మా’, ‘అత్తయ్యా’ అంటూ ఆప్యాయంగా పలకరించి ఓ పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడతారని ఎదురుచూసే పెద్దలు అందరి ఇళ్లలో కనబడతారు. అలా పలకరించి ప్రేమను పంచే పిల్లలెంతమంది ఉన్నారు... అంటున్నారు డాక్టర్ నరేష్ వడ్లమాని. ‘‘మా పిల్లల ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమంలో ఉండడం మేలనే వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బిజీలైఫ్‌లో బంధాల గురించి ఆలోచించే తీరిక కరువైంది. అమ్మానాన్నల దగ్గర కాసేపు కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక ఎవరిలోనో గాని కనిపించడం లేదు. అలాగని పెద్దల్ని పక్కనపెట్టకూడదు. కనీసం వారానికొకసారైనా ‘అమ్మా’,‘నాన్నా’ అంటూ దగ్గరకెళ్లి నాలుగు మాటలు చెప్పండి. ఓపిక లేకపోతే వారు చెప్పేది వినండి. అమ్మానాన్నలు దూరంగా ఉంటే రెండురోజులకొకసారైనా ఫోన్ చేసి బాగున్నారా... తిన్నారా అంటూ క్షేమాలడగండి. ఆ పని రేపటి నుంచే మొదలుపెట్టండి’’ అని డాక్టర్ నరేష్ ఇచ్చిన సలహా చాలా విలువైంది. అది పాటించడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు మీ మీద పడకుండా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. - భువనేశ్వరి -
కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు
జీవితం ఒక తియ్యని వేడుక. అందరికీనా? అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ! పిల్లల్లో కలిసిపోతే... పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది. స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం... ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది. అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు! సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్... చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి... అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయో! ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’. అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే... ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం... సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు... చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు. క్యాండిల్ దగ్గర నుంచి వెల్కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు... అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే... బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్. స్కూలు ఆలోచన... అమెరికాలో ఎమ్ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు. మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు... ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి... పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది. ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం... చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్... వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్. తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్. అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’ - శ్రీవ్యాల్ -
‘స్వీట్’గా నయం చేస్తారు
అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రదేశాల్లోనే జబ్బువస్తే నయం చేసుకోడానికి బోలెడు తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఆసుపత్రి అనే పదానికి అందనంత దూరంలో ఉండే మారుమూల కొండప్రాంతాల గిరిజనవాసులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే మలేరియా జబ్బు గ్రామాలను పట్టిపీడిస్తుంటే వారిని ఎవరు రక్షిస్తారు? గత ఇరవైఏళ్లుగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలందిస్తున్న ఈశ్వరరావుని పలకరిస్తే అడవిబిడ్డలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది మనకు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49 గ్రామాల్లో గిరిజన ప్రజలు వర్షం పేరు చెబితే వణికిపోతారు. ఆ వణుకొచ్చేది వానతోపాటు వచ్చే చలివల్ల కాదు. వర్షం వచ్చినపుడు కొండప్రాంతాల నుంచి వచ్చే కలుషితనీటి వల్ల. గిరిజనవాడలంటేనే శుభ్రత అంతంతమాత్రం. దానికి తోడు ఇళ్ల ముందుండే పశువుల కొట్టాలు. కారణాలేవైతేనేం, చినుకు పడడంతోటే జ్వరాలు మొదలవుతాయి. వచ్చింది మలేరియా అని తెలిస్తే ఎలాగోలా ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకుని బతికి బట్టకడతారు. కాని, తమకు వచ్చిన జబ్బేమిటనేది కూడా వారికి అవగాహన లేకపోతే ఏం చేస్తారు..! ఆ సమయంలో ఈశ్వరరావుకు ఒక ఆలోచన వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ఆరోగ్యం అనే అంశాలపై సేవ చేయాలనుకున్నారు. ‘స్వీట్’ (సొసైటీ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్) పేరుతో స్వచ్ఛందకార్యకర్తల సాయంతో ఆ గ్రామాలకెళ్లి ‘మలేరియా’పై పోరాడుతున్నారు. అవగాహన, వైద్యం... ‘‘చైతన్య యువజన సేవాసంఘం పేరుతో 1991లో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మారుమూల గ్రామాల్లో మలేరియా వల్ల గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికి అందుబాటులో ఉండాలనుకున్నాను. అందుకే 1997లో ‘స్వీట్’ ఆర్గనైజేషన్ స్థాపించాను. 49 గ్రామాల్లో... గ్రామానికి ఒకరు చొప్పున వాలంటీర్లను ఏర్పాటుచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. వర్షం చినుకులు పడడంతోటే గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీక్షలు మొదలుపెట్టేస్తాం. మలేరియా వచ్చినవారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యపరంగా అభివృద్ధి ఉన్న గ్రామాల్లో మార్పు తేవడం కొంతవరకూ సులువు. కాని ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజల జీవనవిధానాల్లో మార్పులు తేవడం అంత తేలిక కాదు. ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఇంటింటికీ తిరుగుతుంటే... ఎట్టకేలకు వారిలో కొద్దిపాటి మార్పు వచ్చింది’’ అని చెప్పారు ఈశ్వరరావు. ‘స్వీట్’ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి ‘వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ మలేరియా నిర్మూలన ప్రాజెక్టును వీరికి అప్పగించింది. కుష్ఠు రోగులకు కూడా... సీజనల్‌గా వచ్చే మలేరియా వంటి జబ్బులొక్కటే కాకుండా కుష్ఠువ్యాధి బాధితులపైన కూడా ‘స్వీట్’ దృష్టి పెట్టింది. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’ వారి సహకారంతో ఆ గ్రామాల్లో కుష్ఠువ్యాధి గ్రస్థులకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్య, వైద్యసౌకర్యాలు అందుబాటులో లేనిచోట ఎన్నిరకాల జబ్బులైనా వస్తాయి. గ్రామాల్లో ఆ రెండింటినీ ఏర్పాటుచేస్తే తప్ప ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరకదు. మా సంస్థ లక్ష్యాల్లో మరొకటి మహిళా సంక్షేమం. వారికి ఉపాధి అవకాశాల్లో భాగంగా అరటినారతో బ్యాగుల్ని తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని ముగించారు ఈశ్వరరావు. ‘స్వీట్’ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. - భువనేశ్వరి -
చల్లని నీడ
ఎయిడ్స్‌తో బాధపడేవారికి ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వడాన్ని ప్రమాదంగా భావించే ప్రపంచంలో ఉన్నాం మనం. అయితే ఆ జబ్బు వచ్చినవారు తమ చివరి రోజుల్ని తన ఆసుపత్రిలో గడిపే అవకాశం కల్పిస్తూ అందరితో ‘వైద్యోనారాయణోహరిః’అనిపించుకుంటున్నారు ఈ డాక్టర్. ప్రకాశం జిల్లా చీరాలలో ‘షాడో’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించి ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్ డేవిడ్సన్ సాల్మన్ గురించి... ఇప్పటివరకూ ఆ ఆసుపత్రికి పద్దెనిమిది వేలమందికి పైగా ఎయిడ్స్‌రోగులు వచ్చారు. అయితే డాక్టర్ డేవిడ్ గర్భిణులు, మరణంతో పోరాడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించారు. అందువల్లే గర్భిణులకు ఉచిత ప్రసవం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆసుపత్రిలోనే ఉచిత ఆశ్రయం కల్పించాలనుకున్నారు. దాతలు డబ్బు మాత్రమే ఇవ్వగలరు, సాల్మన్ మాత్రం ప్రేమను కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎయిడ్స్ రోగులకు తన ఆసుపత్రిలో బెడ్ ఇప్పించారు. ‘షాడో’ సంస్థ ద్వారా డా.సాల్మన్ ఎయిడ్స్ రోగులకు వైద్యం చేస్తున్నారు. ఒకవేళ చనిపోతే అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు. ప్రచారంతో పాటు... ‘‘మా నాన్నగారి పేరుతో గత ముప్పైఏళ్లుగా చీరాలలో ‘సాల్మన్’ ఆసుపత్రి ఉంది. నేను, నా బావమరిది, అతని భార్య అందరం వైద్యవృత్తిలోనే ఉన్నాం. ముంబయి, బెంగుళూరు వంటి నగరాల్లో వైద్య ఉద్యోగాలు వచ్చినప్పటికీ నాన్నగారి ఆసుపత్రిలో ఉండిపోవాలని అందరం ఇక్కడికే వచ్చేశాం. ఇరవై ఏళ్లక్రితం మా జిల్లాలోని మొదటి ఎయిడ్స్‌రోగికి నేను వైద్యం చేశాను. రోజురోజుకీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారికోసం సాల్మన్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వీకర్స్ సొసైటీ... షాడో స్థాపించాను. వైద్యం చేసి ప్రాణం పోయడానికంటే ముందు ఆ జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలు చేశాను. ఎయిడ్స్‌రోగుల్ని ఇంట్లో పెట్టుకోడానికి ఇబ్బందిపడి మా ఆసుపత్రిలో చేర్పించి వదిలేసి వెళ్లిపోయినవారు కూడా ఉన్నారు. బంధువులుండి కూడా వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే నాకు చేతనైనంత సాయం చేసేవాడిని’’ అని చెప్పారు డేవిడ్. సాల్మన్ ఆసుపత్రిలో వెయ్యిమందికి పైగా ఎయిడ్స్‌రోగులు కన్నుమూశారు. వారిలో వందమందికి పైగా అనాథలు. ఈ అనాథలు... అందరికీ దూరమైనవారు. కొందరు నిజంగానే ఎవరూ లేనివారు. బతికుండగా గుక్కెడు నీళ్లు పోయడం సాయమైతే...చనిపోయాక చేయాల్సిన అసలైన సేవ కూడా చేస్తున్న ఈ డాక్టర్ అభినందిద్దాం. - భువనేశ్వరి