ముదిమిలోనూ ఆదర్శ సేద్యం | Profits With Nature Farming | Sakshi
Sakshi News home page

ముదిమిలోనూ ఆదర్శ సేద్యం

Aug 6 2019 8:58 AM | Updated on Aug 6 2019 8:58 AM

Profits With Nature Farming - Sakshi

∙అంతర పంటలు

66 ఏళ్ల వయస్సులోనూ మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కూన చంద్రయ్య. అనేక ప్రయోగాలు చేస్తూ పదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహింబాద్‌ ఆయన స్వగ్రామం. అంతర పంటలకు ప్రాధాన్యత ఇస్తూ 3.7 ఎకరాల్లో ప్రధానంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆయన పొలంలో ఉచిత విద్యుత్తుతో నడిచే 3 హెచ్‌పీ మోటార్లు రెండు ఉన్నాయి. తాను పండించిన కూరగాయలను నేరుగా తానే రైతుబజారులో అమ్ముకోవడం ఈ రైతు ప్రత్యేకత. ఏటా రూ. 3 లక్షల వరకు నికరాదాయం ఆర్జిస్తున్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా మక్కువగా పంటలు సాగు చేస్తుండడం విశేషం.

దొండ, బీన్స్, మిరప, చిక్కుడు, కటింగ్‌ చిక్కుడు, బెండ, టమోటా, వంగ, కాకర వంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల సాగుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.పంటల మధ్య మొక్కజొన్న సాగు సాళ్లుగా వేస్తున్నారు. పొలం మధ్యలో బంతి, ఆముదం నీరు తరలించే నీరు బట్టెల్లో సాగు చేస్తున్నారు. దీంతో పంటలకు తెగుళ్ల సమస్య లేకుండా పోయింది. గిన్నీ, సై ్టలో వంటి జాతుల గడ్డిని సాగు చేస్తూ మూడు పాడి ఆవులను పెంచుతున్నాడు. పాల అమ్మకం ద్వారా ఆదాయం రావడంతోపాటు పంటలకు జీవామృతం, గెత్తం(పశువుల ఎరువు) అందుతున్నాయి. రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులు కూడా వాడటం లేదు. కషాయాలు పిచికారీ చేస్తూ పంటలు సాగు చేస్తుండడం వల్ల వ్యవసాయ పెట్టుబడులు భారీగా తగ్గించుకున్నారు. పంటలపై తెగుళ్లను ప్రా«థమిక దశలోనే పసిగడుతూ నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తున్నారు. వేప, వాయిలాకు, జిల్లేడు, ఉమ్మెత్త తదితర ఆకుల కషాయాలు కూడా వినియోగిస్తున్నారు. తాను పండించిన కూరగాయలు, ఆకుకూరలు తానే నేరుగా రైతుబజారులో అమ్ముకుంటూ గిట్టుబాటు ధర రాబట్టుకుంటూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను పండించే పంట దిగుబడుల్లో నుంచి నాణ్యమైన విత్తనాలను సేకరించి తర్వాత పంట కాలంలో వాడుతున్నారు. ‘ఆదాయంతో సంబంధం లేకుండా ప్రకృతికి, భూమికి, మనకు మేలు చేసే వ్యవసాయం చేస్తున్నాను. çపండించిన పంటలను నేరుగా రైతు బజారులో అమ్ముకుంటున్నాను. భవిష్యత్తులో 5 అంతస్తుల నమూనాలో పంటలు సాగు చేయాలనుకుంటున్నాను’ అని కొండంత ఆశతో చెబుతున్నారు చంద్రయ్య.    – పి. ఎ. నాయుడు,సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్, శ్రీకాకుళం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement