వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది?
ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!
అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్‌గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...
భూసారం, దిగుబడులు పెరుగుతాయి..
వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి.
ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది.
మార్పిడులు ఇలా...
వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది.
మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది.
పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది.
ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది.
రైతుకు ఎంతవరకూ లాభం...?
పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్‌పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది.
ఆసక్తి లేదు ఎందుకు?
తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు.
ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు.
చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.
చేయాల్సింది ఇది...
రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్‌తోపాటు డెమాన్‌స్ట్రేషన్‌ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్‌ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment