మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంతగా కలుషితమై ఉందో మనకు తెలియంది కాదు. అంతేనా... మనం రోజూ తినే పదార్థాల్లోనూ ఎన్నో రకాల హానికరమైన రసాయనాలుంటాయి. ఇలా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి... ఇలా ప్రతి చోటా ఏవో వ్యర్థ రసాయనాల కారణంగా మనం నిత్యం ఎంతో కొంత మనకు సరిపడని రసాయనాల బారిన పడుతూనే ఉంటాం. అయితే... ఈ విషపదార్థాల నుంచి బయటపడటం ఎలా? ఇలాంటి హాని చేసే పదార్థాలను మన ఒంట్లోంచి బయటకు పంపడాన్ని డీ–టాక్సిఫికేషన్ అంటారన్నది తెలిసిందే. ‘డి–టాక్స్’ అని సంక్షిప్తంగా వ్యవహించే ఈ ప్రక్రియ కోసం చాలామంది పెద్ద పెద్ద డీ–టాక్స్ సెంటర్లనూ, నేచర్ కేర్/ నేచర్ క్యూర్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి కష్టమే లేకుండా ఇంట్లోనే స్వాభావిక పదార్థాలతో డీ–టాక్స్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
శరీరంలో విష పదార్థాలు చేరే మార్గాలివి
∙మన చుట్టూ ఉండే వాతావరణంలోకి దగ్గర్లో ఉండే పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలు, మోటార్ కార్ల నుంచి వెలువడే కర్బన రసాయనాలతో గాలి కలుషితం అవుతుంది. ఆ గాలి పీల్చినప్పుడు మన ఒంట్లోకి విష రసాయనాలు చేరతాయి. గాలి కాలుష్యం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది. డీజిల్ పొగ క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది ∙అలాగే ఇవే పరిశ్రమలు నీళ్లలోకి వదిలే వ్యర్థాల ద్వారా నీళ్లు కలుషితమవుతాయి. ఇలాంటి పరిశ్రమలు కేవలం పొగమాత్రమే గాక... సీసం, పాదరసం వంటి హానికరమైన రసాయనాలను వెలువరిస్తూ... ఇటు గాలినీ, ఇటు నీళ్లనూ కలుషితం చేస్తుంటాయి ∙ఇక మనం రోజూ వాడే ప్లాస్టిక్ పదార్థాల ద్వారా కొన్ని హానికర రసాయనాలు మనలోకి చేరతాయి. ఉదాహరణకు ప్లాస్టిక్‌లో బిస్‌ఫినాల్ అనే విషపూరితమైన పదార్థం ఉంటుంది. మనం రోజూ నీళ్లు తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్, భోజనం పెట్టుకునే లంచ్‌బాక్స్‌లు... ఎలాంటి ఎన్నో పదార్థాల ద్వారా ఈ బిస్‌ఫినాల్ మన ఒంట్లోకి చేరుతుంది ∙కలుషితమైన నీటిలో పెరిగే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా మెర్క్యూరీ వంటి హానికర పదార్థాలు మన ఒంట్లోకి చేరుతుంటాయి ∙వీటితో కొన్నిరకాల మందులు, హార్మోన్‌లు, ఫాస్ట్ ఫుడ్స్, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర కూడా శరీరాన్ని విషతుల్యం చేస్తుంటాయి.
దుష్పరిణామాలివే...
హానికరమైన పదార్థాలు మన ఒంట్లోకి తీసుకోవడం వల్ల మలబద్ధకం, తలనొప్పి, వీపునొప్పి, పొట్టనొప్పితో పాటు ఇతర గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు, బరువు తగ్గటం, హైబీపీ (హైపర్ టెన్షన్), చర్మసంబంధ సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌ల వంటి సమస్యలు తలెత్తుతాయి.
డిటాక్స్ చేసుకోవడం ఎలా?
మన శరీరంలో సహజసిద్ధంగానే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ నిత్యం జరుగుతూనే ఉంటుంది. తొలుత మొదటి దశలో ఆహారనాళం బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. ఇలా చాలారకాల విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరకుండా చూసే యంత్రాంగం ఉంటుంది. ఆ దశను దాటుకుని ఏదైనా విషపూరిత పదార్థం శరీరంలోకి చేరితే దానిని కాలేయం విరిచేసి నీటిలో కరిగే పదార్థంగా మార్చి పంపుతుంది. అవి కిడ్నీలకు చేరి అక్కడినుంచి విసర్జితమవుతాయి. ఇదీ శరీరం తనకు తాను స్వాభావికంగానే (నేచురల్‌గా) డిటాక్సిఫై చేసుకునే ప్రక్రియ. అయితే శరీరం బయటకు పంపే దానికంటే మనం అదేపనిగా విషాలను ఒంట్లోకి చేరుస్తుంటే వాటన్నింటినీ బయటకు పంపించడంలో కాలేయం అలసిపోతుంది. అందుకే పైన మనం పేర్కొన్న విష పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటంతో పాటు... స్వాభావికంగానే మన దేహం నుంచి టాక్సిన్స్‌ను తేలిగ్గా బయటికి పంపగల ఆహారం తీసుకోవడం మేలుచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో దోహదపడుతుంది. డీటాక్సిఫికేషన్‌కు ఉపయోగపడే ఆహారాన్ని డీ–టాక్స్ డైట్ అంటుంటారు.
తీసుకోవాల్సినవి...
పచ్చిగానే తినదగ్గ కూరగాయలను సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. తాజా పండ్లను, నట్స్‌నూ, పప్పుదినుసులను, తృణధాన్యాలను మన ఆహారంగా మార్చుకోవాలి ∙డీటాక్స్ డైట్‌లో భాగంగా ఆర్గానిక్‌గా పండించిన ఉత్పాదనలు ఉదా. బ్రౌన్‌రైస్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలి ∙డీటాక్స్ కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క వంటివి ఆహారపదార్థాలపై చల్లి వాడటం మేలు. పసుపు వంటి వాటిని మజ్జిగలో కొద్ది మోతాదులో కలుపుకుని తాగవచ్చు. ఇక్కడ పేర్కొన్న సుగంధ ద్రవ్యాలన్నీ నేచురల్ డీటాక్ఫిఫైయర్స్ కాబట్టి అవి దేహం నుంచి ఎన్నో మలిన రసాయనాలను తొలగిస్తాయి ∙రోజూ తగినంత నీటిని తాగాలి. రోజులో కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి ∙చేపల్లోని చాలా పోషకాలు, ప్రోటీన్లు ఒంటికి మంచిది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అయితే కలుషిత జలాల్లో పెరిగిన చేపలు మంచిది కాదు. వాటిలోని మెర్క్యూరీ వల్ల మళ్లీ మనలోకి విషాలు చేరే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ∙ఎక్కువ క్యాలరీలను విడుదల చేసే కూల్‌డ్రింక్స్, కోలా డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ, స్వాభావికంగానే నీటి పాళ్లు ఎక్కువగా ఉండే కొబ్బరిబొండాలు, పండ్లరసాలు, మజ్జిగ వంటివి తాగాలి.
తీసుకో కూడనివి
∙ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అని పేర్కొనే రంగుపూసిన, ఎక్కువ పిండి వంటి పదార్థాలను పూసినవీ, చక్కెరలు కలిపినవీ, ఉప్పు ఎక్కువగావేసిన వాటికి దూరంగా ఉండాలి. మన జీర్ణ వ్యవస్థ ప్రాసెస్‌డ్ ఆహారాన్ని అంత తేలిగ్గా గ్రహించదు. వాటి కారణంగా కొన్ని సేంద్రీయ రసాయనాలు వెలువడి అవి ఒంట్లో విషపదార్థాలుగా రూపొంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ∙డీటాక్సిఫికేషన్ కోసం వారంలో ఏదో ఒకరోజు ఎంచుకొనిగానీ లేదా ప్రతి పదిహేనురోజులకోసారిగానీ... ఆరోజున పైన పేర్కొన్న స్వాభావికమైన పదార్థాలను (నేచురల్ ఫుడ్స్) మాత్రమే తీసుకుంటూ ఉండేలా ఒక నియమాన్ని పాటించడం చాలా మేలు చేస్తుంది. ఇలా క్రమబద్ధంగా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కాలేయానికి కూడా తగిన విశ్రాంతి లభించి, భారం తగ్గి మళ్లీ మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment