బండెడు బాధలు | MS Narayana to know Vegetable sellers problems as a Sakshi stop reporter | Sakshi
Sakshi News home page

బండెడు బాధలు

Published Sun, Sep 14 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

MS Narayana to know Vegetable sellers problems as a Sakshi stop reporter

ఉదయాన్నే ఠంచనుగా వచ్చి టెన్షన్స్ క్లియర్ చేసే కూరగాయలబ్బి ఒకప్పుడు అందరివాడు. తోపుడు బండిపై తాజా తాజా కూరగాయలే కాదు, అంతకన్నా తాజా తాజా కబుర్లు మోసుకొచ్చే అతగాడంటే ఆడాళ్లకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆ వీధి విశేషాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు పక్క వీధిలోని అమ్మలక్కల చెవిలో వేసే వార్తాహరుడుగా పనిచేసేవాడు. బేరం విషయంలో పేచీ పడ్డా.. కసురుకోకుండా కొసరు కొలుస్తాడు. కొన్నేళ్ల కిందటి వరకు మూడు ఆకుకూరలు.. ఆరు కాయగూరల్లా వ్యాపారం చేసుకున్న అతడు.. ఇప్పుడు భారంగా బండి తోస్తూ గొంతు చించుకున్నా.. ‘ఇటురా’ అన్న పిలుపునకు నోచుకోవడం లేదు. కూరగాయలబ్బి మారలేదు.. ఆయన తెచ్చే కూరగాయలూ మారలేదు. మారింది మనమే. ఏళ్లుగా ముంగిట్లోకి వస్తున్న ఆరోగ్యాన్ని కాదని కార్పొరేట్ కొట్టులో ఏసీలో మగ్గుతున్న కాయగూరలపై మనసుపడ్డాం. మనలోని ఈ మార్పే కూరగాయలబ్బి బతుకును పుచ్చుల్లో పడేసింది. అరకొర అమ్మకాలతో తోపుడు బండ్లు వేసుకుని వీధుల్లో తచ్చాడుతున్న కూరగాయలు అమ్మేవారిని ‘సిటీప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా కామెడీకింగ్ ఎమ్మెస్ నారాయణ పలకరించారు.

ఎమ్మెస్ నారాయణ: ఎలా ఉన్నారయ్యా.. బాగున్నారా?
లక్ష్మణ్: ఏదో ఉన్నం సార్.
ఎమ్మెస్ నారాయణ: నీ పేరేంటి తమ్ముడు.
మారెన్న: మారెన్న సార్...
ఎమ్మెస్: ఏదీ ఒక్కసారి కూరగాయలూ.. అని పిలువ్.
మారెన్న: కూరగాయలూ...(కాస్త మెల్లగా పిలిచాడు)
ఎమ్మెస్: అలా మెల్లగా పిలిస్తే ఎలాగయ్యా.. మా వీధిలో అబ్బాయి అయితే.. ‘కురక్కాయలే...’ అని భలే వెరైటీగా అరుస్తాడు. వాడి అరుపు వింటే ఎంత నిద్రలో ఉన్నవాడైనా లేచి కూర్చుంటాడు.(నవ్వుతూ...)
మారెన్న: అరవాలే సార్. లేదంటే మాకు గిరాకీ యాడికెళ్లి వొస్తది.
లక్ష్మణ్: అరిచి.. అరిచి గొంతంతా ఎండిపోతది సార్.
ఎమ్మెస్: నిజమే.. మారెన్న. నువ్వు రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు?
మారెన్న: నేను ఇక్కడే రెహ్మత్‌నగర్‌లో ఉంట సార్. పొద్దుగాల నాలుగు గంటలకు నిద్రలేచి మాల్ (పచ్చి మిరపకాయలు) కోసం మూసాపేటకు బండి తోసుకుంటూ పోత. బండి నిండా మాల్ ఏసుకుని తోలుకుంట వచ్చేసరికి ఏడెనమిదైతది. దానికే తొమ్మిది కిలోమీటర్లు ఐతది. ఆడికెళ్లి ఇంటింటికీ తిరిగి మిరపకాయలు అమ్మేసరికి టైం పన్నెండైతది. పది కిలోమీటర్లు తిరుగుడైతది.
రాము: ఎంత తిరిగితే గంత బిజినెస్. నడకనే మాకు సగం పెట్టుబడి సార్.
ఎమ్మెస్: ఇంతలా తిరుగుతుంటారు కదా బోర్ కొట్టదా?
రామకృష్ణ: గిరాకీ వస్తే ఏ బాధలుండవు సార్. ఒక్కోసారి బోణీలుండవు.. బేరాలాడేది మాత్రం మస్తుగుంటది. గప్పుడు చుక్కలు కన్పిస్తయ్.
ఎమ్మెస్: అవునమను.. అదే అడుగుదామనుకుంటున్నాను. మార్కెట్‌తో పోలిస్తే కూరగాయుల బండి దగ్గర బేరాలు ఎక్కుమంటాయి, దాని గురించి చెప్పండి..?
రామకృష్ణ: కొత్తిమీర కట్ట రూపాయి తగ్గితే కోట్లు సంపాదించినట్టు అనుకుంటరు సార్. గసొంటి బేరాల ను చూస్తే కోపమొస్తది. ఏంద అని గట్టిగంటే.. చానా ఎక్కువ మాట్లాడుతున్నవని తిడ్తరు.
మహ్మద్ ఖలేద్: బిర్యానీ ప్యాకెట్ ధర పెరిగితే ఒక్క మాట మాట్లాడరు. సినిమా టికెట్ ధర పెరిగినా ఏమనరు. పొద్దుగాళ్ల లేస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్లు మా దగ్గరికొచ్చేసరికి.. బేరమాడి రూపాయి రూపాయి మిగుల్చుకుంటరు. ఆ పైసలతో ఇల్లు కడతరా.
ఎమ్మెస్: ఇల్లు అంటే గుర్తొచ్చింది.. మీలో సొంతిల్లు ఎంత మందికుంది ?
మారెన్న: మాకు సొంతిల్లు యాడుంటయ్ సార్. నాకు నల్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లి చేసిన. ఇంకా నలుగురి బాధ్యత ఉంది. రెండు పూటలు సరిగా తింటే ఆ రోజు సొంతిల్లు కట్టినట్టే అనుకుంటం.
సంతోష్: మా నాయన తోలిన బండే నేను తోల్తున్నా. పొట్ట నిండనికి తప్ప.. పైసలు మూటగట్టడం ఈ బండితోని అయ్యే పనికాదు సార్. పూటకోసారి కూరగాయల ధరలు మారుతుంటయ్. ధరలు ఎక్కుమన్నప్పుడు కొంటం. తెల్లారి అమ్మే టైమ్‌కి ధరలు పడిపోతయ్. ఏం చేస్తం సార్.
ఎమ్మెస్: నేనూ చాలాసార్లు గమనించాను. గిరాకీ లేక, అమ్ముడుపోక బండ్లమీద కూరగాయులు ఎండిపోయి కనిపిస్తాయి. వర్షాలు పడితే కొన్ని కాయుగూరలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి!
లక్ష్మణ్: గిసొంటియి మాకు కొత్తకాదు సార్. పొట్ట ఊకోదు కాబట్టి అప్పు చేస్తం.
ఎమ్మెస్: మీకు అప్పు కావాలంటే.. మీకు కూరలిచ్చే దళారుల దగ్గరికే వెళ్తారని విన్నాను, నిజమేనా?
రామకృష్ణ: అంతేగా సార్.
ఎమ్మెస్: నేరుగా రైతుల దగ్గర మాల్ కొంటే గిట్టుబాటు అవుతుంది కదా. ఇలా దళారీలపై ఆధారపడితే లాభాలు అతనికి.. నష్టాలు మీకు మిగులుతాయి.
మారెన్న: నిజమే సార్. కానీ ఏం జేస్తం. పేదోళ్లం. మాకు రూపాయిచ్చేటోడే దేవుడు. ధరలతో సంబంధం లేకుండా కొంటం. కాళ్లరిగేలా తిరుగుతం.
ఎమ్మెస్: ధరలన్నారుగా.., మీరు రేట్లు ఎక్కువ చెబుతారంటారు నిజమేనా..?
సంతోష్:  ఈ రోజు మార్కెట్ల ఆలుగడ్డల ధర 27 రూపాయలు. అదే మీరు పెద్ద పెద్ద షాపులల్ల (కార్పొరేట్) పొయ్ చూడండి 19 రూపాయలే ఇస్తుండ్రు. అదెట్లంటే షోరూమ్‌లోళ్లు బట్టల మీద, చెప్పుల మీద బగ్గ గుంజి.. కూరగాయల ధరలు తగ్గించి గిరాకీ రప్పించుకుంటున్నరు. దీంతో మా రేట్లు ఎక్కువగానే అనిపిస్తయ్. ఏసీ పెట్టి మరీ మా పొట్టలు కొడుతున్నరు సార్.
 ఎమ్మెస్: కష్టజీవులకు తెలిసినన్ని వాస్తవాలు మిగతావాళ్లకు తెలియవు. కార్పొరేట్ కల్చర్ సామాన్యుడ్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో చూడండి. ఇలా మీలో మీరు బాధపడితే ఎలా..? మీ కష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజేశారా ?
 లక్ష్మణ్: ఏడ చెబుతం సార్. ఎవరూ ముందుకు రారు.
ఎమ్మెస్: అలా అంటే ఎలా? హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా.. సీఎం కేసీఆర్ గారు పేదల సంక్షేమం గురించి బోలెడన్ని పథకాలను ప్రవేశపెడుతున్నారు. మీరు గనక మీ డిమాండ్‌లను ఆయన ముందుంచితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.
రామకృష్ణ: అట్లనే జేస్తం సార్.
ఎమ్మెస్: అసలు విషయం మరిచిపోయాను. ఈ బండి ఖరీదు ఎంత ? కొన్ని బండ్ల టైర్లలో గాలి కూడా ఉండదు. అయినా అలా తోసుకుంటూ వెళ్తుంటారు?
రాము: కొత్తదైతే ఇప్పుడు 10 వేలకు తక్కువ లేదు సార్. టైర్లళ్ల గాలంటరా.. పంచరైనా, పాడైనా.. మార్పించే స్తోవుత లేక అట్లనే తోసుకుంటూ పోతరు. కొందరు కావాలనే అట్ల వదిలేస్తరు.
ఎమ్మెస్: రైతు పొలంలోని కూరలను మార్కెట్‌కి తీసుకొస్తే మీరు ఇంటి ముందుకు తీసుకొస్తారు. వీధుల్లో మీ అరుపులు సందడి  తీసుకొస్తాయి. ‘ఫలానా కూరలబ్బి చాలా మంచోడ’ని కితాబు పొందే మీలాంటి క ష్టజీవులను పలకరించినందుకు చాలా సంతోషంగా ఉంది.
 
స్టార్ రిపోర్టర్‌కి స్పందన
ఎమ్మెస్ నారాయణ రిపోర్టింగ్ గురించి తెలుసుకున్న ఆ ఏరియా కార్పొరేటర్ బి.చంద్రమ్మ వెంటనే స్పందించి తోపుడు బండ్లవారి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెస్ ఆమె ఇంటికి వెళ్లి కూరగాయలమ్మేవారి జీవితాలపై దృష్టి పెట్టాలని కోరారు. ‘సాక్షి’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పేదల పక్షాన నిలిచిన ఎమ్మెస్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయులు అమ్మేవారికి సొంతిళ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న మార్కెట్‌వాసుల క్వార్టర్స్ ప్రాజెక్ట్‌ని పట్టుదలగా పూర్తిచేస్తానని తెలిపారు. తోపుడు బండ్లను నమ్ముకుని బతుకుతున్న మైనారిటీలకు బ్యాంకు రుణాలు అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
 - ప్రజెంటేషన్: భువనేశ్వరి
 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement