చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం పచ్చ రంగు పూసుకుంది. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను టీడీపీ నేత నారా భువనేశ్వరి కార్యక్రమానికి వెళ్లాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ర్యాలీకి వెళ్లకపోతే ఆబ్సెంట్ వేస్తామని, ఇంటర్నెల్ మార్కులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. కళాశాల యాజమాన్యం చేష్టలకు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
స్పందన లేకే...
చిత్తూరు నగరంలో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇలా అయితే చిత్తూరు టికెట్ ఆశిస్తున్న తన పరువుపోతుందని టీడీపీ నేత విజయం కళాశాల నిర్వాహకులను సంప్రదించి విద్యార్థులను పంపాలని కోరారు. అడిగిందే అదునుగా విద్యార్థుల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోని కళాశాల నిర్వాహకుడు ఉన్నపళంగా విద్యార్థులకు ఆదేశాలిచ్చేశాడు.
కళాశాలలో చదువుతున్న 500 మందికి పైగా విద్యార్థులు భువనేశ్వరికి స్వాగతం పలుకుతూ రోడ్డుకిరువైపులా నిలబడాలని హుకుం జారీ చేశాడు. కొందరు విద్యార్థినిలు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా పట్టించుకోకుండా కళాశాల నిర్వాహకుడు ఒత్తిడి చేసి రోడు్డపై నిలబెట్టాడు. మరికొందరు విద్యార్థులు రాజకీయ కార్యక్రమాల్లో తాము వెళ్లినట్టు తమ తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని చెప్పినా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లితీరాల్సిందేనని పట్టుబట్టారు.
వెళ్లని వారికి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు కట్ చేస్తానని, ఆబ్సెంట్ వేస్తానని బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో విద్యార్థులు చేసేది లేక దాదాపు మూడు గంటల పాటు చిత్తూరు పీసీఆర్ కూడలిలోని రోడ్లపై నిలబడ్డారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే కళాశాల యాజమాన్యం కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు.
గతంలోనూ ఇదే తీరు
విజయం విద్యా సంస్థలకు ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. గతంలో లోకేష్ యువగళం కార్యక్రమానికి సైతం విద్యార్థులను ఒత్తిడి చేసి పంపించారు. నో డ్రగ్స్ పేరిట టీడీపీ నేతలు చిత్తూరులో నిర్వహించిన ర్యాలీకి కూడా టీడీపీ జెండాలు పట్టుకుని రోడ్లపై వెళ్లాల్సిందేనంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. దీనిపై అప్పట్లో కళాశాల యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్వాహకుడు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు.
భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి కార్యక్రమానికి విద్యార్థులను పంపడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసి, రోడ్లపై నిలబెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదుచేసి, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment