వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ వస్తున్న భారీ వర్షాలు, వరదలు కూరగాయల సాగుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయల లభ్యత కూడా తగ్గిపోతుంది. ధరలు పెరుగుతాయి. అందుకని.. మనం తినే ఆకుకూరలు, కూరగాయలను వీలైనంత వరకు మనకు మనమే ఇంటి పట్టున, ఎంత కొంచెం స్థలం ఉన్నా సరే, సేంద్రియంగా పండించుకునే ప్రయత్నం ఇప్పటికైనా మొదలు పెట్టడం ఉత్తమం.
కొద్ది స్థలాల్లో, పెరట్లో కూరగాయలు పెంచే సన్నకారు రైతులు గానీ.. డాబా/మేడ పైన, ఇంటి ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో కూరగాయలు సాగు చేసుకునే వారు గానీ ఎత్తుమడుల (రెయిజ్డ్ బెడ్స్)ను నమ్ముకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చదును సాళ్లలో కన్నా బోదెలు తోలి లేదా ఎత్తు మడులు చేసుకోవటం మేలు. వర్షాలు ఎక్కువైనా లేదా తక్కువైనా ఇవి ఆదుకుంటాయన్నది ‘వరల్డ్ వెజిటబుల్ సెంటర్’ నిపుణుల సూచన.
ఎత్తుమడులతో ఉపయోగాలు
ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని కూరగాయ పంటలు నాటుకుంటే భారీ వర్షం కురిసినా నీటి ముంపు సమస్య ఉండదు. కాబట్టి నష్టం అంతగా ఉండదు. అధిక తేమ సమస్య నుంచి భూమిపై పెరుగుతున్న మొక్కల కన్నా ఎత్తు మడుల్లో పెరిగే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.ఎత్తు మడిని ఇటుకలతో లేదా చెక్కలతో లేదా వెదురు బద్దలతో కూడిన దడితో గానీ.. ఏర్పాటు చేసుకోవచ్చు. ఎత్తు మడిని నేరుగా నేలపైన / మేడపైన / ఇంటి ముందు, వెనుక, పక్కన ఖాళీ జాగాల్లో గచ్చుపైన ప్లాస్టిక్ షీట్ వేసి ఏర్పాటు చేసుకోవచ్చు.
అడుగున ఏమీ లేకుండా మట్టిపైనే ఎత్తుమడిని నాలుగు వైపులా ఇటుకలో, చెక్కలో పెట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు.. నేల పైపొర గట్టిపడి ఉంటుంది. దానిపైనే మడిని ఏర్పాటు చేస్తే మొక్కల వేర్లు ఆ గట్టిపడిన నేలలో నుంచి కిందికి వెళ్లడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఎత్తుమడి ఏర్పాటు చేసుకునే స్థలంలో అరడుగు లోతు మట్టిని తవ్వి తీసి వేసి.. అక్కడ ఎత్తుమడిని ఏర్పాటు చేసుకుంటే మేలు.
ఎత్తు మడికి నాలుగు వైపులా గోడలు కూడా భారీ వర్షానికి, నీటి ప్రవాహానికి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్థానికంగా దొరికే రాళ్లు, అరటి బెదెలు, కట్టెలు లేదా చెక్క ప్యానళ్లను ఎత్తు మడి చుట్టూతా దన్నుగా పెట్టుకుంటే ఎత్తుమడి కింద మట్టి కోతకు గురికాకుండా ఉంటుంది.
ఎత్తు మడులను ఏటవాలుగా ఉండే నేలపై ఏర్పాటు చేసుకోకూడదు.
చదరంగా ఉండే నేలపైనే ఏర్పాటు చేయాలి. ఎత్తుమడి లోపల మట్టి మిశ్రమం సమతలంగా ఉండాలి. మొక్కల మధ్య గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేసుకుంటే.. వాన నీటి ధాటికి విత్తనాలు, మట్టి, మట్టితో పాటు పోషకాలు కొట్టుకుపోకుండా ఉంటాయి.
చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment