vegitables
-
మెనూ.. కొద్దిగా మారుద్దాం! అప్పుడే హ్యాపీగా తింటాం!!
బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తే... ‘అమ్మో! డెడ్లీ’ అంటారు పిల్లలు. కూరగాయలతో కూరలు వండితే... ‘అన్నీ పిచ్చి కూరలే’ అంటారు. అందుకే... జస్ట్ ఫర్ చేంజ్. కూరగాయలతో బ్రేక్‌ఫాస్ట్... ఇడ్లీతో ఈవెనింగ్ స్నాక్ చేద్దాం. హ్యాపీగా తినకపోతే అడగండి.వీట్ వెజిటబుల్ దోసె..కావలసినవి..గోధుమపిండి – ఒకటిన్నర కప్పులు;ఉప్పు – పావు టీ స్పూన్;నీరు – పావు కప్పు;టొమాటో ముక్కలు – పావు కప్పు;ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు;క్యారట్ తురుము – పావు కప్పు;పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు;నూనె – 6 టీ స్పూన్లు.తయారీ..– ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.– ఇందులో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.– ఇప్పుడు పెనం వేడి చేసి దోసెలు పోసుకోవడమే. ఈ దోసెలు ఊతప్పంలా మందంగా ఉండాలి.– మీడియం మంట మీద కాలనిస్తే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి.– ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కాల్చి తీస్తే హోల్ వీట్ వెజిటబుల్ దోసె రెడీ.చిల్లీ ఇడ్లీ..కావలసినవి..ఇడ్లీ ముక్కలు – 2 కప్పులు;రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్లు;తరిగిన అల్లం – 2 టీ స్పూన్లు;తరిగిన వెల్లుల్లి– 2 టీ స్పూన్లు;తరిగిన పచ్చి మిర్చి – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు;టొమాటో కెచప్ – 2 టేబుల్ స్పూన్లు;చక్కెర– అర టీ స్పూన్;వినెగర్– టీ స్పూన్;సోయాసాస్ – టీ స్పూన్;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె – 3 టేబుల్ స్పూన్లు.తయారీ..– పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇడ్లీ ముక్కలు వేసి అంచులు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి.– ఇప్పుడు అదే పెనంలో మిగిలిన నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించాలి.– ఇప్పుడు టొమాటో కెచప్, చక్కెర, వినెగర్, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.– ఉల్లిపాయ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసి కలిపితే చిల్లీ ఇడ్లీ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయాలి.ఇవి చదవండి: ‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! -
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్యకు.. సుగంధభరిత బియ్యం, భారీగా కూరగాయలు
ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుగంధభరిత బియ్యాన్ని పంపనుంది. అలాగే ఈ ప్రాంతపు రైతులు తాము పండించిన కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించారు. రాజధాని రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి పాల్గొని, ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధభరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా చూపారు. ఇదిలావుండగా సీఎం విష్ణు దేవ్‌సాయి తన సోషల్ మీడియా ఖాతాలో ‘రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నాం. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. రాష్ట్రంలోని రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్నాడు. ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్న రాష్ట్రంలోని రైతులు అభినందనీయులు’ అని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ రైస్‌మిల్లర్లు అయోధ్యకు సుగంధభరిత బియ్యం పంపినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! राम काज करिबे को आतुर... आगामी 22 जनवरी को अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र जी की मूर्ति की प्राण प्रतिष्ठा होने वाली है, जिस पर हर सनातनी को गर्व है। मेरे प्रदेश के अन्नदाताओं ने भी राम काज के लिए अपने खेतों से उगाई गई 100 टन सब्जियां राम मंदिर निर्माण कार्य… pic.twitter.com/fD3OvLiod0 — Vishnu Deo Sai (@vishnudsai) January 2, 2024 -
పైన కూరగాయలు, కింద రేషన్ బియ్యం!
పెబ్బేరు: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ సోమవారం పోలీసులకు చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు... కర్నూల్ జిల్లా నుంచి గోపాల్‌నాయక్ ఏపీ 31టిఎ 9799 నంబర్ గల మినీ డీసీఎంలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం నింపి బియ్యంపై కూరగాయల బాక్స్‌లు వేసుకుని బాలనగర్‌కు తరలిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం తెల్లవారుజామున పెబ్బేరు సమీపంలో డీసీఎంను పట్టుకున్నారు. బాలనగర్ మండలం కుచర్లతండాకు చెందిన డ్రైవర్ గోపాల్‌నాయక్, అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉంటూ అదే గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తితో కలిసి చుట్టుపక్కల గ్రామాలలో ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని బాలనగర్, షాద్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈవిషయం తెలియడంతో సివిల్ సప్లయ్ అధికారులు డీటీ వేణు, నందకిశోర్ డీసీఎంలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ గోపాల్‌నాయక్, గిరిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కూ'రంగు'కాయలు..
-
కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!
పండ్లు, కూరగాయల నిల్వ పద్ధతిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అస్సాంలోని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల రైతులకు తీపికబురు చెప్పారు. విస్తృత పరిశోధనల ఫలితంగా సముద్రపు నాచు వంటి సహజ పదార్థాలతో ఓ సేంద్రియ లేపన పదార్థాన్ని ఆవిష్కరించారు. ఈ ద్రావణంలో కూరగాయలు, పండ్లను ముంచి తీసి పక్కన పెడితే సరి. లేదంటే ఈ పదార్థంతో కవరును తయారు చేసి అందులో పండ్లు, కూరగాయలను నిల్వ చేసినా చాలు. వారం, రెండు వారాలు కాదు.. ఏకంగా రెండు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కుళ్లిపోయిన టమాటోలు, ఉల్లిపాయలు, పండ్లను చెత్తకుప్పల్లో పారబోయాల్సిన దుస్థితికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది. అంతేకాదు.. ‘పచ్చి సరుకు’ కాబట్టి తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఉద్యాన రైతులు విముక్తి పొందే రోజు కూడా దగ్గర్లోనే ఉందని చెప్పొచ్చు! కూరగాయలు, పండ్లను పొలంలో పండించడానికి రకాన్ని బట్టి 3 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ఇంతా కష్టపడి పెంచి చెట్ల నుంచి కోసిన తర్వాత, ప్రజలకు అందించేలోగా, కొద్ది రోజుల్లోనే వడలిపోతుంటాయి. ఇంకొన్ని రోజులైతే కుళ్లి పనికిరాకుండా పోతుంటాయి కూడా. ఈ క్రమంలో ఉద్యాన పంటల రైతులకు, చిరు వ్యాపారులకు తీవ్రనష్టం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లకైతే అత్యధికంగా 20% వరకు నష్టం జరుగుతోంది. ధర మరీ పతనమైతే పారబోయాల్సిన దుస్థితి. ఈ కష్టాల నుంచి రైతులను, వ్యాపారులను గట్టెక్కించే సరికొత్త సేంద్రియ లేపన పదార్థాన్ని గౌహతిలోని ఐఐటీకి చెందిన రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు, పరిశోధకులు కనుగొన్నారు. తాజాదనాన్ని, పోషకాలను, రంగును, రూపురేఖలను కోల్పోకుండా పండ్లు, కూరగాయలను నిల్వ చేయొచ్చు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వాటిని మెత్తబడిపోకుండా, మొలక రాకుండా చూసుకోవచ్చు. ఏకంగా రెండు నెలల వరకూ కాపాడుకోవచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఈ లేపనం పూసిన పండ్లు, కూరగాయలను తిన్న వారికి ఎటువంటి హానీ జరగదని శాస్త్రీయ పరీక్షల్లో రుజువైందంటున్నారు. బంగాళాదుంపలు, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, స్ట్రాబెర్రీలు, ఖాసీ మాండరిన్ రకం నారింజ పండ్లు, ఆపిల్స్, పైనాపిల్స్, కివీ పండ్లపై ఈ పదార్థాన్ని ఇప్పటికే పరీక్షించి.. వీటిని దాదాపు రెండు నెలల పాటు తాజాగా ఉంచగలిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనా బృందానికి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ విమల్ కటియార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వైభవ్ వి గౌడ్ మార్గదర్శకత్వం నెరిపారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సస్టైనబుల్ పాలిమర్స్‌కు చెందిన పరిశోధకులు తబ్లీ ఘోష్, కోన మొండల్, మాండవి గోస్వామి, శిఖా శర్మ, సోను కుమార్ విజయవంతంగా పరిశోధనలు నిర్వహించారు. లేపనంలో ఏముంది? డునాలియెల్లా టెర్టియోలెక్టా అనే సముద్రపు నాచు సారానికి పాలీసాకరైడ్లను కలిపి ఈ లేపన పదార్థాన్ని రూపొందించారు. ఈ సముద్రపు నాచు యాంటీఆక్సిడెంట్లతో పాటు.. కెరోటినాయిడ్లు, ప్రోటీన్లు వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను ఉత్పత్తి చేయడానికి, అదే విధంగా జీవ ఇంధనం ఉత్పత్తికి కూడా ఈ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఒమేగా–3 కొవ్వు ఆమ్లంను వెలికితీసిన తర్వాత మిగిలే అవశేషాలను వ్యర్థాలుగా భావించి పారేసేవారు. అయితే, గౌహతి ఐఐటి పరిశోధకులు ఈ అవశేషాలను చిటోసాన్ అనే పిండి పదార్థంతో కలిపి లేపన పదార్థాన్ని రూపొందించే పద్ధతిని కనుగొన్నారు. సూక్ష్మక్రిములు, శిలీంధ్రాల నాశని లక్షణాలు కలిగిన ఈ పదార్థాలతో తయారైన లేపన పదార్థం తిన్న వారికి ఎటువంటి నష్టం కలగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. (క్లిక్: ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!) ఈ విధంగా తయారు చేసిన లేపన పదార్థంలో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది 40 డిగ్రీల వరకు వేడికి తట్టుకుంటుంది. లేపనం రాసిన తర్వాత చెదిరిపోకుండా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో నుంచి నీటి ఆవిరి బయటకుపోకుండా అడ్డుకుంటుంది. కాంతిని అడ్డుకునే శక్తి దీనికి ఉందని అనేక పరీక్షల ద్వారా నిర్థారణైందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు ఈ పూతను జీవ భద్రత కోణంలోనూ పరీక్షించారు. వివిధ జీవ ప్రక్రియల అధ్యయనానికి ప్రయోగశాల ప్రమాణంగా పరిగణించే ‘బిహెచ్కె21 సెల్ లైన్’ ద్వారా పరీక్షించి చూశారు. ఈ లేపన పదార్థం విషపూరితమైనది కాదని, తినదగిన ఆహార ప్యాకేజింగ్ పదార్ధంగా సురక్షితంగా ఉపయోగించవచ్చని పరీక్షల్లో తేలిందన్నారు. (క్లిక్: నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..) ఈ అధ్యయన ఫలితాలు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్సెస్, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహా అనేక ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పండ్లు, కూరగాయల వృథాను అరికట్టడంతో పాటు, రైతుల వెతలను తగ్గించి మంచి ఆదాయాన్నిచ్చే ఈ అద్భుత లేపనం త్వరలోనే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఆకృతి, రంగు, రుచి, పోషకాలు చెక్కుచెదరవు! భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా ప్రకారం 5 నుంచి 16 శాతం పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత నిల్వ సామర్థ్యం లేక వృథాగా పాడైపోతున్నాయి. వాస్తవానికి ఈ నష్టం బంగాళాదుంప, ఉల్లిపాయలు, టొమాటో వంటి కొన్ని పంటల్లో కోత అనంతర నష్టం 19% వరకు ఉండొచ్చు. ప్రజలు ఎక్కువగా తినే ఈ కూరగాయల ధర ఆ మేరకు పెరిగిపోతోంది. ఈ లేపన పదార్ధాన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 40 డిగ్రీల సెల్షియస్ వరకు కాంతిని, వేడిని, ఉష్ణోగ్రతను ఈ లేపనం చాలా స్థిరంగా తట్టుకుంటుంది. తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదు. సురక్షితమైనది. లేపనం చేసిన పండ్లు, కూరగాయల ఆకృతి, రంగు, రుచి, పోషక విలువలు చెక్కుచెదరదు. ఈ లేపన పదార్థాన్ని నేరుగా కూరగాయలు, పండ్లపై పూయవచ్చు లేదా ఈ పదార్థంతో కవర్‌ను తయారు చేసి కూరగాయలు, పండ్లను అందులో నిల్వ చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఎలా ఉపయోగించినా కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యాన్ని పొడిగించవచ్చు. ఇది సాధారణ ‘డిప్ కోటింగ్ టెక్నిక్’. పెద్దగా ఖర్చు పెట్టకుండానే పంట కోత అనంతరం దిగుబడులను సులభంగా దీర్థకాలం నిల్వ చేసుకోవచ్చు. – ప్రొ. విమల్ కటియార్, అధిపతి, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం, ఐఐటి, గౌహతి, vkatiyar@iitg.ac.in -
‘పొట్లం’ యువకుడి కథ.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్.. 200 మందికి ఉపాధి
ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు. చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది.. సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు. ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్ యాప్ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్’కు శ్రీకారం చుట్టాడు. లక్ష మందికిపైగా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్ ద్వారా శ్రీనివాస్ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2020లోనే పొట్లం మొదటి డార్క్ స్టోర్ పొట్లం యాప్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్స్టోర్ను శ్రీనివాస్ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ (ఫోన్ ద్వారా)లో ఆర్డర్ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్ నుంచి సిబ్బంది డోర్ డెలివరీ చేస్తున్నారు. రైతుకి వెన్నుదన్ను.. వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్ పొట్లం యాప్ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్ డెలివరీ ఇస్తున్నాడు. నిరక్షరాసులు సైతం.. ఆన్లైన్ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత. కరోనా సమయంలోనూ ఉపాధి 2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్ పనిచేస్తోంది. పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. – శ్రీనివాస్ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. -
భారీ వర్షాలు.. ఇంటి పంటలు.. ఎత్తు మడులు ఎంతో మేలు!
వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ వస్తున్న భారీ వర్షాలు, వరదలు కూరగాయల సాగుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయల లభ్యత కూడా తగ్గిపోతుంది. ధరలు పెరుగుతాయి. అందుకని.. మనం తినే ఆకుకూరలు, కూరగాయలను వీలైనంత వరకు మనకు మనమే ఇంటి పట్టున, ఎంత కొంచెం స్థలం ఉన్నా సరే, సేంద్రియంగా పండించుకునే ప్రయత్నం ఇప్పటికైనా మొదలు పెట్టడం ఉత్తమం. కొద్ది స్థలాల్లో, పెరట్లో కూరగాయలు పెంచే సన్నకారు రైతులు గానీ.. డాబా/మేడ పైన, ఇంటి ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో కూరగాయలు సాగు చేసుకునే వారు గానీ ఎత్తుమడుల (రెయిజ్డ్ బెడ్స్)ను నమ్ముకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చదును సాళ్లలో కన్నా బోదెలు తోలి లేదా ఎత్తు మడులు చేసుకోవటం మేలు. వర్షాలు ఎక్కువైనా లేదా తక్కువైనా ఇవి ఆదుకుంటాయన్నది ‘వరల్డ్ వెజిటబుల్ సెంటర్’ నిపుణుల సూచన. ఎత్తుమడులతో ఉపయోగాలు ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని కూరగాయ పంటలు నాటుకుంటే భారీ వర్షం కురిసినా నీటి ముంపు సమస్య ఉండదు. కాబట్టి నష్టం అంతగా ఉండదు. అధిక తేమ సమస్య నుంచి భూమిపై పెరుగుతున్న మొక్కల కన్నా ఎత్తు మడుల్లో పెరిగే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.ఎత్తు మడిని ఇటుకలతో లేదా చెక్కలతో లేదా వెదురు బద్దలతో కూడిన దడితో గానీ.. ఏర్పాటు చేసుకోవచ్చు. ఎత్తు మడిని నేరుగా నేలపైన / మేడపైన / ఇంటి ముందు, వెనుక, పక్కన ఖాళీ జాగాల్లో గచ్చుపైన ప్లాస్టిక్ షీట్ వేసి ఏర్పాటు చేసుకోవచ్చు. అడుగున ఏమీ లేకుండా మట్టిపైనే ఎత్తుమడిని నాలుగు వైపులా ఇటుకలో, చెక్కలో పెట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు.. నేల పైపొర గట్టిపడి ఉంటుంది. దానిపైనే మడిని ఏర్పాటు చేస్తే మొక్కల వేర్లు ఆ గట్టిపడిన నేలలో నుంచి కిందికి వెళ్లడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఎత్తుమడి ఏర్పాటు చేసుకునే స్థలంలో అరడుగు లోతు మట్టిని తవ్వి తీసి వేసి.. అక్కడ ఎత్తుమడిని ఏర్పాటు చేసుకుంటే మేలు. ఎత్తు మడికి నాలుగు వైపులా గోడలు కూడా భారీ వర్షానికి, నీటి ప్రవాహానికి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్థానికంగా దొరికే రాళ్లు, అరటి బెదెలు, కట్టెలు లేదా చెక్క ప్యానళ్లను ఎత్తు మడి చుట్టూతా దన్నుగా పెట్టుకుంటే ఎత్తుమడి కింద మట్టి కోతకు గురికాకుండా ఉంటుంది. ఎత్తు మడులను ఏటవాలుగా ఉండే నేలపై ఏర్పాటు చేసుకోకూడదు. చదరంగా ఉండే నేలపైనే ఏర్పాటు చేయాలి. ఎత్తుమడి లోపల మట్టి మిశ్రమం సమతలంగా ఉండాలి. మొక్కల మధ్య గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేసుకుంటే.. వాన నీటి ధాటికి విత్తనాలు, మట్టి, మట్టితో పాటు పోషకాలు కొట్టుకుపోకుండా ఉంటాయి. చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే.. -
తెల్లటి ఆహారాలన్నీ డేంజరేనా? ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి ఇవి తింటే..
తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని కొందరు ఆహార నిపుణులు అంటుంటారు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. తెలుపు ఎప్పుడూ డేంజరు అనే మాట కేవలం ‘పాలిష్ చేసిన తెల్లటి బియ్యం, చక్కెర, ఉప్పు’ అనే మూడురకాల ఆహారాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా తెలుపు రంగు ఆహారాలన్నీ మనకు మేలు చేసేవే. తెల్లగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యానికి బదులు బ్రౌన్‌రైస్ ఎప్పుడూ మేలే. అలాగే తెల్లటి రంగులో ఉంటూ కూరలోకి వాడే ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్ మష్రూమ్స్ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే. మేలు చేసే తెల్లటి ఆహారాలివి... ఉల్లి, వెల్లుల్లి తెల్ల రంగులోనే ఉన్నప్పటికీ, తమలోని ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లో ఉండే అలిసిన్ అనే పోషకం (ఫైటో కెమికల్) వల్ల వాటికా ఘాటుదనం వస్తుంది. అలిసిన్ అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ మోతాదులను గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే పొట్ట, పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను సైతం వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి. కాలీఫ్లవర్ / వైట్ క్యాబేజీ వీటిల్లో ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కూడా అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు మంచి చురుకుదనాన్నీ ఇస్తాయి. తెల్ల ముల్లంగి ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన టీ–టాక్సిఫైయర్గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను సమర్థంగా బయటికి పంపుతుందన్నమాట. కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను సంరక్షించడంతో పాటు వాటినలా కాపాడటం ద్వారా కణాలన్నింటికీ మరిన్ని పోషకాలూ, ఆక్సిజన్ అందేలా దోహదపడుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు దుంపకూరలను తినకూడదు లేదా చాలా పరిమితంగా తినాలంటారు. కానీ ముల్లంగికి ఆ మాట వర్తించదు. దానిలోని పీచు కారణంగా చక్కెర మెల్లగా విడుదలయ్యేలా చేసే గుణం వల్ల అది రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. వీటిల్లో కూడా క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్ ప్రోటీన్ ‘ఆర్ఎస్ఏఎఫ్పీ2’ ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్ కూడా అంతే ఆరోగ్యకరం. అవి వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. బీటా–గ్లూకాన్స్ అని పిలిచే అందులోని పాలీసాకరైడ్స్ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. (మన దేహ రక్షణకు తెల్లరక్తకణాలు ఎంతగానో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే). అంతేకాదు... వాటిల్లో ఎపిగల్లాకాటెచిన్ గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది. - సుజాతా స్టీఫెన్ సీనియర్ న్యూట్రీషనిస్ట్ -
మనిషి లేని ‘నిజాయితీ దుకాణం’.. ఎక్కడ ఉందంటే?
ప్రధాన రహదారి పక్కనే చిన్న షెడ్డులో తాజా సేంద్రియ కూరగాయాలతో ‘నిజాయితీ దుకాణం’ వినియోగదారులకు దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెట్టి ఉంటుంది. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ దుకాణం ఎవరిది, మనుషులపై ఇంత నమ్మకం ఉంచిన ఆ మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. వృత్తులన్నిటికీ తల్లి వంటిది వ్యవసాయం. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన నేపథ్యంలో.. ఇతర వృత్తుల్లో స్థిర పడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పల్లెలకు చేరుకొని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. ఈ కోవకే చెందుతారు ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల నుంచి కుందేళ్ల వరకు, కొత్తిమీర నుంచి అంజీర పండ్ల వరకు పండిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయటమే కాకుండా, ఆ పంటను వినూత్నంగా ‘నిజాయితీ రైతు దుకాణం’ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ‘రైతు ఉపాధ్యాయుడి’ అనుభవాలను తెలుసుకుందాం.. అంజీర తోటలో రైతు మల్లారెడ్డి ఎడ్మల మల్లారెడ్డి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్. కోవిడ్‌తో ఏడాది క్రితం నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరిచే పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏడెకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అప్పటి వరకు కౌలుకు ఇచ్చిన ఆ భూమిలో ఇక తానే వ్యవసాయం చేస్తానని గ్రామస్థులకు చెప్పాడు. అయితే, ‘ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న మాకే గిట్టుబాటు కావడం లేదు, నీవేమి వ్యవసాయం చేస్తావు, స్కూల్‌ను బాగా నడిపించుకో..’ అని మొహం మీదే చెప్పారు. అయితే, మల్లారెడ్డి సవాలుగా తీసుకున్నారు. అందరిలాగ వ్యవసాయం చేస్తే మన ప్రత్యేకత ఏంటి, సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేసి అదాయం పొందాలనుకున్నాడు. కసితో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి, ప్రస్తుతం అందరికీ ఆదర్శం అయ్యారు. ప్రణాళికాబద్ధంగా సాగులోకి.. ఏడు ఎకరాల భూమిని ఐదారు ప్లాట్లుగా విభజించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని, చుట్టూ కంచే వేశారు. ఒక ప్లాట్‌లో– కోళ్లు, బాతులు, సీమ కోళ్లు.. రెండో ప్లాట్‌లో– జామ, బొప్పాయి, అరటి తోట.. మూడో ప్లాట్‌లో– మామిడి, సీతాఫలం మొక్కలు.. నాలుగో ప్లాట్‌లో– అంజీర, ఆపిల్ బెర్.. ఐదో ప్లాట్‌లో– కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. బెంగళూర్, హైద్రాబాద్ నర్సరీల నుంచి పండ్ల మొక్కలు తెప్పించి.. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి నాటారు. పొట్ల, బీర, సొర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాల దేశీ రకాల కూరగాయ విత్తనాలను హైద్రాబాద్ నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ఏడెకరాల్లో గుంట భూమి ఖాళీ లేకుండా దాదాపు 2 వేల రక రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. పంటలన్నిటినీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తుండటం, జగిత్యాలకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉండటంతో, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ కస్టమర్లుగా నేరుగా తోట వద్దకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం తరహాలో 365 రోజులు తోటలో కూరగాయలు, పండ్లను అందుబాటులో ఉంచుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు మల్లారెడ్డి. డిమాండ్‌ను బట్టి నాటు కోళ్లను పెంచుతూ, బాతులు, సీమ కోడి గుడ్లు అమ్ముతూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం ప్రారంభించబోతున్నారు. ఆ కుక్కలంటే కోతులకు హడల్! మల్లారెడ్డి తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉండటంతో కోతులు ఎక్కువగా వస్తున్నాయి. పొలంలో రెండు ‘బాహుబలి’ కుక్కలు పెంచుతున్నారు. రాత్రింబవళ్లు అవే కాపాలా కాస్తుంటాయి. కోతులు వస్తే ఈ కుక్కలు వాటిని ఉరికిస్తుంటాయి. దీంతో, ఈ తోటలోకి కోతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే, పట్టణానికి దగ్గరలో ఉండటంతో తల్లితండ్రులతో కలిసి పిల్లలు వచ్చేలా, మామిడి చెట్ల మధ్యలో పిల్లలు ఆటలాడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. ‘అగ్రి టూరిజం’ దృష్టితో తోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ నిజాయితీ దుకాణం! ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన తోటలో పండిన కూరగాయలను తోట దగ్గరే ‘నిజాయితీ దుకాణం’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. చిన్న షెడ్డు వేశారు. అందులో కూరగాయలు పెట్టి, ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెడుతుంటారు. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. కోళ్లు, బాతు గుడ్లను కూడా తోటలోనే అమ్ముతుంటారు. రోజుకు రూ. 3 – 4 వేల వరకు ఆదాయం పొందుతూ మల్లారెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ రైతులకే సేంద్రియ సమగ్ర సేద్య పాఠాలు నేర్పుతున్నారు! నిజాయితీ + నమ్మకం = విజయం! అందరిలాగా చేస్తే మనల్ని ఎవరూ గుర్తించరు. ఆరోగ్యదాయకంగా, వినూత్నంగా చేయాలి, దాని ద్వారా మనం ఆదాయం పొందాలి. వినియోగదారుల మనసులను చూరగొనాలి. నిజాయితీ, నమ్మకంతో చేస్తే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. తొలుత కొన్ని కష్టాలు తప్పవు. కష్టాలను అధిగమిస్తే విజయాలు చేకూరతాయని నేను నమ్ముతా. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో తృప్తితో పాటు మంచి ఆదాయమూ పొందుతున్నాను. – ఎడ్మల మల్లారెడ్డి (99598 68192), లక్ష్మీపూర్, జగిత్యాల జిల్లా -
రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే!
చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు. అలా కాకుండా రోజంతా చురుగ్గా ... హెల్దీగా ఉండాలంటే ఈ సూచనలు పాటిస్తే చాలు... ∙ఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోండి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. నట్స్ ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. ∙వెన్న, నెయ్యి వాడకం పూర్తిగా తగ్గించండి. ఇక మీ ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి. ∙కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తీసుకోండి. ∙ఫ్రూట్ జ్యూస్ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తినండి. -
టమాటా పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 30 మేర ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 50–60 పలుకుతోంది. తెలంగాణలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు.. అంటే అక్టోబర్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుంది. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 15 నుంచి 20 శాతం వరకే ఉంటుంది. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో టమాటా సాగవుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్ మేర సరఫరా లేక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, మదనపల్లితోపాటు కర్ణాటకలోని చిక్మంగళూరు, కోలారు, చింతమణి ప్రాంతాలు, మహారాష్ట్రలోని బీదర్, షోలాపూర్, నాందేడ్ నుంచి కొంతమేర టమాటా రాష్ట్రానికి వస్తోంది. లాక్డౌన్ అనంతరం జూన్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరగడం వల్ల టామాటా ధర రూ. 50 వరకు పెరిగింది. అనంతరం ఆగస్టు తొలి వారం నుంచి ధర తగ్గుతూ కిలో రూ. 20–30 మధ్య కొనసాగింది. ఆగస్టు చివరలో సైతం కిలో ధర రూ. 30 వరకు ఉండగా అది ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యింది. ఆగస్టులో కురిసిన వర్షాలతో పంట దెబ్బతినడం, ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటం వల్ల డిమాండ్ పెరిగి తెలంగాణకు సరఫరా తగ్గిపోయింది. గత నెలలో గరిష్టంగా రోజుకు 3 వేల క్వింటాళ్ల వరకు టామటా మార్కెట్లకు రాగా గత 10 రోజులుగా 1,600–2,000 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తోంది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం మదనపల్లిలోనే కిలో టమాటా ధర రూ. 30–35 మేర ఉంది. రవాణా చార్జీలు కలుపుకొని ప్రస్తుతం హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ. 37–40 అమ్ముతున్నారు. రైతు బజార్లలో రూ. 45 వరకు అమ్ముతుండగా బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి ధర రూ. 50–60 వరకు చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్ చివర, నవంబర్‌లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఇంటి వద్దకే కూరగాయాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో గడప దాటాలన్నా, బహిరంగ మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా జనం జంకుతున్నారు. దీంతో ఇంటి ముందుకే సరుకు తెచ్చి విక్రయించే పాత ట్రెండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. వ్యాపారులు, రైతులు వినియోగదారుల ఇంటి ముంగిటే తాజా కూరగాయల్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణ భారం తగ్గడం, తాజా కూరగాయలు తక్కువ ధరకే దొరకడం, నాణ్యత దృష్ట్యా ఈ తరహా కొనుగోళ్లకు వినియోగదారుల నుంచి స్పందన లభిస్తోంది. రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కు వగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను వికేంద్రీ కరించారు. విశాల మైదానాలు స్టాండ్లు, ఆట స్థలాల్లోకి మార్కెట్లను తరలించి విక్రయాలు జరిపారు. హైదరాబాద్ నగరంలో 12 రైతుబజార్లు ఉండగా, ప్రతి రైతుబజార్ నుంచి 20 మొబైల్ వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో విక్రయాలు జరిపించారు. మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 250 వరకు మొబైల్ రైతుబజార్ల ద్వారా 800 ప్రాంతాల్లో విక్రయాలు సాగాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ మార్కెట్లను పాత ప్రాంతాలకే తరలించారు. మొబైల్ వాహనాలను తగ్గించారు. దీంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. భౌతికదూరం సాధ్యంకాక, మాస్క్‌లు ధరించక మార్కెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. సూపర్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి.. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత కూరగాయలు దిగుమతి కాక ధరలు అమాంతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే కూరగాయల అమ్మకాల ప్రక్రియను వ్యాపారులు ప్రారంభించారు. హోల్‌సేల్ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు సేకరించి వాటిని ఆటోలు, ట్రాలీల్లో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలో ఉంచి తొలుత విక్రయాలు జరిపారు. ధరలు తక్కువగా ఉండటం, రోజూ నిర్ణీత వేళల్లో విక్రయాలు జరపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఈ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ తరహా అమ్మకాలకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రైతులే నేరుగా విక్రయాల్లోకి దిగారు. తమ పంట ఉత్పత్తులను సైకిళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. ఇలా రోజూ 20 – 30 కిలోల కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బెడద తప్పడం, తాము అనుకున్న ధరకే విక్రయాలు చేస్తుండటం వారికీ కలిసొస్తోంది. సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు కూరగాయల జాబితాను వాట్సాప్ మెసేజ్‌గా పంపిస్తే.. ఇంటికే డోర్ డెలివరీ అవుతున్నాయి. కాగా, ఇంటింటి విక్రయాలతో కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రైతుబజార్లలో టమాటా కిలో రూ.35–40కి విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో కిలో రూ.50 వరకు విక్రయించారు. ప్రస్తుతం కొత్త పంట కోతకు రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో.. బహిరంగ రైతుబజార్లలో కిలో రూ.18–20, బహిరంగ మార్కెట్లో రూ.30 పలుకుతోంది. రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కు వగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే లాక్డౌన్ సమ యంలో హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లను వికేంద్రీ కరించారు. విశాల మైదానాలు,» స్టాండ్లు, ఆట స్థలాల్లోకి మార్కెట్లను తరలించి విక్రయాలు జరిపారు. హైదరాబాద్ నగరంలో 12 రైతుబజార్లు ఉండగా, ప్రతి రైతుబజార్ నుంచి 20 మొబైల్ వాహనాల ద్వారా కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో విక్రయాలు జరిపించారు. మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 250 వరకు మొబైల్ రైతుబజార్ల ద్వారా 800 ప్రాంతాల్లో విక్రయాలు సాగాయి. అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ మార్కెట్లను పాత ప్రాంతాలకే తరలించారు. మొబైల్ వాహనాలను తగ్గించారు. దీంతో మార్కెట్లలో రద్దీ పెరిగింది. భౌతికదూరం సాధ్యంకాక, మాస్క్‌లు ధరించక మార్కెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. సూపర్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి.. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర అవసరాలకు కావాల్సినంత కూరగాయలు దిగుమతి కాక ధరలు అమాంతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే కూరగాయల అమ్మకాల ప్రక్రియను వ్యాపారులు ప్రారంభించారు. హోల్‌సేల్ వ్యాపారులు రైతుల నుంచి కూరగాయలు సేకరించి వాటిని ఆటోలు, ట్రాలీల్లో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలో ఉంచి తొలుత విక్రయాలు జరిపారు. ధరలు తక్కువగా ఉండటం, రోజూ నిర్ణీత వేళల్లో విక్రయాలు జరపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఈ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ తరహా అమ్మకాలకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రైతులే నేరుగా విక్రయాల్లోకి దిగారు. తమ పంట ఉత్పత్తులను సైకిళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా ఇంటింటికీ తిరిగి విక్రయిస్తున్నారు. ఇలా రోజూ 20 – 30 కిలోల కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బెడద తప్పడం, తాము అనుకున్న ధరకే విక్రయాలు చేస్తుండటం వారికీ కలిసొస్తోంది. సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు కూరగాయల జాబితాను వాట్సాప్ మెసేజ్‌గా పంపిస్తే.. ఇంటికే డోర్ డెలివరీ అవుతున్నాయి. కాగా, ఇంటింటి విక్రయాలతో కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రైతుబజార్లలో టమాటా కిలో రూ.35–40కి విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో కిలో రూ.50 వరకు విక్రయించారు. ప్రస్తుతం కొత్త పంట కోతకు రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో.. బహిరంగ రైతుబజార్లలో కిలో రూ.18–20, బహిరంగ మార్కెట్లో రూ.30 పలుకుతోంది. -
కూరలమ్మ
ఛాయారాణి సాహు కి 57 సంవత్సరాలు. ఆమెది ఒడిషాలోని భద్రక్ జిల్లా. కరుడా గ్రామం. లాక్డౌన్లో ఆమె తన చుట్టుపక్కల ఉన్న భైరబ్‌పుర్, అలబాగ, లుంగ, బ్రహ్మణిగావ్, బినాయక్పుర్, బసుదేవపుర్ వంటి 15 గ్రామాలకు కూరగాయలను పంచుతున్నారు. మన దగ్గర నాయకులు చేసినట్లు ఒకసారి పంచి ఫొటోలు తీసుకుని వెళ్లిపోవడం లేదు ఛాయారాణి. కోవిడ్ విజృంభించినప్పటి నుంచి ఆమె ఆ గ్రామాలకు దఫదఫాలుగా కూరగాయల పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50 క్వింటాళ్ల కూరగాయలను పంచారామె. ఇచ్చే అలవాటుంది ‘‘ఇప్పుడు లాక్డౌన్ వచ్చిందని మాత్రమే కాదు. అంతకుముందు కూడా పేదవాళ్ల కోసం మా పొలంలో పండిన కూరగాయలు, మా ఆవుల ఫార్మ్ పాలు కూడా పంచేదాన్ని. పాలు, కూరగాయలు కొనుక్కోలేని వాళ్లు రోజూ ఉదయాన్నే మా ఇంటికి వచ్చేవాళ్లు. ముసలివాళ్లకు ఉచితంగా పాలు పోయడం, యజ్ఞాలకు నెయ్యి ఇవ్వడం మాకు ఎప్పటి నుంచో అలవాటు. ఇప్పుడు లాక్‌డౌన్‌తో దైనందిన కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడంతో పనుల్లేక ఇబ్బంది పడేవాళ్లు ఎక్కువయ్యారు. అందుకే ఇప్పుడు గ్రామగ్రామానికీ తిరిగి కూరగాయలు పంచుతున్నాను’’ అన్నారు ఛాయారాణి. పంటకు పిచికారీ చేస్తున్న ఛాయారాణి రైతమ్మ ఛాయారాణికి ఏడు ఎకరాల పొలం, 20 ఆవుల డైరీ ఫార్మ్ ఉన్నాయి. ఆమె భర్త సర్వేశ్వర్ సాహు వ్యవసాయంతోపాటు, పాల సొసైటీ కూడా నిర్వహిస్తుంటాడు. కూరగాయల సాగు మీద వాళ్లకు ఏటా మూడు లక్షల రాబడి ఉండేది. ఈ ఏడాది దళారులు ఈ లాక్డౌన్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలని చూశారు. నేలతల్లి ఇచ్చిన పంటను దళారుల పాలిట పోయడం కంటే ఆకలిగా ఉన్న వాళ్లకు ఇవ్వడమే సరైన పని అనుకున్నారు ఛాయారాణి. ‘అమ్మేది లేదు. పండినదంతా పంచడానికే’ అని కచ్చితమైన నిర్ణయానికి వచ్చేశారు. పొలం నుంచి కూరగాయలను ఇంటికి తెచ్చి రెండున్నర– మూడు కేజీల (వంకాయలు, టొమాటోలు, గుమ్మడి, బెండ, క్యారట్, పచ్చిమిర్చి, చిక్కుడు, పాలకూర) కూరగాయలను కవర్లలో ప్యాక్ చేస్తారు. ఒక వాహనంలో పొరుగున ఉన్న గ్రామాలకు తీసుకుని వెళ్లి ఒక చోట గుడారం వేసుకుని కూర్చుంటారు. ఆ గ్రామ వాలంటీర్ల సహాయంతో గ్రామస్థులకు పంచుతారు. ఈ పనిలో ఛాయారాణికి ఆమె భర్త, కొడుకులు మానస్, సంతోష్, కోడళ్లు కూడా సహాయం చేస్తున్నారు. రోజుకు ముప్పై లీటర్ల పాలను గ్రామస్థులకు, లాక్డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులకు ఇస్తున్నారు. ‘‘మా దగ్గర కూరగాయలను టోకుగా కొనే వ్యాపారుల దగ్గర మేము గట్టిగా బేరం చేస్తే లక్షన్నర రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. భగవంతుని దయ వల్ల ఆ డబ్బు రాకపోయినా సరే... మా కుటుంబానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆ డబ్బు మరొకరి కోసం ఉపయోగిస్తే... ఈ కష్టకాలంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది హాయిగా భోజనం చేస్తారు. ప్రభుత్వం ఎలాగూ పేదవాళ్లకు బియ్యం, ఇతర దినుసులు ఇస్తోంది. మేము కూరగాయలిస్తున్నాం. ఈ పనితో మా ఇంట్లో వాళ్లం మొత్తం ఆరుగురం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం ముందు మేము వదులుకున్న డబ్బు విలువ ఎక్కువేమీ కాదు’’ అంటున్నారు ఛాయారాణి. ఆడవాళ్లు వంట గదికే పరిమితమైన రోజుల్లో ఆకలన్న వాళ్లందరికీ కడుపు నిండా అన్నం పెట్టి సంతృప్తి చెందేవాళ్లు. అది చూసి ‘వండిన చేతికి పెట్టే గుణం ఉంటుంద’ని మాత్రమే అనుకునే వాళ్లం. ఇప్పుడు ఛాయారాణి ‘పండించే చేతికి పంచే గుణం కూడా ఉంటుంద’ని రుజువు చేస్తున్నారు. వండి పెట్టిన మహాతల్లి కాదు, కానీ వండుకోవడానికి పెట్టిన మహాతల్లి ఛాయారాణి. – మంజీర -
ఏపీలో మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యార్కెట్ యార్డుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డులోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్లు ఉండగా, ప్రస్తుతం ఈ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ యార్డ్‌కు నిత్యం 200మంది వరకూ వస్తున్నట్లు అంచనా. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేలా ఇక్కడే కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అలాగే కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. (జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులు) అలాగే గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అలాగే తాత్కాలిక రైతు బజార్ల సంఖ్యను 417కు పెంచింది. అంతేకాకుండా మొబైల్ రైతుబజార్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరం అయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కూడా రైతు బజార్లు నిర్వహిస్తోంది. (కేసులు ఎక్కువున్న చోట కఠినంగా..) వంద యార్డుల గుర్తింపు రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. వాటిలో ఇవాళ్టి నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
పారిశుధ్య కార్మికుల సేవలు మరవలేనివి
-
15 వేల లీటర్లు నేల‘ పాలు’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. కిరాణా, మందులు, ఆహారం వంటి నిత్యావసరాలను పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ ప్రజలకు, ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సందర్బంగా కొన్ని ఆన్లైన్ సరఫరా సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ సంక్షోభ సమయంలో సేవలందిస్తున్నతాము సెక్యూరిటీ గార్డుల నుంచి దాడులు, పోలీసులనుంచి వేధింపులను ఎదుర్కొంటున్నామని ఆరోపించాయి. అంతేకాకుండా పోలీసుల అత్యుత్సాహం వల్ల ఏకంగా 15 వేల లీటర్ల పాలు, 10వేల కిలోల కూరగాయలను పారవేయవలసి వచ్చిందని వెల్లడించాయి. పాలు, కూరగాయలు, మందులు, ఆహారం, తదితర సరుకులును డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులను పోలీసులు వేధిస్తున్నారని , డెలివరీ బాయ్స్ పై భౌతిక దాడులు కూడా చేశారని ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. తద్వారా లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో అటు జనం, ఇటు తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరారు. గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు తమను దూషించడం, కొట్టడమే కాకుండా, డెలివరీ ఏజెంట్‌ను అరెస్ట్ కూడా చేశారని బిగ్ బాస్కెట్, ప్రెష్ మెనూ, పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ గణేష్ చెప్పారు. దీంతో తమ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) ‘అన్ని చోట్ల పోలీసులకు ఇది ఒక ముఖ్యమైన సేవ అని తెలియదు, అందుకే వారు చాలా సందర్భాల్లో, కఠినంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలను కొడుతున్నారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కొట్టవద్దు’ అని గణేష్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్న మా రైడర్లను వేధిస్తున్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూసుకోవాలి కదా అంటూ కెప్టెన్ గ్రబ్‌కు చెందిన కరణ్ నంబియార్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేరళలో, రోగికి సేవ చేయడానికి వెళుతున్న తమ ఆరోగ్య కార్యకర్తలలో ఒకరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. డెలివరీని అత్యవసర సేవగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నామని హోమ్ డెలివరీ అసోసియేట్స్ ప్రతినిధి సౌరభ్ కుమార్ కోరారు.(కశ్మీర్లో కరోనా తొలి మరణం) అత్యవసర సర్వీసులను మాత్రం మినహాయింపు ఉన్నప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 2 వ రోజు స్థానిక అధికారుల అంతరాయాలు కారణంగా 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంతంగా పారవేయవలసి వచ్చిందని, కిరాణా, పాల డెలివరీ వెబ్సైట్ మిల్క్ బాస్కెట్ ప్రకటించింది. అలాగే గుర్గావ్, నోయిడా, హైదరాబాద్ లలో తాజా పాలను అందించలేమని ఆన్లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం ప్రెష్ హోం తెలిపింది. (కరోనాపై యుద్ధం : భారత్‌పై చైనా ప్రశంసలు) మరోవైపు హోం డెలివరీ సందర్బంల్లో తలెత్తుతున్న ఆటంకాలపై స్పందించిన నీతి ఆయోగ్ సీఈవో సంస్థ గుర్తింపు కార్డులు ఉన్న హోం డెలివరీ ప్రతినిధులను అడ్డుకోవద్దని బుధవారం ప్రకటించారు. సంబంధిత ఆదేశాలను అధికారులకు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో అవసరమైన సామాగ్రి ప్రజలకు చేరేలా కూరగాయల అమ్మకందారులకు, కిరాణా దుకాణదారులకు ఈ-పాసులు జారీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి ఎంఎస్ రంధావా తెలిపారు. -
విషాలను వదిలేద్దామిలా!
మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంతగా కలుషితమై ఉందో మనకు తెలియంది కాదు. అంతేనా... మనం రోజూ తినే పదార్థాల్లోనూ ఎన్నో రకాల హానికరమైన రసాయనాలుంటాయి. ఇలా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి... ఇలా ప్రతి చోటా ఏవో వ్యర్థ రసాయనాల కారణంగా మనం నిత్యం ఎంతో కొంత మనకు సరిపడని రసాయనాల బారిన పడుతూనే ఉంటాం. అయితే... ఈ విషపదార్థాల నుంచి బయటపడటం ఎలా? ఇలాంటి హాని చేసే పదార్థాలను మన ఒంట్లోంచి బయటకు పంపడాన్ని డీ–టాక్సిఫికేషన్ అంటారన్నది తెలిసిందే. ‘డి–టాక్స్’ అని సంక్షిప్తంగా వ్యవహించే ఈ ప్రక్రియ కోసం చాలామంది పెద్ద పెద్ద డీ–టాక్స్ సెంటర్లనూ, నేచర్ కేర్/ నేచర్ క్యూర్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి కష్టమే లేకుండా ఇంట్లోనే స్వాభావిక పదార్థాలతో డీ–టాక్స్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. శరీరంలో విష పదార్థాలు చేరే మార్గాలివి ∙మన చుట్టూ ఉండే వాతావరణంలోకి దగ్గర్లో ఉండే పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలు, మోటార్ కార్ల నుంచి వెలువడే కర్బన రసాయనాలతో గాలి కలుషితం అవుతుంది. ఆ గాలి పీల్చినప్పుడు మన ఒంట్లోకి విష రసాయనాలు చేరతాయి. గాలి కాలుష్యం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. డీజిల్ పొగ క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది ∙అలాగే ఇవే పరిశ్రమలు నీళ్లలోకి వదిలే వ్యర్థాల ద్వారా నీళ్లు కలుషితమవుతాయి. ఇలాంటి పరిశ్రమలు కేవలం పొగమాత్రమే గాక... సీసం, పాదరసం వంటి హానికరమైన రసాయనాలను వెలువరిస్తూ... ఇటు గాలినీ, ఇటు నీళ్లనూ కలుషితం చేస్తుంటాయి ∙ఇక మనం రోజూ వాడే ప్లాస్టిక్ పదార్థాల ద్వారా కొన్ని హానికర రసాయనాలు మనలోకి చేరతాయి. ఉదాహరణకు ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్ అనే విషపూరితమైన పదార్థం ఉంటుంది. మనం రోజూ నీళ్లు తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్, భోజనం పెట్టుకునే లంచ్‌బాక్స్‌లు... ఎలాంటి ఎన్నో పదార్థాల ద్వారా ఈ బిస్ఫినాల్ మన ఒంట్లోకి చేరుతుంది ∙కలుషితమైన నీటిలో పెరిగే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా మెర్క్యూరీ వంటి హానికర పదార్థాలు మన ఒంట్లోకి చేరుతుంటాయి ∙వీటితో కొన్నిరకాల మందులు, హార్మోన్లు, ఫాస్ట్ ఫుడ్స్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర కూడా శరీరాన్ని విషతుల్యం చేస్తుంటాయి. దుష్పరిణామాలివే... హానికరమైన పదార్థాలు మన ఒంట్లోకి తీసుకోవడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, వీపునొప్పి, పొట్టనొప్పితో పాటు ఇతర గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు, బరువు తగ్గటం, హైబీపీ (హైపర్ టెన్షన్), చర్మసంబంధ సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల వంటి సమస్యలు తలెత్తుతాయి. డిటాక్స్ చేసుకోవడం ఎలా? మన శరీరంలో సహజసిద్ధంగానే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ నిత్యం జరుగుతూనే ఉంటుంది. తొలుత మొదటి దశలో ఆహారనాళం బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. ఇలా చాలారకాల విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరకుండా చూసే యంత్రాంగం ఉంటుంది. ఆ దశను దాటుకుని ఏదైనా విషపూరిత పదార్థం శరీరంలోకి చేరితే దానిని కాలేయం విరిచేసి నీటిలో కరిగే పదార్థంగా మార్చి పంపుతుంది. అవి కిడ్నీలకు చేరి అక్కడినుంచి విసర్జితమవుతాయి. ఇదీ శరీరం తనకు తాను స్వాభావికంగానే (నేచురల్‌గా) డిటాక్సిఫై చేసుకునే ప్రక్రియ. అయితే శరీరం బయటకు పంపే దానికంటే మనం అదేపనిగా విషాలను ఒంట్లోకి చేరుస్తుంటే వాటన్నింటినీ బయటకు పంపించడంలో కాలేయం అలసిపోతుంది. అందుకే పైన మనం పేర్కొన్న విష పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటంతో పాటు... స్వాభావికంగానే మన దేహం నుంచి టాక్సిన్స్‌ను తేలిగ్గా బయటికి పంపగల ఆహారం తీసుకోవడం మేలుచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో దోహదపడుతుంది. డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడే ఆహారాన్ని డీ–టాక్స్ డైట్ అంటుంటారు. తీసుకోవాల్సినవి... పచ్చిగానే తినదగ్గ కూరగాయలను సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. తాజా పండ్లను, నట్స్నూ, పప్పుదినుసులను, తృణధాన్యాలను మన ఆహారంగా మార్చుకోవాలి ∙డీటాక్స్ డైట్లో భాగంగా ఆర్గానిక్‌గా పండించిన ఉత్పాదనలు ఉదా. బ్రౌన్‌రైస్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలి ∙డీటాక్స్ కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క వంటివి ఆహారపదార్థాలపై చల్లి వాడటం మేలు. పసుపు వంటి వాటిని మజ్జిగలో కొద్ది మోతాదులో కలుపుకుని తాగవచ్చు. ఇక్కడ పేర్కొన్న సుగంధ ద్రవ్యాలన్నీ నేచురల్ డీటాక్ఫిఫైయర్స్ కాబట్టి అవి దేహం నుంచి ఎన్నో మలిన రసాయనాలను తొలగిస్తాయి ∙రోజూ తగినంత నీటిని తాగాలి. రోజులో కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి ∙చేపల్లోని చాలా పోషకాలు, ప్రోటీన్లు ఒంటికి మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అయితే కలుషిత జలాల్లో పెరిగిన చేపలు మంచిది కాదు. వాటిలోని మెర్క్యూరీ వల్ల మళ్లీ మనలోకి విషాలు చేరే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ∙ఎక్కువ క్యాలరీలను విడుదల చేసే కూల్‌డ్రింక్స్, కోలా డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ, స్వాభావికంగానే నీటి పాళ్లు ఎక్కువగా ఉండే కొబ్బరిబొండాలు, పండ్లరసాలు, మజ్జిగ వంటివి తాగాలి. తీసుకో కూడనివి ∙ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పేర్కొనే రంగుపూసిన, ఎక్కువ పిండి వంటి పదార్థాలను పూసినవీ, చక్కెరలు కలిపినవీ, ఉప్పు ఎక్కువగావేసిన వాటికి దూరంగా ఉండాలి. మన జీర్ణ వ్యవస్థ ప్రాసెస్డ్ ఆహారాన్ని అంత తేలిగ్గా గ్రహించదు. వాటి కారణంగా కొన్ని సేంద్రీయ రసాయనాలు వెలువడి అవి ఒంట్లో విషపదార్థాలుగా రూపొంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ∙డీటాక్సిఫికేషన్ కోసం వారంలో ఏదో ఒకరోజు ఎంచుకొనిగానీ లేదా ప్రతి పదిహేనురోజులకోసారిగానీ... ఆరోజున పైన పేర్కొన్న స్వాభావికమైన పదార్థాలను (నేచురల్ ఫుడ్స్) మాత్రమే తీసుకుంటూ ఉండేలా ఒక నియమాన్ని పాటించడం చాలా మేలు చేస్తుంది. ఇలా క్రమబద్ధంగా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కాలేయానికి కూడా తగిన విశ్రాంతి లభించి, భారం తగ్గి మళ్లీ మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది. -
హార్మోన్ల బ్యాలెన్స్‌కు ఇలా తినండి
పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు చాలా ఎక్కువ. వారిలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు నిత్యం అనేక హార్మోను స్రవిస్తుంటాయి. వాటి మధ్య ఏమాత్రం సమతౌల్యత తప్పినా ఎన్నో సమస్యలు వస్తాయి. పైగా వాటిని సరిచేయడానికి మరికొన్ని హార్మోన్లను పైనుంచి ఇస్తే మిగతావి కూడా బ్యాలెన్స్ తప్పే అవకాశాలూ ఉండవచ్చు. మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత వల్ల యాంగై్జటీ, త్వరగా కోపం రావడం, త్వరత్వరగా మూడ్స్ మారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించడం చాలా సాధారణం. తాము రోజూ తీసుకునే ఆహారంతోనే మహిళలు తమకు కావలసిన హార్మోన్లను తగిన పాళ్లలో పొందడం ఎలాగో తెలుసుకోండి. అందుకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి... ప్రోజెస్టెరాన్: గర్భధారణకు, మెనోపాజ్ సమయంతో పాటు మహిళల సంపూర్ణారోగ్యానికీ ఉపయోగపడే హార్మోన్ ఇది. ఈ హార్మోన్ లోపిస్తే బరువు పెరగడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సినవి: విటమిన్ బి6, పీచు, జింక్, మెగ్నీషియమ్ ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ హార్మోన్ స్వాభావికంగానే సమకూరుతుంది. ఇందుకోసం చిక్కుళ్లు (బీన్స్), బ్రోకలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్, గుమ్మడి, పాలకూర, నట్స్ వంటివి తీసుకోవాలి. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్): ఇది కూడా మహిళల్లో చాలా కీలకమైన హార్మోన్. మహిళల్లో మెనోపాజ్ వయసు దగ్గర పడుతున్నకొద్దీ దీని స్రావాలు ఎక్కువ. థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు ఎంతగా అవసరమో అందరికీ తెలిసిందే. దీని మోతాదు కాస్త ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మహిళలతో పాటు పురుషులకు అవసరమైన హార్మోన్లను కూడా థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది. తీసుకోవాల్సినవి: ఎఫ్ఎస్హెచ్ కోసం, థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, కొరమీను వంటివి), అవిశగింజలు, వాల్నట్, కిడ్నీబీన్స్, పాలకూర వంటి ఆకుకూరల్లో ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం పైన పేర్కొన్న హార్మోన్లనే గాక... హైపో పిట్యుటరిజమ్, హైపోగొనాడిజమ్ వంటి హార్మోనుల అసమతౌల్యతను ఏర్పరచే కండిషన్లను కూడా నివారిస్తాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్): ఇది కూడా మహిళలకు అవసరమైన చాలా ప్రధానమైన హార్మోన్. పురుషుల్లో కూడా కొద్దిపాళ్లలో అవసరమే. ఇది మహిళల్లో అవసరమైన ఇతర హార్మోన్లను స్రవించేలా చేస్తుంది. తీసుకోవాల్సినవి: ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమయ్యే ప్రధాన ఆహారాలను తీసుకోవడం ద్వారా దీన్ని స్వాభావికంగానే పొందవచ్చు. వాటితోపాటు పొట్టుతీయని గింజధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పప్పుధాన్యాలు (పల్సెస్)తీసుకోవడం ద్వారా ఎల్‌హెచ్‌ను స్వాభావికంగా పొందవచ్చు. టెస్టోస్టెరాన్: ఈ హార్మోన్ ప్రధానంగా పురుషులకు అవసరమైనది. అయితే కొద్దిపాళ్లలో మహిళల్లోనూ ఇది అవసరం. మహిళల్లో ఎముకలు, కండరాల బలం కోసం, కొవ్వు సమంగా విస్తరించడంతో పాటు రక్తకణాల ఉత్పత్తి కోసం ఈ హార్మోన్ అవసరం. తీసుకోవాల్సినవి: ఇది జింక్ వంటి ఖనిజ లవణాలు, విటమిన్–డి లభించే పదార్థాలతో లభ్యమవుతుంది. కొరమీను, సాల్మన్ వంటి చేపలు, వేటమాంసం... అందునా ప్రత్యేకంగా కాలేయం వంటి మాంసాహారాలతో పాటు గుడ్లు, బీన్స్‌ల ద్వారా కూడా సమకూరుతుంది. పండ్లలో దానిమ్మ ద్వారా ఇది స్వాభావికంగా దొరుకుతుంది. ఆక్సిటోసిస్: ఇది హైపోథలామస్ ద్వారా ఉత్పత్తి అయి, పిట్యుటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది. ఇది మన సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేయడంతో పాటు, సంతానసాఫల్యానికి, బిడ్డపుట్టాక మళ్లీ పీరియడ్స్ క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది. తీసుకోవాల్సినవి: విటమిన్–డి ఎక్కువగా ఉండే ఆహారాలైన గుడ్లు, చికెన్, పాలు, తృణధాన్యాలతో పాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఉసిరి, జామ, బెర్రీపండ్లు, టోమాటో, నిమ్మలలో లభ్యమవుతుంది. అంతేగాక బాదం, అవకాడో, డార్క్‌చాక్లెట్లు, అరటిపండ్లు, పెరుగు, బ్రాకలీలలో దొరుకుతుంది. గ్లూకోజ్ మెటబాలిజమ్: మహిళల్లో గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరగడం అవసరం. దాని వల్ల డయాబెటిస్ నివారితమవుతుంది. తీసుకోవాల్సినవి: మెంతులు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా ‘డియోస్జెనిన్’ అనే ఒక రకం ఈస్ట్రోజెన్ లభ్యమవుతుంది. దీని వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. అలాగే బాదం నుంచి ‘ఎడిపోన్సెటిన్’ అనే స్వాభావిక ప్రోటీన్ లభ్యం కావడం వల్ల కూడా గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. ఎస్ట్రాడియాల్: ఇది మహిళలకు అవసరమైన హార్మోన్. దీన్నే ఈస్ట్రోజెన్ అని వ్యవహరిస్తుంటారు. ఇది తగ్గడం వల్ల యోని సంబంధమైన రుగ్మతలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన ఆహారాలు: అవిశగింజలు, సోయా ఉత్పాదనలు, తాజాపండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటి ద్వారా ఈస్ట్రోజెన్ స్వాభావికంగా సమకూరుతుంది.సుజాతా స్టీఫెన్చీఫ్ న్యూట్రిషనిస్ట్యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్ -
కూరగాయలు చౌక!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి తొలివారంలో దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో రూ.20 నుంచి 40 లోపే ఉన్నాయి. ఇది ఈ సీజన్లోనే అత్యల్పంగా చెప్పొచ్చు. సాధారణంగా సెప్టెంబర్–మార్చి మాసాల మధ్య కాలంలో లోకల్ కూరగాయల దిగుబడులు అధికంగా ఉండి రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి డిసెంబర్ వరకు కూడా రేట్లు తగ్గలేదు. జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం దిగుబడి ఒకేసారి భారీగా రావడంతో కూరగాయల రేట్లు దిగొచ్చాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు పెరిగాయి. ప్రస్తుతం బెండకాయ, వంకాయ, చిక్కుడు, బీన్స్‌తో పాటు ఇతర కూరగాయలు కిలో ధర రూ.20 నుంచి రూ.40 వరకు పలుకుతున్నాయి. ఇక టామాట ధర కిలో రూ.10 నుంచి రూ. 20 మధ్యే ఉంది. ఈ సీజన్లో టమాట ధర ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోలిస్తే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ రెండవ వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. అంతకు ముందు వరకు ఏ కూరగాయలు కొనాలన్న కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ధరలు పలికాయి. రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ అధికారుల అంచనా. పెరిగిన దిగుమతులు అన్‌సీజన్‌లో అంటే మార్చి నుంచి జూలై వరకు నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి అవుతాయి. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో స్థానికంగా రైతులకు నీటి లభ్యత ఎక్కువగా ఉండకపోవడంతో కూరగాయల సాగు కష్టమవుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే రేట్లు ఎక్కువ ఉంటాయన్నారు. ప్రస్తుతం నగరంలోని బోయిన్పల్లి, గడిమల్కాపూర్, కొత్తపేట, ఎల్బీనగర్తో పాటు ఇతర మార్కెట్లకు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల స్థానిక కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. స్థానికంగా దిగుబడి పెరిగింది.. తెలంగాణ వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉంది. రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెల నుంచే కూరగాయల సాగు చేస్తున్నారు. దీంతో అక్టోబర్ నుంచే కూరగాయల పంట చేతికి వచ్చింది. దిగుమతి పెరిగింది. అందువల్లే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గాయి. ప్రస్తుతం నగర ప్రజల 80 శాతం కూరగాయల అవసరాలు శివారు జిల్లాలే తీరుస్తున్నాయి. – చిలుక నర్సింహారెడ్డి, ఎల్బీ నగర్ మార్కెట్ గ్రేడ్–3 కార్యదర్శి -
ముదిమిలోనూ ఆదర్శ సేద్యం
66 ఏళ్ల వయస్సులోనూ మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కూన చంద్రయ్య. అనేక ప్రయోగాలు చేస్తూ పదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహింబాద్ ఆయన స్వగ్రామం. అంతర పంటలకు ప్రాధాన్యత ఇస్తూ 3.7 ఎకరాల్లో ప్రధానంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆయన పొలంలో ఉచిత విద్యుత్తుతో నడిచే 3 హెచ్‌పీ మోటార్లు రెండు ఉన్నాయి. తాను పండించిన కూరగాయలను నేరుగా తానే రైతుబజారులో అమ్ముకోవడం ఈ రైతు ప్రత్యేకత. ఏటా రూ. 3 లక్షల వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా మక్కువగా పంటలు సాగు చేస్తుండడం విశేషం. దొండ, బీన్స్, మిరప, చిక్కుడు, కటింగ్ చిక్కుడు, బెండ, టమోటా, వంగ, కాకర వంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల సాగుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.పంటల మధ్య మొక్కజొన్న సాగు సాళ్లుగా వేస్తున్నారు. పొలం మధ్యలో బంతి, ఆముదం నీరు తరలించే నీరు బట్టెల్లో సాగు చేస్తున్నారు. దీంతో పంటలకు తెగుళ్ల సమస్య లేకుండా పోయింది. గిన్నీ, సై ్టలో వంటి జాతుల గడ్డిని సాగు చేస్తూ మూడు పాడి ఆవులను పెంచుతున్నాడు. పాల అమ్మకం ద్వారా ఆదాయం రావడంతోపాటు పంటలకు జీవామృతం, గెత్తం(పశువుల ఎరువు) అందుతున్నాయి. రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులు కూడా వాడటం లేదు. కషాయాలు పిచికారీ చేస్తూ పంటలు సాగు చేస్తుండడం వల్ల వ్యవసాయ పెట్టుబడులు భారీగా తగ్గించుకున్నారు. పంటలపై తెగుళ్లను ప్రా«థమిక దశలోనే పసిగడుతూ నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తున్నారు. వేప, వాయిలాకు, జిల్లేడు, ఉమ్మెత్త తదితర ఆకుల కషాయాలు కూడా వినియోగిస్తున్నారు. తాను పండించిన కూరగాయలు, ఆకుకూరలు తానే నేరుగా రైతుబజారులో అమ్ముకుంటూ గిట్టుబాటు ధర రాబట్టుకుంటూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను పండించే పంట దిగుబడుల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరించి తర్వాత పంట కాలంలో వాడుతున్నారు. ‘ఆదాయంతో సంబంధం లేకుండా ప్రకృతికి, భూమికి, మనకు మేలు చేసే వ్యవసాయం చేస్తున్నాను. çపండించిన పంటలను నేరుగా రైతు బజారులో అమ్ముకుంటున్నాను. భవిష్యత్తులో 5 అంతస్తుల నమూనాలో పంటలు సాగు చేయాలనుకుంటున్నాను’ అని కొండంత ఆశతో చెబుతున్నారు చంద్రయ్య. – పి. ఎ. నాయుడు,సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్, శ్రీకాకుళం జిల్లా -
సారీ వెజ్!
సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలకు అలవాటైన సిటీజనులు.. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు అందించే కూరగాయలపై విముఖత చూపుతున్నారు. కూరగాయల తలసరి వినియోగంలో వెనుకంజలో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. మనిషి ఆరోగ్యానికి, మెరుగైన జీవన క్రియలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభించే కూరగాయలను ఆహారంగా తీసుకోవడంలోనగరవాసులు వెనుకంజలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి రోజువారీ ఆహారంలో 325 గ్రాముల మేర కూరగాయలు తీసుకోవాలి. కానీ సిటీలో ఒక్కో వ్యక్తి 269 గ్రాముల కూరగాయలనే వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే గ్రేటర్లో 56 గ్రాముల కూరగాయలను తక్కువగా వినియోగిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారికి ఏటా సుమారు 7,22,186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అంటే నెలకు 60,182 మెట్రిక్ టన్నులు, రోజుకు 2,006 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. అయితే రాజధానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల నుంచి నగరానికి ఏటా కేవలం 6,89,363 మెట్రిక్ టన్నుల కూరగాయలే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ కన్నా 32,823 మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. ఈ కొరతను తీర్చేందుకు సిటీకి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో అదనంగా మరో 41,840 ఎకరాల్లో కూరగాయలను పండించాల్సి ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి నగరానికి సరఫరా అవుతోన్న కూరగాయలు సిటీజనుల అవసరాలకు సరిపోవడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌కు అవసరమైన కూరగాయలకు దిగుమతులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. కర్నాటకలోని బీదర్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆలుగడ్డలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉల్లిగడ్డలు, మునగకాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి దిగుమతి అవుతున్నాయి. ప్రత్యామ్నాయాలివే.. ♦ నగరానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి. ♦ కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. ♦ షేడ్‌నెట్స్, పాలీహౌస్‌లు, డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి వాటికి మరింత సబ్సిడీ అందించాలి. ♦ మార్కెట్ సదుపాయం, కోల్డ్ స్టోరేజీల సదుపాయం కల్పించాలి. ♦ పంట విత్తే సమయంలోనే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. మార్కెట్లలో దళారులను పూర్తిగా నిరోధించాలి. కొరతకు కారణాలివీ.. ♦ నగరానికి ఆనుకొని ఉన్న మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారడం. ♦ రైతులు యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు అవలంభించకుండా సంప్రదాయ విధానంలో కూరగాయలు సాగు చేస్తుండడంతో అధిక దిగుబడులు రావడం లేదు. దీంతో కూరగాయల సాగు లాభసాటిగా లేక మధ్యలోనే వదిలేస్తున్నారు. ♦ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం మరో కారణం. పంట విత్తే సమయంలో అధిక ధరలు, పంట కోసే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతోంది. ♦ మార్కెట్ల లేమి, రవాణా పరమైన ఇబ్బందులు. ♦ కోల్డ్‌స్టోరేజీ యూనిట్లు అందుబాటులో లేకపోవడం. ♦ వ్యవసాయ కూలీలు దొరక్కపోవడం. -
మన కూరగాయలను సద్వినియోగం చేసుకోండి
మణికొండ: మన తెలంగాణ–మన కూరగాయల పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం పథకం ప్రారంభోత్సవానికి ఆయన మణికొండకు వచ్చారు. మర్రిచెట్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తోం దని తెలిపా రు. అనంతరం మణికొండలోని పంచవటి కాలనీ ప్రవేశంలో స్టాల్‌ను ఏర్పాటు చేయాలని కోరామని, అది అమలు కాలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరీష్‌రావు మార్కెటింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు. మణికొండలో రెండు స్టాళ్లను ఏర్పాటు చేయాలని గతంలో తాను ఆదేశించినా ఒకటే ఎందుకు సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఏంటని నిలదీశారు. సర్వేనెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలోని కొంత స్థలాన్ని తమకు కేటాయిస్తామని తహసీల్దార్ చెప్పి.. ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతోనే స్టాల్ ఏర్పాటు చేయలేకపోయామని మార్కెట్ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో హరీష్‌రావు.. సదరు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు సూచించారు. పక్కనే ఉన్న ఎంపీపీ తలారి మల్లేశ్ కలగజేసుకుని తహసీల్దార్‌తో మాట్లాడి ప్రతిపాదనలు పంపించామని, కలెక్టర్ స్థలం కేటాయించాలని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే స్టాల్ ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మన కూరగాల పథకంలో అటు రైతులతో పాటు ఇటు కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి పద్మహర్ష, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మమతాశ్రీనివాస్, వైస్ చైర్మెన్ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
పరి పరిశోధన
జంక్ ఫుడ్‌తో ఆరోగ్యం పాడవుతుందని మనందరికీ తెలుసు. చాలాకాలంగా వింటున్న ఈ విషయాన్ని ఇంకోసారి రూఢి చేసుకోవాలని అనుకున్నారో ఏమోగానీ.. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని పల్లె ప్రాంత ప్రజలపై ఓ ప్రయోగం చేశారు. అమెరికాలో ఉండే కొంతమంది ఆఫ్రికా పల్లె తిండి తినేలా.. అదే సమయంలో ఆఫ్రికా గ్రామీణ ప్రజలు కొందరు అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ తినేలా చేశారు. రెండు వారాల తరువాత పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పీచుపదార్థం ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉండే గ్రామీణ తిండితో కేన్సర్ ముప్పు తగ్గినట్లు గుర్తించారు. దీన్నిబట్టి కేవలం ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా పేగు కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని తెలుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ ఓ కీఫీ అంటున్నారు. ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ రకమైన కేన్సర్ ఎక్కువగా ఉందని.. అదే సమయంలో ఆఫ్రికాలోని గ్రామీణులకు ఈ ముప్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో తాము ఈ పరిశోధన చేపట్టామని కీఫీ వివరించారు. అమెరికన్ తిండిలో పీచుపదార్థం తక్కువగా, కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తోందని, ఇందుకు భిన్నమైన ఆహారం తీసుకోవడం ద్వారా కేవలం రెండు వారాల్లోగానే కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చునని తమ పరిశోధన చెబుతున్నట్లు కీఫీ వివరించారు. ఈ పూతతో...కాయగూరల తాజాదనం నాలుగింతలు! కాయగూరలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్రిజ్‌లో లేదంటే శీతలీకరణ గిడ్డంగుల్లో ఉంచాలి. ఈ రెండూ లేకపోతే? ఇక అంతే సంగతులు. అవి కాస్తా తొందరగా పాడైపోతాయి. అటు రైతుకు, ఇటు మార్కెటింగ్ చేసే వారికీ నష్టాలు మిగులుస్తాయి. ఈ పరిస్థితిని మార్చేస్తామంటోంది అమెరికా కంపెనీ అపీల్ సైన్సెస్. మొక్కల నుంచి సేకరించిన ఓ ద్రావణంతోనే రిఫ్రిజిరేషన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం పండ్లు, కాయగూరలను తాజాగా ఉంచవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎడిపీల్ అని పిలుస్తున్న ఈ ద్రావణం ప్రతి పండు, కాయగూర చుట్టూ ఒక సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తుందని, తద్వారా ఇది ఎక్కువ కాలం పాడవకుండా చూస్తుందని కంపెనీ సీఈవో జేమ్స్ రోజర్స్ తెలిపారు. ఆక్సిడేషన్, ద్రవాలు కోల్పోవడం వల్ల... పండ్లు, కాయగూరలు తొందరగా పాడవుతాయని గుర్తించిన రోజర్స్... ఈ సమస్యలకు పరిష్కారంగా ఎడిపీల్‌ను తయారు చేశారు. మొక్కల నుంచి సేకరించిన రసాయనాలతోనే దీనిని తయారుచేశారు. ఎడిపీల్... పండ్లు, కాయగూరలపై ఒక పొరలా ఏర్పడి ఆక్సిజన్ లోపలకు రాకుండా, నీరు బయటికి పోకుండా అడ్డుకుంటుందని రోజర్స్ వివరిస్తున్నారు. పండ్లు, కాయగూరల రకాలను బట్టి ఎడిపీల్ మిశ్రమం మారిపోతుంది. -
మిద్దె సాగు.. బహు బాగు
సిటీజనులు మిద్దె సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల మిద్దెపై ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పట్టణ ప్రజలకు పోషకాలున్న కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పథకంతో ఇదంతా సాధ్యమవుతోంది. నగరంలో ఈ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై పంటల సాగు జరుగుతోంది. నాంపల్లి: 2010లో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో ఉద్యోగులు వేసిన తొలి అడుగు ఇప్పుడు నగరమంతా విస్తరించింది. ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పేరుతో ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన పథకం దినదినాభివృద్ధి చెందింది. గ్రేటర్లో 30 లక్షల ఇళ్లు ఉండగా... దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయడం విశేషం. ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కలిసొచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా రైతు కావడం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథికి వ్యవసాయంపై మక్కువ ఉండడంతో ఈ పథకానికి మరిన్ని సొబగులు అద్దారు. ఈ పథకం కింద పరికరాలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులు సబ్సిడీ కింద అందించడంతో పాటు సాగు విషయంలో నిపుణులతో మెలకువలు అందిస్తున్నారు. సిటీజనులకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. శిక్షణ సైతం... వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించి పంటల సాగు చేయడంపై ఉద్యాన శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన మెలకువలను అందించేందుకు నగరవాసులకు శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే 18 వేల మందికి శిక్షణనిచ్చారు. ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయిస్తే మిద్దెపై అద్భుతాలు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లకాయ, గోంగూర, తోటకూర, దోసకాయ, మిర్చి, కాకర, టమాట, వంగ, బెండ, బీరకాయ, మెంతికూర, పాలకూరలతో పాటు ఉల్లి, ఎల్లిగడ్డలు మిద్దెపై పండించుకోవచ్చని తెలిపారు. అదే విధంగా ఇంటి ఆవరణలో స్థలం ఉన్నవారు పండ్ల మొక్కలు పెంచుకోవచ్చని సూచించారు. మేలైన జాతి మొక్క కేవలం రూ.30కే అందజేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ పర్యవేక్షణలో 20 లక్షల మొక్కలను 17 నర్సరీల్లో పెంచుతున్నారు. పథకంపై ప్రచారం.. ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అనూహ్య ఫలితాలు సాధించేందుకు వినూత్న తరహాలో ప్రచారం చేయనుంది. ఇందుకు కళా బృందాల ద్వారా సిటీజనులకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఈ కళా బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే దీనిపై ప్రచారం చేయనున్నాయి. పథకం ప్రయోజనాలు ♦ 50–100 చదరపు అడుగుల వరకు పెరటి స్థలం లేదా బాల్కానీ, ఇంటి పైకప్పు ఉండి నీటి సదుపాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి 200 చదరపు అడుగులు. ♦ ఈ పథకం కింద కూరగాయల సాగుకు కావాల్సిన సిల్పాలిన్ కవర్స్, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేప పిండి, వేప నూనె, పనిముట్లను 25 శాతం రాయితీతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు యూనిట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సబ్సిడీ సౌకర్యం కూడా ఉంటుంది. ♦ ఆసక్తి ఉన్నవారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో పని దినాల్లో సంప్రదించొచ్చు. లభించే విత్తనాలు.. టమాట, వంగ, బెండ, పొట్ల, కాకర, బీర, దోస, గోరు చిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యారెట్, ఉల్లి, పాలకూర, మెంతికూర, కొతిమీర, చుక్క కూర, గోంగూర, బచ్చలి, తోటకూర, పుదీనా, ముల్లంగి, ఆలుగడ్డ, బీట్రూట్. పండ్లలో అరటి, ఆపిల్, రేగు, సీతాఫలం, బొప్పాయి తదితర అందజేస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి... మిద్దె పంటలతో తాజా ఆకు కూరలు, కూరగాయలు పొందొచ్చు. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిద్దె పంటల సాగుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు కావాల్సిన సలహాలు, సూచనలు, మెలకువలు మేం అందజేస్తాం. – ఎల్.వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్